యుగ యుగాల నుండీ విన్నవీ, కన్నవీ , జరుగుతున్నవీ తప్పు అని ఈ మధ్యన దేశ అత్యున్నత న్యాయ స్థానం వారు ఇస్తూన్న తీర్పుల ద్వారా తెలుస్తోంది. నాకు ఓ విషయం అర్ధమవదూ.. ఆ న్యాయ మూర్తులు కూడా, అందరూ పెరిగినట్టే పెరిగి పెద్దయ్యారు కదా, మరి అకస్మాత్తుగా ఆ సాంప్రదాయాలన్నిటినీ తిరగ రాసే పనిలో పడ్డారేమిటో?
నిజమే రాజ్యాంగం ప్రకారమే, మనందరమూ నడుచుకోవాలి, ఈ రాజ్యాంగం కూడా ఇప్పుడొచ్చింది కాదు—68 ఏళ్ళవుతోంది… నిజమే.. కానీ ఇప్పుడే కదా ఆ పాత చట్టాలని సవాల్ చేస్తూ, న్యాయస్థానాల్లో పిల్ ( ప్రజా హిత వ్యాజ్యం ) వేసారూ అని అనొచ్చు, అందుకే మేము చట్టాలన్నీ పరిశీలించి తీర్పు రూపంలో వాటిని రద్దు చేసామూ అని. కానీ మన న్యాయ వ్యవస్థలో ఇంకో సదుపాయం కూడా ఉంది, ఏ పిల్ అవసరం లేకుండానే, న్యాయ మూర్తులు అదేదో సుమోటో అంటారుట, వాళ్ళంతట వాళ్ళకి ఫలానా సాంప్రదాయం చట్ట విరుధ్ధమూ అని భావిస్తే, ఆ విషయాన్ని విచారించొచ్చూ అని… మరి ఇంత కాలమూ ఆచరణలో ఉన్న సాంప్రదాయాలు తప్పనుకున్నప్పుడు, అదేదో చేసుండొచ్చుగా? న్యాయ నిర్ణయాలు ( అదీ అత్యున్నత న్యాయస్థానం ) గురించి, ఎవరైనా ఆం ఆద్మీలు విమర్శిస్తే తప్పుట… రాజకీయనాయకులు నోటికొచ్చినట్టు మాట్టాడొచ్చు… కారణం – ఆ తీర్పేదో రాజకీయ పార్టీలకి అనుకూలంగా లేకపోతే, చట్ట విరుధ్ధమన్న దానిని ఓ ఆర్డినెన్స్ పేరు చెప్పి పని కానిచ్చేయొచ్చు…
చట్టాలు కావాల్సినన్ని ఉన్నాయి మన దేశంలో, వాటిని ఆచరించే వారే కరువయ్యారు… చట్టాలే కాకుండా, కొన్ని సాంప్రదాయాలు కూడా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. తరతరాల నుండీ వాటి మీద ఎవరికీ అభ్యంతరాలుండేవి కావు… చూస్తే నూటికి తొంభై మందికి వాటితో సమస్యనేదే లేదు.. నిశితంగా పరిశీలిస్తే, బహుశా కొన్ని సాంప్రదాయాలు కొంచం కఠినంగా ఉండొచ్చు… కానీ జీవితాలు సాఫీగానే సాగాయి కదా ఇన్ని సంవత్సరాలూ? మరి అకస్మాత్తుగా జ్ఞానోదయం ఎందుకైనట్టో?
ఇంక చట్టాల విషయానికొస్తే, ఈ మధ్యన నేర చరిత్ర కలిగిన వారు, ఎన్నికల్లో పోటీ చేయ కూడదని ఓ చట్టం ఉంది… పోటీ చేసిన అభ్యర్ధి చరిత్రంతా, మరి ప్రభుత్వానికి తెలుసును కదా, అలాంటప్పుడు ఎన్నికల సంఘమే, వారి నామినేషన్ రిజెక్ట్ చేయొచ్చుగా?.. పైగా ఇందులో కూడా ఓ లొసుగు — నేర నిరూపణ జరిగే దాకా నేరస్థుడు కాడని.. ఎలాగూ దేశంలో నేరాలు నిరూపించడానికి పుష్కరాలకి పుష్కరాలు పడుతుంది, ఈ లోపులో హాయిగా ఒక్కసారేమిటి, రెండు సార్లు పోటీ చేసి నెగ్గేయొచ్చు ఓపికుంటే.. కోర్టులో నేరం నిరూపింపబడే టైముకి ఏ కొడుకునో, కూతుర్నో, భార్యనో రంగం లోకి దింపేస్తే సరి… ఎక్కడ చూసినా జరుగుతుందదే కదా..అవన్నీ తెలిసినా కోర్టులు గమనించరు కన్వీనియెంట్ గా, కానీ తీర్పులు మాత్రం ఎడా పెడా ఇచ్చేస్తూంటారు.
ఏదో ఫలానా మందు ఏళ్ళ నుండీ వాడుతూన్న ఏ తల నొప్పి మాత్రలో, ప్రభుత్వం ఏదో పేరు చెప్పి, నిషేధిస్తారు అందులో ఏవేవో ఉన్నాయని.. వెంటనే ఆ కంపెనీలు కోర్టులకి వెళ్ళడమేమిటి, ఆ నిషేధానికి ఓ స్టే ఇస్తారు. దానితో ఆ మందు కాస్తా “ సంజీవిని “ గా మారిపోతుంది.
దేశం లోని కొన్ని దేవాలయాలకి, వారి వారి సాంప్రదాయాలుంటాయి.. ఫలనా వారికి ప్రవేశం లేదని, ఇన్ని వందల సంవత్సరాలూ ఎవరికీ అభ్యంతరముండేది కాదు.. కానీ కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంఘాలు దీనికి అభ్యంతరం చెప్పి కోర్టులని ఆశ్రయించారు. వాళ్ళదే ముందీ ఓ తీర్పిచ్చేసారు.. అందరికీ అనుమతుండాలని.. ఆ తీర్పు లోని ఉచితానుచితాలు చెప్పడానికి మనం ఎవరమూ ? తిరుమల వెంకన్న బాబు గర్భ గుడిలో ఫొటోలు తీయనీయరు, కొండ మీదుగా విమానాలని నడపనీయరు — కానీ రానున్న రోజుల్లో, ఏ తిక్కరేగిన వాడో, కోర్టులో వ్యాజ్యం వేయొచ్చు, ఫొటోలు తీయడం ఫండమెంటల్ తీర్పు అని, కోర్టు వారు అనుమతించేయడమేనా? ఏమో.. అలాగే కనిపించని దేవుడిని నమ్మడం తప్పని ఇంకోడెవడో అనొచ్చు. ఇలా వీటికి అంతం ఎక్కడా? అవేమీ తప్పని కాదు కానీ, ఇన్నాళ్ళూ వాటిని నమ్ముకున్న వారి సంగతేమిటీ? దేశంలో ఏ విషయం మీదైనా కోర్టుకి వెళ్ళొచ్చు. రేపెవడో దొంగతనం చేయడం రైట్ టూ ఎర్న్ కింద వస్తుందంటే, దొంగతనాలు చట్టబధ్ధమయిపోతాయేమో.. అలాగే ఇవేళ చట్ట విరుధ్ధంగా భావిస్తూన్న ఎన్నో విషయాలు అదేదో రైట్ టూ ఫలానా అంటే చాలు.
ఆధార్ విషయమే తీసుకోండి, దేశంలో 90% పైన అందరూ, వారి వారి బాంక్ అకౌంట్స్ కి లింక్ చేసారు.. ఇప్పుడేమో అకస్మాత్తుగా, అవసరం లేదన్నారు.. ఆ తీర్పేదో ఇంకొంచం ముందర ఇస్తే, మనకి తిప్పలు తప్పేవిగా.
ఏమిటో ఈ కోర్టులూ, తీర్పులూ కావు కానీ, సాధారణ ప్రజలని గందర గోళంలో పెట్టేస్తున్నాయి…
సర్వేజనా సుఖినోభవంతూ…
|