Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue266/710/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... ‘‘అలసటగా ఉందమ్మా!’’ అంది ఆమె. పడుకుందే గానీ తల దగ్గర పెట్టుకున్న తుపాకీ మీదే చెయ్యి ఆన్చి పడుకుంది.

‘‘మీకు ఏమన్నా తినడానికి పళ్ళు గాని, టిఫిన్‌ గాని తెమ్మంటారా అమ్మా!’’ ఆప్యాయంగా ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు సోము. దీపపు వెలుగులో కూడా ఆ కుర్రాడి కళ్లల్లో కనిపించిన ఆప్యాయతకి కరిగి పోయింది ఆమె. చటుక్కున లేచి కూర్చుంది.

‘‘మీ ఇద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు బాబు! మీకు బంధువులు ఎవరూ లేరా?! అమ్మా నాన్న మీద అలిగి వచ్చెయ్య లేదు కదా!’’ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ అడిగింది ఆమె.

‘‘మాకెవరూ లేరమ్మా! నేనూ, రామూ అనాథాశ్రమంలో పెరిగాము. అనాథాశ్రమం లోనే అయిదో తరగతి వరకూ చదువు చెప్పారు. ఆ తర్వాత ఆరో తరగతి నుండి టౌన్‌ పంపించే వారు. మేము ఇద్దరం బడికి ఎగ్గొట్టి ఊరు మీద తిరిగి సాయంత్రం అయ్యే సరికి ఆశ్రమానికి వస్తున్నామని వార్డెన్‌ గారికి తెలిసి పోయింది. రెండు మూడు సార్లు వార్నింగ్‌ ఇచ్చారు. ఆ తరువాత వారం రోజులు పచ్చి మంచి నీళ్ళు ఇవ్వకుండా గదిలో ఉంచేసే వారు. మేమిద్దరం ఇక అక్కడ ఉండ లేక పారి పోయి వచ్చేసాం. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఇదిగో...ఈ దేవాలయం మెట్ల మీద బ్రతుకుతున్నాము.’’ తామిద్దరి గురించి వివరంగా చెప్పాడు సోము.

‘‘అయ్యో! తప్పు కదా బాబూ! బుద్ధిగా చదువుకుంటే మీకీ పాట్లు తప్పేవి కదా!’’ అంటూనే గబ గబా చేతిలో ఉన్న చిన్న పర్సు లాంటి బ్యాగ్‌ తెరిచి సెల్‌ ఫోన్‌ తీసింది ఆమె. స్విచ్‌ ఆఫ్‌ అయి ఉన్న ఫోన్‌ తీసి చూసింది. ఛార్జింగ్‌ లేక ఆగి పోయిన సెల్‌ చూసి పెదవి విరుచుకుంది. తిరిగి ఫోన్‌ లోపల పెట్టి సోము కేసి చూసింది.

‘‘మీరిద్దరూ బాగా చదువుకుంటారా?’’ అడిగింది ఆమె.

‘‘ఇప్పుడు మమ్మల్నెవరు చదివిస్తారమ్మా! పారి పోయి వచ్చిన చవట దద్దమ్మం. అనాథాశ్రమానికి కూడా రానివ్వరేమో కదా!’’ బాధగా అన్నాడు సోము.

ఇంతలో వెనుక నుండి ఎవరో తల మీద బలంగా కర్రతో కొట్టే సరికి ‘అమ్మా’ అంటూ కెవ్వున అరిచి కూర్చున్న దగ్గరే కుప్ప కూలి పోయాడు సోము.

ఆ హఠాత్పరిణామానికి ‘ఆమె’ ఒక్క సారే ఉలిక్కి పడింది..

ఎదురుగా పెద్ద దుడ్డు కర్ర పట్టుకుని యమ కింకరుడిలా ఒకడు నిలబడి ఉన్నాడు. వాడి వెనుకే మరో ఇద్దరు  కత్తులు పట్టుకుని కనిపించారు.

ఆమెకి ముచ్చెమటలు పోసాయి. ఏం చేయాలో అర్థం కాక చటుక్కున లేచి నిలబడింది. చేతికందిన చుర కత్తి తీసి ఛటుక్కున బొడ్డులో దోపుకుంది.

‘‘వెళ్లరా! దాని దగ్గర ఏముందో అంతా లాగెయ్‌. ఆ బ్యాగ్‌ లాక్కుని పట్రా!’’ దుడ్డు కర్ర చేత పట్టుకుని కాల యముడిలా నిలబడ్డవాడన్నాడు.

‘‘ఎ....వ....రు....మీ....రు?!’’ నెమ్మదిగా నోరు పెగిల్చి అడిగింది ఆమె.

‘‘ఎవరైతే నీకెందుకు?! ముందు నీ చేతి గాజులు చెవులకున్న దుద్దులు, ముక్కు పుడక,  తీసి ఇచ్చెయ్యి.’’ కర్కశంగా అరిచాడు ఒకడు.
కర్కశంగా అరిచిన అతని అరుపులు విని మరిక మాట్లాడ లేదు ఆమె. అప్రయత్నం గానే చేతి గాజులు తీసింది.

వెనుక నిలబడ్డ ఇద్దరూ ముందుకొచ్చి ఆమె చేతిలో వస్తువులు లాగేసుకున్నారు. ఒకడు బ్యాగ్‌ కూడా లాక్కుని భుజానికి తగిలించు కున్నాడు.

‘‘అన్నా! దీన్ని లాక్కు పోదామన్నా!....’’ ఆబగా ఆమె అందాల కేసి చూస్తూ అన్నాడొకడు.

‘‘ఎక్కడికో? ఎందుకురా! ఇక్కడే పని కానిచ్చేద్దాం!’’ అన్నాడింకొకడు. ఆమె అవయవాలని కన్నార్పకుండా దీపపు వెలుగు లోనే కళ్ళు చిట్లించుకుని చూస్తూ నిల బడి పోయారు ముగ్గురు. వాళ్లు మీద పడితే ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూనే బొడ్లో దాచుకున్న చురకత్తి మీద చెయ్యేసి సిద్ధంగా నిలబడిందామె.

ఇంతలో బయట బూట్ల శబ్దం విన్పించే సరికి దుండగులు ముగ్గురూ బిక్క చచ్చి పోయి మౌనంగా నిల బడి పోయారు.

‘‘ఎక్కడికిరా మమ్మల్ని తీసుకు వచ్చావు. ఈ బూత్‌ బంగ్లాలో ఎవరుంటార్రా! దొంగ వెధవ! మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నావా?’’ బంగ్లా బయట అరుస్తున్నారెవరో.

‘‘లేదు సార్‌! మా సోము గాడు  అమ్మ గార్ని ఇక్కడికే తీసుకు వచ్చి ఉంటాడు. లోపల ఉంటారు సార్‌....సార్‌....సార్‌ అదిగో! ఆ గదిలో చూడండి! కొవ్వొత్తి వెలిగి లేదూ! అక్కడే ఉంటారు.’’ అంటున్నాడు రాము. రాము మాటలు వింటూనే ఆమె అదిరి పడింది.

రాము ఎవరినో వెంట బెట్టుకు వస్తున్నాడు. ఎవరు వాళ్ళు? నా కోసమే వెతుక్కుంటూ వస్తున్నట్లున్నారు. కొంప దీసి పోలీసులా? పోలీసులే అయి వుంటుంది. ఇప్పుడెలా?! పోలీసులకి దొరికితే తన అన్వేషణ గతి....అధోగతే! ఆలోచిస్తూనే చుట్టూ పరికించింది. గది లోపల నుండి ప్రక్క గది లోకి....వెనుకనున్న గదుల్లోకి....మరో ద్వారం కనిపించింది. అంతలోనే పోలీసులు ముగ్గురు లోపలికి వచ్చేసారు.
బయట మాటలు వినిపించ గానే దుండగులు ముగ్గురూ అలర్ట్‌ అయ్యారు. ఆమె సంగతిని మర్చి పోయారు. ఆమె మీదకు పులుల్లా దూకాలనుకున్న ముగ్గురూ గది లోకి వచ్చిన పోలీసులను చూసి అదిరి పడ్డారు.

‘‘ఒరేయ్‌! పదండిరా!  పదండి’’ అంటూ ఆమె దగ్గర దోచేసిన బంగారం, బ్యాగ్‌తో సహా గదిలోనుండి వెనుక ద్వారం గుండా పరుగులు పెట్టారు.
ఆమె కూడా క్షణం  ఆలస్యం చేయకుండా వారి వెనుకే పరుగందుకుంది. దుండగులు ముగ్గురూ ఆ భవనంలోనుండి వెనుక ద్వారాల గుండా మెట్ల మార్గం లోకి పరుగందుకున్నారు అక్కడ నుండి తప్పించుకోవాలనే ధ్యాసలో కన్ను మిన్ను కానకుండా పరుగెడుతున్నారు.
ఆమె అక్కడ నుండి బయట పడి ఆ దుండగుల కంట పడకుండా మరోమార్గంలో పరుగు లాంటి నడకతో చీకట్లోనే నక్కి నక్కి దాక్కుంటూ ముందుకు సాగి పోయిందామె.

టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులతో వచ్చిన రాము గది లోకి రాగానే క్రింద పడి వున్న సోమూని చూసి భోరున ఏడుస్తూ పరుగున వెళ్లి సోముని లేవనెత్తాడు.

సోము తలకి గాయమై రక్తం స్రవిస్తోంది. స్పృహ తప్పి పడి ఉన్న సోముని ఒడిసి పట్టుకుని ఏడుస్తూనే పోలీసుల కేసి చూసాడు రాము. దుండగులు ముగ్గురూ నిస్సహాయురాలైన ఆమె మీద పడి చెరచడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించారు పోలీసులు. పట్టుకొనే లోపలే పారి పోవడం చూసి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు మతి పోయింది.

గదిలో నుండి పరిగెత్తి పారిపోతున్న దుండగులను చూసి పోలీసు అలర్ట్‌ అయ్యారు. దుండగుల వెనుకే ఆమె కూడా పరిగెట్టి పారి పోవడం చూసి అవాక్కయ్యారు.

‘‘కానిస్టేబుల్‌! నువ్విక్కడే ఉండు. మేమిద్దరం పారి పోతున్న వారిని వెంబడిస్తాం. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చెయ్యి’’ అంటూనే హెడ్‌ కానిస్టేబుల్‌ పరుగందుకున్నాడు. అతన్ని అనుసరించి పరుగెట్టాడు మరో కానిస్టేబుల్‌.

***********

ఘాట్‌ రోడ్‌లో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అప్పటికే ఊరూ-వాడా ప్రమాద వార్త తెలిసి పోయింది. జనాలు గుంపులు గుంపులుగా నిలబడి ఏం జరిగిందో ఒకర్నొకరు అడిగి తెలుసుకుంటూ...ఏం జరగ బోతోందోనని కళ్ళు చిట్లించుకుని....చెవులు రిక్కించుకుని ప్రమాదాన్ని  ప్రమోదం చూస్తున్నట్లు చూస్తున్నారు.
ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బుల్లెట్‌ ని చూస్తూనే రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతున్న జనాలు ప్రక్కకి తప్పుకున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు కొండ మీద నుండి దిగే వాహనాలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు.

బుల్లెట్‌ రోడ్డు ప్రక్కనే సైడ్‌ స్టాండ్‌ వేసి నిలబెట్టి ఆతృతగా ప్రమాద స్థలానికి వెళ్లాడు ఎస్సై. ఘాట్‌ రోడ్‌ కు రెండో ప్రక్క అది. రోడ్డు అంచున నిలబడి క్రిందకు చూసాడు. క్రింద అంతా తుప్పు, ముళ్ల మొక్కలు చిన్న చిన్న బండలు. ఘాట్‌ రోడ్ వార కట్టిన చిన్న ప్రహారీ గోడని గుద్దుకుందేమో....గోడ విరిగి పోయి వుంది.

యువకుల్లాంటి వాళ్ళు లోయ లోకి దిగి వెళ్తున్నారు. అప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ కూడా లోయలోకి దిగాడు. దిగుతూ తూలి జారి పడ బోయాడు. ఇంతలో ఎవరో చేయూత నిచ్చి ఆదుకున్నారు. క్రింద లోయలోనుండి కొందరు పైకి ఎక్కి వస్తున్నారు.

అంత లోనే చిన్న చిన్న గాయాలతో కానిస్టేబుల్‌ని ఇద్దరు పైకి ఎక్కిస్తూ నడిపించుకు వస్తున్నారు. కానిస్టేబుల్‌ని చూస్తూనే ఆనందంతో ఉప్పొంగి పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ‘ష్‌! రక్షించావయ్యా!’ మనసు లోనే అల్లాని ప్రార్థించుకున్నాడు.

‘‘సార్‌! క్షమించండి సార్‌! బస్సుని....’’ గాయాతో లోయలో నుండి పైకి చేరిన కానిస్టేబుల్‌ ఆయాస పడుతూ ఏదో చెప్ప బోయాడు.

‘‘ఓకే! ఓకే! అర్జంటుగా అంబులెన్స్‌ లోకి వెళ్ళి కూర్చో....’’ ఆ ప్రక్కనే రెడీగా ఉన్న అంబులెన్స్‌ దగ్గరకు తనే కానిస్టేబుల్‌ చెయ్యి పట్టుకుని నడిపించుకు వెళ్ళాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అంబులెన్స్‌లో ఉన్న ఎమర్జెన్సీ స్టాఫ్‌ గబాలున వచ్చి కానిస్టేబుల్‌ని అంబులెన్స్‌ లోకి తీసుకు వెళ్లి ఫస్ట్‌ ఎయిడ్‌ చేసారు.

అదే సమయంలో మిగిలిన ఇద్దరు యువకులను నలుగురైదుగురు భుజాల మీద మోసుకొచ్చారు. వాళ్ళిద్దరికీ బాగా గాయాలయ్యాయి. రక్తంతో తడిసి ముద్దయి పోయారు. ఇద్దరికి సృహ లేదు.

ప్రమాద వార్త తెలిసి కొండపై నుండి గాబరాగా దిగి వచ్చిన వరహాల శెట్టి ప్రమాద స్థలంలో నిలబడి గగ్గోలు పెడుతున్నాడు. తన కొత్త బైక్‌కి ఏమైందోనని ఆతృతతో అందర్నీ వాకబు చేస్తున్నాడు.

‘‘బైక్‌ కదా పోతే పోనీలేవయ్యా. ఎవరికీ ప్రాణ నష్టం కలగ లేదు. అందుకు సంతోషించాలి. నీ బైక్‌కేముంది. ఇన్స్యూరెన్స్‌ వాళ్ళు బాగు చేయించేస్తారు.’’ ఎవరో అంటున్నారు.

‘‘అయ్యో!...నా బైక్‌కి ఇన్స్యూరెన్స్‌ గట్రా ఏదీ లేదండీ బాబు! ఏడాదికి రెండు వేలెందుకు దండగ అని కట్టడం మానేసాను. రెండేళ్ళు కూడా కాలేదండీ బాబోయ్‌!’’ లబో-దిబోమని తల బాదుకుంటున్నాడు వరహాల శెట్టి. అందినట్టే అంది...

అంతలోనే పోలీసుల నుంచి జారిపోయిన ఆమె మళ్ళీ చిక్కిందా? కానిస్టేబుల్ ద్వారా నిజాలన్నీ బయటకొచ్చాయా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే  శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?