శిష్య రత్నం: గురువర్యా, మీరు అనేక తపస్సులు చేశారు. రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమలను చూశారు. ఆ నలుగురిలో అందగత్తె ఎవరు స్వామీ?
గురువర్యుడు: (రహస్యంగా) శిష్యా, గురుపత్ని ఇంట్లో వుండగా,ఇలాంటి చిలిపి ప్రశ్నలడక్కురా! ఆవిడ నీటి కడవతో చెరువుగట్టుకెళ్ళనీ... నీ ప్రశ్నకు బదులిస్తా!!
**********
శిష్య పరమాణువు: గురోత్తమా... చాలా కాలం క్రితం మీరు నేర్పిన అస్త్రం ప్రయోగించాను! అది గురితప్పి నన్ను తరుముకొస్తోంది స్వామీ! కాపాడండి!!
గురోత్తముడు: నాకివ్వాల్సిన గురుదక్షిణ ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాడివేనా.. నేనేమీ చేయలేను పో!(కాసేపట్లో, అస్త్రం, శిష్యుడ్ని హతమారుస్తుంది..! ఇది గమనిస్తున్న మరోశిష్యుడు...)
మరోశిష్యుడు: గురోత్తమా, ఇదుగోండి నేను మీ కివ్వాల్సిన గురుదక్షిణ అణా పైసలతో సహా...
గురోత్తముడు: అలా రాండి... దారికి!!
**********
తపస్వి: ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి, నీ దర్శన భాగ్యం పొందాను, నాకు కష్టసుఖాలు సులభంగా అర్ధమయ్యేలా వరం ప్రసాదించన్డి స్వామీ!
స్వామీ: భక్తా... నువ్వీ తపస్సులు చేయటం మాని , ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో కాపురం చెయ్యి పో!!
**********
దేవేంద్రుడు: (తనలో తాను మాట్లాడుతూ)... హు.. ఇవాళ పనీపాట ఏమీ తోచటం లేదు. భూలోకంలో ఎవడి తపస్సునైనా భంగం చేద్దామా? (గట్టిగా) రంభా... ఇలా రా?
రంభ: (కొరకొర చూపులతో) "రంభా... ఇలా రా..అనకుండా " రంభా అలపో" అనండీ... ఊ చెప్పండి ఎక్కడికెళ్ళి చావాలో...! హు!!
**********
మేనక: తపోభంగం చెయ్యడానికి వెళ్ళావు కదా? మధ్యలో తిరిగొచ్చేశావేం తిలోత్తమా?
తిలోత్తమ: ఆ తపస్సు చేసే ఋషి నాట్య శాస్రాప్రవీణుడట... నేను ఆయన ముందు నాట్యం చేస్తుండగా, తప్పులు కనిపెట్టి, నన్ను వెనక్కి పంపించేశాడు!
**********
శిష్యుడు: మునీంద్రా తమరు దివ్య దృష్టిని ఏ విధంగా సాధించారూ?
మునీంద్రుడు: పదివేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసి, వరంగా పొందాను శిష్యా!
శిష్యుడు: దివ్యదృష్టి వల్ల ఏం ప్రయోజనం గురోత్తమా!
మునీంద్రుడు: భూత, భవిష్యత్, వర్తమానాలని చూసి తెలుసుకోవచ్చును!
శిష్యుడు: స్వామీ, నేనూ తపస్సు చేసి సాధించాలనుకుంటున్నాను... మీ దివ్యదృష్టితో చూసి , నేను దివ్యదృష్టి పొందగలనా చెప్పండి స్వామీ.
**********
ఒక ఋషి ఇంకో ఋషి తో: తపస్సు చేయడానికి వెళ్తున్నా... నువ్వూ నాతో వస్తావా?
ఇంకోఋషి: ఎండాకాలం .. నేను రాను బాబూ! చుట్టూ పుట్టలు పెరిగి ఉక్కపోసి చస్తాం!!
**********
శెట్టికొడుకు, దారే పోయే యోగితో: యోగేశ్వరా? తపస్సంటే ఏమిటి?
యోగి: నాయనా... అన్నపానాదులు మాని, నిద్రాసుఖాలు మాని, శరీరం శుశ్కింపజేసి, నియంత్రించి, సమాధి స్థితిలోకి చేరి దైవ నామ జపం చేయాలి! అదే తపస్సు!
శెట్టి కొడుకు: తపస్సు చేస్తే, దక్కే లాభం ఏమిటి స్వామీ?
యోగి: దేవుడు ప్రత్యక్షమై ముక్తి ప్రసాదిస్తాడు:! సురలోకానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆకలి దప్పులుండవు, చావు పుట్టుకలుండవు, అంతా ఆనందమయమే తపస్సుకు నాతో వస్తావా నాయనా...?
శెట్టి కొడుకు: నాకు ఆకలంటే ఇష్టం. సుష్టుగా భోంచేసి , కాయ కష్టం చేసి అలిసి నిద్రపోవాలంటే ఇష్టం. సంసార సుఖాలను అనుభవించి, ముసలివాడై , చివరికి చచ్చిపోవాలని ఇష్టం! ఆపై సంగతి దేవుడెరుగు మీరు వెళ్ళిరండి యోగీశ్వరా!,...!!
యోగి: హు... ఈ చాదస్తపు మనుషులను మార్చలేము ఈశ్వరా!
**********
శిష్యుడు: గురువర్యా, శ్రీమన్నారాయణుడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి అవతరిస్తాడట నిజమేనా?
గురువర్యుడు: అదే.. నేను తపస్సు చేసిన ప్రతీసారీ ప్రత్యక్షమై ఈ రెండు మాటలు చెప్పి మాయమౌతాడు వరాలివ్వడే?
**********
ఋషి: ఊర్వశీ... మీరంతా ఋషుల ముందే నాట్యాలాడి తపోభంగాలు చేస్తారే ?రాక్షసులు తపస్సులు చేస్తే,వాళ్ళ తపస్సులను భంగం చేయరేం? ఆ(?
ఊర్వశి: చిక్కు ప్రశ్న వేశారు! ఎందుకో మాకే తెలియదే!! ..
|