Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue266/709/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి).... “ఏంటి ఆలోచిస్తున్నావు?”  అడిగాడు తేజ కుడి చేయి స్టీరింగ్ మీద పెట్టి ఎడం చేయి చాచి ఆమె భుజాల మీద వేసి. తల విదిల్చి అతని వైపు చూసి నెమ్మదిగా నవ్వి అంది గాయత్రి పేరెంట్స్ నా ఫ్లాట్ ఎదురు ఫ్లాట్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి నాకు కలవ లేదు. కలిసి ఉంటే ఆమె జీవితం వేరుగా ఉండేది కదా...”

“మనం ఎంత కాదు అనుకున్నా కొన్ని విశ్వాసాలను గౌరవించక తప్పదు  శరణ్యా.. జీవితం ఇలా ఉండాలి అని ఆ భగవంతుడు ముందే స్కెచ్ వేసి ఉంచుతాడు.. ఆ జీవితం అలాగే ఉంటుంది. పాపం ఆ అమ్మాయి జీవితం అలా ఉండాలని స్కెచ్ వేసి ఉంటాడు..” అన్నాడు తేజ.

“మంచి ఫిలోసఫీ ... అది సరే నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతావా” అతని మొహం లోకి పరిశీలనగా చూస్తూ అడిగింది.తేజ వెంటనే బదులు చెప్ప లేదు.. ఎదురుగా పెద్ద కొండ చిలువలా కనిపిస్తున్న రోడ్ వైపు చూస్తూ అన్నాడు... “కర్మ సిద్ధాంతమా, లేక ఇంకోటా నాకు తెలియదు కానీ, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విన్నాక అదేంటో నువ్వే చెప్పు .” కుతూహలంగా అతని మొహంలోకి చూస్తూ కూర్చుంది శరణ్య ఏం చెప్తాడా అని.

“మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళది రాజోలు..  వెయ్యి ఎకరాల భూస్వామి. పెద్ద మండువా ఇల్లు అంటారు నీకు తెలుసో, లేదో..” లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది శరణ్య.“అఫ్ కోర్సు నాకూ గుర్తు లేదు.. నాకు ఐదేళ్ళ వయసు లోనే అమ్మ, నాన్న హైదరాబాద్ వచ్చేసారుట ఆ తరవాత అక్కడికి వెళ్ళ లేదు కూడా.  అయితే తాత గారు ఆ ఊరికి మహా రాజు లాంటి వారుట.. ఊళ్ళో ఏ వేడుక జరిగినా, ఈ శుభ కార్యం జరిగినా అదేదో సినిమాలో చూపించినట్టు ముందు తాతయ్య, నానమ్మ దగ్గరికి వచ్చి ఆశీస్సులు తిసుకునే వారట. వాళ్ళు మామూలుగా ఆశీర్వదించరు కదా మోతుబరులు.. వాళ్ళ స్థాయికి తగినట్టు కొంత బంగారం, పట్టు బట్టలు ఇంకా డబ్బు ఇచ్చి దీవించే వారు. అందుకే వాళ్ళంటే ఊరందరికీ ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం. “

“అయితే,”  తేజ ఆగాడు.శరణ్య ఊపిరి బిగ పట్టి విన సాగింది.

తేజ కారు స్లో డౌన్ చేసి, ఎదురుగా వెనకాల వస్తున్న లారీ వెళ్ళడానికి దారి ఇచ్చి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. “ తాత గారు కమ్యూనిస్ట్ భావాలున్న వారు. నానమ్మ దేవుడిని విపరీతంగా నమ్మేది..వాళ్ళకి చాలా కాలం పిల్లలు పుట్టక పోతే నానమ్మ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తుండేది.. ఇంట్లో ఎప్పుడూ ఏవో పూజలు, వ్రతాలూ, నోములు అవుతూ ఉండేవి.

కొంత కాలానికి నాన్న గారు పుట్టారు.  మా నాన్న పుట్టినప్పుడు ఒక జ్యోతిష్కుడికి నాన్న జాతకం చూపిస్తే నీ ఆస్తి నీ కొడుకు అనుభవించడు ... స్వయం కృషితో వృద్ధిలోకి వచ్చి కోటీశ్వరుడు అవుతాడు.. నీకింక పిల్లలు పుట్టరు.. నీ ఆస్తి పాస్తులన్నీ పరుల పాలు అవుతాయి అని చెప్పాడు.  నాన్న అవన్నీ నమ్మ లేదు.. కానీ నానమ్మ భయపడి పోయింది. అయితే తాతయ్య మాత్రం  పొట్ట కూటి కోసం అతనేదో వృత్తిని నమ్ముకున్నాడు... అతను చెప్పేవన్నీ నిజాలు కాదు “ అంటూ తేలిగ్గా కొట్టి పారేశారు.

కానీ  చాలా విచిత్రంగా తాతయ్య ఆస్తులన్నీ పోయాయి. నాన్నకి ఏమి మిగల లేదు.. నాన్న ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు స్వయం కృషితో మళ్ళి ఆస్తులు సంపాదించారు.  తాతయ్య నుంచి వచ్చింది కేవలం ఐదు ఎకరాలు మాత్రమె.. నానమ్మ వంటి మీద ఆ రోజుల్లో ఉన్న ఏడు వారాల నగలు అంతే  “

శరణ్య ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది “ అదేంటి వెయ్యి ఎకరాలు ఏమైనాయి. “

“తెలియదు... ఆ విషయం ఇప్పటికి ఒక రహస్యంగానే మిగిలి పోయింది.. “

“నీకిదంతా ఎలా తెలుసు?”

“అమ్మ చెప్పింది..”

“ఆవిడకి కూడా తెలియదా ఆస్తి ఎలా పోయిందో..”

“ ఎలా తెలుస్తుంది... అప్పటికి ఆవిడ ఆ ఇంట్లో లేదుగా..”

“కానీ మీ నాన్న గారు చెప్పి ఉండచ్చుగా.”

“ ఆయనకీ తెలియదు.. ఈవెన్ మా నానమ్మకి కూడా తెలియదు ”

‘అదేంటి..’

అదే మిస్టరీ..

శరణ్య నోట మాట రానట్టు అలా స్తంభించి పోయి కూర్చుంది. అప్పటికే సూర్యాస్తమయం అవుతోంది.. పచ్చటి పచ్చిక మీద నారింజ రంగు కిరణాలు పడి పచ్చిక వింత అందంతో మెరిసి పోతోంది. సూర్యుడు పెద్ద గోళం లా మారి పడమట వైపుకి నెమ్మదిగా కదిలి పోతున్నాడు. అక్కడక్కడా పశువులు పచ్చ గడ్డి మేస్తున్నాయి.  రైతులు ఇళ్ళ మొహం పట్టారు..

తేజ కళ్ళల్లో ఒక వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగు చూస్తూ అంది శరణ్య “ఇదంతా విధి రాత అని, కర్మ అని అనుకుంటున్నావా..”

“అంతేగా శరణ్యా ... అలా అనుకోక పోతే ఆ రహస్యం తెలుసుకోడానికి బుర్ర బద్దలు కొట్టుకుని, జీవితం మొత్తం ఆ అన్వేషణలో నిరర్ధకంగా గడిపేసి, నిరాశతో, నిర్లిప్తతతో కృంగిపోయి బతికే వాళ్ళం కదా.. “

శరణ్య మాట్లాడ లేదు.. అతని మాటల్లోని సత్యాన్ని అన్వేషిస్తూ నిశ్శబ్దంగా కూర్చుండి పోయింది.

పెళ్లి హైదరాబాద్ లో చేయాలని తేజ కోరడంతో  అక్కడే సత్య సాయి నిగమాగమంలో చేయడానికి నిశ్చయించారు.. శరణ్య తల్లి, తండ్రులు, అక్కలు, బంధువులు అంతా కూడా హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు ఉండడానికి తను తీసుకున్న ఫ్లాట్ ఇచ్చాడు తేజ. అంతే కాక మారేజ్ హాల్ కి తనే డబ్బు కట్టాడు శరణ్య తండ్రి ఎంత వారించినా వినలేదు.

అతని ఔదార్యానికి ఆయన ముగ్దుడయాడు. “ఎంత అదృష్టవంతురాలివి తల్లీ”  అన్నాడు శరణ్యని దగ్గరకు తీసుకుని.. “అవును నాన్నా” అంది శరణ్య..

“బంగారు పూలతో పూజలు చేసావే” అన్నారు అక్కలు .. నవ్వేసింది శరణ్య. పెళ్లి వైభవంగా జరిగింది.

పెళ్లి కొడుకు తరఫు బంధువులు, స్నేహితులు అందరిని చూసి శరణ్య ఇంటిల్లి పాదీ బెదిరి పోయారు.. అందరూ కూడా సమాజంలో పేరు ప్రతిష్టలు, ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళే.. అందరూ డైమండ్ ఆభరణాలు వేసుకుని , ఖరీదైన పట్టు చీరలు కట్టుకుని, బెంజ్ కార్లలో దిగుతుంటే వాళ్ళకి మర్యాదలు చేయడానికి ఖంగారు పడి పోయారు అందరూ. కానీ, తేజ తల్లి,తండ్రులు వాళ్ళని శాంత పరచి “గాభరా పడకండి అంతా సవ్యంగా జరుగుతుంది... ఎందుకు ఖంగారు”  అంటూ నచ్చ చెప్పడంతో కొంచెం ఆ భయం పోగొట్టుకుని మామూలుగా తిరిగారు.
మొత్తానికి పెళ్లి అద్భుతంగా అయిపొయింది.

మిగతా కార్యక్రమాలు కూడా సవ్యంగా, విజయవంతంగా పూర్తీ అయాయి.

కూతురు వైభోగం చూసి శరణ్య తల్లి, తండ్రులు, బంధువులు ఎంతో మురిసి పోయారు.

అత్త గారింట్లో మూడు నిద్రలు అయి పోయాక శరణ్య, తేజ శరణ్య తల్లి,తండ్రులు అంతా విశాఖ పట్నం బయలు దేరారు. వియ్యాల వారికి ఘనంగా కానుకలిచ్చింది తేజ తల్లి. అందరి దగ్గరా సెలవు తీసుకుని వెళ్తూ “నేను వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళి పోతాను అత్తయ్యా... నాకు లీవ్ లేదు” అంది శరణ్య.

“అలాగే వెళ్ళమ్మా...” ఆప్యాయంగా అంది ఆవిడ.తేజ తో పాటు అతని తల్లితండ్రులు కూడా శరణ్యని  అపురూపంగా చూసుకోడం చూసిన అందరి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. అందరూ పరస్పరం ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పుకున్నారు.

మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంది శరణ్య తల్లి, వియ్యాల వారితో.

మా అబ్బాయి కూడా అదృష్టవంతుడే ...అన్నారు వాళ్ళు.

రెండు పెద్ద కార్లు వైజాగ్ బయలుదేరాయి.

అంతా సంతోషంగా జరిగిపోతుందనుకున్న శరణ్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? వద్దనుకున్నా వాళ్ళ మధ్యకు వస్తున్న గాయత్రి ప్రస్తావన వాళ్ళిద్దరి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది?? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచి చూడాల్సిందే.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్