Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue248/673/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

‘‘శక్తికి...’’

‘‘అవి ప్రణీత్ ఎపుడో యిస్తున్నాడు’’ గర్వంగా అంది. తల పట్టుకున్నాడు ఆకాష్.

ఇంత లోనే ఈ మనిషికి ఏవయిందీ...? ఆలోచనలో పడింది కీర్తన.

‘‘టానిక్ అతనిచ్చినా, నువ్వు తీసుకున్నా మన ముగ్గురం ఈ భూమ్మీద వుండం....’’ అన్నాడు. అప్పటికే అతను ఆమె చేరువ లోకి వచ్చాడు. ఆమె గోడకి అంటుకు పోయింది.

ఆమెకి రెండు వేపులా గోడకి చేతులు వేసి ఆమెని ఎటూ కదలనివ్వకుండా బంధించాడు. కీర్తన మొహం తిప్పుకుంటూ ‘‘నాకిలాంటివి ఇష్టం లేదు అన్నపుడు వదిలేయాలి’’ కోపంగా అంది.

‘‘కానీ నువ్వు గేమ్ బాగా ఆడాలంటే నీకు నర నరాన ఉత్తేజం రావాలి’’ ముక్కుతో ఆమె ముక్కును రాస్తూ అన్నాడు.

‘‘హూ!’’ తల విసురుగా తిప్పేసింది.

‘‘నీ పొగరు ముక్కు అంటే నాకెంతో యిష్టం....’’ ముని పంట చిన్నగా కొరుకుతూ అన్నాడు. చేతుల్తో తోసేయ బోయింది. వీసమెత్తు కూడా కదల లేదతను. తనని ఎలా లొంగ దీసుకోవాలో ఇతనికి బాగా తెలిసి పోయింది. స్పర్శ...... యస్.....ఆత్మీయ స్పర్శ....

కన్నతల్లి పొట్ట చుట్టూ చేతు చుట్టి పడుకున్నప్పటి గాఢత, కోడి పెట్ట కింద వెచ్చగా పడుకున్న కోడి పిల్ల ధీమా....అతను స్పర్శిస్తే చాలు శరీరం వాంఛతో కన్నా ప్రేమతో కదిలి పోతుంది. అతను స్పర్శిస్తే చాలు యుగ యుగాల వేదన వదిలి పోతుంది.

ఇక ఆపుకోవడం కీర్తన వల్లల కాలేదు. అతని కన్నా ముందే చేతులు చుట్టేసింది. దుఃఖం ముంచుకొస్తుండగా అతని హృదయం మీద అస్థిమితంగా తలాడిస్తూ...

‘‘అయ్ హేట్ యూ....’’ గట్టిగా అంది.

‘‘పోనీలే!’’ వీపు నిమురుతూ అన్నాడు.

‘‘నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోను.’’

‘‘...........’’

‘‘నిజంగా....’’ తల పైకెత్తి అంది. నీటితో నిండిన కళ్ళు తళ తళ లాడుతున్నాయి. బుగ్గల మీద కన్నీటి చారలు.... ముని వేళ్ళతో తుడిచాడు.
‘‘మీలాగా అన్ని అబద్దాలు చెప్పి ఆ అమ్మాయి కోసం, ఆఖరికి నా చేతులు ఏవయినా ఫర్లేదనుకున్నారు’’ వెక్కుతూ అంది.  నిట్టూర్చాడు  ఆకాష్.

‘‘ఏం కాదా? లేక పోతే యిదీ నా మంచి కోసమేనా...?’’ కోపంగా అంది.

‘‘నేనలా నమ్మించను బుజ్జీ!’’ ఆవేదనగా అన్నాడు. అతను చిన్న వయసు లోనే అన్ని బిజినెస్ లను మానేజ్ చేస్తూ. తనకొచ్చిన ఎన్నో సమస్యలను చిటికెలో పరిష్కరించుకున్నాడు కానీ, కీర్తనతో సత్సంబంధాలను నిలుపుకో లేక పోతున్నాడు. ఆ విషయం ఎంతో ఆవేదనకి గురి చేస్తోంది.

‘‘ఏం నమ్మించొద్దులే! అయినా మీరంటే నాకు అస్సలు యిష్టం లేదు. కానీ...కానీ....’’ మొహ మాటంగా ఆగి పోయింది. కుతూహలంగా చూశాడు. సిగ్గు పడుతూ కంటిన్యూ చేసింది కీర్తన.

‘‘మీ పొట్ట యిష్టం....ఎందుకంటే మా అమ్మ గుర్తొస్తుంది. చేతులు చుట్టినపుడు ఒక రకమైన నిశ్చింత వస్తుంది. మా నాన్నగారి ఆదరణలా వుంటుంది. అందుకే ఎప్పుడూ యిలా హత్తుకుని పోవాలనిపిస్తుంది.’’

అతనికి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కీర్తనకే అర్ధం కాని ఒక విషయం, అతనికి బాగా అర్ధమైంది. అదేమిటంటే కీర్తన తనని గాఢంగా ప్రేమిస్తున్న సంగతి!

తల్లి దండ్రులిద్దరి ప్రేమ తను ఆమె మీద చూపించాలనుకుంటోంది. అందుకు భిన్నంగా కొన్ని సంఘటనలు జరుగుతుండే సరికి తట్టుకో లేక పోతోంది. అది అర్ధం కాగానే మరింత దగ్గరకి పొదుపుకుని..

‘‘ఇక ఎప్పుడూ జీవితంలో నీకు కష్టం కలిగించను. నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నా, లేక పోయినా ఎప్పుడూ నీ ఆత్మీయుడిలా నీ క్షేమం కోరుకుంటాను. నువ్వు సుఖంగా గడపడానికి ప్రయత్నిస్తాను. మదర్ ప్రామిస్’’ చెప్పాడు.

‘‘అయినా ప్రేమించను’’ మొండిగా అంది.

‘‘ఏం?’’

మీరు ఇప్పుడు నాకు నచ్చలేదు. నా గేమ్స్ అయి పోయాక మళ్ళీ కొత్తగా నన్ను పరిచయం చేసుకోండి. అప్పుడు ఏమీ అబద్దాలు చెప్పకుండా స్వచ్ఛంగా ప్రేమించండి. అప్పుడే మిమ్మల్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తాను’’ ఆర్తిగా అంది.

‘‘అలాగే....’’ భారంగా ఊపిరి విడిచి

‘‘మరి ఈ ప్రేమకి ఈ రోజుతో పుల్ స్టాప్ పెడుతున్నప్పుడు......వీడ్కోలు కానుక లేదా?’’ ఆరాధనగా అన్నాడు. కళ్ళెత్తి చూసింది.
నుదురు చుంబించాడు. కళ్ళు వాల్చింది.కను రెప్పల మీద ముద్దాడాడు.

‘‘నీ పొగరంతా ఈ సూది ముక్కులోనే వుంది.’’

‘‘ఏం కాదు....నాకేం పొగరు లేదు’’ అంటున్న ఆమె పెదవుల్ని తన పెదవులతో కలిపి వేశాడు. కాలం స్తంభించి పోయింది.

( సశేషం )

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్