Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue319/817/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/  

(గత సంచిక తరువాయి).... ‘నాలో నేనూ... లేనే లేను...’’ బస్ లో ఎవరి సెల్ లోనుంచో పాట వినిపిస్తోంది.
ఆ పాట విన్న మౌక్తిక విరక్తిగా నవ్వుకుంది..

నిజమే... తనలో తాను లేనే లేదు. తన మనసు తన అధీనంలో లేదు. తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తాను అశక్తురాలు. ఎవరో నొచ్చుకుంటారని బాధపడుతూ తనను తానే హింసించుకుంటూ బతికే వ్యర్ధ జీవిఅం ను . ఎవరినీ సంతోష పెట్టలేని నిరర్ధక జీవితను.

బాధగా కళ్ళు మూసుకుని సీటు వెనక్కి చారబడింది మౌక్తిక. మూసుకున్న ఆ కన్నుల నుండి రెండు నులివెచ్చని భాష్ప కణాలు ఆమె బుగ్గల మీదుగా కిందికి జారి ఆమె ఎద లోతుల్లో ఇంకి పోయాయి.

మూడ్ ఆఫ్ అయిన నెచ్చెలిని చూసి ‘ అది తనకి అలవాటే ‘అన్నట్లుగా నిట్టూర్చింది రమ్య.

“ ఫ్రెండ్స్... ఊరు దగ్గర పడుతోంది... అందరూ కాస్త వార్మ్ అప్ కండి.’’ మధుకిరణ్  అందరినీ ఉద్దేషిన్చి చెప్పాడు.

పిచ్చాపాటీలో మునిగి తేలుతున్న వాళ్లంతా సర్దుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఊళ్ళోకి  ప్రవేశించిగానే బస్ ఆగింది. శమంతకం గారు బస్ దగ్గరకు వచ్చారు వీళ్ళని రిసీవ్ చేసుకునేందుకు.

అందరినీ పేరు పేరు వరసనా పలకరిస్తూ “అందరూ వచ్చినట్లేగా!  ఇదిగోనయ్యా శంకర్రావూ...అనుకున్నవాళ్లందరూ వచ్చారో లేదో కాస్త చూడవయ్యా...’’ ఎక్స్ కర్షన్ కి వచ్చిన స్కూల్ పిల్లలు ఎక్కడ  తప్పిపోతారోనని ఆదుర్దా పడుతున్న స్కూల్ టీచర్ లా కాలేజ్ సబ్ స్టాఫ్ అయిన శంకర్రావుకి గైడెన్స్ ఇచ్చారు .

చాలా సేపటి నుంచి కదలకుండా కాళ్లు వెలవేసుకుని కూర్చోవడం నుంచేమో పాదాలు బరువెక్కి పోయాయి అందరికీ. ఎవరి సామాన్లు వాళ్ళు మోసుకుంటూ బస్ దిగారు. నడకకి కాళ్ళు సహకరించక అడుగులు అస్తవ్యస్తంగా పడసాగాయి.

అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఊరు చూస్తూ నడవ సాగారు. శమంతకం గారి అమ్మాయి ఇల్లు కాస్త ఇరుగ్గా ఉన్నవీధిలో ఉండడం నుంచి బస్ రోడ్ మీదే నిలచి పోయింది. దానితో లోపలికి నడవక తప్పలేదు.

ఊరంతా సిమెంట్ రోడ్లతో చాలా నీట్ గా ఉంది. ఊళ్ళో డ్వాక్రా గ్రూపులన్నీ నడుము బిగించి గ్రామంలో పచ్చదనం , పరిశుభ్రత అన్న నినాదాన్ని అమలుపరుస్తున్నట్లుగా చెప్పారు శమంతకం గారు. ఊరంతా పచ్చని చెట్ టుచేమతో, విరగ పండిన పంట చేలతో సశ్యశ్యామలంగా ఉంది.

వీధిలో మనుషుల అలికిడి కాగానే లోపల నుంచి శమంతకం గారి కూతురు, అల్లుడు శ్రీకాంత్,పెద్ద పెద్ద మీసాలున్న నడి వయసు వ్యక్తి, పని వాళ్లలా కనిపిస్తున్న ఇద్దరు మనుషులు వచ్చారు. శమంతకం గారు వాళ్ళని అందరికీ పరిచయం చేశారు. ఆ బొద్దు మీసాలాయన సుమతి మామగారు సంగమేశ్వరరావు గారు.

“రండి రండి... మా వియ్యంకుడు తన కాలేజ్ స్టాఫంతా పికినిక్ కి వస్తున్నారని చెప్పగానే చాలా సంతోషించాను. ఈ మారుమూల పల్లెకి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అలాంటిది ఇంత మంది ఒక్కసారి వస్తే ఎంతో సందడిగా అనిపిస్తోంది. మీ అందరికీ ఆతిధ్యం ఇచ్చే భాగ్యం నాకు కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది.’’ సాదరంగా ఆహ్వానించారాయన.

చూడడానికి ఆయన ఆకారం భీకరంగా ఉన్నా స్వరం ఎంతో మృదువుగా ఉంది. పనివాళ్ళు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు అందించారు.
మూడంగడాల మిద్దె ఇల్లు వాళ్ళది. ప్రయాణం చేసి అలసిపోయిన వాళ్ళని దక్షిణం వైపు నుంచి వచ్చే చల్లని గాలి ఆప్యాయంగా పలకరించింది... మర్యాదలు చేయడంలో ఈ ఇంటి వాళ్ళకి మేమెందులోనూ తీసిపోమంటూ. అటు వైపు ఉన్న మూడు గదులను వీళ్ళకి కేటాయించారు.

స్త్రీలు అందరూ ఒక పెద్ద రూమ్ లో సర్దుకుని మగాళ్ళ కోసం మిగతా రెండు గదులు వదిలేశారు. చుట్టూ పెద్దపెద్ద వసారాలు, మధ్యలో విశాలమైన లోగిలి. ఇంటిలోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. పాతకాలం నాటి గృహ నిర్మాణ నైపుణ్యానికి అద్దం పట్టినట్లుగా ఉంది ఆ ఇల్లు.

సంగమేశ్వరరావు గారి శ్రీమతి సరస్వతి కూడా భర్తకి తగిన ఇల్లాలు అనిపించింది. సాదరంగా స్వాగతిస్తూ వేడి వేడి కాఫీలందించింది.
కాఫీల సెక్షన్ పూర్తయ్యాక సుమతి చెప్పింది “ ఎవరూ దేనికీ మొహమాట పడకండి. మా అత్తమామలు సాక్షాత్తు ఆది దంపతులు. అతిధులను ఆదరించడంలో సిధ్ధ హస్తులు. ఏం కావాల్సినా నన్ను స్వతంత్రంగా అడగవచ్చు.’’

“అత్తగారి సంగతేమో గాని, మామగారు మాత్రం మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టడంలో ఖచ్చితంగా సిధ్ధహస్తులే...’’ ఆయన మీసాల మీద వ్యాఖ్యానించింది రమ్య మౌక్తిక చెవిలో రహస్యంగా.

ఎవరూ చూడకుండా చిన్నగా గిల్లింది మౌక్తిక ఊరుకోమన్నట్లుగా. సుమతి దగ్గరుండి వంటావిడచేత వంటంతా రెడీ చేయించింది.
సరస్వతి పర్యవేక్షణలో అందరూ పీకల దాకా తిన్నారు.

సన్నబియ్యపు అన్నం, కాలీఫ్లవర్-పచ్చి బఠాణీ కలిపిన కూర, దోసకాయపప్పు, సాంబారు, నిమ్మకాయ పులిహోర, రవ్వకేసరి...
రుచికరమైన భోజనం పొట్ట పగిలేలా తినడంతో భుక్తాయాసంతో కళ్ళు మూతపడ్డం మొదలైంది అందరికీ.

వారి ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలియజేసి రూముల్లోకి వచ్చిపడ్డారు.

నిద్రముంచుకొచ్చేస్తోందంటూ బట్టలైనా మార్చుకోకుండా మంచమెక్కేసింది రమ్య. మౌక్తికకు ఒళ్లంతా చీదరగా అనిపిస్తోంది. ‘స్నానం చేయకపోతే నిద్ర పట్టేట్టులేదు...’ స్వగతంగా అనుకుంటూ బ్యాగ్ లో నుంచి నైటీ తీసుకుని వరండాలో చివరగా ఉన్న బాత్ రూమ్ వైపు నడిచింది మౌక్తిక.

మాలతి,  నవనీతలు నోరెళ్ళ బెట్టి ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలిసినా పట్టించుకోలేదు.

‘ఎముకలు కొరికే ఇంతటి చలిలో కూడా చన్నీటిస్నానం చేస్తోంది... దీనికి పిచ్చిగాని లేదు కదా!’ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారని కూడా ఊహించింది మౌక్తిక. హాయిగా స్నానం చేసొచ్చి పౌడర్ తీసి మెడకు, ముఖానికి కొద్దిగా రాసుకుంది.

ఒళ్లంతా తేలిగ్గా అనిపించింది బడలిక తీరినట్లుగా. ఇంత ఫ్రెష్ గా ఉండకపోతే ఆ నిద్రా దేవత తన దరిదాపులకి కూడా రాదు... నవ్వుకుంది మౌక్తిక.

రమ్య అప్పటికే గాఢ నిద్రలో మునిగిపోయింది.

‘పక్క వాసన చూడగానే నిద్ర ముంచుకొస్తుంది మహాతల్లికి... ఎంత అదృష్టవంతురాలో గాని... కమ్మనైన నిద్రకి  నోచుకోవడానికి కూడా పెట్టి పుట్టాలి...అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఎంతో మానసిక ఒత్తిడికి గురౌతున్న సగటు మనిషికి కంటినిండా కునుకు పట్టడం ఒక అరుదైన వరం అనే చెప్పుకోవాలి!’

ఆవరానికి నోచుకున్న అతి కొద్ది మంది అదృష్టవంతులలో రమ్య ఒకటి. చీకుచింతలేని జీవితం. ఆకలేసినప్పుడు రుచిపచి అని ఎంపుళ్ళు చేయకుండా ఏగడ్ది దొరికినా తినేస్తుంది. నిద్రొచ్చినప్పుడూ అంతే... అది కటికనేలా, పట్టుపరుపా! అని ఆలోచించకుండా కునుకు తీసేస్తుంది.
‘ఆకలి రుచెరగదు...నిద్ర సుఖమెరగదు..’ అని అందుకే అంటారేమో!

మరి తనకో! ఆకలేసి ఆవురావురుమని తిందామంటే మంచి భోజనం దొరకదు... పంచభక్ష్య పరమాన్నాలూ అందుబాటులో ఉన్నప్పుడు తనకి తినాలనిపించదు.

అలాగే...నిద్ర.పరిసరాలన్నీ శుభ్రంగా, ప్రశాంతంగా ఉంతేగాని తనకి కునుకుపట్టదు. ఏ చిన్నపాటి అలికిడైనా సరే... చప్పున మెలకువ వచ్చేస్తుంది.

పల్లెటూరులో మౌక్తిక, రమ్యలు  ఎలాంటి వాతావరణాన్ని అస్వాదించారో, మధుకిరణ్, మౌక్తికని ఎలాగైనా పలకరించాలని  ప్రయత్నాలు చేసున్నాడు. ఆ ఊరిలో జరగబోయే ఇంకొన్ని సంఘటనలు తెలియాలంటే వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్