Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pratipaksham

ఈ సంచికలో >> కథలు >> నైరాశ్యాన్ని పారద్రోలిన దీపావళి

nairaashyaanni paaradrolina deepaavali

మంచం మీద పడుకున్న రామచంద్రమూర్తి నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు.

ఆయన మనసంతా వికలంగా వుంది.

కారణం ఒంటరితనం.

రిటైరయ్యి అయిదు సంవత్సరాలయింది. మాంచి పాష్ లొకాలిటీలో బంగ్లాలాంటి ఇంట్లో ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ తను. ఇద్దరు పనివాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు మెకానికల్గా చేసుకుపోతారు. ఇహ అక్కడి నుండి ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తుంది. మధ్యతరగతి నివాసాలుండే కాలనీల్లాగా అవసరాలకి ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి వెళ్ళడాలుండవు. ఎవరికి వారు గిరి గీసుకుని పంజరాల్లో పక్షుల్లా. పగలు రాత్రీ నీరవ నిశ్శబ్దం.

పదేళ్ళక్రితమే భార్య ఆయన్ని ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. ఇద్దరు కొడుకులు ఒక కూతురూ రెక్కలొచ్చి విదేశాల్లో సెటిలైపోయారు. బాధ్యతల్లో మునిగిపోయిన వాళ్లకి తండ్రి గుర్తుకురావడం చాలా చాలా అరుదు. ఎన్ని పుస్తకాలని చదువుతాడు? ఒంటరిగా ఎన్ని చోట్లని తిరుగుతాడు? ఆయనకి ఈ మధ్యే జీవితం మీద విరక్తి కలుగుతోంది.
డబ్బున్నా సుఖముండదనడానికి ఆయనే నిదర్శనం.

ఎల్లుండి దీపావళి.

పెద్ద పండగే... ఆయన విషయంలో మాత్రం ఏ ప్రత్యేకతా వుండదు. సంక్రాంతి... ఉగాది... దసరా... ఎన్ని పండగలు దొర్లుకుంటూ వెళ్ళిపోలేదు.

అలా అలా ఆలోచిస్తున్న ఆయన మనసులో ఒక ఆలోచన చోటు చేసుకుంది. అది ఇంతింతైగా ఎదిగి ఆయన మనసు ప్రశాంతతకు కారణమైంది.

చాలా రోజుల తర్వాత ఆ రాత్రి ఆయన హాయిగా నిద్రపోయాడు.

***

మరుసటిరోజు హుషారుగా ఎ టి ఎం లోనుండి డబ్బు డ్రా చేసుకుని కారులో దీపావళి టపాసులు హోల్ సేల్గా అమ్మే షాపులకి వెళ్ళాడు.

ఆయన కొన్న టపాసులతో కారు వెనక భాగమంతా నిండిపోయింది. వాటి వంక తృప్తిగా చూసి కారెక్కి ముందుకురికించాడు. స్వీట్ షాపుల ముందు ఆగాడు. రక రకాల స్వీట్లు కొని డిక్కీలో సర్దించాడు. తర్వాత బట్టల షాపు ముందాగి టీ షర్టులు నిక్కర్లు... కొన్ని ప్యాంట్లూ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన సంబరం రెట్టింపైంది. కారు స్పీడు పెంచాడు.

***

దీపావళి.

అమావాస్యని పున్నమి చేసే ప్రత్యేక పండగ.

ప్రకృతి సంధ్యచీకట్లని చిక్క పరచుకుంటోంది.

ప్రమిదలతో ఎవరింటిని వాళ్ళు తేజోమయం చేసుకుంటున్నారు.

పొద్దుటినుండి హుషారుతో బాంబులు వెలిగించిన పిల్లలు... యువత... రాత్రికి భూచక్రాలు... చిచ్చుబుడ్లూ... వెలిగిస్తూ రెట్టింపు ఆనందాన్ని పొందుతున్నారు.

అప్పుడు కారులో బయటకి బయల్దేరాడు రామచంద్రమూర్తి.

చాలా దూరం సాగిన కారు ఒక పేదలుండే మురికివాడ ముందు ఆగింది.

కారులోంచి దిగిన రామచంద్రమూర్తి దూరంగా పెద్ద పెద్ద ఇళ్ళ ముందు వెలిగిస్తున్న బాణాసంచాని కళ్ళింతలు చేసుకుని చూస్తున్న అర్ధనగ్నపిల్లలు కనిపించారు.

అప్పుడే అక్కడకి వెళ్లబోతున్న పిల్లాడ్ని పిలిచి వాడిచెవిలో ఒక విషయం చెప్పాడాయన. అంతే వింటి నుండి వెలువడ్డ శరంలా దూసుకెళ్ళి దూరంగా వున్న వాళ్ళందర్నీ క్షణంలో
ఆయన దగ్గరకి తీసుకొచ్చాడు వాడు.

అందరికీ ముందు కొత్త బట్టలిచ్చి కట్టుకోమన్నాడు.

క్షణాల్లో అందరూ తయారైపోయారు.

అప్పటికే ఆ విషయం తెలిసి ఆ పిల్లలని చూస్తూ ఆనందంతో మైమరచిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు.

బాణాసంచా తీసిచ్చి చీకటి కనిపించేంత వ్యవధి ఇవ్వకుండా కాల్చమన్నాడు.

టపాసులు... భుచక్రాలు... చిచ్చుబుడ్లు... తాళ్ళు... కాకరపువ్వొత్తులు... వెలిగిస్తూ పిల్లలు సంతోషాతిరేకంతో కేరింతలు కొడుతున్నారు. వాళ్ళని చూసి పెద్దలు ఆనంద పరవశులవుతున్నారు.

‘తమ భవిష్యత్తు అందంగా తీర్చిదిద్ది ‘మురికివాడ’ అనే పదం విన్పించకుండా చేయమని’ కాగితం మీద రాసి దాన్ని తారాజువ్వకి కట్టి దేవుడికి అర్జీ పంపమన్నాడు.

వెలుగు... వెలుగు...
చీకటి మీద యుద్ధపు వెలుగు...
మనసుని సంతోషంతో నింపే వెలుగు...
నైరాశ్యాన్ని పారద్రోలి ముందుకు నడిపే వెలుగు...
చైతన్యానికి చిరునామాగా నిలిచే వెలుగు...

దాదాపు అర్ధరాత్రయింది.

అందరి ముఖాలు దేదిప్యమానంగా వెలిగిపోతున్నాయి.

స్వీట్లిచ్చి తినమన్నాడు.

ఒక్కొక్కరుగా వచ్చి ఆనందబాష్పాలతో ఆయన కాళ్ళకి దణ్ణం పెడుతున్నారు. ఆయన కరిగిపోయారు.

అవునుమరి ఆ దీపావళి వాళ్ళందరి జీవితాల్లో మరచిపోలేని మధురానుభూతి.

మనుషులకి ఇంత నీడనివ్వడమే కాదు... ఆకలికి అన్నం పెట్టడమే కాదు... దుస్తులివ్వడమే కాదు... ఇలాంటి సరదాలూ తీర్చాలి! వాళ్ళూ మనుషులే!

ఈ లోకంలో ఎవరూ ఒంటరి కాదు. మానసిక... శారీరక సంకెళ్ళు తొలగించుకుంటే అందరూ మనవాళ్ళే... ఆత్మీయులే!

ఈ దీపావళి మాత్రం వాళ్ళ జీవితాల్లోంచి నైరాశ్యాన్ని పారద్రోలింది.
 

మరిన్ని కథలు
surprize gift