Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

ఒకానొకప్పుడు తీర్థయాత్రలు  చేయడానికి, కాలినడకన వెళ్ళేవారట… కాలక్రమేణా,  జంతువులమీద కూర్చుని కూడా వెళ్ళేవారుట.  ఏనుగు వీరాస్వామి గారు, తమ “ కాశీ యాత్ర “ పుస్తకంలో, వీటన్నిటిగురించీ వర్ణించారు.  కాశీ యాత్ర  చేయడంలో ఆయన పడ్డ కష్టాలూ, అనుభవాలూ వర్ణించారు. ఆదిశంకరులు కాలినడకనే , మొత్తం దేశం అంతా తిరిగారు. అంతదాకా ఎందుకూ,  మన తిరుపతి వెంకన్న దర్శనం చేసుకోడానికి,  ఏడుకొండలూ, నడిచే ఎక్కేవారు. పైగా ఆరోజుల్లో మెట్లమార్గంకూడా ఉండేది కాదు. తరవాత్తరవాత కొండలు తవ్వి, రోడ్డుమార్గం, నడకదారికి మెట్లూ ఏర్పాటు చేసారు. అలాగే మన రాష్ట్రాల్లోని, అన్నవరం, సింహాచలం కూడా మెట్లదారే దిక్కు. అలా నడిచివెళ్తేనే పుణ్యం వస్తుందనుకునే రోజులాయె… కానీ రోజులన్నీ ఒకేలా ఉండవుగా.. కాలక్రమేణా, రవాణా సౌకర్యాలు పెరిగాయి.  ఈరోజుల్లో చార్ ధాం అనండి, లేక వైష్ణోదేవి, అమరనాథ యాత్ర అనండి, ఎక్కడికైనా హెలికాప్టర్ లో కూడా, ఎక్కువ శ్రమ పడకుండా, వెళ్ళి వచ్చేయొచ్చు… జనాలుకూడా సుఖాలకి అలవాటు పడ్డారు. వీటికి సాయం ఈమధ్యన  Ropeway  లు కూడా వచ్చేసాయి.

ఒకానొకప్పుడు విదేశాలకి వెళ్ళాలంటే, సముద్రం మీదుగా ఓడలోనే వెళ్ళాల్సొచ్చేది. కానీ ఇప్పుడో విమానాలే.. అంతదాకా ఎందుకూ, దేశంలోకూడా. ఒక్కోచోటకి వెళ్ళడానికి , ఏ రైలో, బస్సో మాత్రమే ఉండేవి. చాలా నగరాలు, పట్టణాల మధ్యా, విమానమార్గాలు వచ్చేసాయి. 24 గంటల ప్రయాణం, రెండుమూడు గంటలకి తగ్గిపోయింది… నగరాల్లో కూడా రవాణా వ్యవస్థ  ఎడ్లబళ్ళు, గుర్రబ్బండి, బస్సులూ,  Trams,  రిక్షాలనుండి,   Metro Rail  కి  అభివృధ్ధి చెందింది… కొన్ని రోజుల్లో అదేదో “   Bullet Train “  కూడా వచ్చేస్తోందిట… జనాభా పెరుగుదలతోపాటు రవాణా వ్యవస్థ కూడా అభివృధ్ధి చెందేసింది.

అలాగే ఇదివరకటి రోజుల్లో , పొలాల్లో పండే పళ్ళు, కూరలూ లాటివి, దూరాలకి   పంపే సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. ,, కాలవలద్వారా రహదారీపడవలని ఉండేవి., వాటిమీదే రవాణా చేసేవారు…  తరవాత్తరవాత  లారీలొచ్చాయి. అవేకాకుండా రైళ్ళలో గూడ్స్ బళ్ళనున్నాయి, వాటిద్వారా దేశంలో ఎక్కడికైనా  అన్ని సరుకులూ రవాణా అవుతున్నాయి.

విదేశాలకి ఏవైనా వస్తువులు ఎగుమతి చేయాలంటే, ఈరోజుల్లో విమానాలద్వారా కూడా, తక్కువ సమయంలో పంపగలుగుతున్నారు.  ఏదో ముడిచమురు లాటివి మాత్రం ఇంకా జలమార్గాలద్వారానే వస్తోంది.

 ఒకానొకప్పుడు దేశంలో ఏదైనా వస్తువు కానీ, ఓ పుస్తకం కానీ పంపాలంటే, దగ్గరలో ఉండే ఏ పోస్టాఫీసుకో వెళ్ళడం, అదేదో  Registered Post  ద్వారా పంపాల్సొచ్చేది. .. అది చేరడానికి కూడా చాలారోజులు పట్టేది. కానీ, కొన్ని సంవత్సరాలముందు మొదలెట్టిన  Courier Service  ద్వారా, వస్తువులుకానీ, ముఖ్యమైన డాక్యుమెంట్లు కానీ  24  గంటల్లో గమ్యం చేరిపోతున్నాయి.

 ఇలా చెప్పుకుంటూ పోతే , రవాణావ్యవస్థ లో వచ్చిన మార్పుల ధర్మమా అని, అన్ని రంగాల్లోనూ  అభివృధ్ధనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదివరకటి రోజుల్లో విదేశాల్లో తయారయిన వాహనాలు, ఏ కొద్దిమందికో అందుబాటులో ఉండేవి… పైగా వాటిని కొనుక్కోవడానికి కూడా చాలా శ్రమ పడాల్సొచ్చేది. ఇప్పుడు, ఆ విదేశీ కంపెనీలే మన దేశంలోనే వాటి ని తయారుచేసేస్తున్నారు… ఈరోజుల్లో సంపాదన కూడా పెరగడంతో పాటు, మనుషులు ఒకానొకప్పుడు ఎంతో  ప్రసిధ్ధి చెందిన   సైకిలు పాపం కనుమరుగైపోయింది. ఎక్కడచూసినా విదేశీ కార్లూ, మోటార్ సైకిళ్ళూ వచ్చేసాయి… అవి నడవాలంటే  ఇంధనం కావాలికదా..  Petrol, Diesel   ఉత్పత్తికూడా పెరిగింది, దానితోపాటు ధరలూ పెరిగాయి… పొరుగురాష్ట్రంనుండి ఏదైనా వస్తువు రావాలంటే, దానికి రవాణా ఖర్చుకూడా ఉంటుందిగా, రోజురోజుకీ పెరుగుతూన్న ఇంధనం రేట్లతోపాటు , ధరలుకూడా పెరుగుతాయేకదా మరి.

 ధరలకేముందిలెండి, దానితోపాటు ఆదాయంకూడా పెరుగుతోంది కాబట్టి, ఎలాగోలాగ కానిచ్చేస్తున్నారు. కానీ ఇలా  వాహనాల సంఖ్య పెరగడంతో పాటు పెరిగింది—వాతావరణ కాలుష్యం. ఈరోజుల్లో శుభ్రమైన గాలి అనేది లభించడంలేదు… దానితో రోగాలూ పెరిగిపోతున్నాయనడంలో సందేహం లేదు. ఈ రోగాలతో పాటు వచ్చిన ముఖ్యమైన మార్పు, వాతావరణం విపరీతంగా వేడెక్కిపోవడం… అదేదో  Global warming  ధర్మమా అని, చెప్పాపెట్టకుండా ప్రకృతి లోకూడా మార్పులొచ్చేసాయి. ఇదివరకటిరోజుల్లోనూ ఎండలుండేవి, కానీ మరీ విపరీతంగా కాదు. అలాగే వర్షాలూ టైముకొచ్చెవి. కానీ ఈ రోజుల్లోనో, అవేవో తుఫానులూ, వాయుగుండాలూ నిత్యకృత్యాలైపోయాయి.. వాటితోపాటు ఆస్థినష్టం, జన నష్టం…

అభివృధ్ధి ఉండాలనుకోవడంతో పాటు , దానిని ఎలాకాపాడుకోవాలోకూడా  తెలియాలిగా…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
jayajayadevam