వెల్లూరుకి సుమారు 8 కిలోమీటర్ల దూరం లో వున్న శ్రీపురం గురించి చదువుదాం .దీనిని స్వర్ణ మందిరమనికూడా పిలుస్తారు .
చెన్నై నుంచి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో వుంది యీ స్వర్ణ మందిరం . సుమారు వంద యెకరాల విస్తీర్ణంలో నిర్మింపబడ్డ అధ్బుతమైన మందిరం . కొన్ని వేల , వందల సంవత్సరాల చరిత్ర వున్న యెన్నో మందిరాలను చూసేం . కొన్ని కొత్త మందిరాలను కూడా చూసేం . కొత్త మందిరాలను చూసినప్పుడల్లా మనకి పాత శిల్పులను మించిన శిల్పులు తరువాత కాలాలలోపుట్టలేదేమో అని అనిపించేది , కాని యీ మందిరం చూసేక శిల్పులు యెప్పుడూ వున్నారు , కాని వారికి సరైన గుర్తింపు , పని దొరకలేదని అనిపించక మానదు . చక్కని వుద్యానవనం మధ్యలో శ్రీచక్రాకారం దాని మధ్యలో మందిరం . ఇక్కడ అమ్మవారిని లక్ష్మి నారాయణి ‘ , ‘ నారాయణి అమ్మ ‘ అనివ్యవహరిస్తారు . కోవెల యొక్క విమానం , అర్ధమంటపం బంగారంతో నిర్మించేరు . అమృత్ సర్ లోని స్వర్ణ మందిరం సుమారు 750 కెజి ల బంగారంతో నిర్మించగా యీ మందిర నిర్మాణానికి సుమారు 1500 కెజి ల బంగారాన్ని వినియోగించేరు . ‘ శ్రీ శక్తి అమ్మ ‘ ఆధ్వర్యంలో నడపబడుతున్న ‘ నారాయణి పీఠం ట్రస్ట్ ‘ చే నిర్మించ బడింది .
2007 ఆగష్టు 24 న మహా కుంభాభిషేకం నిర్వహించేరు . మందిర ప్రవేశద్వారంలో అడుగు పెట్టిన దగ్గరనుంచి మనం యేదో లోకంలో వున్న అనుభూతి కలుగుతుంది . అయితే నడవలేని వారికి మాత్రం నరకమే , ఓపిక వున్న వారికి తప్ప మిగతా వారికి విసుగు రాకతప్పదు . శ్రీచక్రం ఆకారంలో నిర్మింపబడ్డ నడావా లో నడుస్తూ అక్కడ రాసివున్న ఆధ్యాత్మిక విషయాలను చదువుతూ , కిందపరచిన పాలరాతి లో మన ప్రతి బింబాలను చూసుకుంటూ నడవడం ఓ అనుభూతనే చెప్పాలి . అడుగడుగునా స్వచ్చత , శుభ్రత చూస్తూ నడవడం చాలా బాగుంటుందనే చెప్పాలి , మొత్తం ముఖద్వారం నుంచి అమ్మవారు వున్న గర్భాలయం వరకు నడవడానికి సుమారు గంట గంటన్నర పడుతుంది , జోళ్లులేని కాళ్లతో పాలరాతిమీద నడవడం కాస్త కష్టంగానే వుంటుంది . ఇక్కడ నడుస్తూ వుంటే నాకు ‘ మౌంటు ఆబు ‘ లో బ్రహ్మకుమారి ఆశ్రమం లో యెదురైన అనుభవం గుర్తొచ్చింది . అక్కడ ఒకగదిలోంచి మరోగదిలోకి వెళ్లడానికి మాత్రమే తలుపులు తెరిచేవారు , వెనుకకి వెళదాం అంటే తలుపులు తాళం వేసి వుండేవి . అలా యెన్ని గదుల్లోక వెళ్లినా చెప్పిందే చెప్పడం బ్రహ్మ కుమారులు కండి అని ముగించడం అలా కిందగదులు పూర్తవగాన మళ్లా పై గదులు . చాలా గొడవ పెట్టి నేను బయటకి వచ్చేను . ఇక్కడకూడా ముందుకు వెళ్లాలి , వెనుకకి వెళితే అమ్మవారి దర్శనం కాదు . నడువలేని వారు , వయసుమళ్లిన వారు యెలా అంతదూరం నడవగలరు అన్నదే నాబాధ . నడవగలిగిన వారు తప్పక శ్రీచక్ర పరిక్రమ పూర్తి చేసుకుంటే యెన్నో ఆధ్యాత్మక విషయాలు తెలుస్తాయి , ఆ మంటపాలను తీర్చిదిద్దిన కళాకారుల పనితనం పూర్తిగా చూడొచ్చు .
ఇక స్వర్ణ గోపురంలోకి అడుగు పెట్టిన తరువాత ఆ శిల్పాలను చూస్తే స్వర్గలోకంలో వున్నామేమో అని అనిపించక మానదు . ఇక అమ్మవారి విగ్రహం గురించి చెప్పాలంటే యే త్యాగయ్యో , అన్నమయ్యో కీర్తించాలి , లేదా కవిత్రయం తిరిగి జన్మించాలి .
అసలే బంగారు విగ్రహం దానికి తోడు వజ్రవైఢూర్యాల నగలు , నిజంగా లక్ష్మీదేవి మన ముందు నిల్చున కోరిన వరాలు ప్రసాదిస్తున్నట్లుగా అనిపిస్తుంది .
ఎంత యెండాకాలమైనా చల్లని గాలులు చక్కని సంగీతాన్ని మన చెవులవరకు తీసుకువస్తూ అహ్లాదాన్ని కలుగజేస్తుంది . విసుగు అలసట తెలియకుండ చేస్తుంది . ఒక ఛారిటబుల్ సంస్థ ద్వారా నిర్మింపబడి నడపబడుతున్న అతి పెద్ద మందిరం యిదేనేమో ? .
శ్రీ నారాయణి పీఠం ద్వారా ఉచిత భోజన శాల నడపబడుతోంది . అమ్మవారి దర్శనానంతరం బయటకి రాగానే గేటు కి పక్కగా వుంటుంది భోజన శాల . ఇక్కడి భోజనం చాలా రుచిగా శుచిగా వుంటుంది .
ఈ పీఠం ఆధ్వర్యంలో వైధ్యశాల మరియు ప్రయోగ శాల నడుపబడుతున్నాయి . ఈ మందిరాన్ని ‘ తిరుమల కోడి ‘ అని కూడా పిలుస్తారు . తిరుపతి కి వచ్చే భక్తులలో చాలా మంది యీ మందిరాన్ని కూడా దర్శించుకోడం తో యీ ప్రాంతం యెప్పుడూ రద్దీగానే వుంటోంది .
లక్ష్మి నారాయణి మాతని యెన్ని సార్లు చూసినా తనివి తీరదు , జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవలసిన మందిరాలలో యిదొకటి , తప్పకుండ వెళ్లి చూడండి .
వెల్లూరు తరువాత మనం యెప్పుడూ మన కథలను పంపే చోటికి వెళదాం అదేనండీ కథలన్నీ’ కంచి ‘ కే చేరుతాయి కదా ? .
ప్రస్తుతం కాంచిపురంగా పిలువబడుతున్న యీ నగరం వివిధ కాలాలలో కంచి , కాంచీపురం , కాంజివరం అని పిలువబడేది . ఈ నగరం వేగావతీ నదీతీరాన వున్న నగరం . తమిళనాడుోని ‘ తొండై మండలానికి చెందినది . ఈ నగరానికి చారిత్రాత్మకంగానే కాదు పౌరాణికంగా కూడా ప్రాముఖ్యత వుంది . ముందుగా పౌరాణిక ప్రమాణాలను చూద్దాం . తండ్రి దూషణలు భరించలేక యోగాగ్నిలో ప్రాణత్యాగం చేసిన సతీ దేవి ‘ అంగం ‘ పడ్డ ప్రదేశం యిది . అంటే అష్టాదశపీఠాలలో ఒకటి , మనం రెండువారాల క్రిందట చదివిన ‘ మాంగాడు ‘ తాపస కామాక్షి శివుని మరల వివాహమాడి కైలాసానికి తరలిన ప్రదేశం యిదే . పంచభూత లింగాలలో పృథ్వీలింగమైన ‘ ఏకాంబరేశ్వరుని ‘ మందిరం యిక్కడే వుంది . వైష్ణవులకు పవిత్రమైన యేడు తీర్థాలలో యిదివొకటి . అలాగే వైష్ణవుల పరమపవిత్ర దేశాలైన 108 దివ్యదేశాలలో 14 దివ్యదేశాలు యిక్కడే వున్నాయి .
మహాభారత కాలంలో ద్రవిడ రాజ్యానికి కాంచీపురం రాజధానిగా వున్నట్లు చెప్పబడింది .
కాంచన పురానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర వుంది . కాంచీపురం నగరాలలో కల్లా గొప్ప నగరంగా పేరుపొందింది . కాళిదాసు తన కావ్యాలలో ‘ నగరేషు కంచి ‘ అని ఉదహరించేడంటే అప్పట్లో కాంచీపుర వైభవం యెంతగొప్పదో వూహించుకోవచ్చు . అలాగే మహాపతివ్రతగా చెప్పుకునే తమిళ వనిత ‘ కణ్ణగి ‘ కూడా కాంచీపురానికి చెందినదే .
ఇక చరిత్ర లోకి వస్తే యీ నగరం పల్లవులు , చోళులు , విజయనగర రాజులు , కర్నాటక నవాబుల పాలనలో వుండి ఆంగ్లేయుల చేతులలో వెళ్లింది . ఆంగ్లేయుల కాలంలో కాంచీపురం ‘ కంజివరం ‘ గా మారింది .
హిందూమతం వైష్ణువం , శైవం గా చీలిపోయిన సమయంలో కాంచీపురం కూడా విష్ణుకంచి , శివకంచి గ విడిపోయింది .
అధ్భుతమైన దేవాలయాలు యెన్నో చూడొచ్చు . కాంచీపురం చరిత్రలో ‘ ఘటికా స్థలం (విద్యలు నేర్చుకునే ప్రదేశం ) ‘ గా పేర్కొనబడింది . దీనిని దక్షిణ కాశీగా కూడా మన కవులు వర్ణించేరు .
కాంచీపురం లోని ముఖ్యమైన మందిరాలను గురించి చెప్పుకున్నా కూడా కనీసం పది సంచికలైనా చాలవేమో ? , యిక అన్ని మందిరాలను గురించి చెప్పకుంటే పెద్ద కావ్యమే అవుతుందేమో ? సరే నా శక్తి మేరకు యీ నగరాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను .
అద్వైత గురువైన ‘ శంకరాచార్యులు ‘ స్థాపించడ ‘ కామకోటి పీఠం వున్నది కూడా కాంచీపురం లోనే .
అయ్యయ్యో మరో ముఖ్యమైన విషయం చెప్పడం మరచిపోయేను . కాంచీపురం అనగానే కథలు కాక మనకి మరో విషయం చటుక్కున తడుతుంది , ప్రతీ ఆడపిల్లా జీవితంలో ఒక్కసారైన కట్టుకోవాలని కలలు కనే పట్టుచీరల తయారీ యిక్కడే , విదేశీ వనితలు కూడా ‘ కాంచివరం ‘ పట్టు చీరలంటే మోజు పడతారండోయ్ . ప్రతీ యింట ఓ మగ్గం వుంటుందంటే అతిశయోక్తి కాదు . ప్రతీ యిల్లూ పట్టుచీరల దుకాణమే . పూర్వం యిక్కడ పట్టుచీరల కొనుగోలులో బాగా మోసాలు వుండేవి , యిప్పుడు చాలా మటుకు మంచి సరుకు లభ్య మౌతోంది .
ముఖ్యంగ దక్షిణ భారతదేశంలో యెవరింట పెళ్లి జరిగినా కాంచీపురం వచ్చి పెళ్లిచీరలు కొనడం అనవాయితీగా వస్తోంది . పై వారం నుంచి కాంచీపురం లోని మందిరాల గురించి స్థల పురాణం తో సహా చదువుదాం , అంతవరకు శలవు .
|