Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సినిమాలతోనే కదా ఫాషన్లు - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

 మనిషికి అవసరమైన  “ రోటి కపడా మకాన్ “ లలో,  కపడాకి సంబంధించింది చూద్దాం.. ఒకానొకప్పుడు , అంటే ఏన్నో  యుగాల పూర్వం, మనిషి, తన మానాన్ని కాపాడుకోవడానికి, చెట్ల ఆకులు ఉపయోగించేవాడుట.. ఆడైనా, మగైనా సరే….మొత్తానికి పురాణకాలం వచ్చేటప్పటికి వంటి మీద బట్టలాటిది ఒకటొచ్చిందని పాతపుస్తకాలలో వేసిన బొమ్మలద్వారా అర్ధం చేసుకోవచ్చు.

కాలక్రమేణా, పత్తినుండి వడికిన నూలు, ఖాదీ, పట్టుపీతాంబరాలూ వచ్చేసాయి… ఎవరిస్థాయిని బట్టి వారు, తగిన వేషధారణ చేసేవారు.. తరవాత్తరవాత అవేవో, టెర్లీనులు, నైలానులు,  Terrycot ( టెర్లిన్ + కాటన్ ) , మొదట్లో నూలు వస్త్రాలు మగ్గాలమీద నేసేవారు.. క్రమక్రమంగా, నూలు వడకడానికి మెషీన్లూ, వాటిని తయారుచేసే కర్మాగారాలూ వచ్చేసాయి.

ఈ మిల్లుబట్ట వచ్చేటప్పటికి, వాటిమీద వ్యామోహం పెరిగిపోయింది… ఎంతైనా మెషీన్ల ధర్మమా అని బట్టకూడా నాజూగ్గా ఉంటుందిగా.. దానితో చేనేత కార్మికులకి గిరాకీ తగ్గిపోయింది. పాపం వాళ్ళు, రెండుపూట్లా తిండి తినాలంటే , మగ్గాలమీద పనిచేయక కుదరదాయే.. ఈ మిల్లులూ, పవర్ మగ్గాలూ వచ్చి వారి నోట్లో మట్టికొట్టేసాయి… అధవా మగ్గంమీద నేద్దామనుకున్నా, పొలంలో పండే క్వాలిటీ పత్తి దొరకొద్దూ? ఆ పత్తిమొక్కలకేమో, నానారకాలైన చీడలూ పట్టి, ఆమొక్కల దిగుబడి తగ్గిపోయింది.మొత్తానికి ఏకారణం చేతైనేమిటి, పత్తిపండించే రైతూ, బట్టనేసే చేనేతకార్మికులూ, ఆత్మహత్యలు  చేసేసికుంటున్నారు, చేసిన అప్పులు తీర్చేదారిలేక. ప్రభుత్వాలు ఏదో ఋణమాఫీ, నష్టపరిహారం అంటూంటారేకానీ, జరిగేదిమాత్రం శూన్యం.

ఏది ఏమైతేనేమిటి, మొత్తానికి మార్కెట్ లో మాత్రం నానారకాల బట్టలూ, రకరకాల ఫాషన్లూ మాత్రం విపరితంగా పెరిగిపోయాయి.  దేశం మొత్తం మాట పక్కనుంచి, మన తెలుగువారి వేషధారణ , ఎక్కడినుంచి ఎక్కడకు వచ్చిందో పరిశీలిద్దాం..

ఒకానొకప్పుడు మన ఇళ్ళల్లో  ఓమోస్తరు వయసువారు, నూలుచీర తప్ప కట్టేవారు కారు.. మళ్ళీ వీటిలో 60 నెంబరు, 80 నెంబరు, 100 నెంబరూ.. నాణ్యాన్ని, స్థోమతనుబట్టీనూ..శుభకార్యాలకైతే పట్టుచీర ఉండాలే….  ఇంక ఈ చీరలు ధరించే పధ్ధతి చూస్తే--- ఇదివరకటిరోజుల్లో స్త్రీలు ఓ చీర కట్టుకోడానికి, ముందుగా ఓ ముడివేసి, చీరచుట్టబెట్టుకుని,  కుచ్చిళ్ళుపెట్టుకుని, చీరదోపేసుకునీ, పమిట చక్కగా కప్పుకోవడంతో సరిపోయేది… కాలానుగుణంగా ఈ చీరకట్టడానికి లోపల అదేదో పెట్టీకోటు అవసరం  మొదలయింది. వీటికి సాయం ఆ చీర అంచులకింద ఓ మాచింగ్ ఫాల్, చుట్టూరా అదేదో పీకో ట.. వీటన్నిటికీ కలిపి తడిపి మోపెడవుతోంది… వీటికి మాచింగ్ బ్లౌజూ.. చివరకుతేలిందేమిటంటే, ఈ చీర ఖరీదుకి మాచింగ్ గా, అంత ఖర్చూ తప్పడంలేదు.. ఖర్చెక్కువని చీరకట్టడం మానేస్తారాఏమిటీ? చీర అందం చీరదే.. పైగా ఈరోజుల్లో  హ్యాండ్ లూం చీరలకి మోజెక్కువైపోయింది. వీటికి అదనపు ఖర్చు—వాటికి స్టార్చ్ ( అదేనండీ గంజి ) పెట్టించడమయితే తప్పదు… 

ఇన్ని ఖర్చులు భరించలేక, చివరకి ఆడవారు పంజాబీ dress ల్లోకి మారిపోయారు.. ఒకానొకప్పుడు మన తెలుగునాట ఎవరైనా పంజాబీ dress వేసుకుంటే వింతగా చూసేవారు..   అలాటిది ఈ రోజుల్లో ఎక్కడచూసినా అవే… ఒకానొకప్పుడు, మగపిల్లలకి వేరుగానూ, ఆడపిల్లలకి వేరుగానూ ఉండేవి బట్టలు… మిగిలినవాటిలో సమానత్వం అనేది ఎలా ఉన్నా, వేషధారణలో మాత్రం ఈరోజుల్లో అందరూ ఒకటే.. దగ్గరకు వెళ్ళి చూస్తేనే కానీ తెలియని పరిస్థితి.. అదంతా తప్పని కాదు, ఎవరికి సౌకర్యంగా ఉంటుందో అలాటి దుస్తులు ధరించడంలో ఎవరిష్టం వారిదీ…. ఒకానొకప్పుడు తెలుగునాట, ఆడపిల్ల కి వయసొచ్చిందంటే, లక్షణంగా లంగా ఓణీ లతో , బాపూబొమ్మ లా కనిపించేది. ఇప్పుడు ఆ బాపూగారూ లేరూ, అందానికి నిర్వచనంగా చూపించిన ఆ లంగా ఓణీలూ లేవు…. కాలంతో మారాలిగా… ఫాషను ఇంకొంచం ముందుకివెళ్ళి, ఆడవారి వేషధారణలో అనూహ్యమైన మార్పులొచ్చేసాయి… ఈ రోజుల్లో ధరించే బట్ట ఎంత కురచగా ఉంటే అంత అత్యాధునికమన్నమాట…మన సినిమాల విషయమే తీసుకోండి, .. ఈ సినిమాలకి సెన్సార్ బోర్డనేదొకటుంటుంది..  ఒకానొకప్పుడు స్త్రీపాత్రధారులు ధరించిన చీర, కొద్దిగా పైకివెళ్ళిందంటే, అశ్లీలం పేరుతో కట్ చేసేసేవారు.  అలాటిది ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు వారుకూడా పట్టించుకోవడం మానేసారు…  సినిమాలతోనే కదా ఫాషన్లు మొదలయేదీ.. ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ కట్టిన చీర అనేవారు పూర్వపు రోజుల్లో… కానీ ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ ఒళ్ళంతా కనిపించేటట్టు  dress  ఎలా వేసుకుందో అదే ఫాషనూ కొలమానమూ అయిపోయాయి…

ఈ వ్యాసం స్త్రీల వేషధారణని విమర్శించడం కోసం కాదు రాసినది… ప్రస్తుత పరిస్థితి చెప్పడానికి మాత్రమే… అలాగని మగాళ్ళు ఏదో సాంప్రదాయంగా వేస్తున్నారనీ కాదూ… వారిగురించి మరో వ్యాసంలో….

సర్వేజనాసుఖినోభవంతూ….

మరిన్ని శీర్షికలు
paathadanam-kotthadanam-nundi-vimukti