Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam jokes

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

వేగావతి నదీ తీరానవున్న కాంచీపురం లో క్రీస్తుపూర్వం నుంచి 5వ శతాబ్దం వరకు జైనమతం ప్రాచుర్యంలో వుంది అనడానికి యిప్పుడు తమిళనాడు రాష్ట్ర ఆర్కియాలజీ వారి రక్షణలో వున్న ‘ త్రైలోక్యనాథ ‘ , ‘ చంద్రప్రభ ‘ మందిరాలు నిదర్శనం . అలాగే రెండుమూడవ శతాబ్దాలలో యిక్కడ బౌద్దమతం కూడా ప్రబలివుండేదనడానికి ‘ కుర్కిహార ( బౌద్దగయ ) ‘ లో దొరికిన శిలాశాసనాలలో లిఖించబడింది . వీటి ప్రకారం చోళరాజులు , పల్లవులు బౌద్దగయ నిర్మాణానికి భూరి విరాళాలు యిచ్చేరట .

ఇక హిందూమతం గురించి చెప్పుకోవాలంటే క్రీస్తుపూర్వం యిక్కడ  ‘ బ్రహ్మిజం ‘ బాగా ప్రాచుర్యంలో వుండేదట , యిదే విషయం కంబోడియా లోని ‘ అంకోర్ వాట్ ‘ మందిరాలను చూస్తున్నప్పుడు అక్కడి మ్యూజియం లో యీ బ్రహ్మిజం గురించి చదవడం గుర్తొచ్చింది . వికిపీడియా ప్రకారం బ్రహ్మిజం పాఠించేవారిని ‘ బ్రాహ్మణులు ‘ అని అంటారని వివరణ వుంది . దాని తరువాత శైవం , వైష్ణవం వచ్చేయి . మిగతా మతాలు యెలావున్నా కంచిలో శైవులకి , వైష్ణవులకి పోటాపోటీగా వుండేది . ఇంకా చెప్పుకోవాలంటే బాగా యుద్దాలు జరిగేవట .

యుధ్దాలంటే గుర్తొచ్చింది కాంచీపుర చరిత్రలో కాంచీపురం యెన్నోయుధ్దాలను చూసింది . చోళులు , పల్లవులు , ఆంధ్రచోళులు , విజయనగర రాజులు , హోసలరాజులు , వెలమనాయకులు , కాకతీయులు , బహమనీ సుల్తానులు , సాళువ రాజులు , గోల్కొండ సుల్తానులు , కర్నాటక నవాబుల పరిపాలన తరువాత ఆంగ్లేయుల పరిపాలనలోక వచ్చింది . ఇన్ని రాజుల చేతులు మారింది అంటే యుధ్దాలు జరిగే వుంటాయికదా ? .

వరదరాజు మందిరంలో వున్న శిలాశాసనంలో కృష్ణదేవరాయలను మంచి పరిపాలకుడిగా పేర్కొనబడింది .

రాజరాజ చోళుడు కాంచీపురాన్ని గెలుచుకున్నప్పుడు దీనిని ‘ జయంకొండ చోళమండలం ‘ గా నామకరణం చేసేడు . కచ్చపేశ్వర మందిరాన్ని నిర్మించేడు . కామాక్షి మందిరాన్ని పునఃనిర్మాణం గావించేడు . అతని పుతృడు రాజేంద్రచోళుడు ‘ యతోత్కారి పెరుమాళ్ ‘ మందిరాన్ని నిర్మించేడు .

శైవులకి వైష్ణవులకి యుధ్దాలు జరిగేవని చెప్పకున్నాం కదా ? , ఆ సమయంలోనే తరిమికొట్టబడ్డ వైష్ణవులు కాంచీపురానికి అవతల మరో నగరాన్ని నిర్మించుకొని దానిని విష్ణుకంచిగా పిలుచుకోసాగేరు . అక్కడ లెక్కకు మించిన విష్ణుమందిరాలను నిర్మించుకున్నారు . గరుడ పురాణం ప్రకారం దర్శించదగిన యేడుపురాలలో కాంచీపురం ఒకటి అని చెప్పబడింది .

కాంచి పురంలో యిప్పటికీ సగానికిపైగా జనాభా తెలుగు మాట్లాడేవారే అంటే ఆశ్చర్యం కలుగక మానదు . కాని యిది నిజం , ముఖ్యంగ పట్టునేతలో వున్న వారు తెలుగువారే ముందుగా మనం విష్ణుకంచిలోని మందిరాలను గురించి తెలుసుకుందాం . విష్ణు కంచిలో ముందుగా అందరూ చూసే మందిరం ‘ వరదరాజు ‘ కోవెల దీనిని పెరుమాళ్ కోవెల అని కూడా అంటారు .

హిమాలయాలలో ప్రకృతిని చూడాలి , రాజస్థానులో కోటలను చూడాలి , తమిళనాడులో మందిరాలు చూడాలి అని దేశవిదేశాలలో ప్రసిద్ది . తమిళనాడులో మందిరాలపై వుండే శిల్పకళ ముఖ్యంగ చూడదగ్గది . కొన్ని శతాబ్దాలకు పూర్వం నిర్మింపబడ్డ మందిరాలు అన్నీను , అయినా యివాళ చెక్కినట్లుంటాయి . మందిరాలు విశాలప్రాంగణాలలో నిర్మింపబడ్డాయి , మొత్తం మందిరం అంతా తిరిగి చూడాలంటేకాళ్లు నొప్పులు పుట్టడం ఖాయం .

కాంచీపురం లోని వరదరాజు కోవెలకూడా అలాంటిదే , యీ కోవెలని 1053 లో పల్లవరాజైన నందివర్మ -2 సుమారు 23 యెకరాలలో నిర్మించేడు . పల్లవుల తరువాత వచ్చిన చోళులు , పాండ్య రాజులు ఆంధ్రచోళులు , విజయనగర రాజులు యీ మందిర అభివృద్దికి యెన్నో విరాళాలు యిచ్చినట్లు శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి . ఈ మందిర ప్రాంగణం లో సుమారు చిన్నాపెద్దా 32 మందిరాలు , 19 విమానగోపురాలు , 389 స్థంభాల మంటపాలు వున్నాయి , లోపల యెన్నో పుష్కరిణులు వున్నాయి , వరదరాజస్వామి పుష్కరిణిని అనంత తీర్థం అంటారు . తూర్పుపడమరలుగా వున్న రాజగోపురాలు . తూర్పున వున్న రాజగోపురం పెద్దది , పడమరగా వున్న రాజగోపురం సుమారు 130 అడుగులయెత్తుకలిగి , యేడు అంతస్తులలో వుంటుంది . ఈ మందిరం హస్తగిరి అనిపిలువబడే గుట్టమీద నిర్మింపబడివుంది .

వంద స్థంభాల మంటపం లో గల రామాయణ , మహాభారత ఘట్టాలను తెలియజేస శిల్పాలలో విజయనగర కాలానికి చెందిన శిల్పకళ కనబడుతుంది . ఈ మందిరం లో ముఖ్యంగ రాతిగొలుసులు ప్రతీ పర్యాటకుడినీ ఆకట్టుకుంటాయి . చాలా సహజంగా వుంటాయి . మందిరంలోని గుర్రాలు , యలి ( సింహాన్నిపోలిన జంతువు ) చూడదగ్గవి . గుర్రానికి వున్న అలంకరణ చాలా సహజంగా తీర్చిదిద్దేరు . అలాగే దేవీదేవతల మూర్తుల ఆభరణాలు , మూర్తుల ముఖాలు చాలా సహజంగా చెక్కేరు . వరదరాజుల విగ్రహం పదడుగుల నల్లరాతి విగ్రహం , వరదరాజు విమానగోపురాన్ని ‘ పుణ్యకోటి ‘ అని అంటారు . ఈ మందిరంలో మూడు ప్రదిక్షిణ ప్రాకారాలున్నాయి . మొదటిది ఆల్వార్ ప్రాకారం , రెండవది మడైపల్లి ప్రాకారం , మూడవది తిరుమల ప్రాకారం .

ఈ కోవెలలో ఓ పురాతనమైన ఆచారం వుంది . ఏ కోవెలలోనైనా ముందుగా అయ్యవారిన దర్శించుకుంటారు , కాని యీ మందిరంలో ముందు అమ్మవారిన దర్శించుకొని పూజలు చేసుకున్నతరువాత అయ్యవారి దర్శనార్ధమై వెళతారు . ఇక్కడ అమ్మవారు ‘ పేరిందేవి తాయారు ‘ గా పూజలందుకుంటోంది . అమ్మవారి విమాన గోపురాన్ని ‘ కల్యాణ కోటి విమానం ‘ అని అంటారు . అమ్మవారి విగ్రహం నాలుగడుగుల నల్లరాతితో మలిచేరు .

వరదరాజస్వామి , పేరిందేవిల కర్ర విగ్రహాలను వెండి పెట్టెలో వుంచి నీటి తొట్టిలో వుంచుతారు ప్రతీ 40 సంవత్సరాలకొకసారి బయటకు తీసి పూజాదులు నిర్వహించి తిరిగి వెండిపెట్టెలో నుంచి నీటితొట్టెలో విడిచి పెడతారు . . ప్రతీ సంవత్సరం వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు , బ్రహ్మోత్సవాలలో దేవుని సేవకై వుపయోగించే ఛత్రం విశేషమైనది , యీ ఛత్రం చూడడానికే చాలా మంది భక్తులు బ్రహ్మోత్సవాలకి వస్తారట .

మందిరంలో పై కప్పుకి బంగారు బల్లి , వెండిబల్లి వుంటాయు కోవెలకు వచ్చిన భక్తులు యీ బల్లులను చేతులతో తడుముతూ వుంటారు . ఇలా చేస్తే బల్లి మీద పడ్డ దోషం పోతుందని పెద్దలు చెప్తారు .

మందిరం లో యింకా రామలక్ష్మణుల విగ్రహాలు , హనుమంతుడు , గరుడ , ఆళ్వార్ విగ్రహాలు వున్నాయి

ఇక్కడవున్న నాలుగు  చిన్న మంటపాలను తులాభార మంటపాలు అని అంటారు , వీటిని విజయనగర వంశానికి చెందిన అచ్యుతరాయలు కట్టించేడు .

పుష్కరిణికి తూర్పున వున్న మందిరంలో ఆరు భుజాలు గలిగిన సుదర్శనచక్రం  దర్శించుకుంటాం , ఉత్సవవిగ్రహం యేడు వివిధరూపాలలో వున్న సుదర్శనాన్ని ఒకే చక్రం పై మలిచినది చూడొచ్చు . వీటిని మూడవ కుళోత్తుంగ చోళుడు నిర్మించినట్లుగా చరిత్ర చెప్తోంది . అక్కడవున్న మంటపాలలో రామాయణానికి చెందిన విగ్రహాలను , విష్ణుమూర్తియొక్క మిగతా అవతారాలకు సంబంధించిన విగ్రహాలను చూడొచ్చు , యివి విజయనగరరాజులు 14వ శతాబ్దంలో నిర్మించేరు . ఇక్కడ స్థలవృక్షం అత్తి చెట్టు .

స్థలపురాణ వివరాలు యిలా వున్నాయి .     సత్య యుగంలో బ్రహ్మదేవుడు వేగావతి నదీ తీరంలో యాగం చేసుకుంటూవుండగా నదీ ప్రవాహం వల్ల యాగానికి ఆటంకం కలిగేది . ఎంతకాలం గడచినా బ్రహ్మరాకపోయేసరికి సావిత్రీదేవి బ్రహ్మ పై అలిగి పాతాళలోకంలో దాగుంటుంది . విష్ణుమూర్తి బ్రహ్మ యాగం నిరాటంకంగా జరగాలన నదీ వేగానికి అడ్డంగా నిలుస్తాడు . నదీ ప్రవాహం వల్ల ఆటంకం లేకపోవడంతో బ్రహ్మ యాగసమాప్తి చేసుకుంటాడు . కాని బ్రహ్మ లోకంలో సావిత్రిని కానక దిగులుచెందగా విష్ణుమూర్తి వరాహంగా మారి పాతాళంలో దాగిన సావిత్రిని తిరిగి బ్రహ్మలోకానికి తీసుకువస్తాడు . బ్రహ్మకు సహాయపడిన విష్ణుమూర్తి కోటి సూర్యకాంతితో వెలుగుతూ వుండగా బ్రహ్మ భూలోకంలో మానవులను కాపాడవలసినదిగా కోరగా విష్ణుమూర్తి అదే రూపంలో వేగావతి నదీతీరంలో దేవరాజస్వామిగా వెలిసేడు .

ఒకానొకప్పుడు దేవతలరాజైన యింద్రుడు సరస్వతీ దేవి శాపానికి గురై యేనుగు ఆకారంలో భూలోకంలో సంచరిస్తూ వేగావతీ నదీ తీరానికి వచ్చి దేవరాజస్వామిని సేవించుకొని శాపవిముక్తిపొందేడు . అందుకే స్వామి మందిరం వున్న ప్రదేశాన్ని ‘ హస్తగిరి ‘ లేదా ‘ అత్తగిరి ‘ అని అంటారు .

గౌతమ ముని శిష్యులు శాపవశాన బల్లులుగా మారి యీ మందిరంలో విష్ణుమూర్తిని సేవించుకొని శాపవిముక్తిపొందేరు , వారి జ్ఞాపకార్థం యీ బల్లులను చెక్కించినట్లుగా చెప్తారు . ఈ బల్లులను తాకడం వల్ల సర్వపాపవిమోచన జరుగుతుందని చెప్తారు .

చరిత్రలోక వస్తే , తిరుకచ్చినంబి అనే విష్ణు భక్తుడు రోజూ ‘ పూవిరుండవిల్లి ( ఇప్పటి పూనమల్లి ) లోని తన తోటలో కోసిన పూలతో మాలలు అల్లి కంచి వచ్చి స్వామికి సమర్పించుకొనేవాడట , స్వామి తిరుకచ్చినంబి తో ముచ్చటలాడేవాడట . రామానుజాచార్యలు యెన్నో సంవత్సరాలు యీ మందిరంలో వుండి వరదరాజ స్వామిని సేవించుకున్నాడు . రామానుజాచార్యులు తనకు కలిగిన ఆరు సందేహాలను స్వామిని అడుగగా స్వామి తిరుకచ్చినంబికి వాటి సమాధానాలను తెలియజేసేడట . తిరుకచ్చినంబి సంస్కృతంలో వరదరాజాష్టకం రచించేడు . తిరుకచ్చినంబి స్వామికి వేడినుంచి ఉపశమనం కలుగజెయ్యడానికి విసనకర్రతో వీచేవాడట , దీనిని ఆలవట్ట కైంకర్యం అంటారు , యీ సేవ తరువాత అన్ని మందిరాలలోనూ ప్రవేశపెట్టబడి యీనాటికి కూడా కొనసాగుతోంది .

ఈ కోవెలకు కాంచీపురాన్ని పరిపాలించన అన్ని రాజవంశాల రాజులు మాన్యాలను యేర్పాటు చేసేరు . ఈ కోవెలలోని ప్రధాన ఆర్చకత్వం తాతాచార్యుల వంశానికి వంశపారంపర్యంగా వస్తోంది . ప్రతీ సంవత్సరం ఆశ్వీజ మాసంలో జరిపే ఉత్సవంలో ‘ వేదాంత దేశిక ‘ కి గర్భగుడి లోకి ప్రవేశం లభిస్తుంది . ఇది మరే కోవెలలోనూ లేదు .

ఔరంగజేబు పరిపాలనలో యిక్కడి విగ్రహాలను ‘ ఉదయరపాలెం ‘ కి తరలించి నిత్యపూజలు జరిపేరు .

కాంచీపురాన్ని ‘ ముమూర్తివాసం ‘ అని పిలుస్తారు . మూడు దేవతల నివాసం అని అర్దం , అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కాదు అర్దం , పెరుమాళ్ కోవెలలో వున్న విష్ణుమూర్తి , ఏకాంబరేశ్వర మందిరంలోని శివుడు , కామాక్షి కోవెలలోని పార్వతీ దేవిని కలిపి మూడు మూర్తులని అంటారు .

వైష్ణవులకు యీ మందిరం పరమపవిత్రమైనది , 108 దివ్యదేశాలలో యిదివొకటి .

వచ్చేవారం కాంచీపురంలోని మరికొన్ని మందిరాలను పరిచయం చేస్తాను , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
weekly horoscope july 20th july 26th