Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

అకస్మాత్తుగా ఎవరైనా స్వర్గస్థులయినప్పుడు, వారి వయసుని బట్టి తలో అభిప్రాయం వెలిబుచ్చుతారు, ఆ పోయినాయనగురించి.. – పుణ్యాత్ముడు.. అన్ని పనులూ పూర్తిచేసుకుని సంతృప్తిగా వెళ్ళిపోయాడనో, మధ్యవయస్కుడైతే  ..” అయ్యో పాపం.. ఒక్క చెడు అలవాటూ లేదూ, ఆ మాయదారి రోగం కడుపునెట్టేసికుందీ.. అనో, రకరకాలుగా చెప్పుకుంటారు... అంటే మన మరణం మన జీవనవిధానం (  lifestyle )  మీద ఆధారపడ్డట్టని చెప్పడం. నిజమేగా, మన తిండి అలవాట్లమీదే, మన ఆయుద్దాయం..ఇవన్నీ ,.. కూరగాయలూ, పప్పుదినుసులూ, వాతావరణమూ స్వఛ్ఛంగా ఏ కల్తీ లేని రోజుల్లో.

చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణం ధర్మమాఅని, కొన్ని కొన్ని అలవాట్లు చాలామందికి నరనరాలా పాకిపోయాయి... పెద్దైన తరవాత కూడా తమ స్థోమతనిబట్టి, ఆచరించేవారు... ఉదాహరణకి, ఏ  season  ని బట్టి ఆ season  కి అనుగుణంగా తిండి, వేషధారణ పాటించడం.. వేసవి కాలం వచ్చిందంటే, బయటకి వెళ్తే చేతులో ఓ గొడుగుండాల్సిందే... నవంబరు నెలొచ్చిందంటే, చలి ఉన్నా లేకపోయినా, ఒంటిమీద ఓ స్వెట్టరు, నెత్తిమీద ఓ “ మంకీ కాప్పు “ తప్పదు. వర్షాకాలంలో ఈ రోజుల్లో అయితే ఓ ఫోల్డింగ్ గొడుగూ, ఓ రైన్ కోటూ, కాళ్ళకి అవేవో రబ్బరు బూట్లూ.. మర్చిపోయాను, ఈ అతిజాగ్రత్తపరులు, మినరల్ వాటర్ తప్పించి ఇంకో నీళ్ళు తాగరు. ఒక్క చెడలవాటూ, ధూమపానం, మద్యపానం లాటివాటికి ఎన్నో కోసుల దూరం.బయట ఎటువంటి తిండీ తినడు, రోడ్డుసైడున అమ్మే, ఫాస్ట్ ఫుడ్ అంటే అసహ్యం. ఆతావేతా చెప్పాలంటే  most idealistic lifestyle  అని చెప్పుకోవచ్చు... మరి అంత అకస్మాత్తుగా చిన్నవయసులోనే ఎందుకు పోయాడటా?

గుర్తుండే ఉంటుంది, మన చిన్నప్పుడు , రకరకాల రోగాలు.. అదేదో దోమ కుడితే ఓ రొగం, టైఫాయిడ్, మసూచికం,  ఆట్లమ్మ.. సీజన్ ప్రకారం వచ్చేసేవి... ఆరోజుల్లో వైద్యవిజ్ఞానం అంతగా అభివృధ్ధి చెందకపోవడంతో, మరణాలుకూడా ఎక్కువగానే ఉండేవి. కాలక్రమేణా ప్రతీరోగానికీ ఓ మందు కనిపెట్టేసారు... వాటిని టీకాల రూపంలో చిన్నపిల్లలకి ఇచ్చేవారు... పైగా ఈ టీకాలనేవి compulsory  గా ఉండేవి. స్కూళ్ళలోనూ, బస్ స్టాండుల్లోనూ, ఎక్కడపడితే అక్కడ పిల్లల్ని పట్టేసుకుని ఈ టీకాలు వేసేసేవారు... ఆ ఊరికి చెందిన హెల్త్ ఇనస్పెక్టరుగారు తన మందీ మార్బలంతో, ఇంటింటికీ వెళ్ళి మరీ వేసేవారు.  ఆ టీకాలు వేసిన తరవాత, ఓ మచ్చ మిగిలిపోయేది.. ఆడపిల్లలకి మరీ కనిపించేటట్టు వేస్తే బాగుండదని, ఏ కనిపించనిచోటో వేయించేవారు. ఆరోజుల్లో ఒంటి మీద మచ్చ కనిపిస్తే అంత బాధపడిపోయేవారు.. ఈరోజుల్లో అంతా ఉల్టా అనుకోండి… ఎన్ని మచ్చలుంటే అంత అందమాయే--  Tattoo  ల వాళ్ళరోజులివి.. ఆ టీకాలు వేయించిన తరువాత, ఆ మహమ్మారి రోగాలు రమారమి తగ్గిపోయినట్టే..ఎక్కడో ఒకటీ అరా తప్పించి. అలాగే పోలియోని కూడా నియంత్రణలోకి తెచ్చినట్టే.. అయినా ప్రతీ ఏడాదీ ఏదో ఒక వ్యాధి బారిన పడుతూనే ఉన్నారు.

చెప్పొచ్చేదేమిటంటే, ఈ టికాలరూపేణా మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడానికన్నమాట… అందులో ఉన్నవేమిటిట.. ఏ రోగానికైతే టీకా వేసుకుంటామో ఆ వ్యాధి క్రిములలాటివన్నమాట. అంటే దానర్ధం ఏమిటీ? శరీరంలో ఆరోగ్యలక్షణాలతో పాటు, వ్యాధికి సంబంధించిన క్రిములుకూడా ఉంటేనే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.  ఈ టీకాలన్నీ చిన్న వయసులోనే వేయిస్తారు.. ఏదో   ఆరోగ్య సూత్రాలు పాటించేస్తూ, ఆయనకి అస్సలు ఎలాటి వ్యసనాలూ లేవంటే ఎలా కుదురుతుందీ? మధ్యమధ్యలో, అనారోగ్య క్రిములుకూడా ఉంటేనే. మనిషి నాలుక్కాలాలపాటు బతుకుతాడు.

డబ్బులున్నవాళ్ళైతే, ఏ సీజనుకాసీజను లో  lifestyle  మార్చేసుకోగలరు కానీ, ఏమీ లేని పేదవారెలా బతుకుతున్నారూ? రోజూ తినే తిండి తో పాటు పరిసరాల ధర్మమా అని , అనారోగ్యక్రిములు కూడా శరీరంలో ప్రవేశించబట్టే కదా.. అలాగని మరీ మోతాదెక్కువైతే ప్రాణం మీదకొస్తుంది.

ఏదో ఖచ్చితమైన ఆరోగ్యసూత్రాలు పాటిస్తున్నారని, ఆరోగ్యాలేమీ బాగా ఉండవు. అప్పుడప్పుడు, రోడ్డుసైడునుండే ఫాస్ట్ ఫుడ్ కూడా తింటూండాలి మితంగా.. ఏదీ వ్యసనంగా మారనంత కాలం , ఎటువంటి అనారోగ్యమూ రాదేమో…అస్తమానూ మినరల్ వాటరే తాగక్కర్లేదు, అప్పుడప్పుడు  ఏ నూతినీళ్ళో, కాలవనీళ్ళో కూడా తాగితే,  రావాల్సిన వ్యాధినిరోధక శక్తి దానంతట అదే వస్తుంది…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
This is the reason