గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue248/674/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/..
తెల,తెలవారుతున్న సూచనగా గాలి వేణువు ఊదుతుంటే పక్షులు వేకువ పాట పాడసాగాయి. ఆ మధుర రాగానికి పరవశించి పోతూన్న కుండిల్లోని మొక్కలు అటూ, ఇటూ లయ బద్ధంగా కదులుతుంటే ఆ కదలికకి బలంగా ఎదిగిన గులాబి కొమ్మ ఒకటి కిటికీ రెక్కని తగిలి మృదు మధురంగా సవ్వడి చేసింది.
రాత్రంతా తీయని కలలు కంటూ, ఆ మాధుర్యం గుండెల్లో నింపుకుని గాఢ నిద్ర పోతున్న శరణ్య చెవుల్లో ఆ ధ్వని తరంగాలు శంఖం ఊదినట్టు అయి బద్ధకంగా కళ్ళు తెరిచింది.
మూసి ఉన్న కిటికీ తలుపు సందులోంచి చల్లని గాలి లోపలికీ రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కిటికీ అద్దాలు ఆ నీడలతో సయ్యాటలాడుతున్నాయి.
ఆ కమనీయ దృశ్యం చూసిన శరణ్యకి నిద్ర మత్తు రెక్కలు రెప, రెపలాడించి ఎగిరి పోయింది. దుప్పటి తొలగించి లేచి కూర్చుని కుడి చేత్తో ఆ నీడల మీద ప్రేమగా తడిమింది. తరవాత నెమ్మదిగా కిటికీ రెక్కలు తెరిచి చూసింది. లేలేత సూర్య కిరణాలు నులి వెచ్చగా మొహాన్ని తాకాయి. ఆమె పెదవుల మీద చక్కటి చిరునవ్వు వెలిసింది.
“ఎంత బాగున్నావు ప్రకృతీ” అనుకుంది కళ్ళు విశాలం చేసి లేత నారింజ రంగు అద్దుకున్న ఆకాశం కేసి చూస్తూ. కిటికీ తెరిచే సరికి ఎదురుగుండా ఉన్న ఫ్లాట్ లోంచి ఎం ఎస్ రామారావు పాడిన హనుమాన్ చాలీసా వినిపిస్తోంది.
ఆ ఫ్లాట్ లోకి పది రోజుల క్రితమే ఎవరో కొత్తగా దిగారు.. ఇంత వరకు వాళ్ళు ఎవరో, ఎలా ఉంటారో, ఎంత మంది ఉంటారో తెలియదు. నిజం చెప్పాలంటే శరణ్య రెండేళ్ళ నుంచి అక్కడ ఉంటున్నా ఎవరితో పెద్దగా స్నేహం లేదు .. వినాయక చవితికి, జనవరి ఫస్ట్ కి, శ్రీరామ నవమికి మాత్రమే అందరు కలుస్తారు.. అప్పుడు మాత్రమె మాట, మాట కలుపుకుంటారు. ఆ తరవాత మళ్ళి ఎవరి గోల వారిదే. అపార్ట్ మెంట్ అంటేనే ఎందరున్నా ఒకరికి ఒకరు తెలియకుండా ఏకాంతంగా బతికే ప్రదేశం .. నవ్వుకుంది శరణ్య ...
మరొక్క సారి గాలితో సయ్యటలాడుతున్న మొక్కల్ని, కల కలా రావాలతో వరసగా ఎగిరి పోతున్న పక్షులను చూసి మాటి, మాటికి తన వైపు తొంగి చూస్తూ దూరంగా వెళ్తూ ఆడుకుంటున్న గులాబీ మొక్కని గభాల్న అందుకుని దానికి ఉన్న పెద్ద పసుపు పచ్చ పూవుని కాడతో సహా తెంపి, కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో పట్టుకుని మంచం దిగింది.
టేబుల్ మీద ఉన్న సన్నటి, పొడుగాటి గ్లాసు ఫ్లవర్ వాజ్ లో నుంచి వడలిన పూవు తీసి తన చేతిలో ఉన్న పూవు గుచ్చింది. అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహానికి రెండు చేతులూ జోడించి నమస్కరించి బాత్రూం లోకి వెళ్ళి పోయింది. శరణ్యకి మనసంతా హాయిగా ఉంది.
తేజ అంటే ఎంత ఇష్టం ఉన్నా అతనికి, తనకి మధ్య ఉన్న స్థాయి భేదం గుర్తుంచుకుని ఇంత కాలం నుంచి తనని తాను అదుపులో ఉంచుకోడానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది. ఎలాంటి ఆకర్షణ, ఎలాంటి ప్రలోభం ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని పాడు చేయ కూడదని జీవితాంతం అతను ఒక స్నేహితుడుగా తన జీవితంలో మిగిలి పోతే చాలని ఆశించింది.
అయితే ఇప్పుడు తేజ ఇచ్చిన భరోసాతో అతని ఆహ్వానాన్ని అందుకుని నిస్సంకోచంగా అతని జీవితం లోకి నడచి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇంత కాలం ఉన్న సంకోచాలు, భయాలు అన్నీ తేజ మాటలతో ఎగిరి పోయి మనసు ఉల్లాసంగా ఉంది. స్నానం పూర్తీ చేసుకుని వస్తూ ఇవాళ గుడికి వెళ్ళాలి అనుకుంది.. వార్డ్ రోబ్ లోంచి డ్రెస్ తీసుకో బోయి ఆగి పోయి సూపర్ నెట్ చీర తీసుకుంది.
అందంగా చీర కట్టుకుని అద్దం దగ్గర అర గంట సేపు తయారైంది. తయారవడం పూర్తీ అయాక ఒక్క సారి తనని తను చూసుకుని నేను అందగత్తెని సుమా అనుకుంది.తర్వాత పర్స్ తీసుకుని గది లోంచి హాల్లోకి వచ్చి మరో సారి చీర కుచ్చిళ్ళు సర్దుకుని ఇంటి తాళం, బండి కీస్ తీసుకుని బైటికి వచ్చింది. తాళం వేసి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. లిఫ్ట్ నాలుగో అంతస్తులో ఉంది.. ఒక నడి వయసు స్త్రీ గుంటూరు జరి చీర కట్టుకుని కొంగు భుజం చుట్టూ కప్పుకుని లిఫ్ట్ కోసం చూస్తోంది.
ఎవరివిడ? ఎదురుగా ఫ్లాట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళ తాలూకు కాదు కదా.. పలకరించనా.. ఆలోచిస్తూ ఉండ గానే లిఫ్ట్ రావడంతో ఆవిడతో పాటే లిఫ్ట్ లోకి నడిచింది.
గుడి దగ్గరే కాబట్టి నడిచే వెళ్ళచ్చు కదా అనుకుంటూ బండి కీస్ పర్స్ లో వేసుకుని సెల్లార్ వైపు వెళ్ళకుండా గేటు వైపు నడిచింది.
తనతో లిఫ్ట్ లో వచ్చినావిడ కూడా శరణ్య వెనకాలే రెండు అడుగులు వెనకగా నెమ్మదిగా నడిచి వస్తోంది. చామన చాయగా ఉన్నా నుదుటి మీద కుంకుమ, కళ్ళల్లో కాటుక, రింగు ముడి, నిరాడంబరంగా కళగా ఉంది. మొహంలో ఉదాశీనత వెనక ఏదో విషాదం ఉన్నట్టు అనిపిస్తోంది.
ఆవిడతో మాట కలుపుదామంటే ఆవిడ ఆ అవకాశం ఇవ్వకుండా తల వంచుకుని నడుస్తోంది.
ఈవిడ కూడా గుడికేనా.. అనుమానం వచ్చింది శరణ్యకి. ఇంతలో గుడి దగ్గర అవడం ఆవిడ కూడా తనతో పాటు గుడి లోకి ప్రవేశించడంతో తను కూడా మౌనంగా గుడి లోకి నడిచింది.
గుడి చుట్టూ మూడు ప్రదిక్షణలు చేసి అమ్మ వారికి మనసారా దణ్ణం పెట్టుకుంది. హుండిలో యాభై ఒక్క రూపాయి వేసింది. పూజారి ఇచ్చిన తీర్ధ ప్రసాదాలు తీసుకుని ఆవరణలో ఉన్న వేప చెట్టు చుట్టూ ఉన్న సిమెంటుగట్టు మీద కూర్చుంది. ఆవిడ కోసం చూసింది. కనిపించ లేదు.. అర్చన చేయిస్తోందో... కుంకుమ పూజ చేయిస్తోందో..
వేప చెట్టు మీద నుంచి వీస్తున్న గాలిలో ఏదో పరిమళం... ఆవరణ చాలా విశాలంగా ఉంది.. అమ్మ వారు, వినాయకుడు, శివ లింగం ఉంటాయి. పూజారులు కాని, గుడి కాని ఎందుకో పేదగా అనిపిస్తుంది.. ఎండోమెంట్స్ వాళ్ళ అధినంలో ఉందో లేదో .. మెయిన్టేనేన్స్ సరిగా లేదు.. అయినా కాని ఆహ్లాదంగా ఉంది.
శరణ్య కళ్ళు ఎదురుగా నడచి వస్తున్న ఆవిడ వైపు తిరిగాయి. ఆవిడ చేతిలో కొబ్బరి చిప్ప, అరటి పళ్ళు. శరణ్య కూర్చున్న గట్టు మీదే కొంచెం ఎడంగా కూర్చుంది. శరణ్య మొహం పక్కకి తిప్పుకుని ఓరగా చూడ సాగింది. శరణ్య ఎప్పుడూ బిజీగా ఉండడం వలన ఎవరితో మాట్లాడే అవకాశం లభించ లేదు..
ఇప్పుడు అనుకోకుండా తన ఫ్లాట్ ఎదురు ఫ్లాట్ లో ఉండే ఒక స్త్రీ కనిపించడంతో ఆవిడతో మాటలు కలపాలని కుతూహలంగా అనిపిస్తోంది. అవకాశం కోసం చూడ సాగింది.
ఆవిడ కొబ్బరి చిప్ప చిన్నగా కొట్టి చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకుంది.
ఆవిడనే పరశిలిస్తున్న శరణ్య ఇంక ఆగ లేక పోయింది.. గొంతు సవరించుకుని మెల్లిగా అడిగింది. “ఆంటి మీరు మా ఫ్లాట్ ఎదురుగ ఫ్లాట్ లో ఉంటారు కదా.“
ఆవిడ గభాల్న తలెత్తి చూసింది.. లిప్త పాటు కంగారు కనిపించింది ఆవిడ కళ్ళల్లో.
శరణ్యకి ఆశ్చర్యంగా అనిపించింది ..ఎందుకలా కంగారు పడుతోంది ఈవిడ అనుకుంది.
ఆవిడ అవును, కాదు అన్నట్టు తల ఊపి కొద్దిగా జారిన చీర చెంగు కుడి భుజమ్మిదకి లాక్కుంది.
శరణ్య మళ్ళి అంది “నేను ఒక్కదాన్నే ఉంటాను.. మికేదన్నా అవసరం ఉంటె చెప్పండి.. “
ఈసారి ఆవిడ తల ఎత్తలేదు , తల ఊప లేదు మౌనంగా కింద రాలి పడిన ఆకులు చూడ సాగింది. ఆవిడ వైపు విచిత్రంగా చూస్తున్న శరణ్య ఉలిక్కి పడింది. ఆవిడ కళ్ళ నుంచి నీళ్ళు బొట్లు, బొట్లుగా రాలుతున్నాయి. శరణ్య అప్రయత్నంగా ఆవిడకి దగ్గరగా జరిగి “ ఏమైందండీ” అంది.
ఆవిడ మాట్లాడ లేదు.
శరణ్యకి జాలేసింది.. తన లాగా ఈవిడ కూడా ఒక్కరే ఉంటారా ఏంటి? పాపం భర్త వదిలేశాడేమో! పిల్లలు లేరా... కొడుకులు కూడా వదిలేశారా .. ఆవిడ సన్నగా వెక్కిళ్ళు పెడుతున్న శబ్దం వినిపించి, ఆవిడ చేయి మిద చేయి వేసి మృదువుగా అంది శరణ్య ..” బాధ పడకండి.. నేను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటె నన్ను క్షమించండి.. పదండి ఇంటికి వెడదాం.”
ఆవిడ రెండో చేత్తో శరణ్య చేయి పట్టుకుని “ మేము ఎవరితో మాట్లాడ లేము .. ఇంకెప్పుడు నన్ను పలకరించకు” అంది.
(సశేషం) |