గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue267/711/telugu-serials/anveshana/anveshana/
(గత సంచిక తరువాయి)... కొండ మీద నుండి రెండో కానిస్టేబుల్ కూడా ప్రమాద స్థలానికి వచ్చి చేరుకున్నాడు. కొండ బస్సులో నుండి దిగి వస్తూనే ఎస్సై అక్బర్ ఖాన్ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసాడు.
‘‘సార్! వినయంగా నిలబడ్డాడు కానిస్టేబుల్.
‘‘నువ్వు కూడా ‘ఆమె’ని చూడ లేదా?’’ సీరియస్‌గా అడిగాడు ఎస్సై.
‘‘లేద్సార్! కొండ బస్సు కదిలి వెళ్ళి పోతున్నప్పుడు ఆ యువకులిద్దరూ బస్సులో వున్న ‘ఆమె’ని చూసామన్నారు.’’ చెప్పాడు.
‘‘సరే! యాత్రీకులందరితో పాటు ఆమె కూడా ఇదిగో....ఇక్కడే బస్సు దిగేసి ఉంటుంది. పద! ఎక్కడికి పారి పోలేదు. వెంటనే ఆర్టీసీ బస్సు స్టాండ్ దగ్గరకు వెళ్దాం.’’ అంటూ బుల్లెట్ ఎక్కి స్టార్ట్ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! మనం....’’ సంశయంగా అన్నాడు కానిస్టేబుల్ .
‘‘ఎస్! మనకి ఆమె ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఓ పని చేద్దాం.’’ అంటూనే ఏదో గుర్తొచ్చి టక్కున బుల్లెట్ స్టాండ్ వేసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
జేబులోనుండి సెల్ ఫోన్ తీసి చక చకా నెంబర్లు నొక్కాడు.
‘‘నమస్తే సార్! చెప్పండి సార్! గోపాల పట్నం పోలీస్ స్టేషన్ నుండి స్టేషన్ రైటర్‌ని మాట్లాడుతున్నాను.’’ అట్నుండి రైటర్ అంటున్నాడు. క్రైమ్ ఎస్సై అక్బర్ ఖాన్‌ని మాట్లాడుతున్నాను.’’ హుందాగా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! నమస్తే!’’ అట్నుండి వినయంగా అన్నాడు రైటర్.
‘‘రైటర్ గారూ! వినండి. అర్జెంటుగా అడివి వరం రేంజ్‌లో గస్తీ తిరుగుతున్న మన పెట్రోలింగ్ టీమ్ ఎక్కడున్నారో కనుక్కోండి! అర్జెంటు’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘సార్! వైర్ లెస్ సెట్ కనెక్ట్ చెయ్యమంటారా?’’ అడిగాడు రైటర్.
‘‘ఎస్! అర్జెంటుగా...కలపండి.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
మరు క్షణంలో అట్నుండి వాయిస్ వినిపించింది.
‘‘హలో....హలో....నేను రక్షక వాహనం డ్రైవర్‌ని మాట్లాడుతున్నాను.’’
‘‘హలో....హలో....నేను క్రైమ్ ఎస్సై అక్బర్ ఖాన్ హియర్! పెట్రోలింగ్ కారులో ఎవరూ లేరా?’’ అడిగాడు ఎస్సై.
‘‘సార్! మేము సింహాచలం కొండ దిగువ బస్సు స్టాండ్‌లో ఉన్నాం. టీమ్ అంతా ఎవరో కుర్రాడ్ని ఏటిఎమ్‌లో డబ్బులు డ్రా చేస్తుండగా పట్టుకున్నారు. ఆ డబ్బు ఎవరో స్త్రీదని ఆ కుర్రాడు టీమ్ అందర్నీ ఎక్కడికో తీసుకు వెళ్ళాడు సార్!’’ అట్నుండి రక్షక వాహనం డ్రైవర్ చెప్పింది వింటూనే ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఓకే...ఓవర్...’’ అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే బుల్లెట్ స్టార్ట్ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఎస్సై బుల్లెట్ స్టార్ట్ చేయ గానే వెనక ఎక్కి కూర్చున్నాడు కానిస్టేబుల్.
ఎస్సై అక్బర్ ఖాన్‌కి మతి పోయింది.
‘ఆమె ఎవరు? ఎందుకిలా దోబూచులాడుతోంది?! విదేశాల్లో ఉన్న ముసలమ్మ కుమారులు చంపించారా?! ఎలా?! ఆస్తి కోసం కన్నతల్లినే చంపేస్తారా? రోడ్డు మీదకు తగిలేసిన వాళ్ళు చంపడానికి ఎందుకు వెనుకాడతారు కనుక. మరి, ఈమె ఎవరు?
ఆలోచిస్తూ కొండ దిగుతున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్. బుల్లెట్ దడ దడా శబ్దం చేస్తూ పరిగెడుతోంది. రోడ్డుకిరు వైపులా వెలుగుతున్న వీధి లైట్ల వెలుగులో ఎదురుగా వస్తున్న కార్లు, బైకుల్ని తప్పిస్తూ నెమ్మదిగా బుల్లెట్ డ్రైవ్ చేస్తున్నాడు.
కొండ దిగువ ఆఖరి మలుపు...ఎదురుగా కొండ పైకి వెళ్ళే మెట్ల దారి హైమాక్స్ లైట్ల వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. మలుపు దగ్గరే రోడ్డు ప్రక్కన ఉన్న ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం విద్యుత్తు వెలుగుల్లో అద్భుతంగా కనిపిస్తోంది.
‘‘సార్! మనం ఎక్కడికి వెళ్తున్నాం?’’ వెనుక కూర్చున్న కానిస్టేబుల్ ప్రశ్నకు ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘అవును! ఎక్కడికెళ్తున్నాం. ఆమెని ఎక్కడని వెతుకుతాం! ఎటు వెళ్ళుంటుంది? ఆర్టీసీ బస్సు స్టాండ్ దగ్గరికి తప్ప ఎటూ వెళ్ళ లేం! ఊరు దాటి పారి పోవాంటే బస్సు ఎక్కాలి, అదొక్కటే మార్గం...’
మనసు లోనే అనుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఆర్టీసీ బస్సు స్టాండ్ కి వెళ్దాం. ఆమె అటే వెళ్తుంది. ఊరు వదిలి పోవాలంటే అదే దారి!’’ అన్నాడు ఎస్సై.
‘‘నిజమే సార్!’’ ఉత్సాహంగా అన్నాడు కానిస్టేబుల్. నెమ్మదిగా బుల్లెట్ నడుపుతూ ఆలోచనలతో సతమతమవుతున్న ఎస్సై అక్బర్ ఖాన్ తొలి పావంచా ప్రక్కనే వున్న బూత్ బంగ్లా కేసి చూసి అదిరి పడ్డాడు. శీతాకాలం వెన్నెల వెలుగులో బూత్ బంగ్లాలోనుండి ఏవో ఆకారాలు ముందు పరిగెడుతూంటే వారి వెనుక మరో రెండు ఆకారాలు వెంబడించడం చూసి అదిరి పడ్డాడు.
బుల్లెట్ ని నేరుగా హైమాక్స్ లైట్లు అమర్చిన స్తంభం ప్రక్కకు తీసుకు వెళ్లి ఆపాడు.
ముందు పరిగెడుతున్న ఆకారాలు ఏదో మోసుకెళ్తూ మెట్ల దారిలోనుండి ఘాట్ రోడ్డు కేసి రావడం గమనించిన ఎస్సై అక్బర్ ఖాన్ ఎలర్ట్ అయ్యాడు.
‘‘కానిస్టేబుల్! బి రెడీ! పరిగెడుతూ వస్తున్న ఆ ముగ్గుర్నీ పట్టుకోవాలి. వెనుక వస్తున్న వాళ్ళెవరో తర్వాత ఆలోచిద్దాం...పద!’’ అంటూనే బుల్లెట్ స్టాండ్ వేసి భయంతో గాబరాగా తమ కేసే పరిగెట్టుకొస్తున్న దుండగులను గమనిస్తూ వారికి ఎదురుగా పరిగెట్టారిద్దరూ.
పాడు పడ్డ బంగ్లా లో నుండి పారి పోయి వచ్చిన దుండగులు తమ వెనుక తరుముకొస్తున్న పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఘాట్ రోడ్ ప్రక్కనే ఉన్న లోయల్లోనుండి దిగువకి పారి పోవానే ధ్యాసలో అటూ ఇటూ దిక్కులు చూస్తూ వెనుకా ముందూ చూడకుండా పరిగెడుతున్నారు.
తొలి పావంచా దగ్గర ఘాట్ రోడ్ గట్టు ఎక్కుతూ ఎదురుగా పరిగెట్టుకు వస్తున్న ఎస్సై అక్బర్ ఖాన్, కానిస్టేబుల్‌ని చూసి అదిరి పడ్డారు దుండగులు ముగ్గురూ.
గబుక్కున వెనక్కి తిరిగి పారిపోవాలనుకుని వెనకడుగు వేస్తూ వెనక్కి తిరిగే సరికి వెనుక నుండి తరుముకొస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని చూస్తూనే చేతులో ఉన్న బ్యాగ్ ప్రక్కన పడేస్తూ తొలి పావంచా మెట్ల కేసి పరిగెట్ట బోయాడు ఒక దుండగుడు.
బ్యాగ్ ఘాట్‌రోడ్ గట్టు క్రింద పడేస్తూ తొలి పావంచా కేసి పరిగెడుతున్న దుండగుల్ని చూస్తూనే ఒక్క గెంతు గెంతి అతడి కాలర్ పట్టుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఇంతలో వెనుక నుండి తరుముకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అక్కడకు చేరుకుని మిగిలిన ఇద్దర్నీ పట్టుకున్నారు. దుండగులు ఘాట్ రోడ్ గట్టు క్రిందకు విసిరేసిన బ్యాగ్ వెతికి పట్టుకొచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్‌తో వచ్చిన కానిస్టేబుల్.
ఎస్సై అక్బర్ ఖాన్‌ని చూడగానే టాస్క్ ఫోర్స్ పోలీసు వినయంగా నమస్కరించి సెల్యూట్ చేసారు.
‘‘ఎవరో కుర్రాడు ఏ.టి.ఎమ్‌లో డబ్బు డ్రా చేసి పట్టుకు పోతుంటే పట్టుకున్నారు కదా? అ కుర్రాడేడి?! ఆ డబ్బు ఎవరో స్త్రీ డ్రా చేయమని చెప్పిందన్నాడట కదా! ఆవిడ కనిపించిందా?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఆ కుర్రాడిని వెంట బెట్టుకుని ఆవిడని వెతుక్కుంటూ ఆ బూత్ బంగ్లాకు వెళ్ళాం సార్! అప్పటికే ఈ ముగ్గురూ ఆ మహిళని రేప్ చెయ్య బోతున్నారు. మమ్మల్ని చూసి వీళ్ళు పరిగెట్టుకుని పారి పోతుంటే వెంబడించి వచ్చాము.’’ చెప్పాడు హెడ్ కానిస్టేబుల్.
‘‘మరి ఆ కుర్రాడు....?!’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఆ కుర్రాడితో పాటు మరో కుర్రాడు కూడా అక్కడ ఉన్నాడు సార్! రెండో వాడ్ని వీళ్ళు తల మీద బలంగా కొట్టినట్లున్నారు ఆ కుర్రాడి తలకి గాయాలైతే అంబులెన్స్‌కి కాల్ చెయ్యమని మన కానిస్టేబుల్‌ని ఒక్కడ్ని అక్కడే కాపలా పెట్టి మేము వీళ్ళని వెంబడించాం సార్!’’ చెప్పాడు హెడ్ కానిస్టేబుల్.
‘‘మరి, ఆ మహిళ?....అక్కడే ఉందా?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘లేదు సార్! ఆవిడ కూడా అక్కడ నుండి తప్పించుకుంది. మేము ఇద్దరం ఈ దుండగుల మీదే దృష్టి పెట్టి వీళ్ళని వెంబడిస్తూ వచ్చేసాం.’’ తప్పు చేసిన వాడిలా తల దించుకుని చెప్పాడు హెడ్ కానిస్టేబుల్.
‘‘మైగాడ్! మేము వెతుకుతున్న ‘ఆమె’ ‘ఈమె’ ఒక్కరు కాదు కదా!’’ అంటూనే " పదండి! అక్కడకు వెళ్దాం.’’ అంటూ తొలి పావంచా కేసి దారి తీసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
ఎస్సై వెనుకే దుండగుల రెక్కలు విరిచి పట్టుకుని లాక్కెళుతూ అనుసరించారు పోలీసులు.
***
సరిగ్గా అదే సమయంలో
ఆమె పరుగు లాంటి నడకతో బూత్ బంగ్లా వెనుక నుండి సంస్కృతోన్నత పాఠశాల ప్రక్క సందులోనుండి వెనుక వైపుకు చేరుకుంది. చీకట్లో దారి తెన్నూ కానకుండా నడుస్తోంది ఆమె.
‘దుండగుల చేతుల్లోనుండి తప్పించుకో గలిగింది గాని పోలీసుల చేతుల్లో పడితే తప్పించుకోవడం చాలా కష్టం. తన బండారం బయట పడుతుంది! తన అన్వేషణ అడుగంటి పోతుంది. తన బ్రతుకు శిథిలమై పోతుంది!!
పోలీసులకు దొరక్కూడదు. తానెవరో...తానెందుకిలా పిచ్చి దానిలా తిరుగుతోందో బట్టబయలు కాకూడదు...!’ పరి పరి విధాల ఆలోచిస్తూ పరుగు లాంటి నడకతో వీధి దీపాల వెలుగుకి దొరక్కుండా క్రీనీడలో నక్కి నక్కి నడుస్తోంది ఆమె.
దేవుడి పూలతోట దగ్గరకు వచ్చి ఆగింది.
ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది. దాని ప్రక్కనే ఆర్టీసీ బస్సు స్టాండ్, ఎటు వెళ్ళాలో అర్థం కాక క్షణం ఆలోచిస్తూ నిలబడి పోయింది ఆమె.
సోము చెప్పిన వారి బాల్యమే పదే పదే గుర్తుకొస్తోంంది ఆమెకి. తానీ నగరం వచ్చి చేరుకున్న దగ్గర నుండి జరిగిన సంఘటనలు తిరిగిన ప్రదేశాలు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ నిలబడింది. అక్కడే ఓ మూల చదునుగా ఉన్న చోట కూర్చుంది. తనని ఎవరూ కనిపెట్ట లేరని నిర్ధారించుకుంది. రోడ్డు కేసి చూస్తూ కూర్చుంది.
విశాఖ పట్నంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పాపా హోమ్‌కి వెళ్లింది. డాబా గార్డెన్‌లో ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ప్రేమ సమాజానికి వెళ్ళింది. విశాఖ పట్నంలో అధికారికంగా....అనధికారికంగా నిర్వహిస్తోన్న అనాథ శరణాలయాలన్నీ తిరిగి తిరిగి విసిగి వేసారి పోయింది.
చిట్ట చివరగా భీమిలి రోడ్‌లో ఉన్న ఎస్.ఓ.ఎస్. విలేజ్ కి కూడా వెళ్ళింది. ఎంత మంది పిల్లలు...ఎంత ఆహ్లాదంగా వుంది ఆ వాతావరణం. ‘‘సేల్ అవర్ సోల్’’ బ్రిటీష్ కాలం లోనే అనాథ పిల్లల కోసం ఏర్పరచిన శరణాలయం. అక్కడా నిరాశే ఎదురయ్యింది. తాను చెప్పిన ఆధారాలు... ఎక్కడా దొరక లేదు. తాను చెప్పిన రోజున ఎలాంటి సంఘటనలు రికార్డు కాలేదు.
అన్ని చోట్ల ఎదురైన చేదు అనుభవం ఒక్కటే! పదేళ్ల నాటి మాట. వాళ్లిప్పుడు ఇక్కడే ఎలా ఉంటారమ్మా! పాకడం నేర్చుకోగానే పరిగెట్టి పరిగెట్టి పారి పోవడానికి సిద్ధమయ్యే ఈ కాలం పిల్లలు...బుద్ధిగా ఉన్న వాళ్ళు ఇదిగో ఇలా చదువుకుంటూ ఓ దారి దొరికే వరకూ ఇక్కడే ఉంటారు. ఆకతాయిలు ఎందరో చెప్పా పెట్టకుండా పారి పోతుంటారు. వాళ్ల ఆచూకీ బ్రహ్మ దేవుడు కూడా పట్ట లేడు. మేమేం చెయ్యగలం ఓ పోలీసు రిపోర్టు ఇచ్చి ఊరుకుంటాం అంతే.
అన్నిచోట్ల అదే సమాధానం. గుండె బద్దలై పోయింది. పసి వాళ్లు ఎక్కడికని పారి పోతారు?...‘నా’ అన్న వాళ్ళు లేని వాళ్ళు ఎటు వెళ్లినా తిరిగి ఇక్కడికే రావాలి కదా’’ అంటే వాళ్ళేమన్నారు? ఎంత నిర్లక్ష్యంగా చెప్పారు?
‘‘వాళ్లకేమమ్మా! ఊరంతా బంగారమే! అడుక్కునే వాళ్లకి అన్నిళ్ళు వారివే కదా. అందరూ బంధువులే! ఇలాంటి వాళ్ళు ఉంటే గింటే రైల్వే స్టేషన్ లోనో, గుడి మెట్ల దగ్గరో అడుక్కుంటూనో...దారిన పోయే వారిని దోచుకుంటూనో తిరుగుతుంటారు.
అప్పుడే తన గుండె వెయ్యి ముక్కలై పోయింది. ఆశ చావక అనాధలా అలమటిస్తూ తిరుగుతోంది. గుళ్ళు గోపురాలు చుట్టు ముట్టి వస్తోంది. చివరికి సింహాచలం సింహాద్రి నాధుని సన్నిధికి చేరుకుంది.
సోము చెప్పిన మాటలు చెవుల్లో మారు మ్రోగుతుంటే ‘ఆమె’ మనసెందుకో రాము సోము పుట్టు పూర్వోత్తరాలు ఆరా తియ్యమంటోంది. వారిద్దర్లో తానెదుకుతున్నవాడున్నాడేమో.
ఆలోచిస్తూనే రోడ్డు కేసి చూసింది ఆమె. రోడ్డంతా వచ్చే పోయే వాహనాతో రద్దీగా ఉంది. చాలా మంది నడిచి వెళ్తున్నారు. వాళ్ళలో కలిసి పోయి బస్సు స్టాండ్‌కి చేరుకుంటే మంచిదనుకుంటూ చక చకా రోడ్డు మీదకు వచ్చింది ఆమె.
బస్సు స్టాండ్ నుండి బయలుదేరే బస్సులన్నీ విశాఖ పట్నం నలుమూలలకు వెళ్ళే బస్సులే. ఏది ఎక్కినా తానిక్కడ నుండి సురక్షితంగా బయట పడవచ్చు.
ఆలోచిస్తూనే బస్సు స్టాండ్ చేరుకుందామె,.
*******
పాడుబడ్డ భవనం దగ్గరకు వచ్చి ఆగింది అంబులెన్స్. అదే సమయంలో పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు ఎస్సై అక్బర్ ఖాన్, ఆయన వెనుక పోలీసులు.
సోము స్పృహ తప్పి పడి ఉన్నాడు. సోమును పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు రాము. అక్కడే కాపలాగా ఉన్న కానిస్టేబుల్ గది లోకి ఆతృతగా పరిగెత్తుకు వచ్చిన ఎస్సై అక్బర్ ఖాన్‌ని చూస్తూనే అలర్ట్ అయ్యాడు. సెల్యూట్ చేసి ఓ వారగా నిలబడ్డాడు.
ఆమె అన్వేషిస్తున్నది పిల్లలకోసమా??? ఆమె వెతుకుతున్న పిల్లలు రామూ-సోమూలేనా?? మరితే అంతలోనే సిమ్హాచలం వదిలి ఎందుకు పోతోందామె? పోలీసుల సహాయం తీసుకోవాల్సిన ఆమె, పోలీసుల నుంచి తప్పించుకోవాల్సిన అవసరమేముందామెకి?? ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా వేచి చూడాల్సిందే...... |