Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue319/818/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

 

(గత సంచిక తరువాయి)... గంట సేపు సెక్యురిటి ఏర్పాట్లు చూసి తన గది లోకి వచ్చాడు అబ్బాస్. సెల్ తీసి మిత్రవింద నెంబర్ కు కాల్ చేశాడు. రెండు రింగ్ లు అయిన తరువాత రెస్పాన్స్ వచ్చింది.

“యస్ ఎవరు కావాలండి”అవతల నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది.

“ట్రయినీ మిత్రవింద గారు ఉన్నారా”అడిగాడు అబ్బాస్.

“ఉన్నారు మీరు ఎవరు”?

“నా పేరు జహీర్ అబ్బాస్. చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ ను. పాకిస్ధాన్ డెలిగేషన్ తో వచ్చాను”అని ఇంకా ఏదో చెప్పబోయాడు అబ్బాస్.
అంతె వెంటనే లైన్ కట్ అయింది.

ఒక వేళ లైన్ సరిగ్గా లేదని అనుకున్నాడు అబ్బాస్. అందుకే ఇంకో సారి రింగ్ చేశాడు. అవతల నుంచి ఫోన్ స్టిచ్డ్ ఆఫ్ అని వచ్చింది. పది సార్లు ట్రై చేశాడు. అదే జవాబు మళ్ళీ మళ్ళీ వచ్చింది. మరోసారి కాల్ చెయ్యబోయి ఏదో తట్టినట్టు ఆగిపోయాడు అబ్బాస్. జరిగింది ఏమిటో అతనికి ఇప్పుడు అర్ధమైంది. మిత్రవింద విదేశాంగ శాఖలో ట్రయినింగ్ అవుతుంది. అబ్బాస్ పాకిస్ధాన్ డెలిగేషన్ కు చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ గా ఉంటున్నాడు. మాములుగా అయితే ఫర్వాలేదు. కాని ఇప్పుడు రెండు దేశాలు ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నాయి. ఈ పరిస్ధితిలో ఒక పాకిస్ధాన్ చీఫ్ సెక్యురిటి ఆఫీసర్ భారత్ విదేశాంగ శాఖలో పనిచేస్తున్న అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించకూడదు. ప్రోటోకోల్ అందుకు ఒప్పుకోదు. ఈ చిన్న విషయం అబ్బాస్ కు తెలుసు. కాని ఆ సమయంలో అతను ఆ విషయం పూర్తిగా మరిచిపోయాడు. మిత్రవిందతో మాట్లాడాలనే తపనతో ఈ చిన్న విషయాన్ని విస్మరించాడు.

తను చేసిన తప్పు ఏమిటో అబ్బాస్ కు తెలిసి వచ్చింది. దాంతో సిగ్గు కూడా వచ్చింది. ఈ చిన్న పొరపాటు వల్ల మిత్రవిందకు ఎలాంటి ఇబ్బంది వస్తుందో కదా అని భయపడ్డాడు. ఆ తరువాత అతను మిత్రవిందకు కాల్ చెయ్యలేదు. తన దృష్టిని పూర్తిగా సెక్యురిటి ఏర్పాట్ల మీద పెట్టాడు.

మరునాడు రెండు దేశాలు సమావేశం అయ్యాయి. ఆ సమావేశం చాల స్నేహపూరిత వాతావరణంలో జరిగింది. రెండు దేశాల అధికారులు పరస్పరం పలకరించుకున్నారు. కుశలం మాట్లాడుకున్నారు. ఇద్దరు రక్షణమంత్రులు కూడా తమ ఈగోను పక్కన పెట్టారు. సమస్యల గురించి విపులంగా చర్చించారు. ముఖ్యంగా సరిహద్దు సమస్య రెండు దేశాలను అతలాకుతలం చేస్తోంది. దాని వల్ల రెండు దేశాలు చాల ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే అజెండాలో దాన్ని ముందుగా తీసుకున్నారు.

సరిహద్దు చుట్టు దాదాపు ఎనిమిది అడుగల గోడ నిర్మించాలని నిర్ణయించుకన్నారు. దాంతో పాటు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో వాచ్ టవర్స్ పెట్టాలని కూడా తీర్మానించారు. అబ్బాస్ సూచించిన చోట వాట్ టవర్స్ ఏర్పాటు అవుతాయి. మొత్తం ఖర్చు వందకోట్లు అవుతుందని అంచనా. ఆ ఖర్చుని రెండు దేశాలు సరిసమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా చేశాయి.

దాంతో పాటు మరికొన్ని ఒడంబడికల మీద సంతకాలు చేశాయి. మొదటి రోజు సమావేశం చాల ప్రశాంతంగా ముగిసింది. రెండు దేశాలు సంతృప్తిని వెల్లడించాయి. అందరు భయపడినట్టు ఉగ్రవాదుల వైపు నుంచి దాడి జరగలేదు. ఎలాంటి ఇబ్బంది రాలేదు. సాయంత్రం దాదాపు అయిదుగంటలకు సమావేశం ముగిసింది. రేపు సమావేశంలో ఇంకో ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. జాయింట్ యాంటి టెర్రరిజం సెల్ ఏర్పాటుచెయ్యాలని అనుకుంటున్నారు. ఈ సంస్ధలో రెండు దేశాల ప్రతినిధులు సరిసమానంగా ఉంటారు. అధికారులే కాకుండ కమెండోలు కూడా సరిసమానంగా ఉంటారు. దీని వల్ల ఉగ్రవాదులను పూర్తిగా అరికట్టవచ్చని రెండు దేశాలు భావిస్తున్నాయి. దానికి పేపర్ వర్క్ అంతా అయిపోయింది. కాకపోతే దాన్ని సమావేశంలో బాగా చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంది.

ఆ రోజు రాత్రి డెలిగెట్స్ అందరు నిద్రపోయారు. పాకిస్ధాన్ రక్షణమంత్రి, అబ్బాస్, అతని సహచరులు తప్ప. రక్షణమంత్రి తన గదిలో కూర్చున్నాడు. రేపు సమావేశం ఆఖరి రోజు. రెండు ముఖ్యమైన విషయాలు చర్చించాలి. దానికి సంబంధించిన నోట్స్ ఆయన తయారుచేసుకుంటున్నాడు. అబ్బాస్ తన డ్యూటి ప్రకారం బయట గస్తీ తిరుగుతున్నాడు. అతనితో పాటు అతని కమెండోలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కళ్ళలో వత్తులు వేసుకుని మరి కాపలా కాస్తున్నారు.

రేపటితో సమావేశం ముగుస్తుంది. అందరు ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఉగ్రవాదులు పెట్టిన డెడ్ లైన్ ఈ రోజు. రేపు సమావేశం జరిగే లోగా వాళ్ళు ఏదైన అఘాయిత్యం తలపెట్టవచ్చు. ఒక్కుమ్మడిగా ఈ సేఫ్ హౌజ్ మీద దాడిచెయ్యవచ్చు. అందుకే అబ్బాస్ చాల ఉద్వేకంగా ఉన్నాడు. దేవుడి దయవల్ల ఈ రోజు రాత్రి క్షేమంగా గడిచిపోవాలి.  రేపు జరగబోయే సమావేశం ప్రశాంతంగా పూర్తికావాలి. ఇది అతను కోరుకుంటున్నాడు. అందుకే కళ్ళలో వత్తులు వేసుకుని కాపలా కాస్తున్నాడు.

చుట్టు ప్రశాంతంగా ఉంది. చావు నిశబ్ధం అలుముకుంది. ఎక్కడ చిటుక్కుమని చప్పుడు విన్నా వెంటనే రియాక్ట్ అవుతున్నాడు అబ్బాస్. అతనితో పాటు కమెండోలు కూడా అప్రమత్తంగానే ఉన్నారు.  ఏ అటంకం లేకుండ తెల్లవారింది. అందరు సమావేశం జరిగే చోటుకు చేరుకున్నారు. రెండు దేశాల అధికారులు లోపలికి వెళ్ళగానే తలుపులు లాక్ చేశారు. చుట్టు అబ్బాస్ అతని అనుచరులు నిలబడ్డారు. బయట భారత సెక్యురిటి కాపలా ఉంది.

ఒక వేళ ఉగ్రవాదులు రావాలని అనుకున్నా ముందు భారత్ సెక్యురిటిని ఎదురుకోవాలి. వాళ్ళను నిర్విర్యం చేసిన తరువాత లోపలికి రావాలి. లోపల అబ్బాస్ అతని కమెండో యూనిట్ ఉంది. వాళ్ళను చంపిన తరువాత సమావేశం జరుగుతున్న గదిలోకి వెళ్ళాలి. క్షణాలు నిమిషాలు గడుస్తున్నాయి.

సమావేశం మొదలైంది. అజండాలో ఉన్న విషయాలన్ని రెండు దేశాలు చర్చించుకున్నాయి. వాటిలో లాభనష్టాలను బేరీజు వేసుకున్నాయి. తరువాత కొన్ని తేడాలతో వాడికి ఆమెదం పలికాయి. జాయింట్ యాంటి టెర్రరిజం యూనిట్ సంస్ధ ఏర్పాటుచెయ్యటానికి రెండు దేశాలు ఒప్పుకున్నాయి. ఆ సంస్ధ విధివిధానాలు ఇంకా తేల్చవలసిఉంది. రెండు నెలలలోగా వాటిని కూడా పూర్తిచేసి సంస్ధ ఏర్పాటు చెయ్యాలని రెండు దేశాలు నిర్ణయించాయి.

రెండో రోజు సమావేశం కూడా విజయవంతంగా పూర్తయింది. అందరు భయపడినట్టుగా ఏం జరగలేదు. అసలు ఉగ్రవాదుల అటువైపు రానేలేదు. బహుశా సెక్యురిటి పటిష్టంగా ఉందని వాళ్ళకు చూచాయిగా తెలిసి ఉంటుంది. రిస్క్ తీసుకోవటం ఎందుకుని భావించిఉంటాయి. అందుకే తమ నిర్ణయాన్ని మార్చుకుని ఉంటాయి.

అందరు తలా ఒక విధంగా అనుకున్నారు. ఏది ఏమైన ఉగ్రవాదల దాడి జరగలేదు. ఎలాంటి ఉపద్రవం ఎదురుకాలేదు. భారత్ సెక్యురిటితో పాటు అబ్బాస్ కూడా తేలికగా నిటుర్చారు. అయిన అబ్బాస్ రిలాక్స్ కాలేదు. విమానం క్షేమంగా ఇస్లామాబాద్ లో లాండ్ అయ్యేంతవరకు అతను అప్రమత్తంగానే ఉండాలి.

సమావేశం ముగిసిన తరువాత పాకిస్ధాన్ డెలిగేషన్ గౌరవార్ధం విందు జరిగింది. విందు తరువాత వినోదం ఏర్పాటయింది. ఆటపాటలతో ఆ రోజు చాల ఆనందంగా గడిచిపోయింది. అదే రోజు సాయంత్రం పాకిస్ధాన్ డెలిగేషన్ పాకిస్ధాన్ వెళ్ళిపోయింది. భారత రక్షణమంత్రి తన సహచరులతో ఏయిర్ పోర్ట్ కు వెళ్ళాడు. వాళ్ళకు స్నేహపూర్వకంగా సెండాఫ్ ఇచ్చాడు.

“ఈ రోజుతో మీ ట్రయినింగ్ ముగిసింది.  రెండు మూడు రోజులలో మీకు పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి. పక్క గదిలో మీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. వెళ్ళి తీసుకోండి”అంది లేడి ఇన్ స్ట్రక్టర్.

అందరు వేగంగా పక్క గదిలోకి వెళ్ళారు. మిత్రవింద కూడా వెళ్ళి తన సెల్ ఫోన్ తీసుకుంది. ఆన్ చేసి చూసింది. మిస్డ్ కాల్స్ లిస్ట్ లో జహీర్ అబ్బాస్ పేరు తండ్రి పేరు కనిపించాయి. అబ్బాస్ నుంచి మూడు కాల్స్ వచ్చాయి. తండ్రి దగ్గర నుంచి నాలుగు కాల్స్ వచ్చాయి. ట్రయినింగ్ స్పాట్ కు వచ్చినవెంటనే లేడి ఇన్ స్ట్రక్టర్ అందరి దగ్గర నుంచి సెల్ ఫోన్స్ తీసుకుంది. వాటిని పక్క గదిలో పెట్టింది. అందువల్ల మిత్రవింద ఎవరికి కాల్ చెయ్యలేకపోయింది.

సెల్ తీసుకుని తన గది లోకి వెళ్ళింది మిత్రవింద. గబగబ సామాను సర్దుకుని ఏయిర్ పోర్ట్ కు బయలుదేరింది. రెండు రోజులకు ముందే మిత్రవింద ఫ్లైట్ టిక్కెట్టు బుక్ చేసుకుంది. ఉదయం పదకొండు గంటలకు ఫ్లైట్ టైం. క్యాబ్ లో వెళుతూ ముందు తండ్రికి కాల్ చేసింది. రింగ్ పోతుంది కాని తండ్రివైపు నుంచి రెస్పాన్స్ లేదు. నాలుగు సార్లు ప్రయత్నించింది. ఏం లాభం లేకుండ పోయింది. ఇక లాభం లేదనుకుని తల్లికి కాల్ చేసింది. ఆమె దగ్గర కూడా సెల్ ఉంది. ఆమె వైపు నుంచి కూడా  రెస్పాన్స్ లేదు. చివరగా వసంతసేనకు కాల్ చేసింది. అయిన ఏం లాభం లేకుండ పోయింది. రింగ్ పోతుంది కాని వసంతసేన కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు.

ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. కారణం ఏమిటో మిత్రవిందకు బోధపడలేదు. టాక్సి ఏయిర్ పోర్ట్ చేరుకునేంత వరకు ఆమె అన్యమనస్కంగానే ఉంది. ఏదో తెలియని భయం ఆమెను ఇబ్బంది పెడుతోంది. గంట సేపు తరువాత క్యాబ్ ఏయిర్ పోర్ట్ చేరుకుంది. తన బ్యాగ్ తీసుకుని దిగింది మిత్రవింద. క్యాబ్ వాడికి ఫేర్ ఇచ్చి ఏయిర్ పోర్ట్ లోపలికి నడిచింది.

లోపల చాల మంది ప్రయాణికులు ఉన్నారు. కాని వాళ్ళకంటే పోలీసులు ఎక్కువమంది కనిపించారు. లోపలికి వస్తున్న ప్రతి ప్రయాణికుడిని ఆపుతున్నారు. అతని ఐడింటిని చెక్ చేస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ మిత్రవిందను కూడా ఆపాడు.

“మీ ఐడింటి చూపించండి”అన్నాడు కరుకుగా.

మిత్రవింద ఏం మాట్లాడకుండ తన ఐడింటిని తీసి చూపించింది. దాన్ని జాగ్రర్తగా ఒక నిమిషం పాటు చూశాడు. తరువాత తిరిగి ఇచ్చేశాడు.
“ఏమైంది ఆఫీసర్ ఇంతమంది ఉన్నారు. ఎనీ ప్రాబ్లమ్” అడిగింది కార్డు తీసుకుంటు మిత్రవింద.

అతను ఏం జవాబు చెప్పకుండ అవతలకు వెళ్ళిపోయాడు. అతను చెప్పకపోయిన ఏం అయిందని మాత్రం మిత్రవిందకు అర్ధమైంది. కాని ఏం జరిగిందో మాత్రం ఆమె ఊహించలేకపోయింది. బ్యాగ్ తీసుకుని వెళ్ళి కుర్చిలో కూర్చుంది. ఎప్పుడు మాటలతో సందడిగే ఉండే ఏయిర్ పోర్ట్ ఆరోజు ఎందుకో నిశబ్ధంగా ఉంది. అందరి మొహంలో ఆందోళన భయం కనిపిస్తున్నాయి. ఏం జరిగిందో మాత్రం ఎవరు చెప్పటం లేదు. కనీసం ఒకరితో ఒకరు మాట్లాడటం లేదు.

మిత్రవింద ఇంకో సారి తండ్రికి కాల్ చేసింది. షరా మాములే. రింగ్ పోతుంది కాని రెస్పాన్స్ లేదు. అబ్బాస్ కు కూడా రింగ్ చేద్దామని అనుకుంది ముందు కాని తరువాత చెయ్యవచ్చులే అనుకుంది. అరగంట తరువాత ఏయిర్ పోర్ట్ ఫార్మాలిటిస్ ముగించుకుంది మిత్రవింద. వెళ్ళి విమానంలో కూర్చుంది.

సరిగ్గా షెడ్యుల్ టైం ప్రకారం విమానం టేకాఫ్ అందుకుంది. విమానం గమ్యస్ధానం చేరుకునేంత వరకు మిత్రవింద అన్యమనస్కంగానే ఉంది. ఏదో తెలియని భయం ఆందోళన ఆమెను అతలాకుతలం చేస్తోంది. భయానికి ఇది అని ఖచ్చితమైన కారణం తెలియటం లేదు. అదే సమయంలో ఆమె కుడికన్ను అదిరింది. ఆడవాళ్ళకు కుడికన్ను అదిరితే అరిష్టమని అంటారు. ఏదో చెడు జరుగుతుందని అంటారు. కాని అలాంటి మూఢనమ్మకాల మీద మిత్రవిందకు కొంచం కూడా నమ్మకం లేదు.

కాని ఈ రోజు మాత్రం నమ్మక తప్పటం లేదు. పరిస్ధితులు కూడా అలాగే ఉన్నాయి. పైగా లెక్కలేనంత మంది పోలీసులు కూడా కనిపిస్తున్నారు. ఇదంతా దేనికి సాంకేతమో అర్ధంకావటం లేదు.  ఇంకో గంట తరువాత విమానం శ్రీనగర్ ఏయిర్ పోర్ట్ లో లాండ్ అయింది. ఫార్మాలిటిస్ ముగించుకుని ఏయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. 

రోడ్డు మీద లేకలేనంత మంది పోలీసులు కనిపించారు. అడుగు అడుక్కి పోలీసులు నిలబడి వచ్చే పోయే వాళ్ళను గమనిస్తున్నారు. మిత్రవింద బ్యాగ్ భుజం మీద వేసుకుని క్యాబ్ స్టాండ్ వైపు నడిచింది.

వాళ్ళలో ఒకడిని బారముల్లా వస్తావా “అని అడిగింది.

ఆ మాట వినగానే డ్రైవర్ ఉలిక్కిపడ్డాడు. ఆమె వైపు పిచ్చివాడిలా చూశాడు.

“సారీ మేడం నేను రాలేను”అన్నాడు ఖచ్చితంగా.

మిత్రవింద ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఇంకో డ్రైవర్ దగ్గరకు వెళ్ళింది. అతను కూడా రానని చెప్పాడు. ఎందుకని అడిగింది మిత్రవింద. కాని అతను జవాబు చెప్పలేదు. ఇలా నాలుగురిని అడిగింది. ఎవరు బారముల్లాకు వస్తామని అనలేదు. అందరు అదేదో కాని పదం అన్నట్టు దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రవర్తన మిత్రవిందకు కొంచం కూడా అర్ధంకాలేదు.

అరగంట ప్రయత్నించిన తరువాత ఒక క్యాబ్ వాడు వస్తాననిచెప్పాడు. కాని మాములు రేటు కంటే ఎక్కువ అడిగాడు గత్యంతరం లేకు వెళ్ళి క్యాబ్ లో కూర్చుంది మిత్రవింద. క్యాబ్ వేగంగా హైవే మీద దూసుకుపోతుంది. ప్రతి వంద గజాలకు పోలీస్ పటాలం కనిపించింది. బారముల్లా వైపు వెళుతున్న ప్రతి వాహనాన్ని ఆపుతున్నారు. చెక్ చేస్తున్నారు. అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను కూడా ఏవో కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. బాగా నమ్మకం కలిగిన తరువాత విడిచిపెడుతున్నారు.

మిత్రవింద ప్రయాణం చేస్తున్న కారును కూడా వాళ్ళు ఆపారు. ఒకసారి కాదు. మూడుసార్లు ఆపారు. ప్రతిసారి పది నిమిషాలపాటు కారుడ్రైవర్ ను ప్రశ్నలతో తికమకపెట్టారు. ఒకసారి మిత్రవిందను కూడా ప్రశ్నించారు. పూర్తిగా అనుమానం తీరిన తరువాత వెళ్ళనిచ్చారు. ఈ తతంగం అంతా మూడు సార్లు జరిగింది. నాలుగు గంటలలో బారముల్లా చేరవలసింది అయిదుగంటలు పట్టింది. ఆమె ఇంటికి చేరుకునే సరికి సరిగ్గా అయిదుగంటలైంది.

టాక్సి దిగింది మిత్రవింద. డ్రైవర్ కు డబ్బు ఇచ్చి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. ఇల్లు బార్లా తెరిచి ఉంది. అప్పుడే లోపల నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ బయటకు వస్తున్నాడు.

“ఎవరు మీరు “మిత్రవిందను మద్యలో ఆపి అడిగాడు.

“నా పేరు మిత్రవింద. ఈ ఇల్లు నాదే”అంది మిత్రవింద.

అతను మాట్లాడకుండ సానుభూతిగా చూశాడు.

“ఏం జరిగింది ఆఫీసర్. మీరందరు మా ఇంట్లో ఎందుకు ఉన్నారు”అడిగింది కంగారుగా మిత్రవింద.

“వెరీ సారీ మేడం. జరగకూడని దారుణం జరిగిపోయింది. మీ వాళ్ళంతా చనిపోయారు”అన్నాడు ఆఫీసర్. తలమీద పిడుగుపడినట్టుగా అదిరిపడింది మిత్రవింద.

“మీరేం మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు”అంది గట్టిగా మిత్రవింద.

“ఈ రోజు తెల్లవారుజామున కొంతమంది ఉగ్రవాదులు పాకిస్ధాన్ భూభాగం నుంచి రహస్యంగా బారముల్లా వచ్చారు. దాదాపు పదిమంది వరకు ఉండవచ్చు. అందరి దగ్గర సబ్ మెషిన్ గన్స్ ఉన్నాయి. టౌన్ లోకి రాగానే విచక్షణరహితంగా కాల్పులు మొదలుపెట్టారు. కనిపించిన వాళ్ళందరిని కాల్చీ చంపారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు. ఆడవాళ్ళు పసివాళ్ళు అని తేడా లేకుండ కనిపించిన వాళ్ళందరిని కుక్కలను కాల్చీనట్టు కాల్చీ చంపారు. బలవంతంగా ఇళ్ళలోకి వెళ్ళి మరి కాల్చారు. ఆ సమయంలో అందరు నిద్రావస్ధలో ఉన్నారు. అందుకే వాళ్ళను ఎదురుకునే అవకాశం కాని వాళ్ళకు దొరకలేదు. కనీసం పారిపోవటానికి కూడా వీలుకలగలేదు. దాదాపు గంటపాటు రక్తపుటేరులు పారించారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసిన పోలీసులు స్పాట్ కు వచ్చారు. కాని అప్పటికే జరగవలసిన దారుణం జరిగిపోయింది. ఉగ్రవాదులు తప్పించుకుని మళ్ళి పాకిస్ధాన్ భూభాగంలోకి వెళ్ళిపోయారు. సరిగ్గా లెక్క తేలలేదు. నా ఉద్దేశం ప్రకారం మూడువందల మంది మరణించారు. ఇంకా దర్యాప్తు సాగుతోంది”అని చెప్పి పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయాడు.

ఒక సునామి అల తాకినట్టుగా కదిలిపోయింది మిత్రవింద. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అప్రయత్నంగా నేలమీద పడిపోయింది. నిద్రలో నడుస్తున్నదానిలా లోపలికి వెళ్ళింది. హాలులో ఆమె మొదటగా తల్లి శవం దర్శనం ఇచ్చింది. ఆమె గుండెలు రక్తంతో స్నానం చేసినట్టుగా ఉంది. వేసుకున్న బట్టలు పూర్తిగా రక్తంతో తడిసిపోయింది.

మెల్లగా తండ్రి గదిలోకి వెళ్ళింది. ఆయన కూడా తల్లి చనిపోయిన విధంగానే  చనిపోయాడు. పాయింట్ బ్లాంక్ రేంజిలో మిషన్ గన్ తో కాల్చారు. ఆయన బట్టలు కూడా పూర్తిగా రక్తంతో నిండిపోయింది. చివరగా తన గదిలోకి వెళ్ళింది మిత్రవింద.

మంచంమీద నిర్జివంగా కనిపించింది వసంతసేన. ఆమెను కూడా పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చారు.

ఇక తట్టుకోలేకపోయింది మిత్రవింద. ఆమె నవనాడులు కృంగిపోయాయి. ఇక శక్తిలేనట్టు నీరసంగా నేలమీద కూలిపోయింది. మెల్లగా ఆమె శరీరం పక్కకు ఒరిగిపోయింది. అంతవరకే ఆమెకు తెలుసు. తరువాత ఏమైందో తెలియదు. పూర్తిగా  సృహకోల్పోయింది.

కన్నవాళ్ళను, తోబుట్టువునీ కోల్పోయి  అగమ్యగోచరంగా తయారైన మిత్రవింద పరిస్థితి ఏమిటి? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం విడుదలయ్యే సంచికలో  చూడండి..     

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nee peru talachina chalu