Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The world of fashion 'basket'

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

                  శ్రీరంగం

శ్రీ రంగానికి నేరుగా చేరడానికి రైలు మార్గం కూడా వుంది . చెన్నై నుంచి సుమారు 325 కిలోమీటర్ల దూరం వుంటుంది . తమిళనాడులోని మరో ముఖ్యమైన నగరమైన తిరుచ్చి ( తిరుచురాపల్లి ) కి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో వుంది శ్రీరంగం . ఈ మందిర నిర్మాణం జరిగిన సరియైన కాలం గురించిన సమాచారం చరిత్రలో లేదు , కాని సుమారు ఒకటవ శతాబ్దానికి చెంది వుండవచ్చుననే దానికి ఆధారంగా కొన్ని శిలాశాసనాలు లభ్యమయేయి . యీ మందిరానికి సంభందించిన పౌరాణిక కథ యేమిటంటే దేవాసురులు సాగరమథనంచేసినపుడు కామధేనువు , కల్పవృక్షాలతో పాటు పుష్పక విమానం కూడా వుత్పన్నమయిందట , ఆ పుష్పక విమానం యుగాలతో పాటు చేతులుమారి రావణాసురుని దగ్గర వుంది , రామరావణ యుధ్దంలో రాముడు రావణుని వధించి విభీషునుని లంకానగరానికి రాజుని చేసి అయోధ్యకు వస్తూ వుండగా విభీషణుడు సీతాసమేత రామలక్ష్మణులను పుష్పక విమానంలో అయోధ్యకు తెచ్చి పుష్పక విమానాన్ని రామనికి కానుకగా యిచ్చేడట , రాముడు ఆ విమానాన్ని తిరిగి విభీషణునికి యిచ్చివేయగా విభీషణుడు లంకకుదానిపై పయనమయేడు , విమానం కావేరి నదీ తీరాన భూమిపైకి వాలి యెంతప్రయత్నించినా కదలలేదట , అప్పుడు విభీషణుడు దానిని అక్కడే విడిచిపెట్టి లంకానగరానికి మరలి పోయేడట . ఆ విమానం పడ్డ ప్రదేశమే రంగనాథునికి నివాసమైందట . అయితే ప్రస్తుతం లోకి వస్తే యీ కోవెల సప్త ప్రాకారాలలో కట్టబడింది , ఊరు వేరుగా మందిరం  వుండదు . మందిరం యొక్క వెలుపలి రెండు ప్రాకారాలూ యిళ్లు దుకాణాలూ , పూలు పళ్ల దుకాణాలు వుంటాయి , సప్త ప్రాకారంలో వుండడం వల్ల యీ మందిరాన్ని చేరుకోడానికి యెన్నో దారులు వున్నాయి .

మనం ముందుగా చెప్పుకున్నట్లు యీ మందిరం చాలా పెద్దది కావడం వల్ల అన్ని ప్రాకారాలు తిరగడం చాలా కష్టమైనపని . పెద్దపెద్ద తలుపులోంచి లోపలకి వెళితే మరో పెద్ద తలుపులున్న ద్వారం ఆ తరువాత మరో ద్వారం అయిదో ప్రాకారంలో కి మనం వెళ్లే సరికి కాళ్లు ముందుకు సాగనని మొరాయిస్తాయి . రెండువైపులా వున్న మండపాలు కొన్ని పర్యాటకుల సేదతీరేందుకు అనువుగా వుంచేరు చాలా మటుకు యేనుగులని బర్రెలను వుంచేందుకు వాడుతున్నారు . నేలమీద కూడా రాళ్లు పరచి వుంటాయి . ఇందులో రంగవిలాసమండపం యాత్రీకులు సేదతీరేందుకువీలుగా శుభ్రం చెయ్యబడి వుంటుంది . ఈ మండపంలో రామాయణ ఘట్టాలు చిత్రీకరించేరు . మండపం లోని స్థంభాలు వాటిపైన చెక్కిన శిల్పాలు మట్టి కొట్టుకుపోయినా వాటి అందం మాత్రం చెక్కుచెదరలేదు . ఈ మందిరంలో సుమారు 800 శిలాశాసనాలు ఆరు భాషలలో లిఖించబడినవి వున్నాయి . ఆ ఆరు భాషలు యేమిటో తెలుసా ? సంస్కృతం , తమిళం , తెలుగు , కన్నడం , మరాఠి , ఒరియ . చాలామటికి శిలాశాసనాలు 9వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు లిఖించబడినవి వున్నాయి , ముఖ్యంగా వాటిలో యేయే రాజులు శ్రీరంగనాథుడిని దర్శించుకున్నారో , మందిరానికి సమర్పించిన కానుకలు రాయబడ్డాయి . అలాగే చోళ , పాండ్య , హోసల , విజయనగర , నాయక రాజులచే నిర్మింపబడ్డ కట్టడాలను గురించిన శిలాశాసనాలు వున్నాయి .

అయిదవ ప్రాకారం నుంచి ఉపమందిరాలు , మండపాలు , పుష్కరిణిలో మొదలవుతాయి . నేను ముందుగానే చెప్పినట్లు ఓగంటో రెండుగంటలలోనో చూసిరావచ్చనుకుంటే మాత్రం మనం పొరబడ్డట్టే . కనీసం ఓ నాలుగు గంటల సమయం పెట్టుకుంటే సగం చూడగలం అన్ని ప్రాకారాలు తిరిగి అన్ని శిల్పాల అందాలు చూడాలంటే రెండురోజుల సమయం కావాలి . రామ , కృష్ణ , లక్ష్మి మందిరాలు ,నరసింహ , హయగ్రీవ , చక్రాళ్వార్ ( సుదర్శన చక్రం ) , గోపాల , వేణుగోపాల మందిరాలు వున్నాయి .

గర్భగుడి విమానగోపురం బంగారం తో నిర్మించేరు . శ్రీరంగాన్ని ‘ రంగతిరుపతి ‘ అని కూడా అంటారు . జయవిజయులు కాపలా కాస్తున్న గర్భగుడిలో తూర్పు పడమరలగా స్వామి పవ్వళించి వున్న విగ్రహం వుంటుంది . ద్వారం దక్షిణంగా తెరువబడి వుంటుంది .

ఇక్కడి విగ్రహంలో విశేషం యేమిటంటే లోపల స్వామి అయిదు తలలు , మూడున్నర చుట్లు చుట్టుకొన్న శేషుని పై తలక్రింద గుండ్రటి దిండు పెట్టుకొని పవళించివుంటాడు . ఇక్కడ నాభి నుంచి వచ్చిన బ్రహ్మ గాని పాదాలవద్ద శ్రీదేవి భూదేవి గాని కనిపించరు . హరి సంకీర్తనం చేస్తున్న నారద , తుంబుర , సనకసనందులు కానరారు . గర్భగుడి విమానంపైన క్షీరసాగరమథనం , గోపాలకృష్ణుడు మొదలైన సుందరమైన విగ్రహాలు వుంటాయి . గర్భ గుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు నాలుగు వైపులా వినాయకుడు , యోగ అనంత స్వామి ( శేషుని పై యోగాసనంలో కూర్చొని వున్న విష్ణుమూర్తి ) , యోగనరసింహ , దుర్గాదేవి విగ్రహాలు వుంటాయి .

శివాలయాలలో విష్ణు విగ్రహాలు , విష్ణు ఆలయాలలో శివ పరివారం వుండటం చూస్తే శివమునకు విష్ణువుకు  తేడాలేదని చెప్పటమే అని తెలుస్తుంది . గర్భగుడి వెలుపల వున్న మంటపాలలో వున్న స్థంభాలకు వున్న విగ్రహాలు , తోరణాలు యెంతో అందంగా వుండి శిల్పుల నైపుణ్యం తెలియజేస్తూ వుంటాయి . స్థంభాలపైన మహాభాగవత కథ ఘట్టాలను చిత్రీకరించేరు .

ఈ కోవెలలో దేవతల వైద్యుడైన ధన్వంతరికి మందిరం వుండడం విశేషం . ధన్వంతరిని విష్ణుని అవతారంగా భావిస్తారు . రెండో ప్రాకారంలో రంగనాథుని దేవేరి రంగనాయక మందిరం వుంది . ఇక్కడ మూడు రంగనాయకి విగ్రహాలు వున్నాయి        రామానుజాచార్యులు మొదలైన ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి . విజయనగర రాజులచే నిర్మింపబడ్డ వెయ్యి స్థంభాల మండపం , నాయక రాజులు నిర్మించిన శేషరాయ మండపంలో స్థంభాలుగా గుర్రాలను వాటిపై రౌతులను చెక్కిన తీరును చూడాలి . నిజంగా గుర్రాలు గెంతులేస్తున్నట్లే వుంటాయి . గరుడ మండపం కి పైన పెద్దపెద్ద రెక్కలు విప్పుకొని యెగరడానికి సిధ్దంగా వున్నట్లుగా చెక్కిన గరుత్మంతడు గర్భగుడిని చూస్తున్నట్లుగా వుంటుంది . మూడవ ప్రాకారంలో ‘ కిళి మండపం ‘ వుంటుంది . ఈ మండపం మధ్యలో నాలుగు స్థంభాలు యెత్తైన అరుగు వుంటాయి , ఆ కాలంలో యీ మండపాన్ని వుత్సవాలకి హరికథా కాలక్షేపాలకు వుపయోగించేవారేమో ?

ఈ మందిర ప్రాంగణంలో సుమారు 12 పుష్కరిణులు వున్నాయి , ఇవన్నీ కూడా వర్షం మీద ఆధారపడ్డవే , అందుచేత సంవత్సరంలో చాలా కాలం యివన్నీ యెండిపోయేవుంటాయి . వాటిలో సూర్య పుష్కరిణి , చంద్ర పుష్కరిణి చెప్పుకోదగ్గవి . ఈ మందిరంలో ముక్కోటి ఏకాదశి చాలా వైభవంగా చేస్తారు .  రంగనాథుడు ఊరేగింపులో శ్రీదేవి భూదేవి సమేతుడై వుంటాడు . రంగనాధుని వాహనాలు ఓ మండపం లో వుంచేరు . ఉత్సవాలలో వాటిని వాడతారు . గజవాహనం , ఉష్ట్ర వాహనం , యలి వాహనం , సింహ వాహనం , గరుడ వాహనం , అన్నపక్షివాహనం , శేషవాహనం , అశ్వవాహనం , ప్రభ వాహనం వున్నాయి . రంగనాధుని మహిమలు కథలు కథలుగా చెప్తారు .

ఈ ఆలయంలో గోడకి వున్న ఓ విగ్రహానికి పూజలు చేస్తూ వుంటారు , గోధుమ రొట్టెలు , వెన్న యీ విగ్రహానికి నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు . విగ్రహ అలంకరణ ముస్లిమ్ ల అలంకరణలో గుర్రం మీద కూర్చొని వుంటుంది . ఈ విగ్రహాన్ని ‘ తులుక నాచియార్ ‘ అంటారు . ఈ విగ్రహం గురించిన కథ చరిత్రలో యిలా చెప్పబడింది .1311 లో అల్లా వుద్దీను ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్ర చేసి , అనేక మందిరాలను దోచుకుని , చాలా సంపదను ఢిల్లీకి తరలించేడు . అలా కొల్లగొట్టిన మందిరాలలో శ్రీరంగం కూడా వుంది . అరబ్ గ్రంథాలలో ఖిల్జీ దక్షిణాదిలో ఓ స్వర్ణ మందిరాన్ని కొల్లగొట్టి లెక్కలేనంత సంపద ఢిల్లీకి తరలించినట్లుగా వుందట , దానిని చదివిన ఓ ఆంగ్లేయ చరిత్రకారుడు ఆ స్వర్ణ మందిర వర్ణన శ్రీరంగాన్ని పోలి వుందని కాబట్టి అది రంగనాథ మందిరమేనని దృవీకరించేడు . అలా కొల్లగొట్టిన తరువాత మందిరంలోని రంగనాథుని స్వర్ణ విగ్రహాన్ని కూడా తీసుకు పోయేడట . ఖిల్జీ దాడిలో మందిరం బాగా దెబ్బతినడంతో పూజలు జరిగేవి కావట . ఖిల్జీ ఆ విగ్రహాన్ని అతని కుమార్తెకు బహుమతిగా యిచ్చేడట , ఆమె ఆవిగ్రహాన్ని యెంతో యిష్టపడి యెల్లవేళలా తనతోనే వుంచుకొనేదట . శ్రీరంగంలో ఓ పదేళ్ల పిల్ల కలలో స్వామి కనిపించిన తన యెరుక తెలిపేడట , కొందరు పెద్దలు ఆమె చెప్పిన గుర్తుల ప్రకారం ప్రయాణించి ఢిల్లి చేరి సుల్తానుకు తమ రాక తెలిపి తమ స్వామిని తిరిగి యిమ్మని కోరేరట , దానికి అతను సమ్మతించి విగ్రహాన్ని వారికిచ్చి వేసేడట , ఖిల్జీ కుమార్తె స్వామిని విడిచి వుండలేక నిద్రాహారాలు కరువై చిక్కి పోయిందట , సుల్తాను ఆమెను శ్రీరంగం పంపించేడట , ఆమె రంగనాథుని సన్నిధిలోనే వుంటూ సేవలు చేసుకుంటూ స్వామిలో ఐక్యం చెందిందట . ఆమే ‘ తులుక నాచియార్ ‘ . హిందూ మందిరంలో ముస్లిమ్ వనితకి పూజలు జరగడం విచిత్రం కదూ ? .

1371లో బుక్కరాయలు పుతృడైన ‘ కుమారకంపన ‘ యీ మందిర పునర్నిర్మాణం కావించి విగ్రహ ప్రతిష్ట చేసేడు . శ్రీరంగం చరిత్రలో మరో మారు విగ్రహాలను మందిరం నుంచి తీసివేసి మరల ప్రతిష్టించడం జరిగింది . మైసూరు సుల్తానులు శ్రీరంగం పై దండెత్తి వస్తే కొందరు వైష్ణవులు స్వామిని , కొందరు అమ్మవారిన తీసుకొని రహస్య మార్గం గుండా పారిపోయి వివిధ ప్రాంతాలలో తలదాచుకున్నారట , ఆ దాడిలో 13 వేల ఆచారులు ప్రాణాలు కోల్పోయేరు . అనువైన సమయం చూసుకొని తిరిగి స్వామిని , అమ్మవారిని తిరిగి ప్రతిష్టించేరు .

శ్రీరంగ నాథస్వామి మందిరం అద్భుతమైన మందిరం , చూడవలసిన మందిరం కాబట్టి చూడనివారు తప్పక దర్శించుకోండి .

వచ్చే వారం మరో మందిరం గురించి తదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు