Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

కర్రీస్ పాయింట్

పెళ్లి చూపుల్లో ‘అమ్మాయికి వంటొచ్చా’ అన్న ప్రశ్నే మొట్ట మొదటగా చోటుచేసుకునేది. అబ్బాయికి చక్కగా వండి పెట్టే భార్య దొరకడం అదృష్టంగా భావించేవారు. కొంతమంది బ్రహ్మచారులు వంట చేసుకుని చేతులు కాల్చుకుంటే, మరికొంతమంది హోటల్లకి అంకితమైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకునేవారు. అసలు మగాడికి వండి పెట్టే వసతి కోసమే పెళ్లిల్లు చేసే వారంటే అతిశయోక్తి కాదు.  ‘మా ఆవిడ వంట అమృతమనుకో ఒక్కసారి కంచం ముందు కూర్చున్నామంటే ఇహ లేవడం వల్లకాదు’ అని భార్య గురించి పదుగురి ముందు గొప్పలు చెప్పేవారు. ఆఫీసులో ఎంత రాత్రయినా, ఇంటికొచ్చి నాలుగు మెతుకులు కతికితేగాని మనసుండబట్టేది కాదు.

పొద్దుటనగా ఆఫీసులకెళ్లి ఈసురోమని రాత్రి ఇంటికి వస్తూ కూరగాయలు తెచ్చుకుని, అన్నం పొయ్యి మీద పెట్టి, కూర తరుక్కుని..వండుకుని, వండుకున్న వాటితో పాటు కాస్త తోడేసిన పెరుగుతో రాత్రి భోజనం అయిందనిపించే సరికి అర్ధరాత్రి దాటేది.  పడుకుని పొద్దుటే లేచి మళ్లీ ఆఫీసులకు పరుగో పరుగు. వంట అనేది విసుగుతో కూడిన నిత్య అవసరం.

ఇప్పుడు ఏ వీధిలో చూసినా కర్రీ పాయింట్లు వెలిశాయి. ఇవి నిజంగా బ్యాచులర్స్ పాలిట కామధేనువులే!

ఆఫీసునుంచి వస్తూ ఊరగాయ, రోటి పచ్చడి, వేపుడు, కూర, వంకాయ మసాల, పులుసు, చారు, మెంతి మజ్జిగలాంటి వెజ్ పదార్థాలతో పాటు అన్ని రకాల నాన్-వెజ్ వంటలు, చపాతి, రోటీ, జొన్న రొట్టి సైతం నోరూరిస్తూంటే తమక్కావలసిన వాటిని ప్యాక్ చేయించుకుని ఇంటికొచ్చి కొన్ని బియ్యం రైస్ కుక్కర్ లో వేసి, పోయిమీద పెట్టి, అలా వెళ్లి స్నానం చేసొచ్చే సరికి వేడి వేడి అన్నం రెడీ. తాము తెచ్చుకున్న కూరలతో కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోతున్న బ్రహ్మచారి బతుకు ఇప్పుడు ఓ వరం.

నెల్లూరు, తెనాలి, గుంటూరు, రాయలసీమ, ఉభయగోదావరి, తెలంగాణల ఇత్యాది ఊళ్లకు సంబంధించిన రుచులు కూడా దొరుకుతుండడంతో ఊరికి, అయినవాళ్లకి దూరంగా వచ్చామన్న బాధ నుంచి కాస్త ఉపశమనం లభిస్తోంది.

ఈ కర్రీ పాయింట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు. అంట్లు తోముకోనక్కర్లేదు. కూరలు వండుకోవడం మనకు రానక్కర్లేదు. ముఖ్యంగా కూరగాయలు కొనుక్కోనక్కరలేదు. అంట్లు తోముకోనక్కర్లేదు. పైగా ఎక్కడి రుచులు బాగుంటే అక్కడ తెచ్చుకోవచ్చు. కమ్మని పదార్థాలు తినొచ్చు.

మొదట్లో ఏ సినిమాకో, షికారుకో వెళ్లి ఏ రాత్రో ఇంటికి వస్తూ కూర చేసే ఓపిక లేక పెళ్లయినవాళ్లుకూడా కర్రీస్ పాయింట్లో కూరలు కొనుక్కునేవాళ్లు. ఇప్పుడలాకాదు ఏ మాత్రం కూరొండే తీరిక లేదని మనసుకు అనిపించినా గబుక్కున కర్రీస్ పాయింట్ల మీద వాలిపోతున్నారు తరుణీమణులు.

ఇంతకుముందయితే ‘ఆదివారం మీరు వంట చెయ్యొచ్చు కదా’ అని భార్యలు, భర్తలకు వంట సెక్షన్ అప్పగించేవారు. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య తగాదాలు కూడా జరిగేవి. ఇప్పుడలా కాదు ఆదివారం మరేదన్నా సెలవు దినం వచ్చిందంటే అందరూ కర్రీస్ పాయింట్ జై అంటున్నారు.

మన అవసరం. మరొకరికి వ్యాపారం. అవసరం కనుక్కుని, కాస్త ముందు చూపుతో వ్యాపారం ప్రారంభిస్తే, మూడు పువ్వులూ ఆరుకాయలుగా కొనసాగుతుందనడానికి కర్రీస్ పాయింట్ ఓ ఉదాహరణ.

***

మరిన్ని శీర్షికలు
Egg Drumstick curry