Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue311/802/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి)..... పాకిస్ధాన్ ఇస్లామాబాద్.

అది పాకిస్ధాన్ రక్షణమంత్రి చాంబర్స్. ఆ గదిలో పాకిస్ధాన్ రక్షణ మంత్రితో పాటు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ కు చెందిన బ్రిగేడియర్ కల్నల్ కూడా ఉన్నారు. రక్షణ మంత్రి ముందు ఒక ఎర్ర రంగు ఫైలు ఉంది. దాని మీద టాప్ సీక్రేట్ అని ఎర్ర రంగు పెన్సిల్ తో ఉంది. ఆ ఫైలు నిన్ననే భారత ప్రభుత్వం నుంచి వచ్చింది.

గడిచిన కొద్ది నెలల నుంచి ఉగ్రవాదం పెచ్చు మీరి పోయింది. ముఖ్యంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎక్కువైంది. ఎంతో మంది ఉగ్రవాదులు సరిహద్దు సెక్యురిటి కళ్ళు కప్పి భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నారు. మారణ హోమం సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారు. కాని వాళ్ళ ఆటలు సాగలేదు. భారత మిలిట్రి ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ చాల తెలివిగా వాళ్ళ పధకాన్ని తెలుసుకుని వాళ్ళ మీద దాడి చేసింది. ఆ దాడిలో చాల మంది ఉగ్రవాదులు చనిపోయారు. కొంత మంది గాయపడి హాస్పటల్ పాలయ్యారు. అయినా ఉగ్రవాద చర్యలు ఆగలేదు. సరిహద్దు నుంచి ఉగ్రవాదులు వస్తునే ఉన్నారు. భారత్ ను వరుస బాంబు దాడులతో అతలాకుతలం చెయ్యాలనుకున్నారు. కాని ఇంత వరకు వాళ్ళ పధకం ఫలించ లేదు. కాని ఎప్పుడు పరిస్ధితి ఇలాగే ఉంటుందని గ్యారంటి లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఉగ్రవాదుల ప్లాన్ విజయవంతం అవుతుంది. అప్పుడు ఎంతో మంది భారతీయులు చని పోతారు. కొన్ని వందల మంది గాయపడతారు. ఇది భారత్ ఎంత మాత్రం సహించదు. ఉగ్రవాదలు ఆగడాలకు అమాయకులు బలి కావటం భారత్ ఎంత మాత్రం సహించదు. అందుకే ఒక పధకం ఆలోచించింది.

భారత్ పాకిస్ధాన్ సరిహద్దు చుట్టూ పెద్ద గోడ కట్టాలని తీర్మానించుకుంది. సరిహద్దు దూరం దాదాపు పాతిక కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం గోడ కట్టటం మాములు విషయం కాదు. దానికి ఎంతో డబ్బు కావాలి. భారత్ ఎస్టిమేషన్ ప్రకారం దానికి దాదాపు వంద కోట్లు ఖర్చువుతాయి. ఇంత ఖర్చును భారత్ వెచ్చించడానికి సిద్ధంగా లేదు. అందుకే ఈ ప్రోజెక్ట్ లో పాకిస్ధాన్ ను కూడా కలుపుకోవాలని భారత్ నిర్ణయించింది. అందుకే ఈ ప్రపోజన్ గురించిన పూర్తి వివరాలను పాకిస్ధాన్ రక్షణ మంత్రికి పంపించింది. భారత్ పంపించిన ఫైలు నిన్ననే పాకిస్ధాన్ రక్షణ మంత్రి ముందుకు వచ్చింది.

ఆ ఫైలును ఆయన కూలంకషంగా చదివాడు. భారత్ చేసిన ప్రపోజల్స్ ఆయనకు సబబుగానే తోచాయి. సరిహద్దు చుట్టూ పెద్ద గోడ నిర్మిస్తే అంతో ఇంతో ఉగ్రవాదులను అరికట్టవచ్చు. వాళ్ళు అవతల వైపుకు వెళ్ళకుండా నిరోధించవచ్చు. చుట్టు వాచ్ టవర్స్ కూడా ఉంటాయి. అవి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి. ఎవరైన దొంగతనంగా సరిహద్దు దాటటానికి ప్రయత్నిస్తే తెలుస్తుంది. అప్పుడు సెక్యురిటి వెంటనే చర్య తీసుకోవటానికి అవకాశం ఉంటుంది.

అందుకే రక్షణ మంత్రి కూడా భారత్ పంపిన ప్రపోజల్ కు సుముఖుం గానే ఉన్నాడు. అయిన ఒకసారి మిలిట్రి అధికారుల సలహ కూడా తీసుకోవటం మంచిదని తోచింది ఆయనకు. అందుకే కల్నల్ బ్రిగేడియర్ ను కూడా పిలిపించాడు.

“మీరిద్దరు ఫైలు చదివారు కదా. మీ అభిప్రాయం ఏమిటి” నిశబ్ధాన్ని ఛిద్రం చేస్తూ అడిగాడు రక్షణ మంత్రి.

“ప్రపోజల్ సబబుగానే ఉంది. ఎందుకైన మంచిది మన వైపు కూడా చెక్ చెయ్యాలి. వాచ్ టవర్స్ ఎక్కడెక్కడ పెట్టాలో భారత్ కు తెలియదు. ఆ విషయం మనకు మాత్రమే తెలుసు. అందుకే మనం ఒకసారి సరిహద్దు ప్రాంతం చుట్టూ సర్వే చెయ్యాలి. ఎక్కడెక్కడ వాట్ టవర్స్ పెట్టాలో నిర్ణయించాలి. ఈ పని వెంటనే మొదలు పెడితే బాగుంటుంది. ఆలస్యం అమృతం విషం అన్నారు” అన్నాడు కల్నల్.

“మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఈ పనికి ఎవరిని నియమిద్దాం” అడిగాడు మంత్రి.

“కెప్టన్ జహీర్ అబ్బాస్ కు ఈ పని అప్పగిద్దాం. అతను అయితే కరెక్టు ఎస్టిమేషన్ వేసి రిపోర్ట్ ఇస్తాడు” అన్నాడు బ్రిగేడియర్.
అది నిజమే అని కల్నల్ కూడా తలుపాడు.

“సరే మీరు వెళ్ళండి. నేను మరోసారి ఫైలు చదివి నా నిర్ణయం చెప్తాను” అన్నాడు మంత్రి.

ఇద్దరు అధికారులు ఆయనకు సెల్యూట్ చేసి గది లోంచి నిష్క్రమించారు.

*************

అదే రోజు అబ్బాస్ జీపులో కంచె  దగ్గర నుంచి బయలు దేరాడు. దాదాపు పాతిక కిలోమీటర్ల దూరం చుట్టు పటిష్టమైన కంచె నిర్మాంచారు. చాల చోట్ల సెక్యురిటి గార్డ్స్ కాపలా కాస్తున్నారు. వాళ్ళు రాత్రి పగలు కళ్ళలో వత్తులు వేసుకుని పహారా కాస్తున్నారు. అయిన కొంత మంది ఉగ్రవాదులు వాళ్ళ కళ్ళు కప్పి కంచె దాటుతున్నారు. భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నారు. మారణ హోమం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అరికట్టాలంటే ఒక్కటే మార్గం. కంచెను తీసివేసి దాని స్ధానంలో పట్టిష్డమైన గోడ కట్టటం. ఇది భారత్ కు వచ్చిన అద్భుతమైన ఆలోచన. గోడ కట్టిన తరువాత వాచ్ టవర్స్ కూడా నిర్మించాలని అనుకుంటున్నారు. దాని వల్ల రాత్రి వేళ ఎవరైన అటువైపు దొంగతనంగా వస్తే తప్పకుండా కనబడ్తారు. ఎక్కడెక్కడ వాచ్ టవర్స్  పెట్టాలో అబ్బాస్ చూసి నిర్ణియించాలి. ఈ తతంగం అంతా పూర్తి అయ్యే సరికి చాల సమయం పడుతుంది. సాయంత్రం కూడా దాటవచ్చు.

ఆ రోజు సాయంత్రం మిత్రవిందను కలుసుకుంటానని అబ్బాస్ మాట ఇచ్చాడు. ఎలాగూ అతను సమయానికి అక్కడికి వెళ్ళలేడు. అందుకే మిత్రవిందకు కాల్ చేశాడు.

“ఈ రోజు సాయంత్రం నువ్వు రావద్దు” అన్నాడు అబ్బాస్.

“ఎందుకు? ఏదైనా అర్జంట్ పని ఉందా” అడిగింది మిత్రవింద.

“అవును. చాల ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వీలు పడితే రాత్రి ఒక సారి కాల్ చేస్తాను” అన్నాడు.
నిరుత్సాహంతో ' సరే '  అంది మిత్రవింద.

అబ్బాస్ సెల్ ఆఫ్ చేసి తన పనిలో పడ్డాడు. ఒక పుస్తకం కలం తీసుకున్నాడు. మెల్లగా జీపులో బయలుదేరాడు. ఎక్కడ వాచ్ టవర్స్ పెట్టాలో అక్కన చాక్ పీస్ తో మార్కు చేశాడు. అది కాగితంలో నోట్ చేసుకున్నాడు. మొత్తం పాతిక కిలోమీటర్లు చుట్టి రావటానికి అతనికి నాలుగు గంటలు పట్టింది. అతను నిర్ణయించిన ప్రకారం అయిదు వాచ్ టవర్స్ ఏర్పాటు చెయ్యాలి. ఈ తతంగం అంతా పూర్తి అయ్యే సరికి సాయంత్రం అయిదు గంటలైంది. ఆ రోజు ఎండ చాల తీవ్రంగా ఉంది. వేడి గాల్పులు చెంపలను అదర గొడ్తున్నాయి. జీపులో వెళ్ళటం వల్ల అబ్బాస్ బాగా అలసి పోయాడు.

తను వేసిన ఎస్టిమేషన్ తీసుకుని కల్నల్ ఆఫీసుకు వెళ్ళాడు.  ఆయనకు తన ఎస్టిమేషన్ రిపోర్ట్ ఇచ్చాడు. మిగత అఫీషియల్ వర్క్ పూర్తిచేసుకుని ఇంటికి చేరుకున్నాడు. కాళ్ళకు ఉన్న బూట్లు విప్పి తల్లి గదిలోకి వెళ్ళాడు. అవిడ ఎప్పటి లాగే నేలమీద కూర్చుని నమాజ్ చేస్తుంది. ఆమె నమాజ్ పూర్తి అయ్యేంత వరకు గది బయట ఉన్నాడు అబ్బాస్.

ఆమె నమాజ్ చేసి లేవగానే మెల్లగా గదిలోకి వెళ్ళాడు.

“ఎప్పుడు వచ్చావు బాబు” నవ్వుతూ అడిగింది షబ్నమ్.

“నువ్వు నమాజ్ చేస్తున్నప్పుడు వచ్చావు. అందుకే లోపలికి రాలేదు” అన్నాడు అబ్బాస్.

ఆమె కొడుకు చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చుంది. ఏమిటన్నట్టు ప్రశ్నార్ధకంగా చూసింది.

“ఆ రోజు నువ్వు కాబోయే కోడలు ఫోటో అడిగావు కదా” అన్నాడు.

“అవును. తెచ్చావా “ ఆత్రంగా అడిగింది ఆమె.

“తెచ్చాను.”

“నీకు కాబోయే భార్య ఫోటో తీసుకురావటానికి ఇన్ని రోజులు పట్టిందా” అంది చలోక్తిగా.

“అమ్మా ఇప్పుడు సాంకేతిక రంగం ఎంతో అభివృద్ది చెందింది. తలుచుకుంటే ఎవరి ఫోటో అయినా తీసుకోవచ్చు. అది వాళ్ళకు తెలియకుండ. నేను కూడా మిత్రవింద ఫోటో తియ్యవచ్చు. కాని నా మనస్సు ఒప్పుకోలేదమ్మా. నువ్వు చిన్నతనం నుంచి నేర్పిన సంస్కారం నన్ను ఆ పని చెయ్యనివ్వ లేదు. అందుకే మరునాడు ఆమె అనుమతితో ఫోటో తీశాను. ఆ రోజే నీకు చూపించాలని అనుకున్నాను. కాని అనుకోకుండ ఒక ముఖ్యమైన పని వచ్చింది. అందుకే చూపించ లేక పోయాను. ఈ రోజు అనుకోకుండా ఆ విషయం గుర్తుకు వచ్చింది. అందుకే అన్ని పనులూ మానేసి నీ గదిలోకి వచ్చాను” అన్నాడు అబ్బాస్.“ఏదీ అమ్మాయి ఫోటో చూపించు. నా కోడలు చాలా అందంగా ఉంటుందని నాకు తెలుసు. అయినా నాకు ఆత్రం ఆగటం లేదు” అంది షబ్నమ్.

అబ్బాస్ సెల్ తీసి మిత్రవింద ఫోటో చూపించాడు.

కొన్ని క్షణాల పాటు మిత్రవింద ఫోటోను తేరిపార చూసింది షబ్నమ్. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తల్లి మొహంలో భావాలు అబ్బాస్ గమనిస్తునే ఉన్నాడు. తల్లికి మిత్రవింద బాగా నచ్చిందని అతనికి అర్ధమైంది.

“ఎలా ఉందమ్మా” తెలిసినా అడిగాడు అబ్బాస్.

“చాల బాగుందిరా. మీరిద్దరు జోడి చూడటానికి ముచ్చటగా ఉంది” అంది.

ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు మిత్రవిందకు కాల్ చేశాడు అబ్బాస్. ఆ సమయంలో మిత్రవింద పాపిలాన్ అనే ఇంగ్లీష్ నవల చదువుతోంది. సెల్ రింగ్ వినగానే క్యాజువల్ గా చూసింది. డిస్ ప్లే మీద అబ్బాస్ నెంబర్ చూసి వెంటనే చేతిలోకి తీసుకుంది.
“ఈ రోజు చాల విచిత్రం జరిగింది మిత్రవింద. నీ ఫోటో అమ్మకు చూపించాను. చాల సంతోషపడింది. నీ ఫోటో చూపించాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు చూపించ గలిగాను”అన్నాడు.

“మీ అమ్మ గారికి నేను బాగా నచ్చినందుకు చాల సంతోషంగా ఉంది. సరే ఆ విషయం పక్కన పెట్టు. నేను పరీక్షలు బాగా రాశాను. తప్పకుండ సెలక్ట్ అవుతాను” అంది మిత్రవింద.

“నువ్వు కాకపోతే ఇంకెవరు సెలక్ట్ అవుతారు. నా అడ్వాన్స్ అభినందనలు అందుకో” అన్నాడు అబ్బాస్.

మిత్రవింద నవ్వింది.

“సరే ఇంతకి మన విషయం మీ నాన్న గారితో చెప్పావా లేదా.?

“ఇంకా లేదు అబ్బాస్. ప్రతి సారి ఆయన ఎదురుపడినప్పుడు చెప్పాలనే అనుకుంటున్నాను. కాని ఏదో తెలియని ఇబ్బంది కలుగుతుంది. దాన్ని భయం అని చెప్పను. సిగ్గు అనుకుంటాను. నా గురించి ఆయన తప్పుగా అనుకుంటాడేమో అని కలవర పడుతున్నాను. అందుకే చెప్ప లేక పోతున్నాను. నువ్వేం కంగారు పడకు. ఒక వారం రోజులు నాకు గుడువు ఇవ్వు. ఈ లోగా చెప్తాను.”

“ఇంకా ఎంత కాలం దాస్తావు. ఈ రోజు కాక పోయినా రేపయినా చెప్పక తప్పదు. ఆయనకు తెలియక తప్పదు. ఆ విషయం మనం స్వయంగా చెబితే బాగుంటుంది. మూడో మనిషి మూలంగా తెలుసుకోకూడదు. అది మనకు చాల పరువు తక్కువ. అందుకే చెప్పుతున్నాను. ఇంకో వారం రోజులు గడువు ఇస్తున్నాను. ఈ లోగా మీ నాన్న గారితో మన విషయం చెప్పు. మన పెళ్ళికి అయన మనసారా ఒప్పుకోవాలి. అలాగే మీ అమ్మగారు కూడా ఒప్పుకోవాలి. వీళ్ళలో ఎవరు ఒకరు ఒప్పుకోక పోయినా మన పెళ్ళి జరగదు.”
అలాగే అంది మిత్రవింద.

ఆ తరువాత అబ్బాస్ ఏం మాట్లాడలేదు. బై చెప్పి లైన్ కట్ చేశాడు. మిత్రవింద కూడా సెల్ ఆఫ్ చేసి పక్కకు తిరిగి చూసింది. వసంత సేన గాఢంగా నిద్రపోతుంది. ఆమె వేసుకున్న మాక్సీ మోకాళ్ళ వరకు లేచి పోయింది. ఆమె మాక్సి సరి చేసి గది లోంచి బయటకు వచ్చింది మిత్రవింద. మెల్లగా తండ్రి గదిలోకి వెళ్ళింది.

చక్రపాణి విశాలాక్షి గాఢంగా నిద్ర పోతున్నారు. ఇద్దరి మొహాలు చాల ప్రశాంతంగా ఉన్నాయి. కొన్ని క్షణాల పాటు తల్లి తండ్రిని చూసి గదిలోంచి బయటకు వచ్చింది. గదిలోకి వెళ్ళి టేబుల్ ముందు కూర్చుంది. ఆమెకు ఏం చెయ్యాలో అర్ధం కావటం లేదు. అబ్బాస్ ను ఇష్ట పడుతున్నప్పుడు ఇలాంటి సమస్య వస్తుందని ఆమెకు తెలుసు. కాని ఏమాత్రం భయ పడ లేదు. సమయం వచ్చినప్పుడు తల్లి తండ్రితో ధైర్యంగా చెప్పవచ్చని అనుకుంది. కాని అది అంత సులభం కాదని ఆమెకు అనుభవ పూర్వకంగా తెలిసివచ్చింది. చెప్పటం వేరు ప్రాక్టికల్ గా ఆచరించటం వేరు. రెండిటికి చాల తేడా ఉంది.

అలాగని తండ్రి అంటే భయం లేదు మిత్రవిందకు. ఆమెకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు చక్రపాణి. ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మిత్రవిందను అడుగుతాడు. ఆమె మనసారా ఒప్పుకుంటేనే దాన్ని అమలు చేస్తాడు. అదే విధంగా మిత్రవింద కూడా తండ్రితో ఎంతో ఫ్రీగా ఉంటుంది. అన్ని విషయాలు తండ్రితో చర్చిస్తుంది. చాల విషయాలలో తన నిర్ణయాన్ని నిర్భయంగా చెపుతుంది. కాని తన ప్రేమ విషయంలో మాత్రం ఒక్క అడుగు ముందుకు వెయ్య లేక పోతుంది. దానికి కారణం లేక పోలేదు.

ఆ రోజు తండ్రి ప్రసాద్ కూతురి గురించి చెప్పాడు. ఆ అమ్మాయి ఒక ముస్లిం కుర్రవాడితో లేచి పోయింది. ఆ సంఘటన ప్రసాద్ ను చలింప చేసింది. అతనితో పాటు చక్రపాణి కూడా విపరీతంగా స్పందించాడు. ఆ సంఘటన చెపుతున్నప్పుడు తండ్రి మొహంలో కోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అది ఇంకా మిత్రవిందకు గుర్తుంది. దాంతో పాటు ఆయన మొహంలో కనిపించిన కోపచ్చాయలు కూడా కళ్ళముందు కదలాడుతున్నాయి.

ఈ పరిస్ధితిలో మిత్రవింద అబ్బాస్ విషయం చెపితే చక్రపాణి ఖచ్చితంగా ఊరుకోడు. అబ్బాస్ గురించి వినగానే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో మిత్రవింద ఊహకు అందటంలేదు. అందుకే వెనుకాడుతోంది.

ఆమె ఆలోచనలకు భగ్నం కలిగిస్తూ ట్రింగ్ మంటు సెల్ ఫోన్ చప్పుడు చేసింది. ఎవరో మెసెజ్ చేసినట్టుగా ఉంది. సెల్ ఆన్ చేసి మెసెజ్ చూసింది. అది జహీర్ అబ్బాస్ పంపించిన మెసెజ్. ఆమె కళ్ళు మెసెజ్ వెంట పరుగులు తీశాయి.

“నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోగా మన విషయం మీ నాన్న గారికి చెప్పాలి. లేక పోతే నేను వచ్చి చెప్పాల్సి ఉంటుంది. వచ్చేశనివారం వరకు నీకు గడువు ఇస్తున్నాను.”

మెసెజ్ చదివిన మిత్రవింద మొహం సున్నం కొట్టినట్టు తెల్లగా పాలిపోయింది.

( సరిహద్దు అలజడుల కంటే మిత్రవింద మదిలో రేగుతున్న ఆలోచనల అలజడే ఎక్కువగా ఉన్నట్టనిపిస్తోంది కదూ....తన ప్రేమ విషయం తండ్రికెలా చెప్పగలిగిందో తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట వరకూ ఆగాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani