Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscopejuly 5th to july 11th

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రమ విలువ - డా . నీరజ అమరవాది

sramaviluva

ఐదవ తరగతి చదువుతున్న సూర్య, వంశీ మంచి స్నేహితులు. ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉండడంతో కలిసే బడికి వెళ్ళివచ్చేవారు. బడి నుంచి వచ్చిన తరువాత కూడా ఎవరో ఒకరి ఇంట్లోనే కలిసి ఆడుకునేవారు, చదువుకునేవారు,

సూర్యకి ఆటల మీద ఉన్న ఆసక్తి, హోం వర్క్ చేయడంలో కాని, చదవడంలో కాని ఉండేది కాదు. చాలా సార్లు వంశీ తన హోం వర్క్ తో పాటు, సూర్యది కూడా చేసేవాడు. అలాగే టీచర్లు ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ లు కూడా  చేసి పెట్టేవాడు.

పరీక్షలలో వంశీకి మంచి మార్కులు వచ్చాయి. అదే సూర్యకి ఆ పరీక్షలలో కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. అటు టీచర్లకి కాని , సూర్య తల్లిదండ్రులకి కాని సూర్యకి ఎందుకు అంత తక్కువ మార్కులు వచ్చాయో అర్థం కాలేదు. బడిలో టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేవాడు. టీచర్లకి హోం వర్కులు, ప్రాజెక్ట్ వర్క్ లు సమయానికి ఇచ్చేవాడు. టీచర్లు సూర్య వాళ్ళ నాన్నతో, మేము బడిలో ఎలా చదువుతున్నాడో గమనిస్తాము. మీరు కూడా ఇంట్లో చూడండి అని చెప్పారు .

అప్పటి నుండి సూర్య వాళ్ళ నాన్న, సూర్య, వంశీలను ఆడుకునేటప్పుడు, హోం వర్క్ లు చేసేటప్పుడు, గమనించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులలో అసలు విషయం అర్థమైంది.

ఒక రోజువంశీ, సూర్య ఆడుకుంటుంటే, వాళ్ళ దగ్గరికి సూర్య వాళ్ళ నాన్న  వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ‘కథ చెప్పనా‘  అని అడిగారు. చెప్పండి అంటూ ఉత్సాహంగా ఇద్దరు ముందుకువచ్చారు. ఒక పూల తోటలో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద తేనె తుట్టె ఉంది. రోజూ తేనెటీగలు రకరకాల పూల నుండి తేనెను సేకరించి, ఆ తేనెతుట్టెలో దాచి పెట్టుకునేవి. ఆ చెట్టు కిందే  పెద్ద చీమల పుట్ట ఉంది. పుట్టలోని చీమలు కూడా రోజూ ఉదయాన్నే లేచి, ఆహారం కోసం చాలా దూరం  ప్రయాణించేవి. ప్రతి రోజు ఏదో ఒక చోట తేనెటీగలు, చీమలు ఎదురు పడేవి. కష్టసుఖాలు తెలుసుకునేవి. అలా ఒక రోజు కలుసుకున్నప్పుడు చీమలకి తేనె చాలా ఇష్టమని తెలుసుకున్నాయి. తేనెటీగలు, చీమలతో  “మీరు ఎప్పుడైనా  తేనె కోసం మా పుట్ట వద్దకు రావచ్చు“ అని చెప్పాయి.  అలా అప్పుడప్పుడు చీమలకి తేనె  కోసం, తేనెటీగల దగ్గరికి వెళ్ళడం అలవాటు అయింది. చీమలు చాలా కష్టపడి తేనె కోసం చెట్టు ఎక్కి రావడం చూసిన తేనెటీగలు మా ఇంట్లో చాలా గదులు ఉన్నాయి. ఇక్కడే ఉండవచ్చు కదా అన్నాయి. చీమలు కూడ శ్రమ పడకుండా ఆహారం దొరుకుతుంది  అనుకొని, తేనెటీగలతోనే కలిసి ఉండడం మొదలు పెట్టాయి.

కొన్ని రోజుల తరువాత ఆ తోటమాలి తేనె కోసం, చెట్టు కింద చిన్నగా మంట పెట్టాడు. ఆ వేడిని భరించలేక తేనెటీగలు ఎగిరి పోయాయి. చీమలు ఎగరలేక, తొందరగా చెట్టు దిగలేక ఆ మంట వేడికి, చాలా చీమలు  మాడి పోయాయి. తప్పించుకుని వచ్చిన చీమలు కూడా కూర్చుని తినడానికే అలవాటు పడడంతో, ఆహారం కోసం కష్టపడలేక, ఆకలితో చనిపోయాయి.

ఈ కథ లోని చీమలలాగా,  హాంవర్క్ ల కోసం వంశీ పైన ఆధార పడడం వల్ల సూర్యకి మార్కులు తక్కువగా వస్తున్నాయని, సూర్య వాళ్ళ నాన్న చెప్పాడు. విషయం అర్థమైన వంశీ, అంకుల్  ఇప్పటి నుండి నేను  సూర్య కలిసి హాంవర్క్ లు, ప్రాజెక్టు వర్క్ లు కలిసి చేసుకుంటాము.  మంచి మార్కులు కూడా తెచ్చుకుంటామని చెప్పారు.

మరిన్ని శీర్షికలు
patta cartoons