Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
humarasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు ఇంట్లో ఏదైనా ఇబ్బందొచ్చి, ఇంటావిడకి వంట చేయడం కుదరకపోతే, ఆ ఇంటి యజమానే  ఏవో తిప్పలు పడి , భోజనం తయారుచేసేవాడు… ఆకలితో ఉండడంతో,  పదార్ధాలు ఎలా చేసినా చెల్లిపోయేవి… హొటల్ నుండి భోజనాలు తెప్పించడం అరుదుగా జరిగేది. ఆరోజుల్లో అవేవో సింగిల్ కారీర్లూ, డబల్ కారీర్లూ అనుండేవి. డబుల్ ది తెప్పించేసుకుంటే ఇంట్లో ఉండే నలుగురికీ సరిపోయేది. మహా అయితే, అన్నం వండుకోవాల్సొచ్చేది.  రోజూ తినేవాటికంటే, ఏదో మార్పులాటిది ఉండబట్టి, రుచికూడా బాగానే ఉండేది.

ఆరోజుల్లో యాత్రలకు వెళ్ళేవారు, తమతో వంటసామగ్రి కూడా తీసికెళ్ళి, ఏ సత్రం లోనో వంట చేసుకునేవారు.. పుణ్యక్షేత్రాలలో అన్నప్రసాదాలైతే ఈరోజుల్లో సర్వసాధారణమయిపోయాయి… ఒకేటైములో వందలకొద్దీ భక్తులు భోజనం చేయడానికి ఏర్పాట్లుంటాయి.

వంట చేయడమనేది ఓ కళ. అందరికీ కుదరదు… ఆనాడు వంటలుచేసేవారే, ఇప్పుడు క్యాటరర్స్ గా మారిపోయారు. ఊళ్ళో, పెద్దస్థాయిలో వంటలు చేయాలంటే, వీళ్ళకే పురమాయించడం. ఇదివరకటిరోజుల్లో, ఇంటి పెరట్లో, ఓ గాడిపొయ్యి తవ్వేసి, వంటలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఆ ఇళ్ళూలేవు, పెరడులు లేవాయె. రెండు మూడు స్టవ్వులూ, ఓ నాలుగైదు సిలెండర్లూ  తెచ్చుకుని, క్షణాల్లో పని కానిచ్చేస్తున్నారు. కాలంతో వచ్చిన మార్పు… కాలానుగుణంగా ఈ వంటలకి ప్రత్యేకంగా, క్యాటరింగ్ టెక్నాలజీ అని ఒకటీ, వాటికోసం ప్రత్యేక కాలేజీలు కూడా మొదలెట్టారు. పెద్దపెద్ద హొటళ్ళలలో దేశవిడేశీ యాత్రికులు వస్తూంటారుగా, దేశ సందర్శించడానికి, ఈ హోటళ్ళలో, వారి దేశ వంటకాలు తయారుచేయగలిగితే, వారికీ ఆనందంగా ఉంటుంది, విదేశాలనుండి రాకపోకలూ ఎక్కువవుతాయి. ఎంత ఎక్కువయితే అంత ఆదాయం.

 ఇదివరకటి రోజుల్లో యాత్రలకి ఎప్పుడైనా ఉత్తరభారత పుణ్యక్షేత్ర దర్శనాలకి వెళ్తే, అక్కడ దక్షిణభారత తిండి దొరకడం కష్టమయేది… కానీ ఈరోజుల్లో, దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా, తిండి విషయంలో ఎలాటి అసౌకర్యమూ ఉండడం లేదు. అలాగే, దక్షిణ భారతంలోనూ, ఉత్తరప్రాంత , చపాతీలూ, రోటీలూ,  లాటివి దొరకడంతో వారికీ సౌకర్యంగానే ఉంటోంది. దీనితో దేశంలోని ఓ ప్రాంతంనుండి మరో ప్రాంతానికి రాకపోకలూ, వ్యాపారాలూ కూడా వృధ్ధిచెందాయి…

 ఈరోజుల్లో గమనించిందేమిటంటే, జనాలు ఎవ్వరూ , ఇదివరకటిరోజుల్లోలాగ, ఇళ్ళల్లో కూరలూ, తినుబండారాలూ తయారుచేసుకోడానికి శ్రమ పడ్డం లేదు. కూరలు, పచ్చళ్ళు “ కర్రీ పాయింట్ “ లలో దొరుకుతున్నాయి. అలాగే తినుబండారాలూనూ. దీనితో , ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా, ఏమీ కంగారు పడకుండా, దగ్గరలో ఉండే ఏ “ కర్రీ పాయింట్ “ కో వెళ్ళి, ఓ రెండు మూడు రకాల కూరలు తెచ్చేయడంతో, అతిథి సత్కారాలు కూడా బాగుపడ్డాయి.

ఒకానొకప్పుడు ఇళ్ళల్లో ఏడాదికి సరిపడే ఊరగాయలు పెట్టేవారు. కానీ ఈరోజుల్లో జనాలకి టైమూ ఉండడం లేదు, శ్రమపడే ఓపికా లేదూ.. అన్నిరకాల ఊరగాయలూ, పచ్చళ్ళు, పొడులూ కూడా, డబ్బుకడితే, కొరియర్ లో పంపేస్తున్నారు.

 అస్సలు బయటకే వెళ్ళాల్సిన అవసరం లేకుండా , online  లోనే  order  చేయడానికి, పుంఖానుపుంఖాలుగా  App  లు వచ్చేశాయి. పైగా, మనకి ఏ హొటల్ నుండి, ఏ పదార్ధం కావాలోకూడా తెప్పించుకోవచ్చు..    మనం ఆర్డరు చేసినవి, ఆ కొరియర్ వాళ్ళు ఓ మనిషిని పంపించి, మనకు కావాల్సిన హొటల్ నుండి పదార్ధాలు కలెక్ట్ చేసి పంపుతారు. ఈ మధ్య దీంట్లోకూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓ కంపెనీ కుర్రాడు, ఆకలేసి, ఆర్డర్ చేసిన పాకెట్లలోంచి కొద్దికొద్దిగా తీసుకుని తినేసాడుట… అప్పటినుంచీ, పాకెట్లకి హొటల్ సీల్ వేసి పంపుతున్నారు….

ఎన్ని సదుపాయాలూ, సౌకర్యాలూ ఉన్నా, ఇంట్లో వండుకునే పదార్ధాల రుచి రాదుగా….

సర్వేజనా సుఖినోభవంతూ…

 

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu