Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue260/697/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)...  “తెల్లవారితే ఆఫీసుకి వెళ్ళాలి... నేను వెళ్ళాలి తేజా!” అంది శరణ్య ..

ఆ రోజు ఆదివారం ... సాయంత్రం ఐదు అవుతోంది.

“అప్పుడేనా” దిగులుగా అన్నాడు తేజ. నవ్వింది “అలాగే అనిపిస్తుందిలే ఇప్పుడు ... పెళ్ళయాక నువ్వే అంటావు అబ్బా ఎంత సేపు నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటాము.. కాస్సేపు నువ్వన్నా బయటకు వెళ్ళు నేనన్నా వెళ్తాను అని”  అంది పెదాల మధ్య కొంటె నవ్వు బిగపట్టి.

“నిన్నూ”  అంటూ గబుక్కున ఆమెని దగ్గరకు లాక్కుని కౌగిట్లో బంధిస్తూ “ నీ నోరు మూయించనా” అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.

“ ఏం అవసరం లేదు నేను మూసుకుంటా” అంది పెదాలు గట్టిగా బిగించి.

“ ప్లీజ్ ఒక్కసారి” మరింత దగ్గరగా లాక్కుని తల ఆమె మొహం మీదకి వంచి గోముగా అన్నాడు.

“ఒద్దు ... దెబ్బలు పడతాయి” అంది కళ్ళతో బెదిరిస్తూ..

“ అంతేనా ఇట్స్ ఓకే” అంటూ చేతులు ఆమె వీపు మీదనుంచి జరిపి రెండు చేతులతో తల పట్టుకుని వెనక్కి వంచి పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.

శరణ్య బలవంతంగా విడిపించుకుని “నీకు పైత్యం బాగా ముదిరి పోతోంది.. నేను వెళ్లి పోతాను” అంది ..

తేజ సోఫాలో వెనక్కి వాలి కులాసాగా నవ్వి అన్నాడు “పద కారులో డ్రాప్ చేస్తాను.”

“ఏంటి విజయవాడ కి వస్తావా ...” ఆశ్చర్యంగా అడిగింది.

“నీ కోసం ఎక్కడికైనా వస్తా. పదవోయ్ విజయవాడ ఎంత దూరం .. నిన్ను డ్రాప్ చేసి మళ్ళి వెంటనే బయలు దేరానంటే రాత్రికి ఇంటికి వచ్చి పడుకోవచ్చు” అన్నాడు సోఫాలోంచి లేస్తూ.

“వెరీ గుడ్ నాకు కూడా హాపి పద వెడదాం” అంది.

మరో అరగంటలో ఇద్దరూ బయలు దేరారు. పంజాగుట్ట దగ్గరకు రాగానే తేజ ఫోన్ మోగింది. కుడి  చేత్తో డ్రైవ్ చేస్తూ  ఎడం చేత్తో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ “అవునా!  ఇప్పుడా ... మైగాడ్ ... మనం నెల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు అప్పాయింట్ మెంట్ ఇచ్చారా... అరె.. నేను విజయవాడ వెళ్తున్నాను.. శరణ్యని డ్రాప్ చేయాలి ... నువ్వు అటెండ్ అవకూడదూ ..”

శరణ్య ప్రశ్నార్ధకంగా చూసింది అతనివైపు .. కళ్ళతో సైగ చేసింది ఏంటి అన్నట్టు.

“ఓకే సతీష్ నేను ఇప్పుడే మాట్లాడతా ...” అంటూ కాల్ కట్ చేసి శరణ్యతో అన్నాడు.  “ గ్రేట్ డైరెక్టర్ చంద్ర గారిని కలవాలని నేను, నా ఫ్రెండ్ సతీష్ వన్ మన్త్ నుంచి ట్రై చేస్తున్నాం అప్పాయింట్ మెంట్ దొరక లేదు.. ఇప్పుడు రమ్మన్నాట్ట.”

“ ఓ ఇంకేం వెళ్ళు ... పెద్ద వాళ్ళు ఎపుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి... మళ్ళి మళ్ళి అవకాశం రమ్మంటే రాదు”  అంది.

“ కానీ ఎలా .. నువ్వెలా వెళ్తావు” సంశయంగా అడిగాడు.

“నన్ను బస్ డిపోలో డ్రాప్ చేయి బస్ లో వెళ్తాను “

“ నో, నో నువ్వు బస్ లో వెళ్ళడమా... కాబోయే కలెక్టర్ వి... నా ఫియన్సి వి ... కుదరదు ..ఇంకోసారి తీసుకుంటా అప్పాయింట్ మెంట్ .. నాకు నువ్వు ఇంపార్టెంట్”  అన్నాడు.

అతని ప్రేమకి మురిసి పోతూ అంది " తప్పు తేజా.. నువ్వు అన్నిసార్లు అడిగావని కదా ఆయన రమ్మన్నారు.. నాదేముంది .. నేను హాయిగా ఏ సి బస్ లో వెళ్తాను .. నా డ్రైవర్ కి ఫోన్ చేస్తాను  అక్కడ దిగ గానే వచ్చి పిక్ అప్ చేసుకుంటాడు.. నువ్వు వెళ్ళు నా మాట విను.”

“నా మనసు ఒప్పుకోవడం లేదు” అన్నాడు దిగులుగా.

“నేను ఒప్పిస్తాలే” నవ్వుతూ అతని గుండెల మీద కుడి చేత్తో మృదువుగా రాస్తూ “మనసా ... ఒప్పుకో” అంది.

ఆ చేయి పట్టుకుని గుండెలకి గట్టిగా అదుముకుని “నువ్వు నా ప్రాణం” అన్నాడు. నవ్వింది.

“ఏమి అనుకోవుగా” అడిగాడు.

“మనలో మనకి అనుకోడాలు ఏముంటాయి తేజా ... అండర్ స్టాండింగ్ ఉండాలి” అంది మెత్తగా అతని చేయి నొక్కి. తేజ ఆమె సంస్కారానికి ముగ్దుడయాడు.

మరి కొద్ది సేపటికి శరణ్యని ఇమ్లిబన్ బస్ డిపోలో దింపి, బై చెప్పి తేజ వెళ్ళి పోయాడు.

శరణ్య ఎంక్వైరీ లో బస్ వివరాలు కనుక్కుని టికెట్ తీసుకుని ప్లాట్ ఫారం మీదకి వెళ్ళింది.

బస్ రావడానికి అరగంట టైం ఉంది. శరణ్య కూర్చోడానికి ఎక్కడన్నా ప్లేస్ ఉందేమో అని చూసింది. బాగా రద్దీగా ఉందేమో ఎక్కడా ఇంచు స్థలం కనిపించలేదు. ఒక బెంచ్ మీద ఒకమ్మాయి పసి వాడిని ఒళ్లో పడుకో బెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది. ఆమె పక్కనే ఒక బాగ్ ఉంది. ఆ బాగ్ జరిపితే కూర్చోవచ్చు ..

శరణ్య ఆ బెంచ్ దగ్గరకు వెళ్లి తనే బాగ్ జరిపి కూర్చుంది.

అలికిడికి ఆ అమ్మాయి ఉలిక్కి పడి  కళ్ళు తెరిచి భయంగా చూసింది.

ఆమె కళ్ళల్లో బెరుకు చూసిన శరణ్య చిరునవ్వుతో అంది నేనే మీ బ్యాగు జరిపాను సారీ.

ఆ అమ్మాయి సమాధానం చెప్ప లేదు.. ఇంకా అలాగే చూడ సాగింది బెదురుతున్న కళ్ళతో.

శరణ్యకి ఆమె చూపులు చిత్రంగా అనిపించాయి.  అమాయకంగా, బెదురు  నిండిన కళ్ళతో,  బాగా వడలి పోయి నీరసంగా ఉన్నా అందంగా ఉంది. ఆమె కట్టుకున్న చీర, ఆమె బ్యాగు చూస్తుంటే పేదరాలిలా ఉంది.  ఆమెని చూస్తుంటే ఏదో ఆపదలో ఉన్నదానిలా, ఒక చేయూత కోసం ఎదురుచూస్తున్న దానిలా అనిపిస్తోంది. కానీ పరీక్షగా చూస్తే ఈమెని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది.. ఎక్కడా... ఎక్కడా ...
' ఏంటి నన్ను చూస్తే భయం వేసిందా' అడిగింది నవ్వుతూ.

ఆమె సమాధానం చెప్ప లేదు.

స్వరంలో మృదుత్వం తెచ్చిపెట్టుకుని మళ్ళి  అడిగింది శరణ్య.

' ఎక్కడికి వెళ్తున్నారు? '

ఆమె స్వరం లోని ఆప్యాయతకి చలించి పోయింది... ఆమె అంత ప్రేమగా, చనువుగా మాట్లాడుతుంటే  ఆ  అమ్మాయి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. పెదాలు వణుకుతుంటే “తే ... తెలియదండి నాకెవరూ లేరు.. ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాక ఇక్కడ ఇలా కూర్చున్నాను” అంది.
శరణ్య ఆశ్చర్యంగా చూసింది. “ఎక్కడినుంచి వస్తున్నావు” ఏక వచనం లోకి దిగుతూ అడిగింది.

ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా బోరున ఏడవసాగింది ..

శరణ్య బిత్తరపోయింది.. చురుకైన ఆమె బుర్రకి పరిస్థితి అర్ధం అయింది.. ఆమెని ఓదారుస్తూ అంది “ఏడవకు... నాతో వస్తావా..”

ఆ అమ్మాయి గబ, గబా తల ఊపింది.

“మీకు దణ్ణం పెడతాను నాకెక్కడన్నా తల దాచుకోడానికి చోటు చూపించండి. మీ ఇంట్లో పని మనిషిగా అయినా సరే” అంది ఏడుస్తూ.
శరణ్య గుండె ద్రవించింది. ఆమె చేతి మీద చేయి వేసి మెత్తగా నిమిరి ' ఇప్పుడే వస్తాను'  అంటూ వెళ్లి విజయవాడకి మరో టికెట్ కొంది ..
సరిగ్గా ఐదు నిమిషాల్లో వచ్చిన బస్సు వైపు ఆమెని నడిపిస్తూ “బాధ పడకు నేనున్నాను నీకు” అంది.

“థాంక్స్ అక్కా”  అంది ఆమె శరణ్యతో కలిసి బస్ ఎక్కుతూ..

ఆమె వెనకాలే బస్ ఎక్కుతున్న శరణ్యకి పొడుగాటి జడ చూడగానే గుర్తొచ్చింది.. ఈ అమ్మాయి ... ఆ అమ్మాయే... ఇందిరా పార్క్, ఎర్ర పూల చెట్టు... పక్కన కుర్రాడు.. బెదురుగా తనని చూసిన కళ్ళు ఇవే....

బస్ లో ఆమె పక్కన కూర్చున్నాక అడిగింది శరణ్య “నీ పేరు?”

ప్రశ్న తరవాత కొన్ని క్షణాలకి చెప్పింది “గాయత్రి.”

అపరిపక్వతతో తప్పటడుగులు వేసి జీవితాన్ని ఛిద్రం చేసుకున్న గాయత్రికి శరణ్య అండ దొరకడం మంచికే దారి తీసిందా? ఆమె జీవితం ఒడ్డుకు చేరినట్టేనా? కష్టాల కథ కంచికి చేరినట్టేనా?? తెలుసుకోవాలంటే వచ్చే శుక్ర వారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్