Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue292/762/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)... అచ్యుత రామయ్య గారు కృతజ్ఞతా పూర్వకంగా మనోహర్ ముందు రెండు చేతులూ జోడించాడు.
"అయ్యో పెద్ద వారు మీరలా చేతులు జోడించ కూడదు" అని నొచ్చుకుంటూ ఆయన దగ్గరగా వచ్చి ఒంగి ఆయన పాదాలకు నమస్కారం పెట్టాడు.

పెద్దల పట్ల అతనికి ఉన్న వినయ విధేయతలకు మురిసి పోతూ అతణ్ని భుజాలు పట్టుకుని పైకి లేపుతూ ’దీర్ఘాయుష్మాన్ భవ" అని దీవించాడు.

ఆ తర్వాత "బాబూ, సమయానికి నువ్వెంతో ఆదుకున్నావని అమ్మాయి చెప్పింది"అన్నాడు.

"అదేం లేదండి, ఎవర్ని ఎలా? ఎక్కడ? కలపాలన్నది ఆ భగవంతుడే చూసుకుంటాడు" అన్నాడు క్రీగంటితో ఆమె చెంపలను ముద్దాడుతూన్న ముంగురులను చూసి మురిసి పోతూ నర్మగర్భంగా.

"ఏవైనా తిన్నారా? బయట నుంచి ఏవైనా తెచ్చేదా?" అన్నాడు.

"అప్పుడే ఇలా తిని కూర్చున్నానో లేదో, అమ్మాయి ఫోన్ చేసిందయ్యా..అన్నట్టు ఇందాకణ్నుంచి నిన్ను నుంచోబెట్టే మాట్లాడుతున్నాను. ఇక్కడ కూర్చో" అని అక్కడ గోడకాన్చి ఉన్న స్టీల్ ఫ్రేమ్డ్ కుర్చీలో కూర్చోబెట్టాడు. అతనికి అటూ ఇటూ కాత్యాయని, అచ్యుత రామయ్యలు కూర్చున్నారు.

అతని ముక్కు పుటాలకు ఆమె మేని సువాసన తగులుతూంటే మనసు మదన తాండవం చేస్తోంది.

"బాబూ..మా అల్లుడికి.." అంటూ అల్లునికి వచ్చిన వ్యాధి, అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాల్సిన అవసరం, డబ్బు సర్దుబాటు కాక దాన్ని వాయిదా వేయడం అన్నీ పూస గుచ్చినట్టు చెప్పాడు మనోహర్ కు చెప్పాడు అవ్యుత రామయ్య గారు.

"నాన్నా..పాపం ఆయనేదో సహాయం చేయడానికి వస్తే మీరు మన సమస్యలు ఏకరువు పెట్టడం సరి కాదు. సారీ అండి. మీరు ఆప్యాయంగా మాట్లాడే సరికి మా నాన్న గారు మనసు లోని భారం దింపుకున్నారు" అంది నొచ్చుకుంటున్నట్టు.

"మనిషి బాధ మనిషే పంచుకోగలడండి. అయ్యో, కమలాకర్ గారి పరిస్థితి అంత సివియరా? నేను ఎండకి వడగొట్టి పడిపోయారనుకున్నాను. మీ నాన్నగారు నాకు అన్ని విషయాలూ చెప్పడం మంచిదయింది. చెప్పా గదండీ ఇక్కడంతా ట్రస్ట్ సర్వీస్ అని. ఇహ ఆపరేషన్ గురించి మీరెవ్వరూ బాధ పడకండి. అన్నీ సవ్యంగా జరిగి పోతాయి. నేనున్నా కదా!"అన్నాడు తనకు అతని పరిస్థితి ముందే తెలుసన్నది అస్సలేం తెలియకుండా మేనేజ్ చేస్తూ.

ఈసారి ఇద్దరూ కళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తూ చేతులు జోడించారు.

"మీరిలా మాటి మాటికీ చేతులు జోడిస్తుంటే నాకు చాలా సిగ్గుగా, ఇబ్బందిగా ఉండి" అన్నాడు.

***

రెండు గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. మనోహర్ ఆయనతో పాటు ఒక రూంలోకి వెళ్లబోతూ, కాత్యాయనిని కూడా లోపలికి తీసుకెళ్లాడు. అది డిస్ట్రబెన్సెస్ ఏమీ లేని ఐసోలేటేడ్ కేబిన్.

డాక్టర్ కి కాత్యాయనిని, తనను పరిచయం చేసుకున్నాక ఆయనతో పాటు అక్కడ గ్లాస్ సర్ఫేస్ ఉన్న టేబుల్ చుట్టూ గుండ్రంగా వేసి ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు ముగ్గురూ.  డాక్టర్, మనోహర్ చాలా సేపు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నాక డాక్టర్ లేచి మనోహర్ కి షేక్ హాండిచ్చి బయటకు వెళ్లి పోయాడు. కాత్యాయని చదువు అంతంత మాత్రమే కాబట్టి పూర్తిగా అర్థం కాకపోయినా, తన భర్త పరిస్థితి క్లిష్టంగా ఉందని డాక్టర్, మనోహర్ కి చెప్పినట్టుగా మాత్రం అర్థం చేసుకుంది.

"ఏవండీ మా ఆయన" అంది డల్ గా.

"ఏం ఫర్వాలేదటండీ..మీరలా బెంబేలు పడకూడదు. ఆపరేషన్ ఒక్కటే కాస్త క్రిటికల్, ఆ తర్వాత మీ ఆయన లైక్ ఎ నార్మల్ పర్సన్, అబ్సొల్యూట్లీ పర్ ఫెక్ట్ ట డాక్టర్ గారు చెప్పారు" అన్నాడు.

ఆమె అతనితో పాటు బయటకి వచ్చి తండ్రికి జరిగింది చెప్పింది.

***

డబ్బుండాలే కాని స్టార్ హాస్పిటల్లో అన్నీ చక చక జరిగి పోతాయి. కాత్యాయనికి, వాళ్ల నాన్నకి హాస్పిట ల్లోనే అన్ని ఫెసిలిటీస్ తో ఉన్న డబల్ బెడ్ రూం  తీసుకున్నాడు. ఫుడ్ కూడా టైం ప్రకారం రూం కి వచ్చే ఏర్పాటు చేసినట్టు ఆమెకి చెప్పాడు. అసలు ఎవరికీ హాస్పిటల్లో ఉన్నామన్న భావనే కలగదు. అచ్యుత రామయ్య గారు కూతురితో" నువ్వింటికెళ్లి అత్తమ్మకింత వండిపెట్టి, నువ్వూ ఎంగిలి పడి విశ్రాంతి తీసుకుని రేపురా తల్లీ. నేను అమ్మకి చెప్పే వచ్చాను. రేపు నువ్వొచ్చాక నేనెళతాను" అన్నాడు.

"పదండి కాత్యాయనీ, నేనూ అక్కడేగా ఉండేది కలిసి వెళదాం" అన్నాడు మనోహర్.

"ఇప్పటికే సొంత వాళ్లకన్నా ఎక్కువ సాయ పడ్డారు. మీకింక శ్రమ ఇవ్వ దలుచుకో లేదండి. నేను ఆటోలో వెళతాను" అంది సిగ్గుతో కుంచించుకు పోతూ.

"మీరిచ్చేదేంటండి. నేనే తీసుకుంటాను. ఇట్స్ మై ప్లెజర్" అని ఆమెతో పాటు లిఫ్ట్ ఎక్కాడు.

లిఫ్ట్ చిన్నగా కిందకు జారుతోంది. లోపల ఎవరూ లేరు.

***

(అవకాశాలన్నీ మనోహర్ కి అందుతున్నాయా? అందిపుచ్చుకుంటున్నాడా? విధి ఆడే వింత నాట్కంలో విలన్లెవరు?? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఎదురు చూడాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana