గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue326/832/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/
(గత సంచిక తరువాయి)... “ఏయ్ ముక్తా… మన మధుకిరణ్ కూడా వచ్చారు చూశావా!’’ అప్పుడే అతడిని గమనించిన రమ్య అంది హుషారుగా.
“ఈ హాలు మన ఒక్కరికే స్వంతం కాదు కదా!’’ ముక్తసరిగా అంది మౌక్తిక. ఆమె వైపు విచిత్రంగా చూసింది రమ్య. అతడిని పలకరించాలని ఆమె అనుకునేంతలో అతడే లేచి వాళ్ళ దగ్గరికొస్తూ కనిపించాడు.
“హాయ్ లేడీస్… ఏమిటీ సినిమాకొచ్చారా?’’ ఏదో అడగాలన్నట్లుగా అడిగాడు మధుకిరణ్.
“సినిమాహాలుకి సినిమా చూడడానికి కాకపోతే మరిదేనికొస్తారు!’’ తనలో తానే గొణుక్కుంది మౌక్తిక. అంతలోనే ఆమెకి నవ్వొచ్చింది. ఏమో… సినిమా హాలుకి దేనికోసమైనా రావచ్చు. ఆ విషయం ఇందాకటి యువజంట నిరూపించింది కూడానూ
“ఏమిటీ… మీలో మీరే నవ్వేసుకుంటున్నారు… మాకు చెబితే మేమూ నవ్వుతాం కదా!’’ చొరవగా నవ్వుతూ అన్నాడు మధుకిరణ్.
“అబ్బే! ఏమీలేదండీ…’’ ముడుచుకు పోయింది మౌక్తిక మొహమాటంతో.
అతడు మాట్లాడకుండా బయటకి వెళ్ళి కూల్ డ్రింక్స్, చిప్స్ ప్యాకెట్లు తీసుకొచ్చాడు. వీళ్ళకివ్వబోతే వద్దంటూ తిరస్కరించింది మౌక్తిక.
“నన్ను పరాయివాడిగా చూడద్దు ముక్తా గారూ…’’ అభిమానంగా అన్నాడు మధుకిరణ్.
“తీసుకో ముక్తా… ఆయన మన కొలీగ్… కాదంటే మర్యాదగా ఉండదు.’’ ఆమెకి మాత్రమే వినిపించేంత మెల్లగా అంది రమ్య.
గత్యంతరం లేక తీసుకుంది మౌక్తిక. అతడి సమక్షం ఆమెలో ఏదో తెలియని వింత భావనని కలుగజేస్తోంది. మాట్లాడాలనుకున్నా స్వరం సహకరించడం లేదు. బిడియం అడ్డొస్తోంది. బలవంతాన గొంతు పెగల్చుకుని ‘థాంక్స్’ మాత్రం చెప్పింది.
ఆమె ఇబ్బందిని అర్ధం చేసుకున్నాడేమో… వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు మధుకిరణ్. తిరిగి సినిమా మొదలైంది. సినిమా పూర్తయ్యాక తన బైక్ తీసుకుని బయటకు వస్తూ కనిపించాడు. అతడికి‘ బై’ చెప్పేసి బయటపడ్దారు స్నేహితురాళ్ళిద్దరూ. వీళ్లు ఇంటికి వెళ్లిన మరి కాస్సేపటికే వచ్చేశాడు శరత్. ఊరు నుండి శరత్ అమ్మగారు పంపిన సున్నుండలు మౌక్తికకిచ్చింది రమ్య. సున్నుండల రుచి జిహ్వకి తగలగానే మళ్లీ తన వాళ్ళు గుర్తు వచ్చారు మౌక్తికకి.
ఆ పూట మరి భోజనానికి రానని చెప్పేసింది మౌక్తిక. కొద్దిగా బియ్యం పెట్టుకుని కంది పొడి, నువ్వుల పొడి, గోంగూర పచ్చడి వేసుకుని అన్నం తిన్నాననిపించింది.
భోజనం పూర్తయ్యాక చేతికందిన పుస్తకం తీసుకుని మంచం మీద వాలింది మౌక్తిక. ఏ రసమూ లేని నిస్సారమైన ఆమె జీవితానికి అవే తోడు. కాస్సేపటికి కళ్ళు మూతలు పడినట్లనిపించి పుస్తకం మూసేసి, లైట్ ఆపేసింది.
కాని, నిద్ర రావడం లేదు. ఇందాకా కళ్ళు మూతలు పడినా అది ఆవులింతల వరకే పరిమితమవడంతో…అలా కిటికీలో నుంచి కనిపిస్తున్న ఆకాశాన్ని చూడసాగింది. కృష్ణ పక్షపు రోజులు కావడంతో చందమామ కొద్దిగా ముఖం చాటేసినట్లుగా కనబడుతున్నాడు. దానికి తోడు అతడిని తమ వెనకాతల దాచేసి దోబూచులాడుతున్నాయి తుంటరి మబ్బులు.
చంద్రకాంతి లేని వినీలాకాశం వెలెవెలబోతోంది. అక్కడక్కడా తళుకుమంటున్న తారకలు… నిర్భాగ్యుని మనసులో ఉండి-ఉడిగి చెలరేగే ఆశల్లా మిణుకుమిణుకు మంటున్నాయి.
బయట ప్రపంచంలో లాగానే మౌక్తిక మనసు నిండా కూడా చీకటి.
కృష్ణ పక్షం వెళ్ళి శుక్ల పక్షం రాగానే చీకటి కమ్ముకున్న ఆకాశం లోకి నెలరాజు ఆగమనం జరుగుతుంది. అనంతమైన వెన్నెల నింగిని ఆవరించుకుంటుంది.
నీలాకాశాన్ని కాంతిమంతం చేయడానికి వెన్నెల దీపంలా చల్లని జాబిలి వస్తాడు.
కాని…కాని… తన మనసు లోని ఈ గాఢాంధకారాన్ని తొలగించడానికి ఎవరొస్తారు! అసలీ చీకటి ఏనాటికైనా తొలగుతుందా!?
మౌక్తిక జీవితం లో కాంతులునిండే రోజు వస్తుందా.... లేక తన మొండితనంతో తనజీవితాన్ని ఎండిపోయిన మోడు లా అలాగే మలుచుకుంటుందా..తెలుసుకోవాలమే వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి... |