Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue320/819/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి)... ఎంత సేపు అలా పడుకుందో మిత్రవిందకు తెలియదు. తిరిగి ఆమె కళ్ళు తెరిచే సరికి బాగా తెల్లవారి పోయింది. కాంపౌండ్ లో ఏదో హడావిడి కనిపించింది. ముందు ఏదో వాహనం ఆగిన చప్పుడు వినిపించింది. తరువాత బూట్లు టకటక మంటు శబ్ధం చేశాయి. ఎవరో లోపలికి వస్తున్నారని ఆమెకు అర్ధమైంది. మెల్లగా శక్తిని కూడదీసుకుని లేచి నిలబడింది. తడబడుతున్న అడుగులతో తలుపు దగ్గరకు వెళ్ళబోయింది.

అప్పుడే లోపలికి వచ్చాడు ఒక పోలీస్ ఆఫీసర్. మిత్రవింద వైపు జాలిగా చూసి అన్నాడు.

“శవాలను పోస్ట్ మార్టం చెయ్యాలి. అన్ని పనులు పూర్తయిన తరువాత శవాలను మీకు అప్పగిస్తాం”అన్నాడు.

అలాగే అని మౌనంగా తలూపింది మిత్రవింద. కనీసం సరే అని చెప్పటానికి కూడా ఆమెకు శక్తి లేదు. అంత నీరసంగా ఉంది.
పోలీస్ ఆఫీసర్ బయటకు చూసి సైగ చేశాడు. బయట ఒక అంబులెన్స్ వ్యాన్ పార్క్ చేసి ఉంది. అందు లోంచి నలుగురు అటెండర్స్ దిగారు. వాళ్ళ దగ్గర రెండు స్ట్రెచర్స్ ఉన్నాయి. ముందు చక్రపాణిని , విశాలాక్షిని తీసుకువెళ్ళారు. తరువాత వసంతసేనను తీసుకు వెళ్ళారు. తరువాత అందరు వెళ్ళిపోయారు. ఒక్క మిత్రవింద మాత్రం ఒంటరిగా మిగిలి పోయింది.

కొన్ని గంటలకు ముందు ఈ ఇల్లు ఎంతో కళకళ లాడింది. సంతోషాలకు ఆనందాలకు పుట్టినిల్లుగా ఉంది. కాని ఇప్పుడు కళా విహీనంగా ఉంది. విచారంతో గూడుకట్టుకున్న స్మశానంలా ఉంది. నిలబడటానికి ఆమెలో పూర్తిగా ఓపిక నశించింది. వెళ్ళి సోఫాలో కూర్చోబోతూ ఏదో ఆలోచన తట్టినట్టు లోపలికి వెళ్ళింది. సెల్ తీసి అబ్బాస్ కు కాల్ చేసింది. రింగ్ పోతుంది కాని అటు వైపు నుంచి రెస్పాన్స్ లేదు.
సెల్ ఆఫ్ చేసి తిరిగి సోఫాలో కూర్చుంది. దాదాపు అరగంట సేపు నిశ్చలంగా కూర్చుంది. తరువాత లేచి ఇంటిని శుభ్రం చేసింది. లైజాల్ తో మొత్తం ఇంటిని కడిగింది. తరువాత పక్కబట్టలు మార్చింది. ఈ తతంగం అంతా ముగిసేసరికి మద్యాహ్నం అయింది. విచిత్రంగా ఆమెకు ఆకలి వెయ్యటం లేదు. నిన్న ఉదయం కొంచం  టిఫిన్ తిని బయలుదేరింది. మద్య దారిలో ఏం తీసుకోలేదు. ఒక కప్పు కాఫీ మాత్రం తాగింది.

ఆ తరువాత జరిగిన దారుణం చూసి సతమతమైంది. రాత్రి పూర్తిగా ఆకలి చచ్చిపోయింది. అలాగే ఖాళీ కడుపుతో సృహ తప్పి పడిపోయింది. తరువాత కొన్ని గంటల ముందు సృహ వచ్చింది. ఇన్ని గంటలు గడిచిన ఆకలి మాత్రం వెయ్యలేదు. అందుకే భోజనం ఒండు కోలేదు. ఒక కప్పు కాఫీ మాత్రం తాగి సరిపెట్టుకుంది.

శుభ్రంగా స్నానం చేసి బెడ్ రూంలోకి వెళ్ళింది. మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. జరిగినదంతా ఒకసారి బేరీజు వేసుకుంది. తన వాళ్ళందరు ఉగ్రవాదుల ఘాతుకానికి బలి అయ్యారు. తను మాత్రం మిగిలి పోయింది. తనతో పాటు ఈ ఇల్లు కూడా ఒంటరిదైపోయింది. ఇంకో నాలుగైదు రోజులలో ఆమెకు పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇండియాలో మాత్రం పోస్ట్ చెయ్యరు. విదేశాలలో పోస్ట్ చేస్తారు.  అలాంటప్పుడు ఈ ఇల్లు ఉంచుకోనవసరం లేదు. ఆమె ఎలాగు విదేశాలలో ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరు ఉండరు. ఖాళీగా ఉంచటం కంటే అమ్మేస్తే మంచిదని మిత్రవిందకు తోస్తుంది.

తాతల కాలం నుంచి ఈ ఇల్లు వారసత్వంగా ఈ ఇల్లు వస్తోంది. అలాంటి ఇంటిని అమ్మటం ఆమెకు కష్టంగానే ఉంది. కాని ఆమె మాత్రం ఏం చెయ్యగలదు. ముందు ఎవరికైన బాగా తెలిసినవాళ్ళకు అద్దెకు ఇవ్వాలని భావించింది. కాని తెలిసి తెలిసి ఎవరు ఈ ప్రాంతానికి రారు. భయంతో హడలిపోతారు. అది ఒక వైపు. ఇంకో వైపు అద్దెకు ఉన్నవాళ్ళు సరిగ్గా బాడుగ చెల్లిస్తారో లేదో తెలియదు. ప్రతిరోజు అది తలుచుకుని టెన్షన్ పడాలి. ఇన్ని బాధలు పడేకంటే ఇంటిని అమ్మటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది మిత్రవింద.

వెంటనే ఒక పెద్ద అట్టమీద ఇల్లు అమ్మబడును. సంప్రదించండి అని పెద్దపెద్ద అక్షరాలతో రాసింది. కింద తన ఫోన్ నెంబర్ ఇచ్చింది.
రెండు రోజులు గడిచాయి. ఎవరు ఆమెను కాంటాక్ట్ చెయ్యలేదు. మిత్రవిందలో ఉద్వేకం మొదలైంది. ఇల్లు ఎలాగైన వారంరోజులలో అమ్ముడుపోవాలి. లేకపోతే చాల సమస్యలు ఎదురుకోవలసివస్తుంది. ఇంకో నాలుగురోజులలో ఆమెకు పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి. ఈ లోగా ఇంటికి సంబంధించిన రాతకోతలు పూర్తికావాలని ఆమె భావిస్తోంది.

ఆ రోజు మద్యాహ్నం తీరికగా పడుకంది. ఈ మద్యలో రెండుసార్లు అబ్బాస్ కు కాల్ చేసింది. కాని అతని వైపు నుంచి రెస్పాన్స్ రాలేదు. అప్పుడే తలుపు మీద చప్పుడు వినిపించింది. ఈ సమయంలో ఎవరు వచ్చారా అనుకుంటు ముందు భయపడిపోయింది మిత్రవింద. ఒక వేళ ఉగ్రవాదులు కాదుకదా. ఈఆలోచన రాగానే ఆమె శరీరం సన్నగా జలధరించింది.

మళ్ళి తలుపుమీద చప్పుడయింది. ఈ సారి గట్టిగా చప్పుడయింది. మెల్లగా సడలిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుని వెళ్ళి తలుపు తీసింది. బయట ఒక మద్యవయస్కుడు నిలబడిఉన్నాడు. అతని వేషం చూస్తుంటే అచ్చు రాజస్ధాన్ మార్వాడిలా ఉన్నాడు. మనిషి చాల ఖరీదుగా హుందాగా ఉన్నాడు.

“నా పేరు అగర్వాల్. ఇల్లు చూడటానికి వచ్చాను”అన్నాడు అతను వచ్చిరాని తెలుగులో.

మిత్రవింద తేలికగా నిటుర్చింది.

“రండి లోపలికి”అంటు మర్యాదగా ఆహ్వానించింది. అతన్ని వెంటపెట్టుకుని ప్రతి గది చూపించింది. అతని వాలకం చూస్తే ఇల్లు నచ్చినట్టుగా ఉంది. ఇల్లు చూసిన తరువాత ఇద్దరు హాలులో కూర్చున్నారు. మిత్రవింద అతనికి టీ ఆఫర్ చేసింది. అతను తాగుతుంటే లోపలికి వెళ్ళింది మిత్రవింద.  బీరువాలోంచి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకువచ్చి అతనికి చూపించింది.

పది నిమిషాలపాటు అగర్వాల్ ఆ డాక్చుమెంట్స్ ను నిశితంగా చూశాడు. తరువాత తృప్తిగా తల పంకించి అన్నాడు.

“ఇల్లు నాకు నచ్చింది. కాగితాలు కూడా సరిగ్గానే ఉన్నాయి. నేను మీకు తెలియకపోవచ్చు. కాని మీ నాన్నగారు చక్రపాణి గారు నాకు బాగా తెలుసు”అన్నాడు అగర్వాల్.

“మా నాన్నగారు మీకు తెలుసా ఎలా”అంది మిత్రవింద.

“ఒకసారి టెండర్ పని మీద మీ నాన్నగారి ఆఫీసుకు వెళ్ళాను. అప్పుడు మీ నాన్నగారు పరిచయం అయ్యారు.  ఆయన చాల మంచివాడు. యాభై వేలు లంచం ఇచ్చిన తీసుకోలేదు. సున్నితంగా తిరస్కరించారు. లంచం ఇచ్చి పనులు చేసుకోవటం తప్పని నాకు బుద్ధిచెప్పారు. అంతేకాదు ఇంకేప్పుడు లంచం ఇవ్వనని నా చేత ప్రమాణం చేయించుకున్నారు. ఆ రోజు నేను ఎప్పటికి మరిచిపోలేను బేటీ. జరిగింది తలుచుకుని చాల బాధపడ్డాను. ఒకసారి ఇక్కడికి వచ్చి నిన్ను ఓదార్చాలని అనుకున్నాను. అప్పుడే నా స్నేహితుడు వచ్చి మీ ఇంటి గురించి చెప్పాడు. అంతకుముందు నాకు ఒక ఇల్లు కావాలని వాడితో చెప్పాను. ఇల్లు కొన్నట్టుగా ఉంటుంది నిన్ను చూసినట్టు ఉంటుందని ఇలా వచ్చాను”అన్నాడు అగర్వాల్.

తన కుటుంబాన్ని గుర్తు చేసే సరికి మిత్రవింద దుఖ్ఖం ఆపుకోలేకపోయింది. సిగ్గు విడిచి గట్టిగా ఏడ్చేసింది. అగర్వాల్ ఇబ్బందిగా చూశాడు.

“సారీ అమ్మాయి. మరిచిపోయిన గాయాన్ని మళ్ళి కెలికినట్టు ఉన్నాను. ఏం అనుకోకు”అన్నాడు అపాలజటిక్ గా.మిత్రవింద వెంటనే కళ్ళు తుడుచుకుని అయనను చూసి నవ్వింది.

“ఉన్నట్టుండి మీరు నాన్నను గుర్తుచేశారు. తట్టుకోలేకపోయాను. సరే అసలు విషయానికి వస్తాను. ఈ ఇంటిని అమ్మటానికి నేను ఒక రేటు పెట్టుకున్నాను.  ఆ రేటు మీరు ఇవ్వగలిగితే మీకు ఇల్లు అమ్మటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు”అంది మిత్రవింద.

“ఎంత”అడిగాడు అగర్వాల్. మిత్రవింద చెప్పింది.అగర్వాల్ ఇంకేం ఆలోచించకుండ సరే అన్నాడు.

ఒక్కసారిగా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది మిత్రవింద. ఢీల్ ఇంత తొందరగా పూర్తవుతుంది ఆమె కలలో కూడా అనుకోలేదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు మిత్రవింద. అదే రోజు రాతకోతలు పూర్తిచేసింది. పూర్తి డబ్బు తీసుకుని ఇంటిని అగర్వాల్ పేరు మీద టాన్స్ ఫర్ చేసింది. కాని మిత్రవింద వెంటనే ఇంటిని అగర్వాల్ కు స్వాధీనం చెయ్యలేకపోయింది. ఇంకో వారం రోజులు టైం కావాలని అడిగింది.
అగర్వాల్ కు మిత్రవింద పరిస్థితి తెలుసు. ఆమె ఎందుకు టైం అడిగిందో కూడా తెలుసు. అందుకే సరే అని అన్నాడు. అగర్వాల్ వెళ్ళిపోయిన తరువాత డబ్బును జాగ్రత్తగా బీరువాలో పెట్టి తాళం వేసింది. ఒక సమస్య తీరిపోయింది. ఇంకా  పోస్టింగ్ ఆర్డర్స్ రావటమే మిగిలింది. కాని ఈ లోగా ఆమె ఇంకో పని చెయ్యవలసి ఉంది. ఇంటిలో చాల చెత్త సామానులు పేరుకుని ఉన్నాయి. వాటిలో ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడని బట్టలు డ్రస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. వాటిని మూటకట్టి ఏ అనాధ ఆశ్రమానికి అయిన ఇవ్వాలి. కనీసం వాళ్ళకైన అవి ఉపయోగపడతాయి.

ముందు తల్లి తండ్రి బీరువా తెరిచింది. తల్లి చీరలు రెండు మాత్రం తీసుకుంది. మిగతావన్ని నేలమీద కుప్పలా పోసింది. వాటిని మూటకట్టి తన గదిలోకి వచ్చింది. ముందు వసంతసేన బీరువా శుభ్రం చెయ్యటం మొదలుపెట్టింది. కొన్ని చీరలు తీసి నేలమీద పడేసింది. అప్పుడే ఒక కాగితం ఎగిరి నేలమీద పడింది.

ఆసక్తితో తీసి చూసింది. అది వసంతసేన మిత్రవిందకు రాసిన ఉత్తరం. ఆఖరి ఉత్తరం . ఈ ఉత్తరం రాసే సమయానికి మిత్రవింద ఢిల్లీలో ట్రయినింగ్ లో ఉంది.  ఆసక్తిగా చదవటం మొదలుపెట్టింది.

అక్కా ఈ ఇలాంటి ఉత్తరం నీకు రాయవలసివస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. కాని రాయక తప్పలేదు. ముందు నీకు కూడా ఈ విషయం చెప్పకూడదనే అనుకున్నాను. కాని నా మనసాక్షి దానికి ఒప్పుకోలేదు. చిన్నతనం నుంచి నేను ఏ విషయం నీ దగ్గర దాచలేదు. అలాగే పెద్దయిన తరువాత కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాను. కాని ఈ మద్యకాలంలో ఒక విషయం నీ దగ్గర దాచాను. అది నా ప్రేమ విషయం. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. అతను నా క్లాస్ మెట్ కాదు. కనీసం నా కాలేజి కూడా కాదు. అతని గురించి నాకు కొంచం కూడా తెలియదు. అనుకోకుండ ఒక రోజు నాకు మాల్ లో పరిచయం అయ్యాడు. ఒక రోజు నేను నా స్నేహితురాలు మాల్ కు వెళ్ళాం. నా స్నేహితురాలు ఏవో కొన్ని డ్రస్ మెటీరయల్ కొనుక్కుంది. డబ్బు ఇవ్వటానికి పర్స్ తెరిస్తే అందులో డబ్బులేదు. డబ్బు ఎలా పోయిందో మాకు తెలియలేదు. తను పర్సులో డబ్బు పెట్టుకునే వచ్చానని నా స్నేహితురాలు చెప్పింది. కాని తీరా మాల్ లో చూస్తే డబ్బు లేదు. మాకేం చెయ్యాలో తోచలేదు. కార్డ్ ద్యార పే చెయ్యాలనుకుంది. కాని ఆ రోజు ఆమె కార్డ్ తీసుకురాలేదు. నా దగ్గర కూడా ఇవ్వటానికి అంత డబ్బులేదు.”

“ఏం చెయ్యాలో మాకు తోచలేదు. మాల్ కు వచ్చిన వాళ్ళంతా మా వైపు వింతగా చూస్తున్నారు. చుట్టు ఉన్న సేల్స్ మెన్ కూడా మా వైపు అదోరకంగా చూస్తున్నారు. తల కొట్టేసినట్టు అయింది. అప్పుడే దేవుడు పంపించినట్టు ఒక యువకుడు మా దగ్గరకు వచ్చాడు. అతను చాల అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. మా పరిస్ధితి గురించి తెలుసుకున్నాడు. మాకు సహయం చెయ్యటానికి ఒప్పుకున్నాడు. చెప్పినట్టుగానే బిల్ పే చేశాడు. సమస్య తీరిపోయినందుకు నేను నా స్నేహితురాలు ఎంతో రిలీఫ్ ఫీలయ్యాం.”
“ఇద్దరం అతనికి ద్యాంక్స్ చెప్పాం. తన అడ్రస్సు చెప్పమని అడిగాం. రేపు అతనికి ఇంటికి వచ్చి డబ్బు తిరిగి ఇచ్చేస్తామని చెప్పాం. కాని అతను ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. మా వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వు నాకు ఎంతో మనోహరంగా కనిపించింది. చాల కొద్ది మంది మగవాళ్ళు మాత్రమే అంత అందంగా నవ్వగలరు.

ఆ నవ్వుకు నేను పూర్తిగా మెస్మరైజ్ అయిపోయాను. కనీసం తన ఫోన్ నెంబర్ అయిన ఇవ్వమని అడిగాను. ఇచ్చాడు. దాన్ని జాగ్రర్తగా నా సెల్ లో లోడ్ చేసుకున్నాను. తరువాత ముగ్గురం పిచ్చాపాటి మాట్లాడుకుంటు మాల్ లోంచి బయటకు వచ్చాం.  కలిసి కాఫీ తాగుదామని అతను ప్రపోజ్ చేశాడు. మేము సరే అన్నాం”అలా అతనితో నాకు మొదటిసారి పరిచయం కలిగింది.

“ఒకరోజు అతనే నాకు కాల్ చేశాడు. సినిమాకు వస్తావా అని అడిగాడు. అంతకు ముందే అతని గురించి ఒక స్దిరమైన అభిప్రాయం ఏర్పరుచుకుని ఉన్నాను. అందుకే ఏ మాత్రం సందేహించకుండ సరే అన్నాను. అది ఒక ఇంగ్లీష్ సినిమా. అందులో కధ కంటే సెక్స్ ఎక్కువగా ఉంది. ఆ సినిమాకు వచ్చిన వాళ్ళంతా యువజంటలు. పైగా సెక్స్ సినిమా కావటంతో హాలంతా పూర్తిగా నిండిపోయింది. ఇద్దరం మూలగా ఉన్న సీటులో కూర్చున్నాం. సెక్స్ దృశ్యాలు చూసి నేను కొంచం స్పందించాను. కాని అమ్మాయిని కనుక ప్రొసిడ్ కాలేకపోయాను. అతనే ముందు ప్రొసిడ్ అవుతాడని అనుకున్నాను. కాని అతనిలో కొంచం కూడా చలనం కలగలేదు. రాయిలా స్ధిరంగా కూర్చున్నాడు.”
“అతని ప్రవర్తన చూసి నాకు చాల ఆశ్చర్యం వేసింది. అతని స్ధానంలో ఇంకేవరైన ఉంటే ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునేవారు. కాని అతనిలో కొంచం కూడా స్పందన కలగలేదు. చాల హుందాగా పెద్ద మనిషిలా ప్రవర్తించాడు. ఈ నాటి యువకులు అలా ఉండటం చాల అరుదుగా చూస్తుంటాం. ఈ సంఘటన అతని మీద మరింత గౌరవం పెంచింది. అంతకుముందు అంతో ఇంతో అతని గురించి కొంచం భయం ఉండేది. కాని ఆ సంఘటనతో ఆ భయం పూర్తిగా పోయింది. దానిస్ధానంలో అతని మీద విపరీతమైన నమ్మకం ఏర్పడింది.”

“ఆ తరువాత ఇద్దరం తరుచు కలుసుకునేవాళ్ళం. ప్రతి సారి వచ్చినప్పుడల్లా కొత్త కారు తీసుకుని వచ్చేవాడు. వాళ్ళకు ఎన్ని కార్లు ఉన్నాయో నాకు తెలియదు. కాని అతను చాల డబ్బున్నవాడని మాత్రం తెలిసింది. నా నమ్మకాన్ని నిజం చేస్తున్నట్టుగా విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవాడు. జేబులో ఎప్పుడు రెండువేల రుపాయల నోట్ల కట్టలు కనిపించేవి.”

“నా మీద అతనికి ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు. నాకు మాత్రం అతని మీద పిచ్చి ప్రేమ కలిగింది. పెళ్ళి చేసుకుంటే అతనినే పెళ్ళిచేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. కాని బయటపడలేదు. ఒక అమ్మాయిగా నాకు బయటపడటం ఇష్టంలేదు. అతనికి కూడా నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే అతనే ప్రపోజ్ చేస్తాడు. ఈ లోగా నేను తొందరపడటం మంచిది కాదని తోచింది. “

“ఆ సమయం రానే వచ్చింది. ఒక రోజు అతను నాకు కాల్ చేశాడు.ఆ సమయంలో నేను కాలేజిలో ఉన్నాను.

“వసు ఈ రోజు కాలేజి అయిన తరువాత ఇంటికి వెళ్ళకు. మెయిన్ గేటు దగ్గర కాచుకో. నేను వచ్చి పికప్ చేసుకుంటాను”అన్నాడు.

“ఎక్కడికి వెళుతున్నాం”ఆశ్చర్యంగా అడిగాను.

“మా ఇంటికి. మా అమ్మ నాన్న నిన్ను చూడాలని తహతహలాడుతున్నారు. అందుకే నిన్ను తీసుకువెళ్ళ పరిచయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ రోజు మిస్ అయితే ఇంకో నెల వరకు కుదరదు. మా వాళ్ళు సింగపూర్ వెళుతున్నారు. ఆ తరువాత కాని నువ్వు వాళ్ళను కలుసుకోవటం కుదరదు. అందుకే ఈ రోజు మనం ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళితీరాలి”అన్నాడు.

“నాకు సంతోషంతో నోట్లోంచి మాటరాలేదు. ఈ రోజు కోసమే నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒక రకమైన మత్తు నన్ను ఆవహించింది. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు సరే అన్నాను.

“బై అంటు లైన్ కట్ చేశాడు అతను.

కాలేజి అయిన తరువాత మెయిన్ గేటు దగ్గర నిలబడ్డాను. సరిగ్గా పదినిమిషాల తరువాత కారు తీసుకుని అతను వచ్చాడు. వెళ్ళి అతని పక్కన డ్రైవింగ్ సీటులో కూర్చున్నాను. కారు వేగంగా అతని ఇంటి వైపు సాగిపోయింది. అరగంటతరువాత కారు అతని బంగళా ముందు ఆగింది.రెండంతస్ధుల పెద్ద ఖరీదైన భవనం అది. భవనం ముందు పెద్ద ఇనుపగేటు ఉంది. దాని దగ్గర యూనిఫారమ్ వేసుకున్న గేట్ కీపర్ ఉన్నాడు.”

“కారును చూడగానే గేట్ కీపర్ గేటు బార్లా తెరిచాడు. కారు వేగంగా వెళ్ళి పోర్టికోలో అగింది.

“రా వసూ ఇదే మా ఇల్లు”అన్నాడు అతను చెయ్యి అందిస్తూ.

“నేను ఆ చెయ్యి పట్టుకుని కారులోంచి దిగాను. ఇద్దరం చెట్టాపట్టాలు వేసుకుని లోపలికి వెళ్ళాం.”

“హాలులోకి అడుగుపెడుతూ అప్రయత్నంగా ఆగిపోయాను. లోపల కనిపించిన వైభోగం నన్ను ఒకక్షణం పాటు ఆశ్చర్యానికి గురిచేసింది. హాలులో గోడలకు నిలువెత్తి ఖరీదైన అయిల్ పేయింటింగ్స్ వేలాడుతున్నాయి. ఒక్కోక్కో పెయిటింగ్ ఖరీదు కొన్ని లక్షలు ఉంటుంది. అలాంటివి దాదాపు పది పేయింటింగ్స్ ఉన్నాయి. హాలు మద్యలో ఉన్న ఫర్నిచర్ కూడా ఎంతో ఖరీదనవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇంట్లో ప్రతి వస్తువు ఆ ఇంట్లో వాళ్ళు ఎంత ధనవంతులో చెప్పకనే చెప్పుతున్నాయి. హాలు కూ కుడిపక్కన మేడమెట్లు కనిపించాయి. హాలు హంగు ఆర్భాటం చూసి నేను వచ్చిన పని పూర్తిగా మరచిపోయాను. వాళ్ళ తల్లి తండ్రిని గురించి అడగటం విస్మరించాను. మేడమెట్లు ఎక్కుతుంటే అప్పుడు ఆ విషయం గుర్తుకువచ్చింది. అదే విషయం అడిగాను.

“అతను నవ్వు అమ్మ నాన్న పైన గదిలో ఉన్నారని చెప్పాడు. నేను నిజమనే నమ్మాను. అప్పుడు కూడా నాకు అతని మీద కొంచం కూడా అనుమానం రాలేదు. అందుకే ధైర్యంతో వెళ్ళాను. పైన పొడుగాటి నడవ కనిపించింది. నడవకు రెండువైపుల వరుసగా గదులు కనిపించాయి. అన్ని గదులు ఒకేలా ఉన్నాయి. చాల ఖరీదుగా ఫైవ్ స్టార్ హోటల్ గదిలా ఉన్నాయి. అతను నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గది అందం నేను వర్ణించలేను. అంత బాగుంది. “

“మీ అమ్నా నాన్న ఏరి”అన్నాను అనుమానంగా.

అతను చిరునవ్వు నవ్వాడు. నాకు జవాబు చెప్పకుండ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. మా పరిచయం అయి చాల రోజులైంది. మేమిద్దరం ఎన్నోసార్లు రాత్రి వేళ ఏకాంతంగా గడిపాం. చుట్టుపక్కల ఎవరులేని ప్రదేశంలో గంటల తరబడి ఉన్నాం. కాని ఎప్పుడు అతను నన్ను ముట్టుకోలేదు. కనీసం తాకనైన లేదు. కాని ఈ రోజు అతనికి ఏమైందో ఏమో అమాంతంగా దగ్గరకు లాక్కున్నాడు. ఈ పరిణామం నాకు ఒక వైపు ఆనందంగానే ఉంది. అయిన లోపల ఏదో అనుమానం నన్ను పీడిస్తోంది. అందుకే బలవంతంగా జరిగాను. అతను ఆశ్చర్యంగా నా వైపు చూశాడు.

“మీ వాళ్ళు నన్ను చూడాలని అన్వావు. కాని వాళ్ళు ఎక్కడ కనిపించటం లేదు “అన్నాను సీరియస్ గా. “ఇప్పుడే వస్తారు. కంగారుపడవద్దు. అనుకోకుండ నాన్నగారి బిజినెస్ అసోసియేట్ వచ్చాడు. ఆయనతో మాట్లాడుతున్నారు. పది నిమిషాలలో వస్తారు. ఈ లోగా నీకు కూల్ డ్రింక్ ఇస్తాను. తాగు “అని గదిలో ఉన్న మిని బార్  దగ్గరకు వెళ్ళాడు. అందులో ఖరీదైన రకరకాల డ్రింక్స్ ఉన్నాయి. వాటిలో కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అందులోంచి ఒక బాటిల్ తీసి ఓపనర్ తో ఓపన్ చేశాడు. తను మాత్రం గ్లాసులో ఒక లార్జ్ పెగ్ విస్కీ పోసుకున్నాడు. అతను తాగుతాడని అప్పటివరకు నాకు తెలియదు.”

“ఇదిగో సాఫ్ట్ డ్రింక్”అని నాకు బాటిల్ ఇచ్చాడు.

“తను విస్కీ ఉన్న గ్లాసు అందుకుని చీర్స్ అంటు నా బాటిల్ కు తగిలించాడు.

“నేను ఏ మాత్రం అనుమానించకుండ కూల్ డ్రింక్ తాగాను. ఈ లోగా అతను మొదటి పెగ్ పూర్తిచేశాడు.

రెండు క్షణాలు గడిచాయి. అప్పుడే ఊహించని పరిణామం ఎదురైంది.“నా తల గిర్రున తిరగటం మొదలుపెట్టింది. పైగా విపరీతమైన తలనొప్పి. శరీరం అదుపు తప్పినట్టు తూలిపోసాగింది. ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. భయంతో అతని వైపు చూశాను. అతను ఎగతాళిగా నవ్వుతున్నాడు. ఒక గొప్ప విజయం సాధించినట్టు నవ్వుతున్నాడు. అంత మత్తులోను నాకు జరిగింది అర్ధమైంది. అతని మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. కాని అతను నాకు ద్రోహం చేశాడు. నాకు ఇచ్చిన సాఫ్ట్ డ్రింకులో మత్తుమందు కలిపాడు. “

“జరిగింది అర్ధమవ్వటంతో నాకు కోపం ఆగలేదు. కోపంగా అతని మీదకు దూసుకుపోయాను. కాని వాడు కొంచం కూడా బెదరలేదు. నన్ను దగ్గరకు రానిచ్చి బలంగా నన్ను వెనక్కి తోశాడు. నేను విసురుగా వెళ్ళి మంచంమీద పడ్డాను. అప్పటికే మత్తు పూర్తిగా నా శరీరాన్ని అక్రమించుకుంది. కళ్ళు మూతలుపడుతున్నాయి. బలవంతంగా కళ్ళు తెరవాలని ప్రయత్నించాను. కాని వీలుకాలేదు. నా కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. తరువాత ఏమైందో నాకు తెలియదు.”

“తిరిగి నేను కళ్ళు తెరిచేసరిగి ఎదురుగా అతను కనిపించాడు. ఆశ్చర్యంగా వాడి శరీరం మీద కొంచం కూడా బట్టలు లేవు. అప్పుడే పుట్టిన పసిపిల్లవాడిలా ఉన్నాడు. సిగ్గుతో నా తలకిందికి వాలిపోయింది. అప్పుడే నా పరిస్ధితి నాకు తెలిసింది. అతనిలాగే నా శరీరం మీద కూడా బట్టలు లేవు. పూర్తిగా నగ్నంగా ఉన్నాను. నేను వేసుకున్న బట్టలు మంచంమీద ఒక మూలగా ఉన్నాయి. “

“జరిగిన దారుణం నాకు పూర్తిగా అర్ధమైంది. ఆ నీచుడు నన్ను నమ్మించి నా గొంతు కోశాడు. నన్ను మానభంగం చేశాడు. నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేశాడు. కోపం బాధ నన్ను కలిసికట్టుగా కుదిపేశాయి. ఒక్కసారిగా ఏడుపు ముంచుకు వచ్చింది. అమాంతం అతని కాళ్ళ మీద పడ్డాను. సిగ్గు విడిచి నన్ను పెళ్ళిచేసుకోమని బ్రతిమాలాను. కాని ఆ నీచుడు నా మాటలు వినిపించుకోలేదు. కనీసం జాలి చూపించలేదు. పైగా పిశాచంలా నవ్వాడు.

“ఈ క్షణం కోసమే ఇన్ని రోజులు ఎదురుచూశాను. ఇప్పుడు నా కోరిక నెరవేరింది. నా పగ చల్లారింది”అన్నాడు నా వైపు అసహ్యంగా చూస్తూ.
అతని మాటలు నాకేం అర్ధం కాలేదు. అయోమయంగా చూశాను. అతను నా ఉద్దేశం గ్రహించినట్టు చిన్నగా నవ్వి మళ్ళి అన్నాడు.
“అందరి ముందు మీ అక్క మిత్రవింద నన్ను అవమానపరిచింది. నా ప్రేమను ఎగతాళి చేసింది. అడుగుఅడుగున నన్ను కించపరిచింది. ఇంతవరకు ఏ అమ్మాయి నన్ను కాదనలేదు. నా కోరిక తీర్చకుండ ఉండలేదు. కాని మీ అక్క మాత్రం నాకు లొంగలేదు. పైగా నన్ను ప్రిన్స్ పాల్ దగ్గరకు తీసుకువెళ్ళి నిలబెట్టింది. ఆయన నన్ను అనరాని మాటలు అన్నాడు. పదిమంది ముందు నన్ను ఘోరంగా అవమానించాడు. అది తట్టుకోలేకపోయాను. నన్ను ఇంత బాధకు గురిచేసిన మీ అక్కను వదలకూడదని గట్టిగా తీర్మానించుకున్నాను. నాకు దక్కని అందం ఇంకేవరకి దక్కకూడదని భావించాను. అందుకే ఆమె మొహం నాశనం చెయ్యటానికి యాసిడ్ తో కాలేజికి వచ్చాను. కాని అదృష్టవశతు మీ అక్క ఆ రోజు తప్పించుకుంది.”

“నా మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తుందమో అని భయం వేసింది. అందుకే ఊరువదిలి మా బందువుల ఇంటికి వెళ్ళాను. అక్కడే చాల రోజులు దాక్కున్నాను. ఇంతవరకు నేను ఎవరికి భయపడలేదు. కాని మొదటిసారిగా భయపడి పిరికివాడిలా ఎక్కడో అనామకుడిలా దాక్కున్నాను. చాల రోజుల తరువాత నా మీద మీ అక్క పోలీస్ కంప్లయింట్ ఇవ్వలేదని తెలిసింది. సంతోషంతో తిరిగి వచ్చాను. కాని నా మనస్సులో పగమాత్రం తగ్గలేదు.”

“అందుకే సమయం కోసం కాచుకున్నాను. ఆ సంఘటన సద్దుమణిగిన తరువాత మళ్ళి ఈ ఊరువచ్చాను. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. మిత్రవిందను ప్రత్యేక్షంగా బాధపెట్టటం కంటే ఆమెను పరోక్షంగా ఇబ్బంది పెట్టటం మంచిదని తోచింది. అందుకే మీ కుటుంబం గురించి రహస్యాంగా తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. నువ్వంటే మీ అక్కకు చాల ఇష్టం. నీకు ఏదైన జరిగితే తట్టుకోలేదు. అందుకే నిన్ను టార్గట్ చేశాను. మంచివాడిలా నటిస్తూ నీ మనస్సులో స్ధానం సంపాదించుకున్నాను. ఆ నమ్మకంతోనే నేను పిలిచిన వెంటనే మా ఇంటికి వచ్చావు. నీకు సాఫ్ట్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చాను. తరువాత నా కోరిక పగ తీర్చుకున్నాను.”అన్నాడు.

అతను మరోవరో కాదు అక్కా. నీ క్లాస్ మెట్ రాహుల్.అతని మాటలు విని పూర్తిగా కదిలిపోయాను. నన్ను మోసం చెయ్యవద్దని బ్రతిమాలాను. కాళ్ళమీద పడ్డాను. కాని ఆ రాక్షసుడి మనస్సు కరగలేదు. నిర్ధాక్షిణ్యంగా నన్ను తన్ని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎలా ఇంటికి చేరుకున్నానో నాకు అర్ధంకాలేదు. అమ్మ నాన్న మొహం చూడలేకపోయాను. ఆ పవిత్ర దంపతులను చూస్తుంటే నాకు ఎంతో బాధకలిగింది. ధైర్యంగా వాళ్ళ మొహం వైపు చూడలేకపోయాను. నా గురించి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నను గొప్పగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని అనుకున్నారు. పైగా బావ కూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే నా చదవు బాధ్యత పెళ్ళి బాధ్యత కూడా తనే తీసుకున్నాడు. నువ్వుకూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నావు. ఇంతమంది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేనే వమ్ముచేశాను. కన్నుమిన్ను తెలుసుకోకుండ ఒక మగవాడికి లొంగిపోయాను. వాడు నన్ను మోసం చేసి లొంగదీసుకోవచ్చు. కాని నేనేందుకు అతన్ని నమ్మి అతన ఇంటికి వెళ్ళాలి. వెళ్ళకుండ ఉంటే ఇంత అనర్ధం జరిగేది కాదు. మన కుటుంబానికి తలవంపులు వచ్చేవి కావు.”

“రహస్యాలను ఎవరి దగ్గర అయిన దాచుకోవచ్చు. తల్లి తండ్రుల దగ్గర నుంచి దాచవచ్చు. తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుంచి దాచవచ్చు. స్నేహితుల దగ్గర నుంచి కూడా దాచవచ్చు. కాని మనసాక్షి దగ్గర నుంచి దాచలేము. మనం ఒకవేళ తప్పు చేస్తే అది పదేపదే గుర్తుచేస్తుంది. మనం చేసిన తప్పును ఎత్తి చూపిస్తుంది. ప్రతి క్షణం అదిచేసే హెచ్చరికను మనం తట్టుకోలేం. అంతకంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు. అదే పని నేను చెయ్యబోతున్నాను. “

“ఈ చేదు నిజం అమ్మ నాన్నకు చెప్పలేను. ఒకవేళ చెప్పిన విని వాళ్ళు తట్టుకోలేరు. సిగ్గుతో చితికిపోతారు. తన చిన్న కూతురికి పెళ్ళి కాకుండానే శోభనం జరిగిందని తెలిసుకుని లోలోపల కుమిలిపోతారు. వాళ్ళ బాధ ను నేను చూడలేను. నువ్వు ట్రయినింగ్ వచ్చిన తరువాత ఆత్మహత్య చేసుకోవాలని ముందు అనుకున్నాను. కాని అన్ని రోజులు కాచుకునే ఓపిక నాకు లేదు. పైగా రోజు అమ్మ నాన్నమొహాలను చూస్తూ నేను మనశాంతితో ఉండలేను. అందుకే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నాను.నా చావుకు కారకుడు ఆ రాహుల్. ఇంతకంటే ఇంకేం రాయలేను. ఉంటాను. ఇంకో జన్మలో కూడా నీ చెల్లెలిగా పుట్టాలని  దేవుడిని కోరుకుంటు సెలవు తీసుకుంటున్నాను.

వసంతసేన”

ఉత్తరం పూర్తిగా చదివిన మిత్రవింద కట్రాయిలా బిగుసుకుపోయింది. ఆమె మెదడు పూర్తిగా స్తంబించిపోయింది. కొన్ని క్షణాలు ఉత్తరం పట్టుకుని అలాగే ఉండిపోయింది. తరువాత తేరుకుని మంచం మీద కూర్చుంది. జరిగింది మొత్తం ఇప్పుడు అర్ధమైంది. ఉగ్రవాదులు దాడిచెయ్యకముందే వసంతసేన నిద్రమాత్రలు మింగి మంచంమీద పడుకుంది. ఆమె చనిపోయిన తరువాత ఉగ్రవాదులు ఇంట్లోకి వచ్చారు. మంచంమీద నిశ్చలంగా ఉన్న వసంతసేనను చూసి నిద్రపోతుందని భావించారు. విచక్షణరహితంగా మిషన్ గన్ తో కాల్పులు జరిపారు.
రాహుల్ ఇంత పని చేస్తాడని మిత్రవింద ఊహించలేదు. ఆ రోజు యాసిడ్ సంఘటన తరువాత మళ్ళి ఆమెకు రాహుల్ కనిపించలేదు. దాంతో అతను మారిపోయాడని భావించింది. ఇక జన్మలో తన జోలికి రాడని అనుకుంది. కాని అతను తెలివిగా తన చెల్లెలును టార్గట్ చేశాడు. తన అందం డబ్బుతో ఆమెను వశపరుచుకున్నాడు. మంచివాడిగా నటించి ఆమెను మోసం చేశాడు. పరోక్షంగా తన ఉన్న పగను తీర్చుకున్నాడు. తన వల్లే అతను వసంతసేనను మోసం చేశాడు. ఈ విషయం తలుచుకుంటే చేదు మాత్ర మింగినట్టుగా ఉంది ఆమెకు.
చాల సేపు ఆలోచిస్తూ నిశ్చలంగా కూర్చుంది మిత్రవింద. అప్పుడేతలుపు మీద చప్పుడు వినిపించింది. ఈ వేళప్పుడు ఎవరు వచ్చారా అనుకుంటు వెళ్ళి తలుపు తీసింది. గుమ్మం దగ్గర అబ్బాస్ కనిపించాడు.అతని వాలకం బాగా మారిపోయింది. గడ్డం బాగా పెరిగిపోయింది. తైలా సంస్కారం లేక జుట్టు చిందరవందరగా ఉంది. బట్టలు పూర్తిగా నలిగిపోయిఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పది లంకణాలు చేసినవాడిలా ఉన్నాడు.

“నవ్వా అంది మిత్రవింద అస్పష్టంగా.

“అవును మిత్రవింద నేనే”అన్నాడు అబ్బాస్.

“లోపలికి రా”అని పక్కకు తప్పుకుంది మిత్రవింద. అబ్బాస్ లోపలికి రాగానే తలుపు మూసింది. ఇంకా ఆమెచేతిలో వసంతసేన రాసిన ఉత్తరం ఉంది.“సారీ మిత్రవింద జరిగిన దారుణం విని చాల బాధపడ్డాను”అన్నాడు అతను.“ఇందులో నీ తప్పు ఏముంది. ఉగ్రవాదులు చేసిన పనికి నువ్వు ఎలా బాధ్యుడవుతావు?

“ఇరవైనాలుగు గంటలు రెండు దేశాల మద్య సమావేశం గురించి మాత్రమే ఆలోచించాను. ఉగ్రవాదులు సమావేశాన్ని భగ్నం చేస్తారేమో అని భయపడ్డాను.అందుకే నా దృష్టి అంతా అక్కడే కేంద్రికరించారు. కాని ఒక్క క్షణం కూడా బారముల్లా గురించి ఆలోచించలేదు.ఆ రెండు రోజులు బారముల్లాలో కొంచం కూడా సెక్యురిటి లేదు. మా సరిహద్దు దగ్గర కూడా ఎవరు లేరు. అందరు సమావేశం జరిగిన స్ధలంలో ఉన్నారు. ఈ విషయం ఉగ్రవాదులు గమనించారు. సరిగ్గా మంచి సమయం చూసి దాడి చేశారు. ఒక రకంగా నీ కుటుంబాన్ని పొగోట్టు కోవటానికి పరోక్షంగా నేనే కారకుడిని. నా అసమర్ధత ముందు చూపు లేకపోవటం వల్ల ఇంత పెద్ద అనర్ధం జరిగింది” అన్నాడు అబ్బాస్.

అబ్బాస్ తన వాళ్ళను గుర్తుచెయ్యగానే పూర్తిగా కదిలిపోయింది మిత్రవింద. పెద్దగా ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోయింది.
“ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. నా ఆత్మీయులంతా నన్ను విడిచి వెళ్ళిపోయారు. మన పెళ్ళి చూడకుండానే అమ్మ నాన్న చనిపోయారు. నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఇంకేవరు ఉండరు”అంది వాపోతూ మిత్రవింద.

అబ్బాస్ అనునయంగా ఆమె భుజం తట్టాడు.

“నీకు ఎవరులేరని ఎందుకుఅనుకుంటున్నావు. నేను ఉన్నాను. మా అమ్మగారు ఉన్నారు. నిన్ను కళ్ళలో పెట్టి చూసుకుంటాం. ఇంకేప్పుడు మా ముందు అలా అనకు”అన్నాడు. మిత్రవింద ఇంకేం మాట్లాడలేదు. అతని స్పర్శను అనుభవిస్తూ కొంచం సేపు కళ్ళు మూసుకుంది. అబ్బాస్ కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరు ఒకరి స్పర్శను ఒకరు అనుభవిస్తూ అలౌకికమైన ఆనందంలో ఉండిపోయారు. ముందుగా మిత్రవింద తేరుకుంది. మెల్లగా అతనికి దూరంగా జరిగింది.ఏదో మాట్లాడబోయాడు అబ్బాస్. అప్పుడే అతని చూపులు ఆమె చేతిలో ఉన్న కాగితం మీద పడింది.“ఏమిటా కాగితం “అడిగాడు అబ్బాస్.మిత్రవింద జవాబు చెప్పకుండ మౌనంగా కాగితాన్ని అందించింది.వసంతసేన రాసిన ఉత్తరాన్ని పూర్తిగా చదివాడు అబ్బాస్. అతని మొహం గంభీరంగా మారిపోయింది.

“రాహుల్ అంటే ఈ రోజు నీ మీద యాసిడ్ తో దాడిచెయ్యటానికి ప్రయత్నించినవాడు కదూ”అన్నాడు.

“అవును వాడే. నా మీద కోపంతో నా చెల్లెలును పాడుచేశాడు. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు”అంది మిత్రవింద నిర్లిప్తంగా.
వెంటనే ఏం మాట్లాడలేదు అబ్బాస్. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు.

“ఏమిటి ఆలోచిస్తున్నావు అబ్బాస్? అడిగింది మిత్రవింద.

“ఏం లేదు. రాహుల్ అడ్రస్సు తెలుసా”ఉన్నట్టుండి అడిగాడు అబ్బాస్.

“తెలుసు. ఎందుకు అడుగుతున్నావు” అడిగింది ఆశ్చర్యంగా మిత్రవింద.

“ఏంలేదు ఊరికే తెలుసుకుందామని”చెప్పు రాహుల్ ఎక్కడుంటాడు.? మిత్రవింద రాహుల్ ఇంటి అడ్రస్సు చెప్పింది. దాని బాగా గుర్తుపెట్టుకున్నాడు అబ్బాస్.

అబ్బాస్ , రాహుల్ ని ఏవిధంగా శిక్షిస్తాడు... కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన మిత్రవిందకు  అండగా అబ్బాస్ నిలుస్తాడా... తెలియాలంటే  వచ్చే శుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి..

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nee peru talachina chalu