చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ కీలకపాత్ర కోసం ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం తమన్నా ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా? డాన్స్ నేర్చుకుంటోందట. అదేంటీ మిల్కీ బ్యూటీ ఏంటీ? డాన్స్ నేర్చుకోవడమేంటీ అనుకుంటున్నారు కదా. అవును అక్షరాలా తమన్నా డాన్స్ నేర్చుకుంటోందట. అదీ క్లాసికల్ డాన్స్. ఈ సినిమాలో తమన్నా పాత్ర క్లాసికల్ డాన్సుతో ముడిపడి ఉంటుందట. అందుకే తమన్నా ప్రత్యేకంగా ఓ ట్రైనర్ సమక్షంలో క్లాసికల్ డాన్సులో శిక్షణ పొందుతోందట. స్టార్ హీరోయిన్ అయినా కానీ తమన్నా ఎప్పటికప్పుడే ఏదో కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
తన ప్రతీ సినిమానీ మొదటి సినిమాగానే భావిస్తుంది. అందుకే ఇండస్ట్రీలో తమన్నా డెడికేషన్‌కి హీరోలు, దర్శకులు ఫిదా అయిపోతూంటారు. 'బాహుబలి' సినిమా కోసం కత్తి యుద్ధం, గుర్రపుస్వారీ నేర్చుకుంది తమన్నా. ఇప్పుడు 'సైరా' కోసం ఇదిగో ఇలా క్లాసికల్ డాన్సులో శిక్షణ తీసుకుంటోంది. 'సైరా' ఓ పీరియాడిక్ మూవీ. మొదటి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరుగున పడిన చరిత్రను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
|