Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue296/770/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)..."మనవన్నీ బిజినెస్ రిలేషన్స్ అని చెప్పాను కదా! అంతా ఇచ్చి పుచ్చుకోవడమే ! మీ ఆయనకి వచ్చిన ఖరీదైన వ్యాధికి మీరు వైద్యం చేయించ లేరు. మీ పుట్టింటి వాళ్లూ అంత కలిగిన వాళ్లేం కాదు. చేయి జాపి ఎవరి సహాయమూ అర్థించ లేరు. ఎందుకంటే మీరలా పెరిగారు. ఇహ ఆయనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది? దిన దినం అతను మృత్యువుకు దగ్గరవుతున్నాడని మీకూ తెలుసు. ఒకవేళ అతనేమన్నా అయితే వాళ్లమ్మను మీరెలా చూసుకుంటారు?. ఆవిడ అంధురాలు. కొడుకుంటే మీరంత బాధ్యత వహించాల్సిన అవసరముండదు. కాబట్టి అతను బతకడమే కరెక్ట్! ఏవంటారు?"అని ఆగాడు.

ఆమేం మాట్లాడ లేదు.

"ఒకే, ఐ విల్ కంటిన్యూ..చెప్పా కదా మిమ్మల్ని మొదటి రోజు చూసినప్పుడే నా మనసు ఫిదా అయిపోయింది. మిమ్మల్ని పొందాలన్న ప్రగాఢమైన కాంక్ష కలిగింది. మీ మెజర్ మెంట్స్ మీకు తెలుసో తెలీదో కాని మగాణ్ని పిచ్చోణ్ని చేస్తాయి. రావణుడికి, కీచకుడికీ తేడా ఉంది. రావణుడు సీత అందాన్ని చూడ లేదు. ఆమెని కోరుకోలేదు. చెల్లెలి మీద ప్రేమతో ఆమెకి జరిగిన అన్యాయానికి, ఆమె చెప్పిన మాటలకు కలిగిన కసితో సీతను ఎత్తుకెళ్లాడు. కీచకుడు అలా కాదు. ద్రౌపది అందానికి దాసోహంతో ప్రపోజల్ పెట్టాడు. చచ్చాడు. నేను వాళ్లిద్దరినీ కాను. మీ ఆయన మొత్తం ట్రీట్ మెంట్ నేనే బేర్ చేస్తాను. నాకు మీరు ఒక్క.. రా..........త్రి...........కి కావాలి. ఇదే డీల్. మీకు ఇష్టమైతేనే! ఇష్టమైతేనే అంటే లిటరల్ గా  మీకిష్టమని కాదు. నేను మీకు చేసిన దాన్ని బేలన్స్ చేస్తారని. ఒకవేళ మీకు నచ్చక ఒప్పుకోకపోయినా నేనేం అనుకోను. ఎందుకంటే ఆ ఒక్క రాత్రి మీ సంపూర్ణ సహకారంతో మిమ్మల్ని పొందాలి. అప్పుడే తృప్తి. అందుకే మీ యాక్సెప్టెన్స్ నాకు చాలా చాలా ముఖ్యం. ఆ ఒక్క రాత్రీ అయింతర్వాత ఇహ నేను మీకు కనిపించను. ఐ స్వేర్. మీ ఆయనతో మీరు హాయిగా, ఆనందంగా ఉండొచ్చు. మీరు మధురమైన స్మృతిలా భావిస్తారో, పీడకల అనుకుంటారో మీ ఇష్టం. ఇట్స్ మై ప్రపోజల్ దట్సాల్."అని ముగించాడు.

కాత్యాయనికి గుండె బద్దలై పోయినట్టనిపించింది.  ’ఎంత మాటన్నాడు. అతను చేసిన సహాయానికి తన మానాన్ని కోరుకుంటున్నాడు. ఆడది ఎప్పటికీ మగాడికి లోకువే! ఇప్పుడు తనేం చేయ గలదు? అతని ట్రాప్ లో పడిపోయింది. కనీసం ‘హాస్పిటల్లో అలాంటి ఛారిటీ ట్రీట్ మెంట్ ఉందా?’ అని కూడా వాకబు చేయలేదు. రేపు తెల్లవారితే కమలాకర్ కు ఆపరేషన్. ఆపరేషన్ అయితే అతనికి మరో జన్మ దొరికినట్టే. తన సంగతి పక్కన బెట్టినా, పాపం అతని తల్లికి అతనే లోకం. ఆమె లోకం విడిచే వరకు అతనే ఆధారం. అలా అని తను తన మానాన్ని కోల్పోవాలనుకోవడం లేదు. ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎవరికీ రాకూడదు.’ ఆమె మనసులో ఆలోచనల సుడి.

వైబ్రేట్ అవుతున్న ఆమె శరీరం, ఎర్ర బారిన కళ్లు.. అవిశ్రాంతంగా స్రవిస్తున్న కన్నీళ్లు చూసిన మనోహర్ కాస్తంత విచలితుడయ్యాడు. లేచి నిలబడి "కాత్యాయనీ, ఇవ్వాళ మీ ముందు ఇలా రివీల్ అవడం నాకు చాలా రిలీఫ్ గా ఉంది. మీ ఆయనకి ఆపరేషన్ పూర్తయి, డిస్చార్జ్ అయి మీ సహకారంతో కోలుకోడానికి ఓ పదిహేను రోజులు పడుతుంది. ఇదిగో ఈ కార్డ్ తీసుకోండి. ఇది ఒక హోటల్ ది. మీరు ఇరవై ఒకటో రోజు సాయంత్రం ఆరు గంటలకి ఆ హోటల్ కి వస్తారని ఆశిస్తున్నాను. అక్కడ నా పేరుతో  ఎప్పటికీ ఒక రూం అల్లాటై ఉంటుంది. మీరు రిసెప్షన్ లో నా పేరు చెబితే సెలెబ్రిటీ ట్రీట్ మెంట్ ఇస్తూ నా గదికి తీసుకొస్తారు. ఎందుకో మీకు అర్థమైందని నాకు తెలుసు. నేను మీ మీద ఇష్టంతో మీ ఆయన మీద పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయాలనుకుంటే మీరొస్తారు! ఒకవేళ నేను మోసం లేదా బ్లాక్ మెయిల్ చేశాను అన్న భావన కలిగితే రారు. మీరు వచ్చినా, రాక పోయినా ఆ తర్వాతి రోజు నుంచి నేను మీకు కనిపించను. అంతే కాదు రేపటి నుంచి కూడా మీకు కనిపించను. ఎందుకంటే నేను ఎదురు పడితే మీకు ఎంబ్రాసింగా ఉంటుంది. మీ అవసరాలన్నీ చూడడానికి ఒక పదిహేనేళ్ల కుర్రాణ్ని పెడతాను. మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు కావలసిన అమౌంటూ స్పెండ్ చేస్తాడు. అదంతా నాదే. నేను మీ కోసం కర్చు పెట్టాలనుకున్నదే! మళ్లీ మనం కలిసేది సరిగ్గా ఇరవై రోజుల తర్వాతే. అదీ మీరనుకుంటేనే!" అంటూ వెళ్లి పోయాడు. ఆ కార్డ్ ని విసిరికొట్టాలని, ఆ ప్రపోజల్ ని, ఆ కుర్రాణ్ని రిజెక్ట్ చేయాలని అనుకుంది. కాని ఏదో తెలీని నిస్సత్తువ ఆవరించడంతో అలాగే కూర్చుండి పోయింది.

సంధ్య చీకట్లు కమ్ముకున్నాయి. "ఏమ్మా..ఇగ మీరు ఎల్లాల" అంటూ కాకీ డ్రస్ వేసుకున్నతను తన దగ్గరగా వచ్చి అనడంతో ఈ లోకంలోకి వచ్చింది. లేచి కళ్లు తుడుచుకుంది. అన్య మనస్కంగా లేచి వెళ్లబోతుంటే, "అమ్మా, ఇక్కడ మీ కార్డ్ ఒకటి ఉంది" అని అక్కడ పడి ఉన్న కార్డ్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాడు. కాత్యాయని అసంకల్పితంగా దాన్ని చేతిలో పట్టుకుని హాస్పిటల్ వైపు నడవసాగింది.
నడిచే ఉప్పెనలా ఉందామే.

హాస్పిటల్లోకి చేరగానే రిసెప్షన్ లో ఆమె కోసం ఎదురు చూస్తున్న అచ్యుతరామయ్య "ఏమ్మా ఏవైంది..అలా ఉన్నావు? అసలెక్కడికి వెళ్లావు?"అడిగాడు ఆందోళనగా.

ఏం చెప్పింది కాత్యాయని? ఏం చెప్పగలుగుతుంది?? ఏం చేయగలుగుతుంది?? ఏ స్త్రీకీ రాకూడని విపత్కర పరిస్థితి నుండి ఎలా దాటబోతోంది?? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఆగాల్సిందే...............

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana