Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
surprize gift

ఈ సంచికలో >> కథలు >> జ్ఞానోదయం

jnanodayam

ఎర్ర కలువల్లాంటి కళ్ళతో స్టాఫ్ రూం లోకి అడుగు పెట్టిన వినీలని చూసి కంగారుపడింది విభావరి. అప్పటికే క్లాసు మొదలవడంతో మిగిలిన లెక్చరర్స్ ఎవరూ లేరక్కడ. విభావరికి ఫ్రీ పీరియడ్ అవడం చేత తర్వాత క్లాస్ కి చదువుకుంటోంది. “ఏయ్ వినీలా! ఏంటది? వొంట్లో బాగా లేదా? ఏమైంది?” అని కంగారుగా అడిగేసరికి ఒక్కసారిగా ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. “ప్రిన్సిపాల్ తిట్టారు” అంటూ భోరుమంది. “హమ్మయ్య, అంతేనా! ఇంకేంటో అని గాబరా పడ్డాను.” అంటూ “ఊర్కో వినీలా! మామూలే కదా ఆవిడ తిట్టడం! ఇంకా అలవాటుపడకపోతే ఎలా? ఇంతకీ ఏం జరిగిందేంటి?” మంచినీళ్లు అందిస్తూ వీపు మీద అనునయంగా చేయి వేసింది విభావరి.

“నీకు తెల్సుగా విభా! మా పనిమనిషి సరిగ్గా రావడం లేదు. దానికితోడు ఇంట్లో చుట్టాలు! రెండురోజుల్నించీ లేటయిపోతున్నాను కాలేజ్ కి. నాకు తెల్సి ఎప్పుడూ ఇలా జరగలేదు. ప్రిన్సిపాల్ ఇవాళ వరండా లో నిలబెట్టి తిట్టేశారు. నాకు... నాకు బాధ్యత లేదట. ఎప్పుడూ రెండు లేట్ గా వస్తానట. నేను చెప్పేది అసలు విన్పించుకోలేదు తెల్సా?” ఎందుకు ఉద్యోగం? ఇంట్లో కూచో!” అని కసిరేశారు.”  వెక్కిళ్లు పెడుతూ “నువ్వే చెప్పు  నేను ఎప్పుడైనా లేట్ గా వచ్చానా అసలు? నా టైమ్ బాలేక రెండు రోజులు లేట్ గా వస్తే ఎప్పుడూ ఇంతే అనడం, ఏంటి? అంతకీ క్లర్క్ రాణి కి ఫోను చేసి చెప్పాను కూడా కాస్త లేట్ గా వస్తున్నానని... అయినా ఆవిడ...” ఏడుపు వల్ల మాట్లాడలేకపోయింది వినీల. “నీకు తెలియందేముంది వినీ! ప్రిన్సిపాల్ అన్నాక లక్ష టెన్షన్స్ ఉంటాయి. ఆవిడ ఎంతమందిని కంట్రోల్ లో పెట్టాలి? ఏదో ఒక విషయానికి ఎవర్నో ఒకర్ని తిడతారు మరి... తప్పదు” అంది ఓదార్పుగా విభావరి. “కానీ నన్నెప్పుడూ తిట్టలేదు విభా! మొన్నసాగర్ కాలేజ్ యూత్ ఫెస్టివల్ లో నా స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ బోలెడు ప్రైజులు సాధించారు గుర్తుందా? అప్పుడు వాళ్ళు అసెంబ్లీ లో వినీలా మేడమ్ గైడెన్స్, సపోర్ట్  వల్లే తమకి ప్రైజులు, కాలేజ్ కి గుర్తింపు వచ్చాయని చెప్తే ఆవిడ ఎంత పొంగిపోయారో? నన్ను అభినందించారు కూడా! అలాటిది నాల్రోజులకే బాధ్యతారాహిత్యంగా ఉన్నానని కడిగేయటమేంటి చెప్పు?” అని వెళ్లబోసుకుంది వినీల.

“అబ్బా వదిలెయ్ వినీ! పెద్దవాళ్ళన్నాక అలాగే ఉంటారు. తిట్టేటప్పుడు తిడతారు, అలాగే మెచ్చుకునేటప్పుడు  మెచ్చుకుంటారు. ఇంటి దగ్గర మన అమ్మో. అత్తగారో  తిడితే  సరిపెట్టుకోమా? ఇంట్లో అందర్నీ సాటిస్ ఫై చేయగల్గుతున్నామా? చేస్తున్నాం అనుకుంటాం గాని  మొగుడో, పిల్లలో మనల్ని విసుక్కోవడం లా? అలాగే, ఇక్కడానూ! ఇక్కడ తిట్లు పడేటప్పుడు ఇంట్లోవాళ్లే తిడుతున్నారు ఇంక బయటి వాళ్ళు ఎందుకు తిట్టరు? అనుకుంటా. అలాగే ఇంట్లో వాళ్ళు విసుక్కుంటే కాలేజ్ లో పై వాళ్ళు తిట్టగా లేంది ఇంట్లోవాళ్లు ఏమైనా అంటే తప్పేంటి? నా వాళ్ళే కదా అని సరిపెట్టుకుంటా! అలా అనుకోకపోతే చాలా కష్టం.” అని హితవు పలికింది ఫిలాసఫీ మేడమ్ విభావరి. ఆలోచన లో పడింది వినీల.

***
    
రెండు రోజులు గడిచాయి... పన్లోకి వచ్చిన రాజమ్మని చూడగానే కోపమొచ్చింది వినీలకి  దీనివల్లే కదా మాట పడ్డాను, జీతం చేతిలోపెట్టి మాన్పించేస్తాను. నెలలో పది రోజులు నాగా పెడ్తుంది. ఇంక నా వల్ల కాదు, అని నిర్ణయించేస్కుంది మనసులో. రాజమ్మ చాలా నీరసంగా కన్పించింది, దాంతో ఏమి అనకుండా ఊర్కుంది వినీల. రాజమ్మ పనంతా పూర్తి చేసి ఇల్లు అద్దం లా పెట్టేసింది చకచకా. దానికి కాఫీ ఇస్తూ “ఏమైపోయావ్ నాల్రోజుల్నించీ?” అని అడిగింది ముభావంగా. ఈ పని వాళ్ళేంటోగాని చక్కగా నాగాలు పెట్టేస్తారు. తరవాత పన్లోకి వచ్చాక కామ్ గా పని చేసుకుపోతారే తప్ప ఎందుకు మానేసిందీ తమకుగా చెప్పరు మనమే అడగాలి ఏమైందమ్మా అని. మనసు మండిపోసాగింది వినీలకి. “తాగనీకి డబ్బులీయలేదని మా ఆయన కొట్టేసాడమ్మా, ఒళ్ళంతా నొప్పులు, ఒకెటే జ్వరం, వొంటిమీద ఎరుక లేకుండా పడున్నా. పిల్లగాళ్లని మా అత్తొచ్చి తీసుకపోయింది. మీకు కబురెట్టలేకపోయినా! తప్పైపోనాదమ్మా. ఇంకెప్పుడూ చెప్పకుండా ఉండిపోను” అంది బతిమాలుతున్నట్టు. ఇంతక ముందు ఇలా రెండు మూడు సార్లు చెప్పకుండా ఉండిపోతే మాన్పించేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ అది అమ్మా, బాబూ అని ప్రాధేయపడితే జాలి పడింది. “ఎందుకే ఎప్పుడూ వాడు తాగుడు కోసం నిన్ను కొడుతూ ఉంటాడు? తాగడానికి డబ్బులిచ్చినా తాగొచ్చి కొడతాడు, ఇవ్వకపోతే ఇవ్వలేదని కొట్టి దాచుకున్న డబ్బు కాస్తా లాక్కుపోతాడు. అలాటివాడితో ఎంతకాలం కాపురం చేస్తావ్? వదిలెయ్ వెధవని.” అంది వినీల కోపంగా. 
   
రాజమ్మ అంత నీరసంలోనూ నవ్వేసింది “ఈడు కాక ఇంకోన్ని మనువాడితే ఆడు మాత్రం బాగా సూసుకుంటాడని గారంటీ ఏటి తల్లీ? ఈడు తాగినప్పుడే కొడతాడు గాని మామూలు టయంలో ఎంత బాగా సూసుకుంటాడో తెలుసామ్మా? నాకు జిలేబి ఇష్టమని రోజూ పని కాన్నించి వచ్చేటప్పుడు అట్టుకొత్తాడు. పిల్లల్ని కూడా ముద్దుగాసూసుకుంటాడు. నెలకో సిన్మాకి తీసికెళ్తాడు. “రాజూ, నువ్వు నా బంగారానివే” అని ముద్దు చేత్తాడు’’ అంది సిగ్గు పడుతూ, “అందుకే ఆడు నన్ను కొడుతున్నపుడు ఇయన్నీ యాదుకి తెచ్చుకుంటా. ఆడికి నామీద ఉన్న పేమని తలచుకుంటే నాకు బాద అంపీయదు. పెట్టినా కొట్టినా నా పెనిమిటే కదా! నన్ను కాక బైటిదాన్ని కొడతాడేటీ ? అలానే మీరు కొన్నిసార్లు కోపంగా “పని మానేయ్!” అని కసిరినా నాకు మానాలంపించదు. ఎందుకంటే నాకు కస్టమొచ్చినప్పుడు మంచి మనసుతో ఆదుకునేది తమరే కదా! రానప్పుడు తిట్టినా పని బాగా సేసినప్పుడు “రాజీ నీలాటి మనిసి నాకు దొరకదే!” అని మీరు ఎంత బాగా మెచ్చుకుంటారమ్మా? అందరమ్మగార్లూ మీలా ఉంటే ఎంత బాగున్ను అనుకుంటా. వత్తానమ్మా ఆలీసమైపోనాది” అంటూ కాఫీకప్పు కడిగి బోర్లించి వెళ్లిపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వినీల.

***                              

వినీల కాలేజ్ లోకి అడుగు పెట్టిందో లేదో ప్రిన్సిపాల్ నించి పిలుపు. ఈసారి ఏం మాటలు పడాలో ఏంటో అని అదిరే గుండెలతో ప్రిన్సిపాల్ రూం లోకి అడుగు పెట్టి విష్ చేసింది. లోపల నోబెల్ కాలేజ్ స్టాటిస్టిక్స్ లెక్చరర్స్ కూచుని ఉన్నారు. వినీల ని చూసి అభివాదం చేశారు. ప్రిన్సిపాల్ ఆమెని కూచోమని “డా. వినీలా! వీరు మీకు తెలుసు కదా! నోబెల్ కాలేజ్ నించివచ్చారు. స్టాటిస్టిక్స్ సెమినార్ కండక్ట్ చేస్తున్నారట. లాస్ట్ ఇయర్ మీరు మన కాలేజ్ లో చక్కగా కండక్ట్ చేశారని మిమ్మల్ని సంప్రదించి సలహాలు తీస్కోవడమే కాకుండా మిమ్మల్ని రిసోర్స్ పర్సన్ గా కూడా ఆహ్వానించాలని వచ్చారు”. అంటూ వాళ్ళ వైపు తిరిగి

“నేను చెప్పాను కదా డా.వినీల వెరీ బ్రిలియంట్ అండ్ మోస్ట్ కమిటెడ్ లెక్చరర్. మా స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ లో సెంట్ పర్సెంట్ తెచ్చుకోగల్గుతున్నారంటే ఆ క్రెడిట్ అంతా ఈమెకే  చెందుతుంది. స్టూడెంట్స్ ని అన్ని రంగాల్లో ముందుండేలా ప్రోత్సహిస్తూ మా కాలేజ్ కి మంచి పేరు తెస్తున్నారు. అంతే కాదు ఈమె మంచి రచయిత్రి కూడా!”  ప్రిన్సిపాల్ ఎంతో గొప్పగా తనని పరిచయం చేసేసరికి వినీల చకితురాలైంది. ఇన్విటేషన్ తీసుకొని వాళ్ళకి నమస్కరించి ప్రిన్సిపాల్ కి ధన్యవాదాలు చెప్పి క్లాసు కి వెళ్లిపోయింది. 

సాయంత్రం ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ జరిగిన సంఘటనలన్నిటిని గుర్తు చేసుకోసాగింది వినీల. ప్రిన్సిపాల్ కి తన మీద ఇంత మంచి అభిప్రాయం ఉందని ఇవాళే తెల్సుకుంది తను. విద్యావంతురాలైన విభావరి, అక్షరజ్ఞానం లేని రాజమ్మ ఆమె కళ్ల ముందు మెదిలారు.  ప్రేమలు, ద్వేషాలు, కోపాలు, ఇష్టాయిష్టాలు ఏవీ శాశ్వతం కావు అని అర్ధమైందామెకి. ఇవాళ తిట్టిన వాళ్ళు రేపు పొగుడుతారు. ఇవాళ పొగిడారంటే త్వరలోనే తిడతారన్నమాటే ! అందుకే ఎవరైనా  పొగుడుతుంటే  వీళ్ళు నన్ను భవిష్యత్ లో తిట్టవచ్చు జాగ్రత్త పొంగిపోకు! అనుకోవాలి. అలాగే తిడుతున్నప్పుడు ఇదివరకు వాళ్ళు తనని మెచ్చుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకోవడం గాని లేదా తొందర్లో వీళ్ళే నన్ను పొగడచ్చు కృంగిపోకు అని మనసుకి నచ్చచెప్పుకోవాలి అని గ్రహించింది వినీల. దూషణ భూషణ తిరస్కారాదులు శరీరానికే గాని మనసుకి కాదు అని తెలుసుకున్ననాడు మనశ్శాంతి కి లోటే ఉండదు. కానీ చేసే పనిని పొగడ్తల మోజుతోనో, తెగడ్తల భయంతోనో కాకుండా పూర్తి అంకితభావంతో చేయాలి! ఇలా ఆలోచించే సరికి వినీల మనసు ఎంతో తేలికైంది.                  
 

మరిన్ని కథలు