Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nairaashyaanni paaradrolina deepaavali

ఈ సంచికలో >> కథలు >> సర్ ప్రైజు గిప్టు

surprize gift

"రామ! రామ! ఏంటండి ఆపాడు మాటలు!" చెవి మూసుకుంది వసంత.

"నేను అన్నమాటలు కాదు వసంతా! లోకం అంటున్నది అలా - ఇంక జీవితాంతం మనకు ఎడబాటు తప్పదని." బాధపడ్తూ చెప్పాడు శేఖర్.

"అయ్యో! ఈ రాజకీయాలను సీరియస్సుగా తీసుకోవద్దు. రాజకీయాలెప్పుడూ ప్రజల ఆకాంక్షలను తెలియజెయ్యవు - నాయకుల ఆశలను తెలియచేస్తాయి." చెప్పింది వసంత.

"అస్సలు మనం చాలా పొరపాటు చేశాం! వేరు వేరు డిపార్టుమెంటుల్లో పనిచేస్తున్న మనం, పెళ్ళిచేసుకోకుండా ఉంటే బాగుండేది!" అతని నోరుమూసింది.

శేఖర్, వసంత ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే! కాని ఆఫీసులు వేరు. శేఖర్ కడపలో పనిచేస్తాడు. అతని డిపార్టుమెంటు చిన్నది. ప్రమోషన్లు ట్రాన్సఫర్లు చాలా తక్కువగా జరుగుతూంటాయి. వసంత డిపార్టుమెంటు అతనితో పోలిస్తే కొంచెం మెరుగైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నది. మంచి టైట్ సీటు ఆమెది. సాధారణంగా హెడ్డాఫీసులో పనిచేసేవాళ్ళెవరూ ఆసీటు వదులుకుని మఫజలు ఆఫీసుకు రావడానికి ఇచ్చగించరు, చాలా సౌకర్యాలు నష్టపోవలసి వస్తుందని.

పెళ్ళి చూపులు వారికి ఇంకా గుర్తున్నాయి.

"చూడండి మేడం! మీది హైద్రాబాద్ - నాది కడప. ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే! నాకు ట్రాన్సఫరు రావడం చాలాకష్టం - మా డిపార్టుమెంటుకు ఎక్సుపాన్షన్ తక్కువ! మరి మనం పెళ్ళిచేసుకుంటే మీరు బదిలీ మీద కడపకు వస్తారా?" అడిగాడు శేఖర్. అప్పటికి అతను దిగ్విజయంగా నూరుమంది అమ్మాయిల్ని చూసి ఉన్నాడు.

ముదిరిపోయిన బెండకాయలాగా - ముదిరిపోయిన బ్రహ్మచారి! వసంత రూపురేఖలు చూడంగానే బోల్తాపడిపోయాడు. ఆకర్షణతోనో - కొండకచో ప్రేమతోనో - అతనికి తెలియదు. సాధారణంగా మంచి ఉద్యోగాలకు మూడు నాలుగు రకాల ఇంటర్వ్యూలు - టెస్టులు గట్రా ఉంటాయిగా. అందుకే అతను ఆమెను దశలవారీగా దర్శించుకున్నాడు. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి తను ఒంటరిగా వచ్చి ఆమెను చూశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో వచ్చాడు. ఆపైన స్నేహితులతో వచ్చాడు. ఇంకోసారి దగ్గర చుట్టాలను తీసుకుని చుట్టపుచూపుగా వచ్చాడు.

ఇప్పుడు హైద్రాబాదులో ఆఫీసుపని పడితే - ఊరుకో లేక ఆమె ఆఫీసుకు వచ్చాడు. ఆమెను క్యాంటినుకు తీసుకువచ్చాడు. అదీ సంగతి - మనసులో మాట బయటపెట్టాడు.

"శేఖర్ గారు! పెళ్ళి కావాలేగాని - దేవుడు మార్గం చూపించకపోడు. నారు పోసిన వాడు నీరు పోయడా అని - ముడి వేసినవాడు కలపకుండా ఉంటాడా? ఆంధ్రప్రదేశ్ శరవేగంతో అభివృద్ధి చెందుతున్నది. టెక్నాలజీలో విప్లవం సాధిస్తున్నారు. రానున్న సంవత్సరాల్లో గ్రేటర్ హైద్రాబాద్ ఎలా ఉంటుందో - సర్కారు, రాయలసీమ, తెలంగాణాలు ఎలా ఉంటాయో ఆలోచించలేము. బదిలీలకు భయపడి పెళ్ళిమానుకుంటామా? అయినా మీకు జాబు యిష్టం లేదంటే మీరు పోషిస్తానంటే జాబ్ రిజైన్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు". త్యాగశీలిగా చెప్పింది వసంత కాఫీ కొంత చప్పరిస్తూ, రవ్వంత నవ్వుతూ ఓరకంట చూస్తూ.

బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు శేఖర్ 'అంత పనిచేయకు తల్లీ! నీ ఉద్యోగం చూసే కదా నిన్ను పెళ్ళి చేసుకుంటున్నది' అని మనసులో అనుకోని మొహం మీద చిరునవ్వులు చిందించాడు. "అయ్యయ్యో వసంతగారు! నాకోసం మీ జీవితాశయాలను వదులుకోవద్దు. ఇంత గొప్ప చదువు చదివారు. ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నారు. మహిళాలోకానికి ఆదర్శంగా నిలిచారు - హెడ్డాఫీసులో ఇంత మంచి ఉద్యోగం అందరికీ దొరికేది కాదు - వెధవది - మీకోసం నా బోడి జాబు రిజైన్ చెయ్యమంటే చేస్తాను". త్యాగారాజులా చెప్పాడు మెలికలు తిరిగిపోతూ.

వసంత కంగారుపడిపోయింది. ఆమెకు అంతకుముందు చాలా చాలా సంబంధాలు వచ్చాయి. కాని గోత్రాలు - జాతకాలు కుదరలేదు కొన్నిటికి అన్ని కుదిరితే వాళ్ళ ఉద్యోగాలు మరీ నాసిరకంవి. ఉద్యోగం కూడా బాగుందనుకుంటే వాళ్ళ శుద్ధమొద్దు స్వరూపాల్లాగా ఉండేవాళ్ళు. కాగా చదువు - సంధ్యలు తనకంటే తక్కువవి. ఇతనికి చదువు - అందం - ఓ మాదిరి ఉద్యోగం ఉంది. అతని చదువుకు మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పటికే తనీడు స్నేహితురాళ్ళు పిల్లాపాపలను కని కు.ని చేసేసుకుని పిల్లలతో స్కూళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. తన వాళ్లకు సంబంధాలు చూసే ఓపిక కూడా లేదు. ఏదో గంతకు తగ్గబొంత అన్న వేదాంతంతో చాలా చచ్చువి పుచ్చువి చూస్తారు. వాళ్ళకు బొత్తిగా టేస్టులేదు అన్నిటికీ సరిపెట్టుకునే రకం.

"అయ్యో శేఖర్ గారు! ఉద్యోగం పురుషలక్షణం! మీరు నాకోసం అటువంటి సాహసం చెయ్యవద్దు. ఉద్యోగి అన్న తర్వాత ట్రాన్సఫర్లు రాకుండా ఉంటాయా?" ఈ కాలంలో 'ఉత్తరం - దక్షిణం' కు లొంగని వాళ్ళు ఎవరుంటారు? మనసుండాలే గాని మార్గాలుండవా? మనిషి ఆశా జీవి! ఈ కాలంలో పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి అమెరికాకు పోయి ఏళ్లతరబడి పాతుకుపోయి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళున్నారు. అటువంటిది ఆఫ్టరాల్ మనిద్దరి మధ్య దూరం పదిగంటలు! అంతే! ఎవరు చూడొచ్చారు, హైద్రాబాద్ కు - కడపకు ఏ రాజకీయ నాయకుడన్నా విమానం ఆగమేఘాల మీద వేయిస్తాడేమో! అరగంటలో కలుసుకోవచ్చు. ఇప్పుడైనా - రాత్రి పదికి హైద్రాబాద్ లో బస్సు ఎక్కితే ఉదయం కల్లా కడపలో ఉంటాను. ఇంక రైళ్ళు కూడా ఉన్నాయిగా మనం కల్సుకోవడానికి! కొందరు ఉద్యోగస్తులు కల్సుకోవాలంటే అన్ని రకాల వాహనాలు ఉపయోగించి ఇరవై నాలుగ్గంటలు ప్రయాణం చెయ్యాల్సివస్తుంది కూడ? అటువంటి వాళ్ళే పెళ్ళి చేసుకోంగా లేంది - ఓ నాలుగొందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం ఎందుకు చేసుకోకూడదు." సిగ్గుపడుతూ చెప్పింది వసంత తన మనసులోని మాట.

ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు శేఖర్. వసంత లాజిక్కులు, మాటల మ్యాజిక్కుకు, ఓపెన్ మైండుకు. మొదటి చూపులోనే, పాయసంలో పడ్డ ఈగలా, ఆమె ఆకర్షణలో పడి - బయటపడలేక గింజుకున్నాడు. బుద్ధి బురదలోకి లాగుతూంటే - అదృష్టం అందలం ఎక్కిస్తుందని సామెత! తనక్కావలసిన అమ్మాయి ఈమె కాదని బందువర్గాలు ఘోషిస్తున్నా - వచ్చిన అవకాశం వదులుకోవద్దని అతనిలోని ఆశ మొగతనం చెబుతున్నాయి.

"కరెక్టు! ప్రభుత్వ ఉద్యోగికి సెలవులంటూ ఉంటాయి కదండి - మీకు తెలియంది ఏముంది - క్యాజువల్ లీవు, ఎరన్డు లీవు, సిక్కు లీవు, క్వారంటైను లీవు, ఈఓయల్, ఆపైన ఫ్రెంచ్ లీవు!" చెప్పాడు శేఖర్ మోహంలో నవ్వు పులుముకుని.

"ఫ్రెంచ్ లీవా? మా కయితే అది తెలీదు -" చెప్పింది వసంత.

"అరే! అది చాలా కామన్ కదండి ఉద్యోగుల్లో - మీకు తెలీదా? ఎట్లాగయినా లేడీసు కొన్ని విషయాల్లో వెనకాలే ఉంటారు." శేఖర్ చెప్పాడు.

"చెప్పచ్చుగా - ఎగతాళి చెయ్యకపోతే - సంవత్సరంలో ఎన్ని రోజులు వాడుకోవచ్చు?" చిరుకోపంతో అడిగింది - వసంత.

"మనిష్ఠమండి అడ్జస్టుమెంటు - పైవాడి బట్టి ఉంటుంది. రౌతు మెత్తని వాడయితే గుర్రం ఒంటికాలిమీద నడుస్తుంది. ఇది అంతే! ఎవరూ చూడకపోతే వారానికి రెండు రోజులు కూడ లాగించవచ్చు!" కన్ను గీటుతూ చెప్పాడు.

"అబ్బా! అంత లీవు ఎవరిస్తారబ్బా! ఆ ఫెసిలిటీ ఉందని నాకు తెలీదు సుమా!" చాలా బాధపడుతూ చెప్పింది తన అజ్ఞానానికి.

"వాడిచ్చేదేంటండి - వాడి మొహం - మనం పుచ్చుకుంటాం - అంతే!"

"ఈజిట్! దానికి శాంక్షన్ చేయాల్సిన పనిలేదా?"

"ఎందుకు చెయ్యడం - ఎవరూ చూడకుండా అటెండెన్సు రిజిస్టరులో సంతకాలు పెడతాంగా ఆఫీసుకు పోగానే!" చెప్పాడు శేఖర్.

"అంటే - మీరనేది ఫ్రీడం - ఫ్రీలీవు ఫ్రెంచ్ లీవు. మనకి - ఫ్రాన్సుకు సంబంధాలేంటిట? ఇటలీకి, మనకు ఇటీవల బాంధవ్యం అయితే కుదిరింది కాని" - వసంత అర్ధం గాక అడిగింది.

"పని ఎగ్గొడతాం! అంతే! బుద్ధి పుడితే పోతాం లేకపోతే లేదు - ఆఫీసరు లీవులో ఉన్నాడనుకోండి - మాకు పండుగే! మమ్మల్ని గమనించేవాళ్ళు ఎవరుంటారు! శుభ్రంగా ఇంట్లోకూర్చుని మా పర్సనల్ పన్లు చేసుకుని ఆఫీసుకు పోయినప్పుడు రాని రోజులు సంతకాలు గీకేస్తాం! మాలో మాకు అండర్ స్టాండింగ్?" విడమరిచి చెప్పాడు.

"అరే! ఎవరూ పట్టుకోరా!" ఆశ్చర్యంగా అడిగింది కప్పు గట్టిగా పట్టుకుని.

"మా జాగ్రత్తలో మేం ఉంటాం - ఎంప్లాయిసు మధ్యలో కో ఆపరేషన్ ఉంటే సంవత్సరం మొత్తం మీద ఈ లీవులే ఎక్కువుంటాయి ప్రభుత్వ ఉద్యోగికి. కొందరు వెధవలు వాళ్ళు సుఖపడరు - మనల్ని సుఖపడనివ్వరు. అందుకే మేం రూలులా అమలు చేసుకుంటూ ఉంటాం - కనీసం నెలకు రెండన్నా ఫ్రెంచ్ లీవులు యివ్వాలని!" శేఖర్ చెప్పాడు తన ఆఫీసులోని లొసగుల గురించి.

వసంతకు వింతగా ఉంది. టైము చూసుకుంది. అరగంట దాటింది.

"అయ్యో! నా సీటులో పెండింగు బోలెడు పడిపోతుంది వర్కు! నేనింక వస్తానండి - మా బాసుకూడా ఏడుస్తాడు నేను ఎక్కువ సేపు సీటులో లేకపోతే!"

"వాడ్ని ఏ గంగలో అన్నా దూకమనండి. లేకపోతే ఉరేసుకుని చావమనండి! మనం ఇలా కల్సుకునే అవకాశం మళ్ళీ వస్తుందా వసంతగారు?" ఆవేశపడ్డాడు.

"ఎందుకు రాదు - మీరు ఊ అంటే మనం ఒకటవుతాంగా!" సిగ్గుల మొగ్గ అయి చెప్పింది వృద్ధకన్య వసంత లోకం అంతాతమనే చూస్తున్నారని బిడియపడ్తూ.

"అయితే పచ్చజెండా ఊపెయ్యమంటారా? ధైర్యే సాహసే జ్యోతిలక్ష్మి - సారీ, లక్ష్మి అంటూ ఉంటారు!" శేఖర్ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అడిగాడు.

"మీరిప్పటికే బోల్డు టైం వేస్టుచేశారు. మీరు నన్ను మొదటి సారి చూసి ఇప్పటికి ఆర్నెల్లు దాటిపోయింది. అప్పుడు మా సెక్షనులో ఒకమ్మాయికి పెళ్ళి చూపులయ్యాయి. ఇప్పుడు ఆమె లీవులో ఉంది కూడా!" చెప్పింది వసంత.

"ఏం పాపం? ఆరోగ్యం బాగోలేదా?" అమాయకంగా అడిగాడు.

"అయ్యో రామా! డెలివరీ పీరియడు అండి! సిక్ లీవు కమ్ మెటర్నిటీ లీవులో ఉంది - వాళ్ళ భర్త ఆమెను అపురూపంగా చూసుకుంటాడు. పుట్టబోయే బాబుకు ఏ మాత్రం ఇబ్బంది కలుగ కూడదని ముందస్తుగా సెలవు పెట్టించేశాడు" వసంత చెప్పింది బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతూ ఉంటే.

"అవును కదూ - అవునండోయ్ మనకు మెటర్నిటీ లీవు కూడ ఉందిగా? ఎన్నిసార్లు - నాలుగు సార్లా?" అనుమానంగా అడిగాడు శేఖర్.

కిలకిల నవ్వింది వసంత. అప్పటికి ఇంకో కాఫీ కూడా ఆర్డరిచ్చాడు శేఖరు, అది తాగుతూ కొరపోయి కొంచెం చీరమీద ఒలికింది కూడా.

"మనకు కాదండి - అది కేవలం ఆడవాళ్ళకే - అంటే నాకు" సరిచేసింది.

"ఓ! వెధవది - ఆడజన్మ ఎత్తి ఉంటే బాగుండేది - రెండుసార్లు డెలివరీ అని - రెండు సార్లు అబార్షన్లు అని లీవులు వాడుకునే వాడిని - అయినా ఫారిన్ కంట్రీస్ లో మొగాళ్ళకు
కూడా ఈ మెటర్నిటీ లీవు యిస్తారండి!" చెప్పాడు గుర్తుచేసుకుంటూ.

"యూ మీన్ పెటర్నిటీ లీవు?" వసంత సరిచేసింది.

"ఆ! అదేదో ముష్టిలీవు - ఇండియాలోకి కూడా వస్తే - ఎంచగ్గా పిల్లల్ని కంటూ - ఆ లీవులో కాలం గడిపెయ్యచ్చు." కలలు కన్నాడు శేఖర్.

"శేఖర్ మహానుభావా! మీరు అలానే కలలు కంటూ ఉండండి. నాకు టైమవుతుంది. మా బాసు చెండశాసనుడు! పైగా శాడిస్టు! ఎవరన్నా నవ్వితే తట్టుకోలేదు - ఈ పాటికి నాపైన గూఢచారులను నియమించి ఉంటాడు" వసంత అయిష్టంగా లేచింది వ్యానిటీ బ్యాగ్ తీసుకుని.

"వసంత గారు! మీరు దూరమవుతారంటే నాగుండె గుబగుబలాడుతున్నది - ప్లీజ్! ఇంకో గంట ఉండకూడదు?" ఆర్ధించాడు శేఖరు ఆర్ధ్రంగా.

"నాకభ్యంతరం లేదు - ముందు మీ వాళ్ళతో చెప్పి - ఆ మూడు ముళ్ళ ఏర్పాట్లు చూడండి! అప్పుడు మనం గంటేం ఖర్మ రోజుల తరబడి మొహాలు చూసుకుంటూ కూర్చోవచ్చు." వసంత బై బై చెప్పి వెళ్ళిపోయింది చకచక.

అంతే! తన అనుమానాలు ప్రక్కన పెట్టి పెళ్ళికి అంగీకారం తెలిపాడు శేఖర్! భళ్ళున పెళ్ళయింది కాని... సెలవులదే సమస్య అయిపొయింది.

వెధవది! సరిగా కాపురం చేశారో లేదో హైద్రాబాద్ నుండి వసంత వాళ్ళ బాసు ఫోన్ 'అర్జంటుగా వచ్చెయ్య'మని.

తోకెంబడ నారాయణ లాగా వసంత వెంబడ హైద్రాబాదు పోయినా ఒక్కోప్పుడు ఆమెకు క్యాంపులు పడేవి! ఇతర ఇబ్బందులు వచ్చేవి. తన దిపార్టుమెంటులో వర్కు ఎక్కువైపోయి - బాసిజం వచ్చేసి శేఖర్ కూడా ఎక్కువ లీవులు పెట్టడానికి లేకుండా పోతున్నది.

ఆమె వస్తుందని కడపలో ఓ మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

ఇతగాడు వస్తాడని ఆమె హైద్రాబాద్ లో మంచి ప్లాటు తీసుకుంది. ఏ ఆదివారం ఎవరు వస్తారో అర్ధంకాని పరిస్థితి! ఏ  పండుగ ఏ ఊళ్ళో చేసుకోవాలో తెలియని పరిస్థితి.

వసంత కడుపు పండితే ఓ సంవత్సరం లీవు పారేసి ఇంట్లో ఉండచ్చనుకుంటే ఈ ప్రయాణాల్లో ఆ గర్భం నిలిచే అవకాశం ఏది! ఎప్పుడూ అప్ అండ్ డౌను చేస్తూ ఉంటే అలసిపోయిన శరీరాలు గాఢనిద్రను కోరుకుంటున్నాయి.

అప్పటికీ ఓ సారి వసంతతో అబార్షన్ అయిందని లీవు పెట్టించాడు శేఖర్! వాళ్ళ బాసు పీనుగకు అనుమానం వచ్చి అదేపనిగా గూడచారుల ద్వారా ఎంక్వయిరీ చేయించి ఆమె లీవు కాన్సిల్ చేయించి ఓ గట్టి వార్నింగు యిచ్చాడు. దాంతో అటువంటి లీవులు పెట్టాలంటే భయం పట్టుకుంది. సిక్కు లీవు పెట్టలేదు. ఎరన్డు లీవు శాంక్షను కాదు. శేఖర్ చాలా మటుకు తన లీవులు వాడుకున్నాడు కాని... ఆఫీసులో అతనికి కూడా చాలా యిబ్బంది అయిపోయింది. సిబ్బంది తగ్గారు - పని పెరిగిపోయింది. ఇబ్బడిముబ్బడిగా ప్రపంచీకరణ - వరల్డు బ్యాంకు బాధితులు వీరు.

అతనికి 'కొంగు చాటు మొగుడు' అని ముద్ర పడిపోయింది.

రాజకీయాలు - పార్టీలు మారిపోతున్నాయి. కాలం గడిచిపోతున్నది.

నాగరికత ప్రబలిపోతున్నది. హైటెక్కు యుగం వచ్చేసింది.

ట్రాన్సఫరు ప్రయత్నాలు మటుకు ఫలించడం లేదు అన్నీ ఆటంకాలే!

దాంతో ప్రస్తుతానికి ఆ ఊసు ఎత్తుకోకుండా జీవితాన్ని లాగిస్తున్నాడు.

కాని మధ్యలో ఈ తెలంగాణ సమస్య ఒకటి వచ్చి ఏకు మేకైంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరు ఎక్కడికి పోవాలో అర్ధం కావడం లేదు.

అసలే ఆలస్యపు పెళ్ళి - దానిలో మళ్ళీ నత్తనడక కాపురం!

ఈ ప్రయాణాలు మూలంగా ఆరోగ్యం దెబ్బతింటున్నది.

పర్సు కాస్త కర్సు అవుతున్నది - భారీగా ఏనాడు ఆర్టీసికి రుణపడ్డాడో! "డార్లింగు వీ.ఆర్.యస్ తీసుకుంటావా?" వసంత అడిగింది ఒకసారి.

"చూడు ప్రియా! వీడెవడో పనికి మాలినవాడు కాబట్టి మనకు ఉద్యోగం యిచ్చాడు. వీ.ఆర్.యస్ తీసుకుంటే నెత్తిమీద రూపాయి పెట్టినా పది పైసలకు చెల్లం?"

శేఖర్ కు అప్పుడప్పుడు నిజాలు మాట్లాడ్డం అలవాటు మరి.

"ఉద్యోగంలో ఉన్నప్పుడే దోచుకోవాలి! సారి దాచుకోవాలి. ఎలాగూ పదేళ్ళు అయిపొయింది - అలవాటైపోయింది - ఇంకొన్నాళ్ళు కళ్ళు మూసుకుంటే అదేవుడికే కనికరం
కలుగుతుంది." చెప్పాడు అభ్యంతరం చెబుతూ శేఖర్.

వసంతకు వీ.ఆర్.యస్ తీసుకోవడం అస్సలు యిష్టం ఉండదు. ఆమె కాస్తో కూస్తో తనవాళ్ళకి అడపాతడపా పంపాల్సి వస్తూ ఉంటుంది.

ఒక ఆదివారం ఇద్దరూ కల్సుకున్నారు హైద్రాబాద్ లో!

"వసూ! ఈ పదమూడవ వివాహ మహోత్సవాన్ని చాలా గ్రాండుగా చేసుకుందాం"! చెప్పాడు ఆమె ఒడిలో పడుకుని.

"గ్రాండుగా అంటే పది మందిలోనా - మన మధ్య వాళ్ళెందుకు? మనకు ఏకాంతం దొరకడం కష్టంగా ఉందికదా?" ఆశ్చర్యంగా అంది వసంత.

"ఆహా! గ్రాండు అంటే అది అని కాదు - నీకు మంచి గిఫ్టు కొనివ్వాలి!"

"అబ్బా! ఏంటి అంత మంచి గిఫ్టు!" అడిగింది వసంత.

"చెప్పకూడదు - ఇస్తే దాని మజా వేరేగా ఉంటుంది" ఊరించాడు శేఖర్.

"ఐసీ! నేను కూడా మంచి గిఫ్టు తెస్తాను." వసంత చెప్పింది.

"ఏంటది? ప్యాంట్లూ చొక్కాలు అయితే చచ్చేటన్ని ఉన్నాయి."

"ముందుగా చెప్పను. తెచ్చి చూపిస్తాను" సస్పెన్సులో పెట్టింది వసంత.

"అయినా ఇంకా నెలరోజులు టైముందిగా! ఈ సారి మన పెళ్ళిరోజు గురువారం పడింది - సెలవు లేదు - పెట్టుకోవాలి!" చెప్పాడు.

"మా బాసుగాడు ఏమంటాడో?" వసంత బిక్కుమోహంతో చెప్పింది.

"ఎవడువాడు! వాడికి పెళ్ళాం బిడ్డలున్నారా అస్సలు! ఈ సారి వాడు నీ దగ్గర తిక్క తిక్క వేషాలేస్తే లేపేస్తానని చెప్పు. ఏ  మనుకుంటున్నాడో వాడు - కడప కుర్రాడ్ని! నాలుగు బాంబులేసి పైకి పంపిచేస్తాను." ఆవేశపడ్డాడు తన తాతలని తలచుకుని.

"అర్భకుడు - వాడిమీద ఎందుకులే బాంబులు -"

"మరి రౌడీలతో కొట్టించనా? వాడి బ్రతుక్కి రౌడీలెందుకు! నేనే వచ్చి నాలుగు వాయించగలను." మీసాలు మెలేశాడు.

"అంతటి సమర్ధుడివే కాని - ఆతర్వాత మనం ఉద్యోగాలు చేసుకోవాలిగా - మన మీద కేసులు - డిసిప్లినరీ యాక్షను తీసుకుంటే కష్టం!" భయపడింది.

"అన్ని గుండెలా! బాంబుతో వాడి బాబు దగ్గరికి పంపుతాను. గురి చూసి విసరానంటే ఆ దేవుడు అడ్డువచ్చినా వాడ్ని ఎవరూ కాపాడలేరు."

"సరే డియర్! ఇంకా టైముందిగా - నాకు లీవు దొరక్కపోతే మీరు పెట్టివద్దురు కాని - లేదా - నాకు దొరికితే ముందు నేనే వస్తాను" వసంత అభయమిచ్చింది.

శేఖర్ కాస్త తగ్గి ఆమెను తీసుకుని ట్యాంకు బండు మీద షికారుకు బయలుదేరాడు. ఐమాక్సులో సినిమా చూశారు - అదొక గొప్ప అనుభూతి!

రోజులు యిట్టే గడిచిపోయాయి...

శేఖర్ మంగళవారమే బస్సు ఎక్కాడు హైద్రాబాదుకు గురువారం పెళ్ళి రోజు మరి - పదమూడు సంవత్సరాల పెళ్ళి గురుతుమరి!

ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఫోను గట్రా చెయ్యకుండా బయలుదేరాడు... వేసవి కాలం సెలవుల సీజను కాబట్టి బస్సులు కిటకిట లాడుతున్నాయి - పిల్లాపాపలతో పుణ్యక్షేత్రాలకు పోయేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు.

హైటెక్కులో చివరి సీటు సంపాదించి హైద్రాబాదుకు బయలుదేరాడు. రాత్రి పన్నెండు కావస్తున్నది... బస్సు కర్నూలు బస్టాండులో ఆగింది.

అంటే హైద్రాబాదుకు సగం ప్రయాణం ముగిసినట్లే! కడప - హైద్రాబాద్ మధ్యలో కర్నూలు ఉంది. అటు అయిదు గంటలు - ఇటు అయిదు గంటలు కర్నూలు నుండి ఎటు
పోయినా, కర్నూలు నుండి రెండు వందల కిలోమీటర్లు - అంతే!

పెద్ద బస్టాండు - ఎన్నో వందల బస్సులు ఆగుతాయి. గెట్ వే ఆఫ్ రాయలసీమ - కర్నూలు! హైద్రాబాదు నుండి అనంతపురం పోవాలన్నా - కడప పోవాలన్నా చిత్తూరు పోవాలన్నా - బెంగుళూరు వైపు పోవాలన్నా ప్రతి బస్సు కర్నూలు నుంచి పోతుంది.

ఎండాకాలం - హడావిడిలో నీళ్ళు మర్చిపోయాడు... దాహం వేసింది - బస్సు ఎలాగూ పది - పదిహేను నిమిషాలు ఆగుతుంది.

అందుకని కూల్ డ్రింకు తాగి వద్దామని బయలుదేరాడు - నిద్ర మబ్బులో. కూల్ డ్రింకు షాపు రద్దీగా ఉంది... ఆడ, మొగ ఎగబడి తాగుతున్నారు శీతల పానీయాలు.

ఆర్డరిచ్చాడు - అటు వైపు ఒక స్త్రీ అతన్ని ఆకర్షించింది - వెనక నుంచి కనిపిస్తున్నది... అచ్చం ఆమె కట్టిన చీర వసంతకు కొన్న లాంటిదే - ఆమె వంపు సొంపులు కూడా బాగున్నాయి.

కూల్ డ్రింక్ తాగుతూ ప్రక్క మ్యాగజైన్లుంటే చూస్తున్నాడు.

ఇంతలో ఆడవాళ్ళ గొంతులు - అరుపులు వినిపించాయి.

"నేను వంద ఇచ్చాను - నువ్వు చిల్లర యివ్వలేదు" గట్టిగా అంటున్నది ఒక స్త్రీ. అచ్చం వసంత లాగే మాట్లాడుతున్నది.

"లేదమ్మా! మీరేమీ యివ్వలేదు - తాగిందానికి డబ్బులివ్వండి!" షాపతను అంటున్నాడు - వినయంగా.

"ఏం నీకంటికి నేను ఎలా కనిపిస్తున్నానేంటి! డబ్బులు ఎగ్గొట్టే దానిలా కనిపిస్తున్నానా? నేను బాధ్యతాయుత ఆఫీసర్ని, యూనో!" ఆమె అంటున్నది.

"చాలామందిని చూశాం? ఆఫీసర్లయితే మరీ కక్కుర్తి పడతారు" అతను అంటున్నాడు కొంచెం నిర్లక్ష్యంగా.

"హాల్డు యువర్ టంగ్! పోలీసు కంప్లెయింటు యిస్తా జాగ్రత్త!" ఆమె ఆవేశంగా అరుస్తున్నది. వసంతకు కూడా చాలా ఆవేశం వస్తుంది అప్పుడప్పుడు.

కొంత నిద్ర మబ్బు పోయింది శేఖరానికి - సీసా తెచ్చి అతనికిచ్చి "ఏంటయ్యా గొడవపడుతున్నారు?" అడిగాడు కుతూహలంగా.

"చూడండి సార్! ఆమె నాదగ్గర డబ్బులు కొట్టేద్దామని చూస్తున్నది" అంటూ ఆమెను చూపించాడు. అటు చూశాడు శేఖర్ అతని నిద్ర మత్తు పూర్తిగా పోయింది.

"వసంతా? నువ్విక్కడ!" ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్.

"ఈమె మీకు తెల్సా సార్!" షాపువాడు అడిగాడు సీసా తీసుకుని లోపల పెడుతూ.

"అరె! మీరు ఇక్కడ? ఎక్కడికి పోతున్నారు!" వసంతకూడ ఆశ్చర్యపోయింది.

"ఇంకెక్కడికి? హైద్రాబాద్ వస్తున్నా నీకోసం! మరి నువ్వు క్యాంపు వేసుకుని వచ్చావా?" అడిగాడు శేఖర్. ఇంకా ఆశ్చర్యంలోంచి కోలుకోలేదు.

"లేదు - కడపకు వస్తున్నాను - దార్లో దాహం వేస్తే కూల్ డ్రింకు తాగాను - తాగేముందు వంద యిచ్చాను - వాడు లేదంటున్నాడు." చెప్పింది.

"పోతే పోయిందిలే - వాడితో గొడవెందుకు!" అంటూ ఆమె వారిస్తున్నా ఇద్దరి డబ్బులిచ్చి ఆమెని తీసుకుని దూరంగా వచ్చాడు. ఓ బెంచిమీద కూర్చున్నాడు.

"అంటే నువ్వు ఇప్పుడు బస్సులో వున్నావా?" అడిగాడు అనుమానంగా శేఖర్ నిద్ర మత్తులో సగం అర్ధమవుతున్నది సగం అర్ధం కావడం లేదు.

"ఆ! అదే మా బస్సు! హైద్రాబాదులో ఏడుకు బయలుదేరింది..." చెప్పింది దూరంగా వున్న సూపర్ లగ్జరీ బస్సు చూపిస్తూ.

"ఇది మా బస్సు - కడపలో ఏడు దాటాక బయలుదేరింది!" చెప్పాడు.

"మరేం చేద్దాం - మీరు హైద్రాబాదు పోండి - నేను కడప పోతాను. ఇద్దరం గ్రాండుగా జరుపుకుందాం పదమూడవ పెళ్ళిరోజు - అయినా నాతో ఒక్క మాట చెప్పకుండా బస్సు ఎందుకు ఎక్కారు?" కోపంతో అడిగింది వసంత. వంద పోయిందన్న అక్కసు ఉంది. "మీ డొక్కు సెల్ ఫోన్ పనిచెయ్యడం లేదా?" అడిగింది.

"కార్డు అయిపోయింది. వేయిద్దామంటే దొరకలేదు. స్కేరిసిటి!" చెప్పాడు శేఖర్.

"దాన్ని తీసుకుపోయి ఏట్లో పారెయ్యండి. ఎందుకు బయలుదేరారు!" వసంత కోపంగా అడిగింది.

"నువ్వు వస్తావని నాకేం తెల్సు - నిన్ను సర్ ఫ్రైజు చేద్దామని బయలుదేరాను - సరే - అయిన నష్టం ఎలాగూ అయింది - ఈ రాత్రికి ఏ లాడ్జి అన్నా తీసుకుందాం - ఈ సారి మన పెళ్ళిరోజు వెరైటీగా కర్నూలులో జరుపుకుందాం చెప్పాడు శేఖర్ ఓపిక నశించిపోయి.

అలాగే ఇద్దరూ బస్సులు దిగి లాడ్జీలో ఒక రూము తీసుకున్నారు. బుధవారం - అలంపురం - మహానంది - అహోబిలం పొయొచ్చారు. అలసిపోయి పడుకున్నారు. గురువారం నిద్రలేచారు. కాలకృత్యాలు తీర్చుకున్నారు.

"డార్లింగ్ - నాకేం గిఫ్టు కొనలేదా?" వసంత అడిగింది కుతూహలంగా -

"లేదు - ఈసారి వెరైటీ గిఫ్టు - లేడీసు ఫస్టు - నువ్వు నాకేం కొన్నావు?" అడిగాడు గడుసుగా - శేఖర్ తను తెచ్చింది చూపకుండా.

"నాకు కొనే టైం లేదు - అయినా అంతకంటే మంచిది తెచ్చాను" అంటూ. ఓ కవరు తీసి అందించింది వసంత సూట్ కేసు అరలోంచి.

"ఓ క్యాషా! ఇది చూసేముందు నీకు నేను ఓ గిఫ్టు యిస్తున్నాను". అంటూ తన బ్యాగులోంచి ఓ కవరు తీసి అందించాడు శేఖర్.

ఇద్దరూ కవర్లు ఓపెన్ చేసి చూశారు ఒకేసారి టెన్షన్ తో.

"ఓ మై గాడ్!" అని అరిచాడు శేఖర్ షాక్ తిన్నట్లు.

"అయ్యో రామా! ఎంత పని జరిగిందిరా తండ్రి" అంటూ విలపించింది వసంత.

ఇద్దరూ నిశ్చేష్టులై సోఫాల్లో కూలబడిపోయారు. కళ్ళెంబడ నీళ్ళు!

వాళ్ళ చేతుల్లోని కాగితాలు ఫ్యాను గాలికి కొట్టుకుని కింద పడ్డాయి.

"నువ్వు నాతో ఒక్క మాట చెప్పలేదు." బాధగా అన్నాడు శేఖర్.

"పెళ్ళి కానుకగా మిమ్మల్ని సంభ్రమంలో ముంచుదామనుకున్నా! కాని మొగవాళ్ళు మీరెందుకు చెప్పలేదు!" వసంత విచారంగా అడిగింది.

"ఆ కాగితం నీ చేతిలో పెట్టి నీ కళ్ళల్లోని సంతోషాన్ని చూడాలనుకున్నా!" ఏడుస్తూ చెప్పాడు శేఖర్. ఎన్నో విషయాలు ఎప్పుడూ మాట్లాడుకుంటున్నా సస్పెన్సు కోసం ఆ ఒక్క విషయం దాచడం ఎంత తప్పయిందో అర్ధమైంది.

ఇంతకీ ఆ కాగితాల్లో ఏముందంటే - వసంతకు కడపకు ట్రాన్సఫరు - శేఖర్ కు హైద్రాబాదుకు ట్రాన్సఫరు అయినట్లు - వెంటనే కొత్త ప్రదేశాల్లో జాయిన్ కమ్మని ఆర్డర్లు.

ఇద్దరూ వాళ్ళ వూళ్ళ నుంచి రిలీవై - కొత్త ఊళ్ళు ఛార్జీలు పుచ్చుకోవడానికి బయలుదేరారు మంగళవారం.

ధర్మరాజు శాపం తనకు ఎందుకు తగలలేదని విచారించింది వసంత.

అన్ని వందలు తగలేస్తున్నా అవసరానికి తన సెల్లు తనను ఎందుకు ఆదుకోలేదని బాధపడ్డాడు శేఖర్.

కింకర్తవ్య విమూఢులై తమ పదమూడవ పెళ్ళిరోజు జరుపుకోకుండానే బస్టాండుకు పరుగులు తీశారు.

 
 

 

 

 

మరిన్ని కథలు
jnanodayam