మన దేశంలో ప్రతీదానికీ ఓ “ హక్కుల సంఘం “ ఒకటి చూస్తూంటాము. అసలు వీళ్ళెవరో, ఈ సంఘాలు ఎవరి ప్రోత్సాహంతో మొదలెట్టారో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఏదైనా సంఘటన జరిగితే మాత్రం క్షణాల్లో రంగం లోకి వచ్చేస్తూంటారు. అదేదో “ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం “ గురించైతే విన్నాము. పాపం ఏదేశంలోనైనా, ఏ జాతివారికైనా అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు, ఓ ప్రకటన చేస్తారు “ మీరు చేసేది మానవ హక్కుల చట్టానికి విరుధ్ధం “ అంటూ.. ఏ ప్రభుత్వమూ ఇలాటివాటిని పట్టించుకోరనుకోండి, అది వేరే విషయం.
మన దేశంగురించి మాట్టాడుకుందాం—దేశంలోని కొన్ని ప్రాంతాల్లో, నక్సలైట్ల బెడద ఇప్పటికీ కొనసాగుతోంది. అలాగే మరి కొన్నిరాష్ట్రాల్లో అవేవో గ్రూప్ లు ఉన్నాయి. అడవుల్లోనే తిరుగుతూంటారు.
వారి చర్యలు రైటా, ప్రభుత్వ చర్యలు రైటా అన్నది ఎవరూ చెప్పలేరూ.. ఎవరికి వారే తాముచెప్పిందే రైటూ అంటారు… అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో పోలీసు బలగాలకీ, ఆ గ్రూప్స్ వారికీ మధ్య సంఘర్షణలు జరిగి, ఇరుపక్షాలలోనూ, కొంతమంది మరణిస్తూంటారు… వెంటనే ఈ మానవ హక్కులవాళ్ళు తెరమీదకి వచ్చేస్తారు… “ ఫలానా చోట ఫలానా మందిని అతిక్రూరంగా చంపేయడం అన్యాయం..” అంటూ.. ఇదే వాదన, ఆ గ్రూప్ చేత చంపబడిన పోలీసులగురించి మాత్రం ఒక్క మాటకూడా అన్న పాపానికి పోరు. వాళ్ళూ మనుషులేగా, వాళ్ళవీ ప్రాణాలే, పైగా వీరిమీదే ఆధారపడ్డ కుటుంబాలు కూడా ఉంటాయి.
అలాగే చాలాచోట్ల మహిళాసంఘాలని ఉంటాయి. తప్పకుండా ఉండాల్సిందే, వారి గోడు వినిపించడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలిగా..ఎక్కడైనా స్త్రీలమీద అత్యాచారాలు జరిగినప్పుడు, వీరిపాత్ర అంటే, న్యాయం జరిగేటట్టుగా చూడడం చేస్తూంటారు. కానీ అత్యాచారాలు జరగకుండా చూడ్డంలో వీరి పాత్ర అంతగా ఉండదు, ఏవో TV ల్లో చర్చల్లో పాల్గోడం తప్పించి.
ఇంక కులప్రాతిపదికమీదైతే, దేశంలో ఎన్ని కులాలున్నాయో అన్ని సంఘాలు. పైగా రాజ్యాంగంలో కూడా, ఒక్కోకులానికి ఒక్కో సదుపాయం. ఎక్కడైనా నేరం జరిగి, నేరస్థుడిని అరెస్ట్ చేసేటప్పటికి, మొదట వాడే కులంవాడూ అని చూడడం, ధర్నాలూ, బంధ్ లూ ప్రారంభం.. వీలునిబట్టి ప్రభుత్వ ఆస్థులను ( బస్సులు ) తగలెట్టడం… మళ్ళీ, రవాణా సౌకర్యాలు సరీగ్గాలేవని, మళ్ళీ ఓ ధర్నా.. ఉన్న బస్సులు తగలెడుతూ కూర్చుంటే, రవాణా ఎలా బాగుపడుతుందిట?.. బస్సు రేట్లు పెంచితే మళ్ళీ గొడవా. ఒకానొకప్పుడు పెట్రోల్ ధరలు పెంచినప్పుడల్లా, రాజకీయనాయకులు నానా గొడవా చేసేవారు.. ఇప్పుడు ప్రతీ నెలా పెరిగినా, ఒక్కడూ పట్టించుకోడు.
ఇంక ప్రమాదాల్లో మరణించినవారికీ, గాయపడినవారికీ ఇచ్చే Compensation చూద్దాం. రైల్వే, విమానయానం పక్కకి పెట్టండి. సాధారణంగా రోడ్ ప్రమాదాల్లో ఆ ఇన్స్యూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు. .. చిత్రం ఏమిటంటే, కల్తీ సారా తాగి ఛస్తూంటారు కొన్ని చోట్ల.. అసలు తాగమన్నదెవడూ వీళ్ళనీ? కల్తీసారా అమ్మినవాడు హాయిగానే ఉంటాడు, కారణం వాడు ఏ రాజకీయనాయకుడో అయుండడం. వాళ్ళే కదా దేశంలో జరిగే ప్రతీ Scam వెనకా ఉండేదీ? పోయినవాళ్ళందరికీ ఎంతోకొంత కాంపెన్సేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనే కానీ, అసలు మూలకారణాల గురించి మాత్రం ఎవడూ పట్టించుకోడు. ఆ మాయదారి ఆల్కహాల్ ఏదో ప్రభుత్వ దుకాణాల్లోనే అమ్మొచ్చుగా, కనీసం కల్తీ ఉండదు. ఓపికున్నవాడు హాయిగా తాగి, ఏ రోడ్డు పక్కనో పడుంటాడు..
అలాగే ఎన్నికలముందు అధికారంలో ఉన్నవారు, ఎన్నోఎన్నెన్నో “ తాయిలాలు “ ప్రకటించేస్తూంటారు. అదేమీ తమ జేబులోవా? మనందరం కడుతూన్న పన్నులద్వారా కూడబెట్టిన డబ్బే. అయినా తమస్వంతడబ్బే ఖర్చుపెడుతున్నట్టు హడావిడి చేసేయడం. అంత త్యాగబుధ్ధి ఉన్నవాళ్ళైతే, ఇదివరకటిరోజుల్లో స్వతంత్ర పోరాటంలో తమ ఆస్థుల్ని ఖర్చుపెట్టినట్టు, ఏ ఒక్కడైనా చేయగలరా?
మన దేశంలో ఉన్నట్టు, మిగిలిన దేశాల్లో కూడా ఉంటుందేమో మాత్రం తెలియదు. పోనిద్దురూ ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటీ, మన పని సజావుగా గడిచిపోతున్నంతవరకూ అని అనేసుకుంటే హాయి కదూ..
సర్వేజనా సుఖినోభవంతూ…
|