Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
yuvataram stories com results

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

జీవ నదులను కాపాడుకుందాం!

ఉంటే విలువ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది అంటారు పెద్దలు. మొన్నొకసారి పని మీద కడపకెళ్లాను. మేమున్నది ఓ నాలుగు వాటాలున్న ఇల్లు.

"సార్, నీళ్లు పొదుపుగా వాడండి. అయిపోతే ఇంక అంతే సంగతి" అన్నాడు కలీగ్ అవసరాలకి ఎంత పొదుపుగా వాడినా, నీళ్లు అయిపోయాయి. స్నాన చేయడానికి లేవు.మావాడు సంప్ లో దిగి లోటాతో అడుగున ఉన్న నీళ్లుతోడి బక్కెట్లో పోసి నా కోసం అరెంజ్ చేశాడు. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. ఇప్పటి కాలంలో కూడా ఇంత నీటి ఎద్దడా? పైగా అతనేం చెప్పాడంటే, తెల్లవారు ఝామున 2-3 గంటలకు నీళ్లు వస్తాయట. ఆ సమయంలో ఒకతను డప్పు కొడుతూ ఊరంతా తిరుగుతాడట. అప్పుడు గనక నీళ్లు పట్టుకోకపోతే మళ్లీ నీళ్లు వచ్చేదాకా నరకమే! అక్కడున్నన్ని రోజులు ఎలా గడ్డుగా గడిపానో, తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. నీరు కనీస అవసరం. ప్రాణాధారం. నీరు లేకపోతే అందరం ఒడ్డున పడ్డ చేపలమే!

ఇహ విజయవాడ. అందులో అశేష జలరాశి ఉన్న కృష్ణమ్మ. కడప లాంటి నీటి ఎద్దడి ఉన్న ప్రదేశం నుంచి విజయవాడకు వచ్చిన నేను నది సమీపంలో కూచుని, నీళ్లను స్పృశిస్తూ మురిసిపోయాను. మైమరచిపోయాను.

నగరం మధ్యలో ఉండడం వల్ల విజయవాడకి శోభాయమానంగా ఉంటుంది. అమ్మవారు తనకోసం సృష్టించుకున్నారేమో తెలీదు కాని, అక్కడున్నవాళ్లందరూ మాత్రం నీటి విషయంలో మహా అదృష్టవంతులని చెప్పక తప్పదు.

ఇది ఒక వైపు అయితే, మరో వైపు నా మనసుకు చేదును చవిచూపింది. అదేమిటంటే- ప్రకాశం బ్యారేజీకి ఇవతల, మరి కొన్ని చోట్ల నదిలో పేరుకుపోయిన చెత్త అంతఇంత కాదు. మనసు ద్రవించి పోతుంది. అలా బాటలో నడిచి వెళుతూ వెళుతూ దోసిట్లోకి నీళ్లు తీసుకుని తాగే అదృష్టం ఎందరికుంటుంది? కరువుతీరా స్నానం చేసే సుకృతం ఎన్ని చోట్ల లభిస్తుంది?

నదులు, చెరువుల విలువ తెలుసుకున్న మనిషి కళ్లు తెరచి అక్కడ స్నానాలు చేయడం, బట్టలుతకడం, ఇతర కాలకృత్యాలు తీర్చుకోడం, పారిశ్రామిక వ్యర్థాలను అందులోకి విడవడం నిషేదించుకున్నాడు. మేధావులు నదుల అనుసంధానం, నదులను ఇతర నీటి ఎద్దడి ప్రాంతాలకు మళ్లింపులూ చేస్తున్నారు. కాని ఇంకా కొన్ని చోట్ల అలసత్వం తాండవిస్తోంది.

ప్రభుత్వాల సంగతి పక్కన పెడితే అక్కడి ప్రజలే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నది ప్రకృతి పరంగా తమకు లభించిన ఆస్తి. నావరకు నాకు మనముండే చోట తాజ్ మహల్ ఉండడం కన్నా జీవాన్నిచ్చే నీరు ఉండడం చాలా గొప్ప విషయం. అలాంటి చోట పుట్టడం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం.

నదీమతల్లిని ఒక్క పుష్కర కాలంలోనే దర్శించుకుని, మునకలేస్తే కాదు, ఎప్పుడు స్పర్శించినా పుణ్యమే. అందుకే అందరం బాధ్యతగా ఉండాలి.

మనకున్న నదీ సంపదను ప్రతి ఒక్కరం కాపాడుకుందాం. ఇది మనకోసం మనం చేసుకునే అత్యుత్తమ కార్యం!

మరిన్ని శీర్షికలు
sarasadarahasam