Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope21st december to 27th december

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

 వైధీస్వరన్ కోవెల ( కుజ స్థానం )

ధరణీ గర్భ సంభూతం విధ్యుత్కాంతి సన్నిభం
కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహమ్

గత సంచికలలో మనం సూర్య గ్రహస్థానం , చంద్ర గ్రహస్థానాల గురించి తెలుసుకున్నాం . ఈ సంచికలో అంగారకుడు , మంగళుడు , కుజుడు , ధరణీ పుత్రుడు , బౌముడు అనిపిలువబడుతూ నవ గ్రహాలలో మూడవదిగా గా చెప్పబడే అంగారక గ్రహం గురించి చెప్పుకుందాం . ముందుగా కుజుడుగా యెక్కువగా ప్రసిధ్ధి పొందిన అంగారక గ్రహం యెవరు ? , ఇతని తల్లి తండ్రులెవరు ? మొదలైన విషయాలు తెలుసుకుందాం . ఇతని పుట్టుక గురించి మూడు  కధలు ప్రచారంలో వున్నాయి ,  పార్వతీ దేవి ఏదో కారణాన అడవిలో తిరుగుతూ వుండగా ఆమె నుదుట నుంచి కారిన చెమట నుంచి అంగారకుడు జన్మించి నట్లు , భూదేవి అతనిని పెంచినట్లు మొదటి కధ , ఇక రెండవది భరద్వాజ మహర్షికి భుమాతకి జన్మించెనని , భూదేవి అతనిని పెంచెనని అందుకే కుజుని ధరణీగర్భ సంభూతునిగా వ్యవహరించడం జరిగిందని అంటారు  .

మత్స్య పురాణం ప్రకారం దక్ష వాటికలో దక్ష యజ్ఞం జరిగినప్పుడు  సతీదేవి ప్రాణ త్యాగం చెయ్యగా క్రొధితుడైన శివుని మూడో నేత్రం నుంచి పుట్టిన వీరభద్రుడు యజ్ఞాన్ని ద్వంసం చేసి కోపం తో ఎర్రని రంగుతో ప్రజ్వలిస్తూ వుండగా ముక్కోటి దేవతల ప్రార్ధనలను మన్నించి ఉగ్రరూపం వుపసంహరించి మంగళుడిగా అవతరించేడనేది మూడవకథ . ఎనిమిది దివ్య గుఱ్ఱములు పూచిన బంగారు రథం లో త్రికోణం పై కూర్చొని యెర్రని వర్ణం తో నాలుగు చేతులు , మూడు చేతులలో ఆయుధాలు కలిగి , మేక బొమ్మ కలిగిన పతాక దారియై వుంటాడు . జాతక చక్రం లో కుజ స్థానం లో దోషాలుంటే పెళ్ళి కుదరడం లో ఆలస్యం , భార్యాభర్తల మధ్య కలహాలు , అప్పుల బాధ , ఉద్యోగ విషయాలలో ఆటంకాలు , సహోదరులతో విబేధాలు , భూవివాదాలు , గాయాలు , ఎముకలు విరుగుట , వాతరోగాలు మొదలయిన యిబ్బందులు వుంటాయి . అంటే మన జాతకం లో కుజుని స్తానం దోషపురుతమైతే మన జీవితం లో  అతిముఖ్య మైన వివాహం , వుద్యొగాలపై చెడు ప్రభావం పడుతుంది . కుజ మహాదశ వున్న వారికి ఏడు సంవత్సరాలు యీ మహా దశ కొనసాగుతుంది . ఆ సమయంలో వారికి అప్పుల బాధలు తీరి వ్యాపారంలోను , వుద్యోగంలోను , వైవాహిక సంబంధాలలోనూ చాల మంచి ప్రభావం చూపుతుందిట . కుజునికి యిష్ఠమైన రంగు కమలాపండు యెరుపు , యిష్ఠమైన పువ్వు మందారం , పగడం యిష్ఠమైన రత్నం . యిష్ఠమైన వారం మంగళవారం . కుజదొషాలు పోవాలంటే యెర్ర బట్టలు , పగడం ధరించి  మంగళవారం ఉపవాస దీక్షలొ వుండి  మందారాలతో కుజుని పూజిస్తే కుజదోష నివారణ జరుతుందని జ్యోతిష్కులు అంటారు . మేష , వృశ్చిక రాశులకు కుజుడు అధిపతి . మకరరాశి కి అనుకూలుడు గా ఉంటాడు .

అయితే యీ కుజగ్రహ స్థానం యెక్కడుంది . అక్కడకి ఎలా చేరుకోవాలో తెలుసు కుందాం .తమిళనాడులోని చిదంబరానికి రానికి 24 కిమీ శిరికాళి వెళ్ళే రోడ్డు మీద కుంభకోణానికి సుమారు 55కిమి దూరంలో నాగపట్టణం జిల్లాలో వున్న  ' పుల్ఋగ్వేలూర్  ' అనే వూరిలో వైధీశ్వరన్ కోవెలలో యీ కుజస్థానం వుంది .యీ వురి పేరు వింతగాలేదూ ? , ఆకధ కుడా తెలుసుకుందాం .పుల్ అంటే పక్షి , త్రేతాయుగం లో జటాయువు  కోవెలలో యీశ్వరుడిని సేవించుకొన్నాడు , ఋగ్ అంటే ఋగ్వేదం కృతయుగం లో ఋగ్వేదం  , వేల్ అంటే కుమారస్వామి యొక్క ఆయుధం , కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వెలాయుధాన్ని పొందిన ప్రదేశం . అందుకే యీ వూరికి ' పుల్ఋగ్వేలూర్ ' గా పిలువ బడుతోంది . అన్ని శైవ నవగ్రహస్థానాలలోనూ మూలవిరాట్టు శివుడు . తమిళనాడులో వైష్ణవ నవగ్రహ స్థానాలు కుడా వున్నాయి . కాబట్టి శైవ నవగ్రహ స్థానాలు అని రాయడం జరిగింది .

యీ కోవేల కనీసం 2000 సం .. పూర్వం నిర్మింప బడ్డ మందిరంగా చెప్పబడింది . నాలుగు వైపులా పెద్ద పెద్ద గోపురాలతో చాలా విశాల మైన కోవెల . అయిదు అంతస్థుల రాజ గోపురం లోంచి లోపలకి వెళితే పూజా సామగ్రి అమ్ముకొనే దుకాణాలతో  పాటు రాళ్లఉప్పు , మిరియాల పోట్లాలు  అమ్ముతూ కొందరు ఆడవాళ్ళు వెనుక పడడం కుడా చూడొచ్చు . యిక్కడ అడుగడుగునా నాఢీ జ్యోతిషాలయాలు దర్శనమిస్తాయి . రాజ గోపురం దాటుకొని లోపలకి వెళ్ళగానే పెద్ద పెద్ద మండపాలు రెండువైపులా వుంటాయి .యిక్కడ కోవెల ఆధీనం లో వున్న యేనుగులు కనుపిస్తాయి . యింకా ముందుకి వెళితే లోహంతో నిర్మింప బడ్డ పెద్ద కుమారస్వామి విగ్రహం వుంటుంది . దీనిని ముత్తు ( ముద్దు ) కుమారస్వామి అని అంటారు . పార్వతీ దేవి షన్ముఖుని ఆరు ముఖాలతో కాకుండా అతని అసలు రూపం తో దర్శన మివ్వమని కోరగా కుమారస్వామి ఆమెకు ఒక మొహం తో దర్శన మిచ్చేడుట . ఆ ముద్దు మోముని చూసి ముత్తు కుమారస్వామి అని పార్వతీ దేవి పుత్రుని ముద్దాడిందిట .

కుమారస్వామి పద్మాశురునితో యుధ్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు వేలాయుధాన్ని యిచ్చి అశీర్వదించి యుద్ధానికి పంపుతారు . ఆయుధ్ధం లో క్షతగాత్రులైన దేవతలకు శివుడు వైద్యునిగా సేవలందిస్తాడు . అందుకు యీ కోవెలలో యీశ్వరుని వైధీశ్వరుడు అని పిలుస్తారు యీశ్వరుని గర్భ గుడిలోకి ప్రవేశించడానికి ముందు కుడిచేతి వైపున దక్షిణ ముఖంగా అమ్మవారి కోవెల వుంటుంది .ఇక్కడ పార్వతీదేవిని థైయాల్ నాయకి అని అంటారు . యీ కోవెలలో ముందుగా ముత్తు మురుగన్ ని దర్శించుకున్నాక థైయాల్ నాయకిని దర్శించుకోవాలి . అమ్మవారు తలపై తైలం కడవని పెట్టుకొని భక్తులకు దర్శన మిస్తుంది . తైలనాయకి గా పిలువబడే అమ్మవారు కాలాంతరాన  థైయాల్ నాయకిగా మారిపోయింది . వైధ్యుడుగా దేవతలకు సేవలందిస్తున్న శివునికి ఓషధులు కలిపిన తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది పార్వతీ దేవి . యీ అమ్మవారిని దర్శించుకుంటే అన్ని ఋగ్మతలు తొలగిపోతాయనేది స్థానికుల నమ్మకం .

అమ్మవారి కోవెల యెదురుగా వున్న ద్వారం గుండా లోపలకి వెళ్తే స్వఛ్ఛ మైన జలాలతో నిండిన పుష్కరిణి కనిపిస్తుంది . దీనిని చిత్రమిత్ర తీర్ధం అని అంటారు . దీనికి సిధ్ధామృత తీర్ధం , గోక్షీర తీర్ధం, ఇషుసార తీర్ధం అని కూడా అంటారు . కామధేనువు ప్రతి దినం తన క్షీరాన్ని యీ తీర్ధంలో విడుస్తుందట అందుకు గోక్షీర తీర్ధం అని అంటారు . ఇక ఇషుసార అంటే చెరుకురసం , యిందులో నీరు చెరుకురసమంత తియ్యగా వుంటాయిట . ఇందులో స్నానం చేసినా , ప్రక్షాళన చేసుకున్నా దీర్ఘ కాల ఋగ్మతలు తొలగపోతాయిట . కుష్ఠువ్యాధి సోకిన కుజుడు యీ తీర్థం లో స్నానం చేసి కుష్ఠు వ్యాధిని పోగొట్టుకున్నాడట .  తమిళనాడు ప్రభుత్వం వారు యివన్ని అక్కడ బోర్డుపై రాసి భక్తుల కొరకై ఏర్పాటు చేసేరు .           అక్కడ నుంచి గర్భగుడిలో శివలింగం దర్శించుకుంటాం , ఇక్కడ  ఈశ్వరుడు వైధీశ్వరునిగా పూజలందు కుంటున్నాడు . వైధీశ్వరుని దర్శించుకొని గర్భ గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు వినాయకుడు , గజలక్ష్మి , నటరాజు , దుర్గ , ధన్వంతరి , నాలుగు వేదాలు , దక్షిణామూర్తి , సత్యనాధుడు , జటాయుకుండం , అంగారకుని ఉత్సవ విగ్రహాలను దర్శించుకుంటాం . కుజ దోష పరిహార పూజలు యీ ఉత్సవ విగ్రహం దగ్గర జరుగుతూ వుండడం చూస్తాం .

యిక్కడ జటాయుకుండం గురించి చెప్పుకుందాం . సీతాదేవిని రావణాసురుడు అపహరించుకు పోతూవుంటే చూసిన జటాయువు రావణునితో పోరాడి గాయాల పాలై యిక్కడ పడిపోయి , సిధ్ధామృత  తీర్ధమ్ లో స్నానం చేసి వైధీశ్వరుని సన్నిధిలో రాముని రాకకై యెదురు చూసి రామునికి సీతాదేవి ఎరుక తెలియజేసి తనువు చాలిస్తాడు . జటాయువునకు శ్రీరాముడు లక్ష్మణుడు , వశిష్ఠ విశ్వామిత్ర ఋషుల ఆధ్వైర్యం లో ఉత్తర క్రియలు జరపిన ప్రదేశమే యీ జటాయుకుండం అని యిక్కడి పూజారులు  చెప్పారు .

యిక్కడ ఉప్పు , మిరియాలు అమ్మవారికి ఎదురుగా వున్న పెద్ద మట్టి గోలెం లో సమర్పించడం చూస్తాం . ఉప్పు మిరియాలు సమర్పిస్తే చర్మ రోగాలు , వులిపిరికాయలు పోతాయనేది స్థానికుల నమ్మకం . సిధ్ధామృత తీర్థం కి ఎడమ వైపుకి వెళితే అంగారకుని రాతి విగ్రహం చిన్న మండపం లో వుంటుంది . యిక్కడ అంగారకునికి అర్చన అభిషేకాదులు జరుగుతూ వుంటాయి . అక్కడే జ్వరహరేశ్వరుడు , పళ్లిస్వామి , స్థల వృక్షం కృతయుగం నుంచి వుంది అని చెప్తారు . ఇక్కడ స్థల వృక్షం వేపచెట్టు . ఈ చెట్టుకిందన ఆది వైధీశ్వరుని మందిరం ముఖ్య మందిరాన్ని పోలివున్నది వుంటుంది . యిక్కడ నేత్రపిడి , తిరుచెందువుండ అనేవి ప్రసదాలుగా యిస్తారు . నేత్రపిడి అంటే చందనం , కుంకుమ పువ్వు నీళ్ళ తో కలిపి ముత్తు కుమారస్వామి నుదుట అలంకరించిన తరువాత తీసి భక్తులకు ప్రసాదంగా యిస్తారు . తిరుచెందువుండ అంటే చందనం , హోమకుండం లోని వీభూతి , వేప ఆకులు పుష్కరిణి లోని మన్ను కలిపి చేస్తారు . వీటి  సేవనం వల్ల సర్వ ఋగ్మతలు నశిస్తాయని భక్తుల విశ్వాసం .యీ కోవెలలో ప్రతి రోజు ఆరుమార్లు పూజలు నిర్వహిస్తారు . అంటే యీ కోవెల  యిరవై నాలుగు గంటలు తెరిచే వుంటుంది . యీ కోవెలలో మంగళవారం అంగారకుని ఉత్సవ విగ్రహాన్ని మేక ఆసనం పై కోవెలలో ఊరేగింపు నిర్వహిస్తారు . కృత్తికా నక్షత్రం లో విశేష పూజలు ,  స్కంద షష్టి పూజలు విశేషం గా జరుగుతాయి . ఫాల్గుణ మాసం లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు .

పురాణ కాలంలో సూర్యుడు ,  జటాయువు , నాలుగు వేదాలు , అంగారకుడు , రాముడు , లక్ష్మణుడు యీ శివుడిని పూజించుకున్నారు . విక్రమ చోళుడు 12వ శతాబ్దం లోనూ , 16 వ శతాబ్దం లో నాయక రాజులు , మారాఠా రాజులు దర్శించుకున్నారనేది చరిత్ర చెప్తోంది .

అంగారక మూల మంత్రం
ఓమ్ క్రామ్  క్రీమ్ క్రౌమ్ సహా భౌమాయనమః

అంగారక గాయత్రి
ఓమ్ అంగారకాయ విద్మహే , భూమి బాలయ ధీమహి
తన్నో కుజః ప్రచోదయాత్

ఈ కోవెల. చాలా పెద్దది , కజిన రాతి విగ్రహం నిండా గుంతలు పడి కనిపిస్తుంది , కుష్ఠువ్యాధితో బాధపడుతున్న కుజుడు కాబట్టి అలా వుందని పూజారులు చెప్పేరు . థైయాల్ నాయకి అమ్మవారి విగ్రహం చాలా సజీవంగా వుంటుంది .             కోవెల చుట్టూర నాడీ జ్యోతిషాలయాలను చూడొచ్చు . ఈ కోవెల మూడు ప్రాకారాలలా వుంటుంది . మొదటి ప్రాకారంలో ‘ ముత్తు వేల్ ‘ , కుజగ్రహ కోవెల వుంటాయి , రెండో ప్రాకారంలో థైయాల్ నాయకి , ఈశ్వరుని కోవెలలోపల వున ప్రాకారంలో ‘ జటాయు మోక్షం ‘ , కుజగ్రహ ఉత్సవ విగ్రహాలు వుంటాయి . గర్భగుడిలో శివుడు వైథీశ్వరునిగా పూజలందుకుంటూ వుంటాడు .

వచ్చేవారం బుధగ్రహం గురించి చదువుదాం , అంతవరకు శలవు .        

మరిన్ని శీర్షికలు
chamatkaaram