Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue296/771/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి) చెన్నై వరకూ తనని వెంబడిస్తూ వచ్చాడా? చెన్నైలోనే తన వెంట పడుతున్నాడా? ఎవరా వ్యక్తి? ఎందుకలా తనని వెంబడిస్తున్నాడు?  ఆలోచిస్తూనే  బుల్లెట్‌ డ్రైవ్‌ చేస్తున్న  లోకల్‌ పోలీసు రామ్‌కి తమ వెనుకే అనుసరిస్తూ వస్తున్న బైక్‌ని...బైక్‌ మీద ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా గమనించమని చెవిలో చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అతను బుల్లెట్‌ డ్రైవ్‌ చేస్తూనే మిర్రర్‌ లో వెనుక ఫాలో అవుతున్న బైక్‌ని చూసాడు. బుల్లెట్‌ ని రక రకాలుగా మలుపు తిప్పి ప్రక్క ప్రక్క గల్లీల్లోకి మళ్లించినా వదలకుండా ఫాలో అవుతూనే ఉన్నాడు ఆ వ్యక్తి.

‘‘ఏం చేద్దాం సార్‌?’’ వెనుక కూర్చున్న ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ని అడిగాడు పోలీసు రామ్‌.

‘‘మీరే ఆలోచించండి.’’ చెవిలో గుసగుసగా చెప్పాడు.

‘‘వాడి దృష్టి మళ్ళించాలని శత విధాలా ప్రయత్నించాను. కానీ వాడు నీడలా మన వెనుకే వస్తున్నాడు. ఎలా? వడపళినికి పోనివ్వనా?’’ అడిగాడు పోలీస్‌ రామ్‌.

‘‘వెళ్ళండి. వాడికి మనం భయ పడ్డం ఎందుకు?’’ మొండిగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అంతే  !

బుల్లెట్‌ని వడపళిని కేసి మళ్ళించాడు రామ్‌.

వెనుక వస్తున్న బైక్‌ కూడా వారి వెంటే మలుపు తిరగడం ఇద్దరూ గమనించారు. వడపళినిలో లాడ్జీ ముందుకు వెళ్ళే దారిలో టక్కున ఒక షాపు ముందు బుల్లెట్‌ ఆపేసాడు రామ్‌.

బైక్‌ మీద ఫాలో అవుతున్న వ్యక్తి కూడా బుల్లెట్‌ ఆగీ ఆగగానే అక్కడికి దగ్గర లోనే ఆపి బైక్‌ మీద కూర్చున్నాడు. బుల్లెట్‌ స్టాండ్‌ వేసి వెనుక ఫాలో అవుతున్న వాడి దగ్గరకు వెళ్లి పట్టుకుని నాలుగు పీకాలనుకున్నాడు రామ్‌.

‘‘ఏం సార్‌! బుల్లెట్‌ ఆపేసారు?’’ బండి దిగుతూ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘వాడెవడో.... దగ్గర కెళ్లి నాలుగు తగిలించి వస్తానుండండి.’’ అంటూనే బుల్లెట్‌ స్టాండ్‌ వేసి గబగబా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు రామ్‌.
ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తున్న రామ్‌ కేసి చూస్తూ నిలబడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘వీడెవడండీ బాబూ! గుండెలు తీసిన బంటులా ఉన్నాడు! వాడెవడో... ఎందుకు ఫాలో అవుతున్నాడో....అసలు కావాలనే ఫాలో అవుతున్నాడో.... లేక.... యాదృచ్ఛికంగా ఫాలో అవుతున్నాడో...ఏదీ నిర్ధారణ చేసుకోకుండా...అంత దర్జాగా...ధీమాగా...ధైర్యంగా...ఎటాక్‌ ఇవ్వడానికి వెళ్తున్నాడు. యూనిఫాం లో ఉన్నా బావుండేది. మఫ్టీలో ఉన్నాడు. పోలీసులని గుర్తు పడితే కదా ఎవరైనా మర్యాదిస్తారు. గౌరవంగా తప్పుకుంటారు.

పరిపరి విధాలా ఆలోచిస్తూనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తున్న లోకల్‌ పోలీస్‌ని చూస్తూ నిలబడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. అక్కడ దృశ్యం చూస్తూనే ఒక్కసారే అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లిన రామ్‌ వినయంగా సెల్యూట్‌ చేసి వంగి వంగి నమస్కారాలు చేస్తూ నిలబడ్డాడు.

ఆ వ్యక్తి గర్వంగా తల ఎగరేస్తూ నిలబడి జేబులో నుండి సిగరెట్టు తీసి స్టైల్‌గా వెలిగించి బలం గా ఒక్క దమ్ము లాగి ఆ పొగ ఎదర నిలబడ్డ రామ్‌ మొహం మీద వదులుతున్నాడు.

అప్పుడు.... అప్పుడు ఆ వ్యక్తిని తదేకంగా చూస్తూనే ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. ఆ వ్యక్తే... ఆ వ్యక్తిని ఓ అరగంట ముందే చూసాడు. కండలు తిరిగిన బాడీ.... జెండా కొయ్యలా పొడవుగా బలిష్టంగా ఉన్న....అతడు... ఎస్‌.... యలమంచిలి  గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ హరిశ్చంద్రప్రసాద్‌ బాడీగార్డుల్లో ఒకడు....బౌన్సర్‌...

ఆ ‘బౌన్సర్‌’ కా రామ్‌ వంగి వంగి దండాలు పెడుతున్నాడు?

ఆశ్చర్యంగా అవాక్కయి బుల్లెట్‌కి జారగిలబడి పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

************

వడపళని సెంటర్‌లో లాడ్జీలో దిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. లాడ్జీలో దించేసి రామ్‌ వెంటనే వెళ్లిపోయాడు.

వెళ్లిపోతూ  ఎస్సై  అక్బర్‌ఖాన్‌  అడక్క పోయినా  అతనే  చెప్పాడు. ‘‘సార్‌! ఆ గూండా గాడితో చాలా జాగ్రత్తగా ఉండండి. వాడి దృష్టి మీ మీదే ఉంది. వాడిక్కడ పేరు మోసిన గూండా...హంతకుడు. వాడికి తమిళనాడు రాజకీయ నాయకుల  అండదండలే  కాదు. బడా బడా వ్యాపారాలు...పెద్ద పెద్ద పోలీసు అధికారుల అండ కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి.’’ వెళ్తూ వెళ్తూ చెప్పాడు.

ఎస్సై అక్బర్‌ఖాన్‌కి తల తిరిగి పోయింది.

తన మీద నిఘా పెట్టారంటే ఈ కేసు ఎంత జటిలమైనదో అర్థమౌతోంది. విశాఖ పట్నం నుండి చెన్నై వరకూ వచ్చింది ఒకే ఒక్క చిన్న ఆధారంతో. అది కూడా ఎందుకూ పనికిరానిదై పోయింది.

అసలు ఇంతకీ ఆమె ఎవరు? ఇక్కడ శోభాదేవి గారు చెప్పినట్టు ‘మహాశ్వేతాదేవి’ నెల క్రితమే చనిపోతే ఆమె లాగే ఉన్న ఈమె ఎవరు?
ఆలోచిస్తూనే రూమ్‌లో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. వడపళనిలో చాలా పెద్ద హోటల్‌ ఇదేలాగుంది. అయిదంతస్థుల భవనం. అయిదో ఫ్లోర్‌ ఇచ్చారు. ఒక్కరే ఉంటారంటేనే ససేమిరా రూముల్లేవని ఎంత యాగీ చేసాడో? రూల్స్‌ ఒప్పుకోవంటాడు. తన ఉనికి తెలీకూడదని సాధారణ వ్యక్తుల్లా వెళ్లి రూమ్‌ అడగాలని ముందే నిర్ణయించుకున్నారు. హోటల్‌ వాడు రూమ్‌ ఒంటరిగా వచ్చే వాళ్లకి ఇవ్వలేమని....ఏదైనా జరిగితే మాకు ప్రమాదమని తేల్చి చెప్పాడు.

చివరికి తన ఉనికి బయట పెట్టక తప్పలేదు. లోకల్‌ పోలీస్‌ కూడా తన ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు. తను కూడా తన ఐడి కార్డు చూపిస్తే గాని ఆ హోటల్లో గది ఇవ్వడానికి అంగీకరించ లేదు. ఎంత ఘోరం?! మనసులోనే అనుకున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌..
రూమ్‌లో దిగాక అసహనంగా లోకల్‌ పోలీస్‌ మీద అరిచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఏంటి సార్‌! మీరున్నా వాడు అంత యాగీ చేసాడు.’’ అన్నాడు.

‘‘వాడి రూల్స్‌ వాడికుంటాయి కదండీ.’’ అన్నాడు రామ్‌.

‘‘గొప్పగా చెప్పారే! ఒంటరిగా ఎంత మంది రారు. రైల్వేస్టేషన్ లో బ్రోకర్లు బెటర్‌ సార్‌! ఈజీగా రూమ్‌ ఇప్పిస్తారు.’’ అసహనంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

రౌడీలూ గూండాల మీద నిఘా పెట్టాల్సిన పోలీసునే ధైర్యంగా వెంటాడిన అతడు నిజంగా గూండానేనా? అతడికి ఇన్స్పెక్టర్ రాం అంత వినయంగా దండాలెందుకు పెట్టాడు? అక్బర్ ఖాన్ కేసు చేదించడానికొచ్చాడా? లేక కేసులో ఇరుక్కోబోతున్నాడా......తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా ఎదురు చూడాల్సిందే.........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్