Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అంతరం లఘు చిత్ర సమీక్ష - సాయిపుత్ర కపీష్.

antaram short flim review

అక్షయ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ రామచంద్ర ప్రసాద్ వారణాశి నిర్మించిన సందేశభరిత లఘుచిత్రం ఇటీవల క్రిష్టల్ మైండ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ సంఘమిత్ర అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన 2019 లఘు చిత్ర పోటీలలో ప్రధమ విజేతగా నిలిచింది.
పరువు హత్యల నేపథ్యంలో సాగే ఈ చిత్రం, అంతర్లీనంగా ఎన్నో సందేశాత్మక అంశాలను స్పృశిస్తుంది.

ఈ చిత్రం టైటిల్ "అంతరం" నుండి "అంతం" వరకూ ప్రతీ ఫ్రేములోనూ మానవబంధాలు అనుబంధాలు వయోపరిమితులు ఆర్ధిక సామాజిక రాజకీయ కోణాల్లోని 'అంతరం' ప్రతిఫలింపజేస్తుంది.  ఎత్తుగడగా మొట్టమొదటి అంకంలోనే యువతకి వారి ముందుతరానికి ఉన్న భేదాన్ని ఎత్తిచూపుతుంది. ప్రతి సంభాషణలోనూ నూతన ఒరవడి నిగూడార్ధాలు సామాజిక స్థితిగతులలోని 'అంతరం' ప్రస్ఫూటమౌతాయి.
కులపిచ్చితో రాజకీయ ఎదుగుదల కోరే ఓ తండ్రి తన కూతురు నిమ్న కులస్థుడైన నిరుద్యోగిని ప్రేమించిందన్న ద్వేషంతో పరువు హత్యకు పాల్పడబోవటం, అదే సమయంలో నిష్కల్మషప్రేమతో 'స్వేచ్ఛకి' జన్మనివ్వాలని సంస్కారవంతంగా ఆలోచిస్తున్న అమ్ము అభీల జంట ఆకట్టుకుంటాయి.
బావమరిది చూపే అసహనం, అవకాశ కుల రాజకీయవాదం కాబోయే అల్లుడిని హత్య చేయించటానికి ప్రోత్సహిస్తాయి; సలీం అనే కిరాయి ముఠానాయకుడికి సుపారీ ఇప్పిస్తాయి. ఆంటోనీ అనే చెన్నై హాంతకుడిని పిలిపించిన సలీం పాత బస్తీ ఇరానీ కేఫ్ లో పని అప్పజెపుతూండగా వెనుక కుర్చీలో కూర్చున్న ఒక అభ్యుదయవాది ఈ విషయాన్ని గ్రహిస్తాడు. తన గతంలో తాను కూడా పరువుకోసమే కూతురి ప్రేమను తిరస్కరించి అల్లుడి ని హత్య చేయించి తన కూతురి ఆత్మహత్యకు కారకుడవడం జ్ఞాపకం రాగా ఒక పథకం వేస్తాడు. ఆ పథకం ఏమిటన్న కథనాన్ని 'ఫ్లాష్ బ్యాక్, టైం లాప్స్ బిట్స్' గా వివరించిన 'ఫాస్ట్ ట్రాక్' ప్రేక్షకుల్ని ఉత్కంఠభరితుల్ని చేస్తుంది.అభ్యుదయవాది మకాములో చకచకా మాటలతూటాలు పేలుతాయి. డబ్బు కట్టలతో కాక కట్టు బట్టలతో వచ్చిన అమ్ముని మనసారా ప్రేమించిన క్రిస్టియన్ అభి, ప్రేమించాక పెళ్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటాడని భయపడే అమ్ము, ఆడవారు అంతరిక్షంలోకి వెళ్తున్నా భార్యలు వంటింట్లోనే పడివుండాలని పడగ్గదికే పరిమితం కావాలనీ కూలివాడు కూలి చెయ్యాలి యజమాని కూలి ఇవ్వాలి అనే సిస్టంని నమ్మే సగటు తండ్రి - జీవించే పాత్రలు.

ఉద్యోగం సద్యోగం లేని తక్కువజాతి అప్రయోజకుడిని అల్లుడుగా స్వీకరించలేని ఆ తండ్రిని - అభిని చంపించడానికి సలీంకి 50 లక్షలు ఇచ్చే బదులు ఆ డబ్బే పెట్టుబడిగా అల్లుడికి ఇచ్చి ఏదోఒక వ్యాపారాన్ని వ్యాపకాన్ని కల్పించవచ్చుగా - అన్న ఆలోచనని అందిస్తాడా అభ్యుదయవాది.

ఒక మనిషిని చంపడానికి హిందువైన తండ్రి ముస్లిమైన సలీం క్రిస్టియనైన ఆంటోనీ - మూడు మతాలు ఏకమైనప్పుడు - ఒక ప్రేమని బ్రతికించటానికి రెండు కులాలు దగ్గరైతే తప్పేమిటి అని నిలదీస్తాడు.

కథాకథనం నటీనటుల ఎంపిక సంభాషణల చాతుర్యమే కాక, దర్శకత్వంలోనూ నీలేష్ పొడుగు సినిమాని తలపించే పొట్టి సినిమాని చూపించి ఆకట్టుకున్నాడు.

నేపధ్య సంగీతం, లొకేషన్స్, సహజత్వాన్ని నింపుకున్న ఆహార్యం మొదలైన అన్ని అంశాలలోనూ ఈ పొట్టి సినిమా గట్టి సినిమా అని నిరూపించింది. నిర్మాత అభిరుచిని ఆవిష్కరించింది.

ఈ లఘు చిత్రం చూద్దామనుకునే ప్రేక్షకులు ఈ క్రింది లింక్ లో వీక్షించగలరు.

మరిన్ని శీర్షికలు
tamilnadu