Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ వారం ( 12/7 –18/7 ) మహానుభావులు.

జూలై 14
1.శ్రీ పూండ్ల రామకృష్ణయ్య  : వీరు జూలై 14, 1860 న దువ్వూరు లో జన్మించారు. ప్రముఖ తెలుగు పండితుడు, విమర్శకుడు. అముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రికను వెలువరించారు. ఆముద్రిత గ్రంథ చింతమణి దాదాపు రెండు దశాబ్దాలపాటు జీవించింది.. ఆనాటి ప్రముఖ పండితుల రచనలు, ఈ పత్రిక ద్వారానే , కీర్తి సంపాదించాయి.

2.శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ :  వీరు  జూలై 14, 1893 న గోనెపాడు లో జన్మించారు. ప్రముఖ కవి. స్వాతంత్రోద్యమం సమయంలో, ఎన్నో స్పూర్తిదాయకమైన గేయాలు రాసారు.  “ మాకొద్దీ తెల్లదొర తనం..” అనే గేయం,.. వాడవాడలా మారుమోగి ఎంతోమందిని ఉత్తేజపరిచింది.

జూలై 15

శ్రీ కొలచల సీతారామయ్య  : వీరు, జూలై 15, 1899 న ఉయ్యూరు లో జన్మించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన, ప్రముఖ ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు.   యంత్రాలు, వాహనాలలో యంత్ర భాగాల ఘర్షణను నిరోధించే కందెనలు (లూబ్రికెంట్స్) మీద పరిశోధనలు చేసి కెమటాలజీ (మోటారు ఆయిల్స్ మరియు కందెనలకు సంబంధించిన రసాయన శాస్త్రము) కి పునాది వేసిన రసాయన శాస్త్రవేత్త.
శ్రీ దాట్ల వెంకట నరసరాజు :  D.V.  నరసరాజు గా ప్రసిధ్ధి చెందిన వీరు, జూలై 15, 1920 న  తాళ్ళూరు లో జన్మించారు. ప్రముఖ చలనచిత్ర రచయిత.  “ పెద్ద మనుషులు “,  “ గుండమ్మ కథ “, “ భక్త ప్రహ్లాద” “ యమ గోల “ వంటి 92 తెలుగు సినిమాలకు, కథ, మాటలు వీరు రాసినవే.

జూలై 16

శ్రీ కోటికాలపూడి వెంకట కృష్ణారావు:   General. K.V.Krishna Rao  గా ప్రసిధ్ధి చెందిన వీరు, జూలై 16, 1923 న విజయవాడలో జన్మించారు.  భారత సైనిక దళాద్యక్షుడిగా (  Chief of Army Staff)  పనిచేసిన తెలుగు తేజం. పదవీ విరమణ తరువాత మూడు రాష్ట్రాలకి గవర్నర్ గా కూడా పని చేసారు.

వర్ధంతులు

జూలై 12

శ్రీమతి జిల్లెళ్ళపూడి  అనసూయ  : జిల్లెళ్ళపూడి అమ్మ గా ప్రసిధ్ధి  చెందారు. భక్తులకి తత్వం బోధించేవారు.  .అమ్మ వేదాంత సూత్రం, “ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు”.  ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.

జూలై 12, 1985 న స్వర్గస్థులయారు.

జూలై 17

1.శ్రీ ఓగిరాల రామచంద్ర రావు :  పాతతరం తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు, మొట్టమొదటి నేపథ్య గాయకుడు. వాహినీ వారి ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1939 లో ఒక చిత్రం లో శివుని వేషంకూడా వేసారు. 20 చిత్రాలకు సంగీతం సమకూర్చారు.. దాదాపు అన్ని చిత్రాలూ విజయవంతమయాయి.

వీరు జూలై 17, 1957 న స్వర్గస్థులయారు.

2.శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి :   ప్రముఖ వేద పండితుడు… వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో వీరిది ముఖ్యపాత్ర. ఆయనకు వేదభాష్య విశారద, వేదభాష్యాలంకార, సాంగ వేదార్థ వాచస్పతి, వేదభాష్యాచార్య, ఆమ్నాయ సరస్వతి, కళాసరస్వతి అనే బిరుదులు  ఉన్నాయి. వేదంలోని ప్రతి అక్షరం వెనుక భావాన్ని చిన్నపిల్లలకు సైతం అర్థం అయ్యేలా వివరించగల ప్రతిభామూర్తి.
వీరు జూలై 17, 1969 న శతవసంతాలు పూర్తిచేసుకుని స్వర్గస్థులయారు.

జూలై 18

శ్రీ రెంటాల గోపాలకృష్ణ  :  ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకులు మరియు నాటక కర్త. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు. జర్నలిస్టుగా ఉంటూనే, కొన్ని తెలుగు సినిమాలకు మాటలూ, పాటలూ సమకూర్చారు. ఎన్నో పత్రికలలో  విభిన్న విషయాలమీద వీరి వ్యాసాలు ప్రచురితమయ్యేవి.

వీరు జూలై 18, 1995 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
weekly-horoscope july11th to july 18th july