Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue267/712/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)....  ఆ రోజు మంగళ వారం.

గాయత్రి కొత్త జీవితంలో ఏడు నెలలు ప్రశాంతంగా గడిచి పోయాయి. బాబుకి ఏడాది గడిచి రెండో ఏడు వచ్చింది. వాడు పుట్టిన తేది కానీ, తిధి, వార, నక్షత్రాలు కానీ గాయత్రికి గుర్తు లేదు.. ఒక్కటే గుర్తుంది ... కొత్త సంవత్సర సంబరాలు జరిగిన  సుమారు పది రోజులకి వాడు పుట్టాడు. అంటే జనవరి నెలలో పుట్టాడు.

జనవరి నెల వచ్చింది.. సుమారుగా పన్నెండో తారీకు అని లెక్క గట్టి చెప్పింది సుశీల. ఆ రోజు వాడిని గుడికి తీసుకు వెళ్ళి పూజారితో దీవెనలు ఇప్పించింది. గుంటూరు నుంచి తెచ్చిన కొత్త డ్రెస్ వేసింది. సేమ్యా పాయసం చేసి తినిపించింది. సుశీల ప్రేమకి, అభిమానానికి గాయత్రి మనసు మూగ బోయినట్టు అయింది. వాడి చేత ఆ దంపతులకి పాదాభి వందనం చేయించింది. భర్తకి చెప్పి గాయత్రిని, బాబుని సినిమాకి తీసుకు వెళ్ళింది సుశీల. శరణ్య దగ్గరకు కూడా వెళ్ళాలనిపించింది గాయత్రికి కానీ ఎలా వెళ్ళాలో తెలియ లేదు.. సుశీలతో అనాలనుకుంది గాయత్రి దగ్గరకు బాబుని తీసుకుని వెళ్దాం అని కానీ ధైర్యం చాల్లేదు.  అయితే సినిమా నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు సుశీలే అంది శరణ్య గారి దగ్గరకు తీసుకు వెళ్తే బాగుండేది కదా.

గాయత్రి  విప్పారిన  మొహంతో చివుక్కున ఆవిడ వైపు చూసింది.

మేడం చాలా బిజీగా ఉన్నారు.. అసలు ఆఫీస్ కి కూడా రోజు రావడం లేదు.. చాలా ఫైల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి.. ఆవిడకి విజయవాడ ఆఫీసులోనే చాలా పని ఉంది.. రోజు కలెక్టర్ దగ్గర మీటింగ్స్.. పైగా ఈ మధ్య ఆవిడ పెళ్లి చేసుకున్నారు అన్నాడు రమణ.

ఓహ్ అవునా.. శుభవార్త చెప్పారే అంది సుశీల సంతోషంగా.

మా అందరికి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు కానీ మేము వెళ్ల లేక పోయాం. పెళ్లి హైదరాబాద్ లో జరిగింది.. అతను చాలా రిచ్ ట.. లవ్ మ్యారేజ్ ట.. ఆవిడ లీవు నుంచి రాగానే మా అందరికి ఆఫీస్ లో పార్టి ఇచ్చారు. అతను కూడా చాలా బాగున్నాడు.

రమణ చెప్తున్న ఒక్కో మాట గాయత్రి మనసుని  ఆనంద డోలికలూగించింది.  బాబు పేరున యాభై వేలు బాంక్ లో డిపాజిట్ చేస్తూ శరణ్య అన్న మాటలు గుర్తొచ్చాయి. నా కాబోయే భర్త ఇచ్చాడు ఈ డబ్బు అని చెప్పింది. గాయత్రికి అంత పెద్ద మనసున్న శరణ్య భర్తని వెంటనే చూడాలనిపించింది. ఎంత అదృష్టవంతురాలు ఆవిడ.. ఆవిడే కాదు అతను కూడా అదృష్టవంతుడే. అందం, చదువు, ఉన్నతమైన హోదా, మంచి మనసు ఉన్న భార్య దొరకడం అతని అదృష్టం కాదా.

రమణ ఇంకా ఏదో చెప్తున్నా అవేవి ఆమె వినిపించుకో లేదు. శరణ్య, తేజాల అందమైన రూపాలను మనసులో ఊహించుకుంటూ కూర్చుంది ఇల్లు చేరిందాకా.

ఆదివారం సాయంకాలం సుశీల వెళ్ళి పోయింది గుంటూరు ..

గాయత్రికి సుశీల ఉన్న మూడు రోజులు హాయిగా నిశ్చింతగా గడిచినట్టు అనిపిస్తుంది. ఆవిడ వెళ్ళగానే ఏదో అభద్రతా భావం కలుగుతుంది. ఆ పెద్ద ఇంట్లో రమణ, పక్కనే తను, తన కొడుకు.. పగలంతా అంగన్ వాడిలో గడిచి పోతుంది. ఇంటికి రాగానే వంట పని, బాబు పని, కాసేపు తోట పని వీటితో గడిచి పోతుంది.  బాబు త్వరగా నిద్ర పోతాడు.. వాడిని పడుకోబెట్టాక మనసంతా శూన్యం ఆవరిస్తుంది. తను కోల్పోయిన జీవితం అంతా ఒక్క సారి గుర్తు వస్తుంది.. అమ్మ, నాన్న, అన్నయ్య ఎంతో భద్రత గలిగిన జీవితం, అందమైన పూల తోటలాంటి  జీవితం  రమేష్ అనబడే ఒక అగ్గిపుల్ల వలన కాలి బూడిద అయింది . అసలు రమేష్ ఎందుకు తన వెంట పడ్డాడు.. వాడు వెంట పడితే తను బుద్ధి లేక ఎందుకు వాడితో లేచి వచ్చింది.. గాయత్రికి అంతు లేని దుఃఖం కలుగుతుంది.

ఆ తరవాత ఆమె ఆలోచనలు రమేష్ తో గడిపిన జీవితం చుట్టూ తిరగడం మొదలు పెడతాయి. అసలు తనకి అతను చని పోయాడన్న బాధ ఏ మాత్రం కలక్కపోడం విచిత్రంగా అనిపిస్తుంది. అయిష్టంగా, బలవంతంగా అతనితో కాపురం చేసి ఒక పిల్ల వాడికి తల్లి అయినా అతని మీద ఏమాత్రం ప్రేమానురాగాలు కలక్క పోడం ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది.

దేవుడు తను చేసిన తప్పుకి చాలా పెద్ద శిక్ష వేసాడు.. చదువు అర్ధాంతరంగా వదిలి వచ్చింది.. తనకి ఇవాళ శరణ్య జాలి తలచి ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చింది... ఈ ఉద్యోగం ఏ క్షణాన అయినా పొతే వేరే ఉద్యోగం ఏం వస్తుంది? నాలుగిళ్ళల్లో పాచి పని చేసుకోవాలి ... దేవుడా అలాంటి పరిస్థితి రానివ్వకు..

గబుక్కున రెండు చేతుల్లో మొహం దాచుకుని కుళ్ళి, కుళ్ళి ఏడవ సాగింది.. శరణ్య తనని అంగన్ వాడికి, సుశీలకి అప్పగించి వెళ్ళి పోయింది. ఆవిడ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు భర్తతో, ఉద్యోగ బాధ్యతలతో తనని మర్చి పోయి ఉంటుంది.. ఆవిడని కలుసుకోడానికి తనకి ఆవిడ ఆఫీస్ తెలియదు.. ఇల్లు తెలిసినా ఎలా వెళ్ళాలో తెలియదు. కనీసం ఆవిడ ఫోన్ నెంబర్ అయినా తీసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు తనకి..

గాయత్రి అంతూ , పొంతూ లేని ఆలోచనలతో అన్నం తినడం కూడా మర్చి పోయి అలా మనస్తాపంతో ఎప్పటికో నిద్ర పోయింది.

ఆ రోజు బుధవారం. గాయత్రి అంగన్ వాడి నుంచి వచ్చి రోజూ లాగే అన్నం, పప్పు వండి బాబుకి పెట్టి వాడిని పడుకోబెట్టి, తను తోట పని చేసుకోసాగింది. తను నాటిన కనకాంబరాలు, గులాబీలు పూలు పూస్తున్నాయి.  అయితే ఆకులన్నీ చీమలు పట్టడంతో చిల్లులు పడ్డాయి.. అలా ఉన్నప్పుడు గమాక్సిన్ చల్లమని సుశీల గమాక్సిన్ తెచ్చి కాంపౌండ్ వాల్ కి ఉన్న ఒక గూట్లో పెట్టింది. గాయత్రి పల్చటి బట్ట తీసుకుని అందులో గమాక్సిన్ వేసి మొక్కల మీద చల్ల సాగింది. 

చల్లడం పూర్తీ అయాక చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కుని  చాలా కొంచెం నీళ్ళు మొక్కల మీద చిలకరించి చేతులు చెంగుతో తుడుచుకుని కొద్దిగా వంగి  కనకాంబరాలు కుడి చేయి చూపుడు వేలు, బొటన వేలుతో సున్నితంగా తెంపి చెంగులో వేసుకుని చెంగు మూట కడుతూ నిటారుగా నిలబడబోయి ఎవరో తనని వెనక నుంచి ముందుకు తోస్తున్నట్టు అయి నిలదొక్కుకుని చివ్వున వెనక్కి తిరిగింది.

రమణ ఎప్పుడు వచ్చాడో పిల్లిలా శబ్దం చేయకుండా వచ్చి ఆమెకి బాగా సమీపంగా దాదాపు ఆమె వీపుని ఆనుకుని  నిలబడి ఉన్నాడు.

గాయత్రి షాక్ తగిలినట్టు గభాల్న దూరం జరిగి అంకుల్ మీరు... అంది భయం, భయంగా ...

రమణ కుడిచేయి చూపుడు వేలు నోటి మీద ఉంచుకుని చప్పుడు చేయద్దు అన్నట్టుగా ష్ అంటూ ఆమె వైపు నడిచి గభాల్న ఆమె భుజాలు పట్టుకుని దగ్గరగా లాక్కున్నాడు.

గాయత్రికి ఆకాశం రెండుగా చిలి తన మీద పడినట్టు అయింది. బలవంతంగా అతని పట్టు వదిలించుకుని దూరం జరిగి గట్టిగా అరిచింది ఏంటిది...మీరేం చేస్తున్నారు.

గాయత్రీ ... దూరం వెళ్ళకు ... దగ్గరగా రా.. ఎవరూ లేరు.. మనం ఏకాంతంగా ఉన్నాం ... నీకు భర్త లేడు .. నాకు భార్య ఉన్నా ఎందుకూ పనికి రాదు.. నాకు పిల్లలు లేరు.. నీ కొడుకుని నా కొడుకులా చూసుకుంటా ... ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరిగి పోతుంది.. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా ... ప్లీజ్ రా గాయత్రి..

కళ్ళల్లో ఎర్ర జీరలు అతనిలో దహిస్తున్న కామాగ్నిని స్పష్టంగా తెలియ చేస్తుంటే ఉన్మాదిలా మీదకు రాసాగాడు. గాయత్రికి ఆవేశం, దుఃఖం ముప్పిరి గొన్నాయి.. వణుకుతున్న స్వరంతో అంది మీరు మంచి వాళ్ళు అనుకున్నాను.. ఆంటి లేని సమయంలో ఇలా ప్రవర్తిస్తారా.. దగ్గరకు రాకండి..

ఆంటి, అంకుల్ ఇవన్ని మనం కల్పించుకున్న వరసలు... నాకేం పెద్ద వయసు లేదు.. నువ్వు మంచి వయసులో ఉన్నావు.. ఎంత కాలం ఇలా ఉంటావు.. నిన్ను సుఖ పెడతాను ... నా భార్య కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు భయ పడుతున్నావనుకుంటా.. ఎవరికీ తెలియదు.. నువ్వు నీ ఇంట్లో నేను నా ఇంట్లో ఉంటాం.. కానీ ఇలా కాసేపు స్వర్గ సుఖాలు అనుభవించి గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేద్దాం.. రా " రమణ ఆపుకో లేని కామంతో విసురుగా వచ్చి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు..

ఆమె చెంగు జారిపోయి పూలన్నీ కింద పడి పోయాయి. రమణ మరి కొంచెం సాహసం చేసి ఆమె జాకెట్టు మీద చేయి వేసాడు. గాయత్రి బలవంతంగా కుడి చేయి లాక్కుని లాగి అతని చెంపలు రెండూ వాయించి వేగంగా ఇంట్లోకి పరిగెత్తింది.

అతను వెనకాలే అంతకన్నా వేగంగా వచ్చి ఆమెని ఒడిసి పట్టుకున్నాడు.

గాయత్రీ నా మాట విను ... ఇది చాలా మంచి అవకాశం.. నీ జీవితం బాగు పడుతుంది... నేను నీకు అండగా ఉంటాను. హాయిగా అనుభవిద్దాం.. అంటూ ఆమెని మంచం మీదకి నెట్టే ప్రయత్నం చేయ సాగాడు.

గాయత్రి పెనుగులాడుతూ అరవ సాగింది వదులు, వదులు... ఆంటికి చెప్తాను వదలక పోతే..

రమణ కొంచెం గట్టిగా నవ్వాడు.. ఆంటికి చెప్తావా .. ఆంటి నిన్ను నమ్ముతుందనేనా .. పాతికేళ్ళుగా నాతో కాపురం చేస్తున్న నన్ను నమ్మకుండా నిన్న గాక మొన్న వచ్చిన నిన్ను నమ్ముతుందా.. అలాంటి ఆశలేం పెట్టుకోకు..మరింత గట్టిగా కౌగిట్లో బంధిస్తూ అన్నాడు.

బాబు ఆ అల్లరికి నిద్ర లేచి కెవ్వుమన్నాడు.

వదులు బాబు లేచాడు.. శక్తి కొద్ది అరిచింది గాయత్రి. వదలను.. నిన్ను చూస్తూ గుటకలు మింగడం నా వాళ్ళ కావడం లేదు. ఇవాళ ఎలాగైనా సరే నిన్ను అనుభవించి తిర్తాను...అంటూ అతను ఆమెను బలంగా గోడకి నొక్కి పెట్టి ముద్దు పెట్టుకో బోయాడు.

గాయత్రికి కన్నీళ్ళు కారి పోతున్నాయి.. గుండె రగులుతోంది.. బాబు గుక్క పట్టి ఏడవ సాగాడు. గాయత్రి అతని పశు బలం నుంచి తప్పించుకోడానికి అటు, ఇటూ అవకాశం కోసం వెతక సాగింది..  తలుపు పక్క గోడకి అదిమి పెట్టి నిలబడ్డాడు.. తలుపు వెనక గోడకి ఆనించి ఉన్న చీపురు కనిపించింది గాయత్రికి. కుడి చేయి చాస్తే అందుతుంది. అతని వైపు చూసింది.. పెదాలు అందుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.

గాయత్రి సంశయించ లేదు. ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని కుడి చేయి చాచి చీపురు అందుకుని అతని విపు మీద కసి కొద్దీ కొట్టింది.. అప్రయత్నంగా అతని పట్టు సడలింది.. ఒసేయ్ దయ్యం అని అరిచాడు.

గాయత్రి ఆగలేదు ఎడా, పెడా కసి కొద్దీ చిపురుతో బాది అతను కింద పడి పోగానే కాళ్ళతో అతని మొహం మీద ఫెడి ఫెడి కొట్టింది. రమణ విలవిల్లాడుతూ నోటికి వచ్చినట్టు తిట్ట సాగాడు. గాయత్రి పెనుగులాటలో ఊడి పోయిన చీర అడ్డ దిడ్డంగా కట్టుకుని, విడి పోయిన  జుట్టు ముడి వేసుకుని మంచం దగ్గరకు నడిచి బాబుని ఎత్తుకుని గబా, గబా రమణ తేరుకునే లోగా అందిన బట్టలు, సామాను సంచుల్లో వేసుకుని విసురుగా గుమ్మం దాటింది.. దాటబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి పెదాలు చిట్లి రక్తం కరుతోంటే, చీపురు దెబ్బలకి వాచిన కళ్ళతో క్రూరంగా చూస్తూ మోచేతుల మీద లేవడానికి ప్రయత్నిస్తున్న అతని దగ్గరగా నడిచి, అతని మొహం మీద కాండ్రించి ఉమ్మేసి ఒక్క  పరుగుతో రోడ్డు మీదకి వచ్చింది.

మామూలు మన్షులుగా కనిపించే ప్రతి మగాడూ " మృగాడేనా"?  ఒక దరి చేరిందనుకున్న గాయత్రి జీవితం మళ్ళీ ఏ మలుపులు తిరగబోతోంది?

వీటికి సమాధానాలు వచ్చే శుక్రవారం ఒంటిగంటకు మీ గోతెలుగులో........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్