Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue323/825/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)... అపరిమితమైన కళలను వెదజల్లుతూ, అత్యంత శోభాయమానంగా, కళ్లు చెదిరేలా ఉంది   గుడిలోని కోదండరాముడి విగ్రహం. అందరినీ చల్లగా చూడమని ఆ రాముడిని మనసారా వేడుకున్నారందరూ. తిరిగి ఇంటికొచ్చి, వేడి-వేడి కట్టుపొంగలి, మసాలావడలు, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి కాంబినేషన్ తో లాగించి, దివాణం చూడడానికని బయలుదేరారు. శమంతంకం గారు చెప్పినట్లు  నిజంగానే దివాణం చాలాపెద్దది. చుట్టూ ప్రహారీగోడతో దుర్బేధ్యంగా ఉంది.

ఎంట్రన్స్ లో ఉన్న పెద్ద ఇనుపగేట్లను తీసుకుని దివాణంలోకి ప్రవేశించారందరూ. గేటుదగ్గరనుండి లోపలున్న భవనం వరకు సుమారు ఓ పావుకిలోమీటర్ దూరం ఉంటుంది.

దివాణం ఆవరణలో అనేక రకాల పూలమొక్కలు, ఫలవృక్షాలు ఉన్నాయి. తోటలో అక్కడక్కడా వాటర్ ఫౌంటెన్స్, విశ్రాంతిగా కూర్చునేందుకు సిమ్మెంట్ బెంచీలు ఉన్నాయి. తోట మధ్యలో అనేకభంగిమలలో అందంగా మలచిన పాలరాతి శిల్పాలు కొలువై ఉన్నాయి.

దివాణంలోకి అడుగు పెడుతూంటే ఏదో ఒకానొక వింత అనుభూతితో ఒళ్లు జలదరించింది. విశాలమైన పెద్దపెద్ద వసారాలు,, చిన్నపాటి ఇళ్ళు కట్టుకునేంత జాగాలలో నిర్మించిన అతిపెద్ద గదులు, ఆర్చీల్లాంటి గుమ్మాలు, అద్భుతమైన పనితనంతో మెరుస్తూ ఉన్న టేకుదర్వాజాలు… దివాణం వైభవం చూడడానికి రెండుకళ్లూ చాలడంలేదు.

గదులలో రాజవంశపు పెద్దలు సేకరించిన అనేకానేక పురాతన కళాఖండాలు , వంశపారపర్యంగా వస్తున్న పొడవాటి కత్తులు, వేటకెళ్లి తెచ్చిన పులిచర్మాలు, పులిగోళ్ళు, ఎన్నో ఏనుగుదంతాలు ఇవన్నీ ఉన్నాయి.

ఆ ఏనుగుదంతాలను చూసి “ ఆరోజుల్లోనూ వీరప్పన్ లాంటివాళ్ళు ఉన్నారన్నమాట!’’ గుసగుసలాడింది రమ్య మౌక్తిక చెవిలో.మరొక గదిలో రాజవంశపు పుట్టు పూర్వోత్తరాలు తెలియజేసే వంశవృక్షం గోడకి తగిలించబడి ఉంది. ఆనాటి రాజుల చిత్రపటాలన్నీ గోడలమీద అలంకరించబడి  ఉన్నాయి.

ఠీవిగా, దర్జాగా, అధికార దర్పాన్ని ఒలకపోస్తూ… ఒంపులు తిరిగిన కోరమీసాలతో ఉన్నారు వారందరూ. చివరగా…చిన్న రాజావారైన కుమారవర్మ తైలవర్ణ చిత్రం అమర్చబడి ఉంది.

“వావ్… ఎంత హ్యాండ్ సమ్ గా ఉన్నాడో!  ఈయనకి పెళ్ళి మీద విముఖతేమిటో పాపం!’’ అంది రమ్య చిన్నగా అరుస్తూ.అందరూ ఆమెకేసి చూశారొక్కసారిగా.

“ష్… నెమ్మది. అందరూ వింతగా మనల్నే చూస్తున్నారు’’ వారించింది మౌక్తిక. తో క్యా? చూస్తే చూడనీ. ఉన్నమాటే కదా… అన్నదీ… నిజం చెప్పు…చాలా బాగున్నాడు కదూ!’’ అంది రమ్య తమాషాగా కళ్ళు చికిలిస్తూ.

“అబ్బ! ఏమిటి రమ్యా…పసిపిల్లలా’’ ఆపినా ఆగదని తెలిసినా ఆమె అల్లరిని ఆపాలని చూసింది మౌక్తిక.

దివాణంలోని ప్రతి అంగుళం పట్టిపట్టి చూసేసరికి దాదాపు ఒంటిగంటైంది. ఎవరికీ కూడా బోర్ కొట్టకుండా తన వ్యాఖ్యానంతో అలరించారు శమంతకం గారు. ఒక సుందరమైన ప్రదేశాన్ని సందర్శించిన అనుభూతి ఒక తీపిగుర్తుగా మిగిలిపోయింది అందరి హృదయాలలోనూ.
దివాణం వెనకవైపునున్న మామిడితోటలోకి మధ్యాహ్నభోజనాలు తీసుకొచ్చారు సుమతి తాలూకు మనుషులు. ఉసిరిచెట్టుకింద కారీకదీపం వెలిగించి, అందరూ రుచికరమైన భోజనాన్ని తిన్నారు. అక్కడే కాస్సేపు కార్డ్స్ ఆడారు.

తరువాత తోటంతా విహరించారు. తోటంతా అనేకరకాల ఫల, పుష్పవృక్షాలతో కళకళలాడిపోతోంది. వసంతకాలంలో వన విహారం చేయడానికి అనువుగా తోటమధ్యలో నిర్మించిన మంటపం ఆకర్షణీయమైన శిల్పాలతో తీర్చిదిద్దబడి చూపరులని ఆకట్టుకుంటోంది. అక్కడ ఓ పక్కనే ఉన్న చిన్న నీటికొలను, నిండా తామరపూలతో రమణీయంగా ఉంది.

సుందర నందనోద్యానంలా ఉన్న ఆతోట అందాలకి పరవశించిపోయారందరూ. ఆడవాళ్లందరూ మాలినడిగి తలా కాసిని పూలు కోసుకున్నారు. మగాళ్లందరూ ఇళ్లదగ్గర ఉన్న భార్యలకోసమని కొన్ని పూలను ప్యాక్ చేసుకున్నారు. తోట చూడడం పూర్తయ్యాక, ఊరికి ఉత్తరాన ఉన్న ఉన్న బోడికొండను అధిరోహించారు. ఆ కొండమీద కూడా కిందన ఉన్నట్లే సీతారాముల గుడి ఉంది.కాకపోతే కాస్త శిధిలావస్థలో ఉంది. లోతెంతుంటుందో తెలియని రామగుండం, బౌధ్ధుల కాలంనాటి కొన్ని చారిత్రిక అవశేషాలు, వనవాససమయంలో సీతారాములు ఆప్రదేశంలో సంచరించినట్లుగా తెలియజేస్తున్న కొన్ని గుర్తులు, ఇవన్నీ చూసి కొండదిగేసరికి సాయంత్రం ఐదయ్యింది. మెట్ల సౌకర్యం లేని బోడికొండ ఎక్కి దిగేసరికి కాళ్ళు పట్లుపట్టేసి సలుపులు ప్రారంభమైనాయి. అందరూ సుమతి ఇంటికి చేరుకుని సామాన్లు సర్దుకుని తిరుగుప్రయాణానికి సంసిధ్ధులైనారు.   “చాలా థాంక్సండీ…పరాయివారు, పరిచయం లేనివారు అని కూడా చూడకుండా చక్కగా ఆతిధ్యం ఇచ్చారు.’’ అంతసేపూ ఏమూలనున్నారో కూడా తెలియకుండా నోరుమూసుకుని ఉన్న కాలేజీ ప్రిన్సిపాల్ అహోబిలం గారు తన ఉనికిని చాటుకుంటూ వందన సమర్పణ గావించారు. పేరుకి ఆయన ప్రిన్సిపాల్ అయినా, పెత్తనమంతా శమంతకం గారిదే అనుకుంటారు అందరూ. అనుకోవడం కాదు… అది వాస్తవం కూడానూ.

“అయ్యో! అలా అనుకోకండి. ‘ అతిథి దేవోభవ’ అని పెద్దలేనాడో చెప్పారు.’’  సుమతి మామగారు మీసాలు దువ్వుకున్నారు.

కోడలిచేత ఆడవారికి పసుపుకుంకాలు- జాకెట్ బట్టలు ఇప్పించింది సరస్వతి. పనివాళ్ళ సేవలకి సంతోషంగా డబ్బులిచ్చారు అందరూ. పొంగిపోతూ తీసుకున్నారు వాళ్లు.మరొకసారి సుమతికి, శ్రీకాంత్ కి కృతజ్ఞతలు చెప్పి బస్ ఎక్కారు. అప్పుడప్పుడు విహారయాత్రల పేరుతో ఇలా ప్రకృతిని సందర్శిస్తే ప్రశాంతతతో పాటుగా, బుధ్ధి కూడా వికసిస్తుందనిపించింది అందరికీ.

ప్రతిఒక్కరూ అలసిపోయి ఉండడంతో… బస్ సాగిపోతున్నప్పుడు వీస్తున్న చల్లగాలికి కళ్ళుమూతలు పడ్డాయి వారి ప్రమేయం లేకుండా.
వచ్చేటప్పుడు ఉన్న ఉత్సాహం వెళ్ళేటప్పుడు లోపించినా మనసు మాత్రం మధురానుభూతులతో నిండి ఉంది.

వాళ్ళు ఊళ్ళోకి ప్రవేశించేసరికి దగ్గరదగ్గర పదకొండైంది. నిద్రకి జోగుతూన్న అందరినీ అలర్ట్ చేశారు శమంతకం గారు. తమ వీధి చివరన బస్ ఆపించుకుని దిగేశారు మౌక్తిక, రమ్యలు.

దుమ్మురేపుకుంటూ ముందుకు సాగిపోయింది బస్. ఇద్దరూ ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో ఉంటున్నారు. రెండువాటాలకీ మధ్యన తలుపే అడ్డు. నిద్రలో తూలుకుంటూనే ఇల్లు చేరారు ఇద్దరూ. కాలింగ్ బెల్  మోగిన మూడు నిముషాలకి తలుపు తీశాడు రమ్యభర్త శరత్.
అతడు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో మానేజర్ గా పనిచేస్తున్నాడు. చెప్పుకోదగిన జీతగాడు కాదు. వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలా ఉంటుందని తానూ ఉద్యోగం చేస్తోంది రమ్య. రెప్పొద్దున్న పిల్లలు పుడితే ఎటూ వీలవదని ఆమెకి తెలుసు. అందుకే ఈలోపే కాస్త వెనకేసుకుందామని వాళ్ళ ఉద్దేశ్యం.

మౌక్తిక తన ఇంటి తాళం తీస్తూండగా “గుడ్ నైట్ ముక్తా… సీ యూ టుమారో మార్నింగ్.’’ అని చెప్పేసి లోపకి మాయమైపోయింది ఏదో మంత్రం వేసినట్లుగా.

తనూ ఆమెకు ‘గుడ్ నైట్’ చెప్పేసి లోపలికి వెళ్ళి బ్యాగ్ కుర్చీలో విసిరేసి, స్నానం చేసొచ్చింది మౌక్తిక. ఫ్రిజ్ లోనుంచి యాపిల్స్ తీసుకుని, మొండిబారిన చాకుతోటి అతికష్టం మీద తెగాయి యాపిల్స్.

ఆ చాకుతో ‘ మొండివాడి ముక్కు కూడా తెగదు’ అంటుంది రమ్య. యాపిల్ ముక్కలు తినేసి, పెద్ద గ్లాసుడు మజ్జిగ తాగేసి మంచంమీద చేరింది మౌక్తిక. బస్ లో హాయిగా కునుకు తీయడం నుంచి మరి నిద్ర రావడంలేదు.

పక్కవాటాలోనుంచి రమ్య, శరత్ ల గుసగుసలు, కిలకిలలు మంద్రస్థాయిలో వినబడుతున్నాయి.

ఆసవ్వడులకి మౌక్తిక మనసంతా అదోలా అయిపోయింది. ఏదో వేదన మనసుని మెలితిప్పింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram