Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vote-vesi-chethulu-dhulupukunte-saripodu

ఈ సంచికలో >> శీర్షికలు >>

జబ్బు తగ్గితే నిమ్మకాయలదండ - కర్రా నాగలక్ష్మి

ఇవాళ మీకు చెన్నైలోని ట్రిప్లికేన్ లో వున్న ‘ పార్ధసారధి ‘ కోవెల గురించి చెప్తాను .

ఈ కోవెల 8 వ శతాబ్దంలో పల్లవ వంశపురాజు ‘ నరసింహ వర్మ -1 చే నిర్మింపబడింది . చెన్నైలోని అతి పురాతనమైన మందిరాలలో ఒకటి . దీనిని సినీ నటులు తరుచుగా దర్శించుకుంటూ వుండేవారు . ట్రిప్లికేన్ అంటే చాలా రద్దీ అయిన ప్రదేశం . అన్ని మందిరాలలానే యిక్కడ కూడా పుష్కరిణి , పెద్దపెద్ద గోపురాలు వుంటాయి . గోపురాలమీద లోపల మంటపం పైన దేవీదేవతల విగ్రహాలు చూడచక్కగా వుంటాయ . ఈ కోవెల లోని శిల్పాలు ద్రవిడ శిల్పకళతో నిర్మింపబడ్డాయి .

ఈ మందిరంలో విష్ణుమూర్తి పార్ధసారధిగానే కాక నరసింహస్వామి , రాముడు , గజేంద్ర వరదరాజు , రంగనాధుడు , కృష్ణ రూపాలలో పూజలందుకుంటున్నాడు . ఇవికాక యీ మందిరంలో వేదవల్లి , తాయారు , ఆండాళ్లు , హనుమంతుడు , ఆళ్వారులు , రామానుజాచార్యుల విగ్రహాలు వున్నాయి .

నల్లరాతి నిలువెత్తు విగ్రహం కళకళలాడుతూ వుంటుంది . ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహానికి మీసాలుకూజా వుంటాయి . మెడలో శాలగ్రామాలమాల వక్షస్థలం మీద లక్ష్మీదేవి చూపరులని భక్తిపారవశ్యంలో ముంచెత్తుతూ వుంటుంద .

తమిళనాడు లో శివాలయాలలో ‘ నాయనార్ల ‘ విగ్రహాలు వుంటాయ , అలాగే విష్ణు ఆలయాలలో ‘ ఆళ్వారుల ‘ విగ్రహాలు వుంటాయి .

ఆలయంలో వైఖాయన ఆగమ పద్దతిలో పూజలు నిర్వహించుతూ వుంటారు . ‘ థెంకాలై ‘ అనే వైష్ణవ సాంప్రదాయాన్ని పాఠిస్తారు యిక్కడి పూజారులు .      మహాభారత యుధ్దంలో శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన వుంటాను గాని ఆయుధాలను పట్టనని యుద్దం చేయనని చెప్పి అర్జునని రధసారధిగా వుంటాడు , అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు వేసిన బాణం శ్రీకృష్ణుని గాయపరుస్తుంది . ఆ సన్ని వేశానికి నిదర్శనంగా యిక్కడి విగ్రహానికి ఛాతీపైన మచ్చవున్నట్ల చెప్తారు . ఆత్రేయముని యీ విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు స్థలపురాణం . ఇక చరిత్రలోకి వస్తే సమిత అనే రాజు విష్ణుమూర్తిని పార్ధసారధిగా చూడాలని ఆశపడతాడు , తిరుమల వెళ్లి శ్రీనివాసుడికి తన కోరిక విన్నవించుకుంటాడు . ప్రసన్నుడైన శ్రీనివాసుడు తులసి వనంలో ఆత్రేయ ముని చే ప్రతిష్టించబడ్డ పార్ధసారధి వునికి తెలియజేస్తాడు .

అసూరి కేశవ సోమయాజి సంతతి కొరకై యీ మందిరంలో పుత్రకామేష్టి యాగం చేయగా ప్రసన్నుడైని విష్ణమూర్తి తానే స్వయంగా కేశవ సోమయాజికి పుతృనిగా జన్మించి భగవద్గీతకు భాష్యంచెప్తానని స్వప్నం లో తెలియ జేస్తాడు . కేశవ సోమయాజి పుతృడే రామానుజుడు . ఈ మందిరంలో  8వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాలు తెలుగు తమిళంలో చెక్కినవి యిప్పటికీ మందిరంలో వున్నాయి.

ఇప్పటి ఆర్కియాలజీ వారి ప్రకారం యీ మందిర నిర్మాణం లో మూడు కాలాల శిల్పకళలు వున్నట్లు కనుగొన్నారు . పల్లవుల , చోళుల , విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళల కలగలుపు యీ మందిరం లో వున్నట్లు కనుగొన్నారు . మందిరానికి వీరి కాలాలలో మార్పులు చేర్పులు జరిగి వుండవచ్చు .

ఈ కోవెలలో నిత్యపూజలతో పాటు విశేష పూజలు , మాడవీధులలో వూరేగింపులు యెంతో భక్తి శద్దలతో చేస్తూవుంటారు . 

వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే 108 దివ్యదేశాలలో యీ మందిరం ఒకటి .

చెన్నైలో మందిరాలేకాదు యెన్నో విహార స్థలాలుకూడా వున్నాయి , గోల్డెన్ బీచ్ కూడా అలాంటిదే .

గోల్డెన్ బీచ్ లేదా విజిపి గార్డెన్ అని పిలువబడే యీ బీచ్ చెన్నై నగరానికి ఆనుకొని వుంది . నిలువెత్తున లేచి పడే అలలతో కూడుకొని వున్న సముద్రాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవుకదా ? , అలాంటి ప్రదేశం లో పిల్లలు ఆడుకోడానికి కావలసినన్ని యేర్పాట్లు , ఆకలేసినప్పుడు తినటానికి ఉత్తర , దక్షిణ ఫలహారాలు అందుబాటులో వుండి , మధ్యలో ఒకటో రెండో సినిమా షూటింగులు చూసే అవకాశం వస్తే అదే విజిపి గార్డెన్ .

విజి పన్నీరు దాసు కి చెందినది , తన వద్దనున్న చాలా కొద్ది మొత్తంతో యీ ప్రదేశాన్ని కొని సినిమా షూటింగులక అద్దెకు యివ్వడం యితని వ్యాపారం . షూటింగ్ కోసం వేసిన సెట్టింగులని అలాగే వుంచి పర్యాటకలకు ప్రత్యేక ఆకర్షణగా చేసేరు . కొత్తలో ప్రవేశరుసుము పదిరూపాయలుండేది . ప్రస్తుతం వందరూపాయలు . లోపల యెన్నెన్నో ఆకర్షణలు వున్నాయి . ఇక్కడ చాలా హిందీ సినిమాల నిర్మాణం కూడా జరగడం వల్ల పర్యాటకులు ఆ సినిమాలు గుర్తుకు తెచ్చుకుంటూ యీ ప్రదేశంలో తిరగడం ఆనందాన్ని యిస్తుంది . మొత్తం గోల్డెన్ బీచ్ చూడడానిక సుమారు 5 , 6 గంటలు పడుతుంది. అందుకే పర్యాటకులు ఒకరోజు దీనికోసమే కేటాయిస్తారు .      అప్పట్లో బొమ్మలాగ పాతకాలపు దుస్తులను ధరించి కళ్లుకూడా ఆర్పకుండా ఓ వ్యక్తి నిలబడే వాడు , అతనిని చూడ్డానికే అప్పట్లో పర్యాటకులు వచ్చేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు .

సోనే పె సుహాగా అన్నట్లు గోల్డెన్ బీచ్ కి అనుబంధంగా ‘ యూనివర్సల్ కింగ్డమ్ ‘ నిర్మాణం చేసేరు . ఇందులో రోజంతా గడిపినా తనివి తీరదు . నా వయసువారికే అలా వుంటే పిల్లల సంగతిచెప్పాలా ? సుమారు దగ్గరదగ్గర యాభై వరకు రైడ్స్ వున్నాయి . ఇందులో వాటర్ స్పోర్టు , స్నో కింగ్డమ్ లు కూడా వున్నాయి . భారతదేశం లోని అతిపెద్ద ఎమ్యూజిమెంట్ పార్క్ గా దీనిని చెప్పొచ్చు .

పగలు 11 నుంచి రాత్రి 7-30 వరకు తెరిచే వుంటుంది .

వీక్ డేస్ లోనూ వీకెండ్స లోనూ కూడా చాలా బీజీగా వుంటుంది .

చెన్నై జ్యూ

చెన్నై లో వున్న జ్యూ ని ‘ వండలూరు జ్యూ ‘ అని అంటారు . నగరం శివార్లలో  చెన్నై నగరానికి సుమారు 31 కిలోమీటర్లదూరం , విమానాశ్రయం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరం లోను సుమారు 512 హెక్టార్ల విస్తీర్ణం లో నిరమితమైన జ్యూ . 1855 లో భారత దేశంలో మొట్టమొదటిసారి నిర్మింపబడ్డ జ్యూ , చాలా కాలం చెన్నై రైల్వే స్టేషనుకి దగ్గరగా వుండేది . తరువాత స్థలం చాలక 1975 లో వండలూరికి యీ జ్యూని తరలించేరు .

ఒక  రోజులో మొత్తం జ్యూని చూడ్డం మనవల్లకాదు , లోపల తిరగడానికి ఓ పెన్ టాప్ బండి బుక్ చేసుకుంటే వారు మొత్తం జ్యూ అంతా తిప్పుతారు .

ఇందులో మొత్తం 1500 రకాల జంతువులున్నాయి . అందులో 45 లుప్తమౌతున్న  రకాలు . 2012 నాటి లెక్కల ప్రకారం 46 రకాలైన జంతువులు , 63  రకాలైన పక్షులు , 31 పాకే జంతువులు , 5 ఉభయచరాల , 28 రకాల చేపలు , 10 రకాలైన కీటకాలు వున్నాయి .    చెన్నై వాసులే కాదు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా సందర్శకులు వస్తూవుంటారు .

చెన్నై నగరం లో నేషనల్ మ్యూజియం కూడా చూడదగ్గదే .

చెన్నైనగరం  కళలకు పుట్టిల్లు అని చెప్పకున్నాం కదా ? , ప్రతీ రోజూ యిక్కడి మ్యూజిక్ ఎకడమీలో పేరు పొందన కళాకారుల నృత్య సంగీత కార్యక్రమాలుజరుగుతూ వుంటాయి . మ్యూజిక్  ఎకాడమీలో ప్రోగ్రాం యివ్వడమంటే కళాకారులకు ఓ పెద్ద గౌరవంగా భావిస్తారు . అలాగే యెన్నో థియేటర్లు వున్నాయి , వాటిల్లో యివాళకూడా తెలుగు నాటకాలు వేస్తున్నారంటే ఆశ్చర్యంగా వుంటుంది కాని యిది నిజం .        చెన్నై ‘ మొగప్పేరు ‘ దగ్గర వున్న ‘ కరుమారి అమ్మన్ ‘ కోవెల చూడదగ్గది . చెన్నై వాసులు యీ అమ్మవారిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజిస్తారు .

శక్తి స్వరూపిణి పార్వతీదేవి కరుమారి అమ్మగా యిక్కడ పూజలందుకుంటోంది . ముఖ్య మందిరంలో నల్లరాతి కరుమారి అమ్మ విగ్రహం జీవకళ వుట్టి పడుతూ వుంటుంది . శ్రీలక్ష్మినారాయణ మందిరం , శ్రీ కాశి విశ్వనాథుడు ముఖ్య మందిరంలో వుండగా ఉపమందిరాలలో దేవి మహేశ్వరి , వైష్నవి , ఛాముండి , బ్రాహ్మణి , విశాలక్షి , నారాయణి అమ్మవార్లు , బాలగణపతి , బాల మురుగన్ , హనుమంతుడు కాక నవగ్రహాలు , నాగప్రతిష్ఠలు , లింగోధ్బవం లను చూడొచ్చు .

ఇక్కడో చిన్న తమిళుల ఆచారం గురించి వివరిస్తాను . అమ్మవారి మందిరం దగ్గర కొబ్బరికాయలు పూలు పళ్లతో పాటు నిమ్మకాయలు కూడా అమ్ముతూ వుండడం కనిపిస్తుంది . పూలు పళ్లతో పాటు అమ్మవారికి రెండు నిమ్మకాయలు కూడా సమర్పిస్తూ వుంటారు . అలాగే దుకాణాలలో నిలువెత్తు నిమ్మకాయల దండలుకూడా అమ్మడం కనిపిస్తుంది . కారణం అడిగితే తెలిసిన విషయం యేమిటంటే అమ్మవారిక నిమ్మకాయ సమర్పిస్తే అమ్మవారి కృపను మనం కోరుకున్నట్లు , నిమ్మకాయలదండ మొక్కుకొని వేస్తారట , అంటే జీవిత భాగస్వామికి తగని జబ్బుచేసినపుడు ఆ జబ్బు తగ్గితే నిమ్మకాయలదండ వేస్తానని మొక్కుకుంటారట . ప్రతీ అమ్మవారి కోవెలలోనూ యిలాంటి మొక్కులు వుంటాయి . అలాగే ఉప్పురాళ్లను , మిరియాలను అమ్మవారికి సమర్పించడం కూడా అమ్మవారి మందిరాలలో కనిపిస్తాయి  .    వచ్చే వారం మరికొన్ని వివరాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ శలవు.

మరిన్ని శీర్షికలు
sarasadarahasam