( పళని )
పళని కోవెల వున్న పర్వతాన్ని శివగిరి అంటారు , శివగిరి పర్వతపాదాల దగ్గర వినాయకుని కోవెలవుంటుంది , ఆ వినాయకుని దర్శించుకొని తరువాతే కొండపైకి వెళతారు . కొండకిందన శిలకోవెల , పార్వతీదేవి కోవెల వున్నాయి . పళని వూరికి 9 కిలోమీటర్ల దూరంలో విష్ణుమూర్తి మందిరం వుంది .
ఈ కోవెలలోని విగ్రహాన్ని’ భోగరుడు ‘ చే నిర్మింపబడిందట , భోగరుడు నవపాషాణ రసాయనంలో సిద్ది పొందినవాడు , అదే రసాయన శాస్త్రప్రయోగంతో కుమారస్వామి విగ్రహాన్ని నిర్మించేడు . చరత్ర ప్రకారం యీ సిద్దుడు క్రీస్తు పూర్వం 500 నుంచి 300 సంవత్సరాల మధ్యకాలం నాటివాడని తెలుస్తోంది .
స్థానికుల ప్రకారం భోగరుడు మరణం లేకుండా వుండే మందు తయారు చేసేడని , దాని ప్రభావం వల్ల యిప్పటికీ కోవెల కిందనున్న నేలమాళిగలో తపస్సుచేసుకుంటున్నాడని అంటారు .
16 వ శతాబ్దం వరకు బోగరుని శిష్యసంతతి వారు యీ మందిరంలో పూజారులుగా వుండేవారట .ఇప్పటికీ ఈ కోవెలలో వున్న మహత్యం యేమిటంటే కుమారస్వామి విగ్రహానికి చేసే పాల, పంచామృత అభిషేకాల వల్ల వాటిలో వ్యాధినిరోధక శక్తులు కలుస్తాయట , ఆ తీర్ధాన్ని పుచ్చుకున్న వారి యెటువంటి రోగాన్నించైనా విముక్తులౌతారట .
ఈ మందిరం మధ్యాహ్నం మూసివేస్తారు , సాయత్రం త్వరగా మూసివేస్తారు , బాల కుమారస్వామి కాబట్టి త్వరగా అలసిపోతాడని అంటారు , అలాగే ప్రతీ రాత్రి మూల విరాట్టుకి చందనం లేపనం పూసి ప్రొద్దున్నే చందనం వొలిచి ఆ చందనాన్ని ప్రసాదంగా భక్తులకు యిస్తారు ( అమ్ముతారు ) , యీ చందనానికి వ్యాధి నిరోదక శక్తులు వుంటాయని భక్తుల నమ్మకం .
ప్రతీరోజూ రాత్రి ఉత్సవవిగ్రహానానికి పవ్వళింపు సేవ పూజారులు జోలపాటలతో చేస్తారు .
ప్రతీ రోజూ జరిపే ఆరు నిత్యపూజలేకాక సంత్సరంలో థైపూసం , ఫాల్గుణి ఉత్తిరం ( ఫాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్రం రోజు) , వైశాఖి విశాఖం ( వైశాఖమాసంలో విశాఖ నక్షత్రం రోజు ) , సూరసంహరం రోజులలో విశేషపూజలు జరుగుతాయి . థైపూసం నాడు భక్తులు దూరప్రాంతాలనుంచి కావిళ్లు మోసుకొని రావడం చాలా విశేషంగా జరుగుతుంది . ఈ కావిళ్లు మోసేవాళ్లు జోళ్లులేని కాళ్లతో వస్తారు , అలాగే తీర్ధకావిళ్లుకూడా తీసుకువస్తారు , ఆనీటిని అభిషేకానికి వుపయోగిస్తారు , థైపూసంలో మరో విశేషం యేమిటంటే ‘ కారైకూడి ‘ కుమారస్వామి మందిరంనుండి వజ్రశూలం వూరేగింపుగా తీసుకు వచ్చి పళని మందిరంలో వుంచి పూజలు చేస్తారు . ప్రతీరోజూ సాయంత్రం 6-30 గంటలకి స్వామివారి బంగారు రథాన్ని భక్తులకోసం ప్రదర్శిస్తారు .
ప్రతీరోజూ జరిపే అభిషేకాల వల్ల మూలవిరాట్టుకు క్షతి కలుగుతుందని నూరు కిలోల బరువున్న కొత్త విగ్రహాన్ని 2004 లో ప్రతిష్టించేరు . 1980 లలో యీ ప్రస్తావనకు పునాది పడగా అనూహ్యమైన వ్యతిరేకత భక్తులనుండి రావడంతో వాయదా పడుతూ వచ్చింది .
పళని పర్వతాన్ని హిడింబాసురుడు కుమారస్వామి కోరిక మీద తన భుజాలమీద యెత్తుకొని ఉత్తరాన్నుంచి తీసుకొని వచ్చేడని అనే కథకి నిరూపణగా యిక్కడ హిడింబాసురునికి పూజలుజరగుతూవుండం చూస్తాం .
పళని నుంచి మధురైవైపు వెళదాం , మధురైవైపు వెళ్లేటప్పుడు మధురైకి 9 కిలోమీటర్ల దూరంలో వున్న ‘ తిరుపరంకుండ్రం ‘ లో వున్న కుమారస్వామి యొక్క మరో ‘ అరుప్పడి వీడు ‘ గురించి తెలుసుకుందాం . అరుప్పడివీడు అంటే యుధ్ద సమయంలో వేసుకున్న గుడారం అని తెలుసుకున్నాం కదా ? , ఈ అరుప్పడి వీడు కుమారస్వామి ‘ సురపద్ముడు ‘ అనే రాక్షసునితో యీ ప్రదేశం లో యుద్దం చేసినప్పుడు వేసుకున్నది .
ఈ మందిరం కొండను దొల్చి కట్టినది , మధురైనుంచి వెళ్లడానికి బస్సు ఆటో సర్వీసులు వున్నాయి . కొండల మధ్యన వుండడం వల్ల పకృతి సౌందర్యానికేమీ కొదవలేదు . పళని లో వున్నంత పర్యాటకుల రద్దీ వుండదు . ఈ మందిరం 8 వ శతాబ్దానికి చెందిన పాండ్యరాజుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది . ఈ మందిరం గోపురం సుమారు 150 అడుగులయెత్తుని కలిగి 7 అంతస్థులలో వుంటుంది , ఈ మందిరానికి చెందిన 5 తీర్ధాలుకూడా వున్నాయి . వీటిని ‘ సరవన పోయిగై ‘ , ‘ లక్ష్మీ తీర్థం ‘ , ‘ సన్యాసి కినారు ‘ ( బావి ) ‘ , ‘ కాశి సునై ‘ , ‘ సతియకూపం ‘ అని అంటారు .
మంచి ప్రశాంతతనిచ్చే మందిరం , మందిరం లోపలే కాదు పరిసరాలు కూడా చాలా ప్రశాంతంగా వుంటాయి . వినాయకుడు , పార్వతీ పరమేశ్వరులు , విష్ణుమూర్తి , దుర్గా దేవిల అంతరాలయాలు వున్నాయి . గోపురం పై భాగం లో ఇంద్రుడు , ఇంద్రాణి తమ పుత్రికైన దేవయానిని వళ్లో కూర్చోబెట్టుకొని కన్యాదానం చేస్తున్న విగ్రహాలను చూడొచ్చు .
ద్వజస్థంబం దగ్గర శివుని వాహనమైన నంది , వినాయకుని వాహనమైన ఎలుక , కుమారస్వామి యొక్క వాహనమైన నెమలి లను చూడొచ్చు . ఈ మందిరంలో మరో విశేషమేమిటంటే శివకేశవులు ఒకే మందిరంలో యెదురెదురుగా వుండడం . ఈ కోవెలలోని వినాయకుడిని కర్పకవినాయకుడు అని అంటారు , కర్పకవినాయకుడు అంటే కోరిన కోర్కెలు తీర్చేవాడు అని అర్దం .
ఈ కోవెలలో ఆరునిత్యపూజలతో పాటు ప్రతీ యేడాదీ చేసే విశేషపూజలతో పాటు స్కందషష్టి పూజలు చాలా విశేషంగా జరుపుతారు .
ఇక ఈ మందిరానికి సంబంధించిన స్థలపురాణం గురించి తెలుసుకుందాం . స్కంధపురాణం లో వివరించిన ప్రకారం తెలుసుకుందాం . ‘ సురపద్ముడు ‘ అనే రాక్షసుడు శివుని వరగర్వాన 1008 లోకాలనూ జయించి ఇంద్రుని చెరబట్టి ఇంద్రాణిని వివాహమాడదలుస్తాడు . ఇంద్రుడు , ఇతర దేవీదేవతల ప్రార్ధనలకు ప్రసన్నుడైన కుమారస్వామి సురపద్మునితో యుధ్దం చేస్తాడు , కుమారస్వామి సురపద్ముని పుతృలలో ‘ ఇరానియనుని ‘ తప్ప మిగిలిన వారిని సంహరిస్తాడు , కుమారస్వామికి భయపడిన సురపద్ముడు సముద్రగర్భంలో దాగుకొనగా కుమారస్వామి అతనిని రెండుగా చీల్చి వధిస్తాడు .
కుమారస్వామి విజయానికి దేవతలు పూలవర్షం కురిపిస్తారు , ఇంద్రుడు కుమారస్వామికి తన పుత్రికైన దేవయానిని యిచ్చి వివాహం చేస్తాడు .
కుమారస్వామికి వివాహం జరిగిన ప్రదేశం కాబట్టి కూడా యీ కోవెల మరింత విశిష్టితను సంతరించుకొంది .
వచ్చేవారం మధురమీనాక్షిని దర్శించుకుందాం , అంతవరకు శలవు
|