Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nee peru talachina chalu

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue326/831/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి)...“ఇంకో గంటలో ప్రెస్ మీట్ ఉంది” గుర్తు చేశాడు పర్సనల్ అసిస్టెంట్. భారత రక్షణ మంత్రి చిన్నగా నిట్టూర్చి స్పీచ్ తయారుగా ఉందా “అని అడిగాడు.

“నిన్ననే తయారు చేసుకుని వచ్చాను. ఇదిగో స్పీచ్ డాక్యుమెంట్. దయచేసి ఇందులో ఏం ఉందో అది మాత్రం మాట్లాడండి” అన్నాడు పర్సనల్ అసిస్టెంట్.

“ఎందుకని” అసహనంగా అడిగాడు రక్షణ మంత్రి.

“నిన్న సాయంత్రం మీరు వెళ్ళిపోయిన తరువాత ప్రధాన మంత్రి గారు నాకు కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పారు. మీ కోసం తయారు చేసిన స్పీచ్ ను చూపించమని అడిగారు. ఆయన చదివి అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ నేను దాన్ని ఫ్రెష్ గా రాసి మీకు ఇచ్చాను”

“నా ప్రెస్ మీట్ తో పి యం గారికి ఏమిటి సంబంధం ”చిరాకుగా అడిగాడు రక్షణ మంత్రి.

“నాకేం తెలియదు సార్. ఆయన రమ్మని చెప్పారు వెళ్ళాను అంతే”అన్నాడు పర్సనల్ అసిస్టెంట్. మంత్రి ఇంకేం మాట్లాడకుండ స్పీచ్ కాగితం వైపు చూస్తూ ఉండి పోయాడు. నిజానికి ఆయన మూడ్ ఏమంత బాగా లేదు. కొన్ని నెలలకు ముందు బారముల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఆయన ఇంకా మరచి పోలేదు.  ఆ సంఘటనలో దాదాపు మూడు వందల మంది అమాయకులు ప్రాణాలు పోగోట్టుకున్నారు. ప్రస్ధుతం ఆ ముష్కరులు పాకిస్తాన్ లో దాక్కుని ఉన్నారు. ఈ విషయంలో మంత్రి ఎన్నో సార్లు పాకిస్ధాన్ రక్షణ మంత్రితో మాట్లాడాడు. సాధ్యమైనంత వరకు ఆ ఉగ్రవాదులను పట్టుకుని తమకు అప్పగించమని చెప్పాడు. కాని ఇన్ని రోజులు గడిచిన వాళ్ళు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారు.

ఈ విషయంలో భారత పార్లమెంటులో పెద్ద రభస జరిగింది. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఇదే విషయం మీద కార్నర్ చేస్తున్నాయి. ప్రశ్నల మీద ప్రశ్నలు సందిస్తున్నాయి. వాటికి జవాబులు చెప్పలేక బిక్కమొహం వెయ్యవలసి వస్తుంది. ప్రధాన మంత్రి గారు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు కాని రక్షణ మంత్రి మాత్రం విపరీతంగా స్పందిస్తున్నాడు. దీనికి అంతటికి కారకులు పాకిస్ధాన్ ప్రభుత్వం అని అతని నమ్మకం. వాళ్ళు నిజాయితిగా ప్రయత్నించకపోవటం వల్లే ఉగ్రవాదులు ఇంకా దొరకలేదని ఆయన అభిప్రాయం. కాని ఈ విషయం ఆయన ఎక్కడ బయటపెట్టలేదు. సమయం కోసం కాచుకుని ఉన్నాడు. ఈ సమయం ఈ రోజు ప్రెస్ మీట్ రూపంలో వచ్చింది. ప్రోటోకోల్ ప్రకారం స్పీచ్ ను ఆయన పర్సనల్ సెక్రటరి తయారు చేసిన తను చెప్పదలుచుకున్న విషయం చెప్పాలనే నిర్ణయానికి వచ్చాడు అయన. సెక్రటరీ వెళ్ళిన తరువాత మెల్లగా లేచాడు మంత్రి. చేతిలో ఉన్న కాగితాన్ని మరోసారి చూసుకున్నాడు. తరువాత నింపాదిగా తన చాంబర్స్ లోంచి బయట పడ్డాడు. ఆయన బయలుదేరగానే సెక్యురిటీ ఆయన వెనుక బయలుదేరింది. అందరు కాన్ఫరెన్స్ హాలు చేరుకున్నారు. అప్పటికే చాల మంది ప్రెస్ రిపోర్టర్స్ అక్కడికి చేరుకున్నారు. రక్షణ మంత్రి ఏం చెప్పబోతున్నాడో తెలుసుకోవాలని వాళ్ళకు ఆసక్తిగా ఉంది. అందుకే ఆయన రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

రక్షణ మంత్రి లోపలికి రాగానే అందరు మర్యాద పూర్వకంగా నిలబడ్డారు. రక్షణ మంత్రి టేబుల్ దగ్గర నిలబడి అందరిని కూర్చోమని సైగ చేశాడు. ప్రెస్ రిపోర్టర్స్ అందరు ఎవరి స్ధానంలో వాళ్ళు కూర్చున్నారు. రక్షణ మంత్రి పక్కన ఆయన అధికారులు ఇద్దరు కూర్చున్నారు. వెనుక సెక్యురిటి గార్డ్స్ స్టిఫ్ గా నిలబడి అందరిని గమనిస్తున్నారు.

“పిలిచిన వెంటనే ఈ ప్రెస్ మీట్ కు వచ్చినందుకు నాకు చాల సంతోషంగా ఉంది.  మీరు అడగదలుచుకున్న ప్రశ్నలు నిర్భయంగా అడగండి. నాకు తెలిసినంత వరకు చెప్తాను”అన్నాడు మంత్రి.

ఆయన మాటలు పూర్తి కాకుండానే ఒక రిపోర్టర్ లేచి నిలబడి అడిగాడు.

“మినిస్టర్ గారు బారముల్లాలో  ఆ దారుణమైన సంఘటన జరిగి చాల రోజులు అయింది. కాని ఇంత వరకు ఆ నేరం చేసిన ఉగ్రవాదులను పట్టుకోలేదు. కనీసం వాళ్ళ ఆచూకి తెలుసుకోలేకపోయారు. దీని గురించి మీరేం అంటారు?”

“ఆచూకి తెలుసుకోలేదని ఎవరు అన్నారు. సంఘటన జరిగిన వెంటనే మా అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేసి వాళ్ళు పాకిస్ధాన్ సరహద్దు లోంచి బారముల్లా వచ్చారని తెలుసుకున్నారు. అంతేకాదు. ఆ ముష్కరులు ప్రస్ధుతం ఇంకా పాకిస్ధాన్ లో ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ దాక్కుని ఉంటే వెంటనే మనవాళ్ళు వాళ్ళను పట్టుకుని చట్టానికి అప్పగించేవాళ్ళు. కాని వాళ్ళు మన పొరుగుదేశంలో తలదాచుకున్నారు. వాళ్ళను పట్టుకోవలసిన బాధ్యత మన ప్రభుత్వానిది కాదు. పాకిస్ధాన్ ప్రభుత్వానిది”అన్నాడు మంత్రి.

ఇంకోక రిపోర్టర్ లేచి “సంఘటన జరిగి ఇన్ని రోజులైన పాకిస్ధాన్ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు. ఆ ముష్కరులను ఎందుకు పట్టుకోలేక పోతుంది. దానికి ప్రత్యేకమైన కారణం ఏదైన ఉందంటరా.”

“నాకు మాత్రం ఒకే ఒక కారణం కనిపిస్తుంది. వాళ్ళను పట్టుకుని మనకు అప్పగించటానికి పాకిస్ధాన్ ప్రభుత్వం సుముఖంగా లేదని నేను అభిప్రాయపడుతున్నాను. లేకపోతే వాళ్ళను పట్టుకునే శక్తి సామర్ధ్యాలు వాళ్ళకు లేవని అనుకోవాలి. వాళ్ళ స్ధానంలో మనం ఉంటే ఈ పాటికి ఆ రాక్షసులను పట్టుకుని చట్టానికి అప్పగించే వాళ్ళం. తీహార్  జైలులో చిప్పకూడు తింటు శిక్ష అనుభవిస్తూ ఉండేవారు.”

“అంటే ఇది పాకిస్ధాన్ అసమర్ధత అని మీరు అభిప్రాయపడుతున్నారా?

“నేనే కాదు ఎవరికైన ఈ అభిప్రాయం కలుగుతుంది.”

ఇంకో రిపోర్టర్ లేచి “ అంటే ఇది పాకిస్ధాన్ ప్రభుత్వం అసమర్ధత అని మీరు భావిస్తున్నారా.”

“నేనే కాదు మన ప్రధాన మంత్రి గారు అలాగే భావిస్తున్నారు” అన్నాడు రక్షణ మంత్రి. అంత వరకు మౌనంగా కూర్చున్న ఒక అధికారి రక్షణ మంత్రిని సైగ చేసి వారించబోయాడు. రక్షణ మంత్రికి తయారుచేసిన  స్పీచ్ అతను చదివాడు. వాటికి ఏం జవాబు చెప్పాలో కూడా సెక్రటరి తయారుచేశాడు. కాని ఇప్పుడు సదరు మంత్రి చెప్తున్న జవాబులు చాల వేరేగా ఉన్నాయి. పైగా పాకిస్ధాన్ ను దూషించినట్టుగా ఉంది.
ఈ మాటలు ఎంత రాద్ధాంతం కలగచేస్తాయో ఆయనకు బాగా తెలుసు. పాకిస్ధాన్ అంబాసిడర్ దీనికి అభ్యంతరాలు చెప్పటానికి అవకాశం ఉంది.

“మీరు ఈ విషయం గురించి పాకిస్ధాన్ ప్రభుత్వంతో చర్చించలేదా”అడిగాడు ఇంకో రిపోర్టర్,

“చాల సార్లు చర్చించాం. ప్రతి సారి ఆ ఉగ్రవాదుల గురించి అడిగినప్పుడల్లా మా వాళ్ళు వాళ్ళను పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మాకు చెప్పేవారు. నిజంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారో లేదో మాకు తెలియదు. నిజాయితిగా ప్రయత్నించి ఉంటే వాళ్ళు తప్పకుండ ఈ పాటికి దొరికేవాళ్ళు. ప్రతిపక్ష పార్టీల నుంచి మనకు విమర్శలు తప్పేవి. అంతా మన ఖర్మ”అన్నాడు మంత్రి కోపంగా. ఆయన మొహం కోపంతో అస్తమిస్తున్న సూర్యుడిని గుర్తుకుతెస్తోంది.

“చివరి ప్రశ్న సార్. ప్రస్ధుతం మీ స్టాండు ఏమిటి? అడిగాడు ఇంకో రిపోర్టర్.

“ముందు నుంచి ఈ పాకిస్ధాన్ కు వెన్నుపోటు పొడిచే తత్వం ఉంది.  పైన మనతో స్నేహితుడిగా నటిస్తూ లోపల మాత్రం శత్రుత్వం పెంచుకుంటోంది. ఈ విషయం మనకు తెలియదని భ్రమ పడుతోంది. ఎనివే ఇంకా కొన్ని రోజులు కాచుకుని ఉంటాం. అంతలో వాళ్ళ వైపు నుంచి ఎలాంటి జవాబు రాకపోతే అప్పుడు చెప్తాం. అంతవరకు నాతో పాటు మీరు కూడా ఓపికగా కాచుకోవాలి. ఇంతటితో ప్రెస్ మీట్ ముగిసింది” అంటు లేచి నిలబడ్డాడు మంత్రి. ఆయన లేవగానే అధికారులు కూడా లేచి నిలబడ్డారు. వెంటనే ఫోటో గ్రాఫర్స్ తమ కెమారాలను క్లిక్ మనిపించారు.

వడివడిగా నడుస్తూ రక్షణ మంత్రి తన చాంబర్స్ చేరుకున్నారు. కుర్చిలో అలసటతో కూలబడ్డాడు.  ఇప్పుడు ఆయన మనస్సు చాల ప్రశాంతంగా ఉంది. పాకిస్ధాన్ ను అనవలసిన నాలుగు ముక్కులు అనేశాడు. దాంతో ఆయన మనస్సు నెమ్మదించింది. రాజకీయంలో ఇంత అనుభవం ఉండి ఒక విషయం ఆయన గ్రహించ లేకపోయాడు.

తను చెప్పిన మాటలు పాకిస్ధాన్ లో విపరీతంగా సంచలనం కలిగిస్తాయని దాని ప్రభావం రెండు దేశాల విశేషమైన ప్రభావం చూపిస్తుందని ఆ సమయంలో ఆయన గ్రహించలేకపోయాడు. అనుకున్నట్టుగానే జరిగింది. అదే రోజు టీవిలో రాత్రి న్యూస్ లో రక్షణమంత్రి ఇచ్చిన ప్రెస్ మీట్ ప్రసారం చెయ్యబడింది. క్యాజువల్ గా ఆ ప్రెస్ మీట్ ను చూస్తున్న పాకిస్ధాన్ అంబాసిడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రక్షణమంత్రి తన దేశం గురించి అవాకులు చెవాకులు పేలటం అతను సహించలేకపోయాడు. వెంటనే భారత ప్రధాన మంత్రి పర్సనల్ సెక్రటరికి కాల్ చేశాడు.
అర్ధరాత్రి దాటి పది నిమిషాలైంది. గాఢ నిద్రలో ఉన్న మిత్రవింద ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. క్వార్టర్స్ బయట ఏదో హడావిడి వినిపించింది. ఇద్దరు సెక్యురిటి గార్డ్స్ కంగారుగా ఏదో చెప్పుకుంటు కాంపౌండ్ లో పరిగెత్తుతున్నారు. మెల్లగా మంచం మీద నుంచిలేచింది మిత్రవింద. కాళ్ళకు చుట్టుకున్న రగ్గును పక్కకు లాగి గదిలోంచి బయటపడింది. తలుపులు తీసుకుని బయటకు వచ్చింది. కాంపౌండ్ అంతా లైట్ల వెలుగులో దేదిప్యమానంగా వెలిగిపోతుంది. అప్పుడే ఒక సెక్యురిటి గార్డ్ ఆమె వైపుకు దూసుకువస్తున్నాడు.

“ఏం జరిగింది సెక్యురిటి. ఏమిటి ఈ హడావిడి”అడిగింది మిత్రవింద.

“ఎవడో దొంగవెదవ ఎంబసి లోకి వచ్చాడు. మన బహదూర్ వాడిని చూసి గట్టిగా అరిచి పట్టుకోబోయాడు. కాని ఎలా మాయం అయ్యాడో తెలియదు. మెరుపులా కనిపించకుండ పోయాడు. అతని కోసమే వెతుకుతున్నాం”అన్నాడు సెక్యురిటి.

“గేటు దగ్గర మీరు కాపలా ఉన్నారు కదా”అడిగింది మిత్రవింద.

“అవును మేడం. నేను బహదూర్ ఇద్దరం ఇరవై నాలుగు గంటలు వంతులు వేసుకుని కాపలా ఉంటాం.”

“అలాంటప్పుడు వాడు ఎలా లోపలికి వచ్చాడు”సందేహంగా అడిగింది మిత్రవింద.

“అదే మాకు అర్ధంకావటం లేదు మేడం. ఒకరి తరువాత ఒకరం ఇరవై నాలుగు గంటలు వత్తులు వేసుకుని కాపలా ఉంటున్నాం. అయిన వాడు ఎలా లోపలికి వచ్చాడో అర్ధం కావటం లేదు. వస్తాను మేడం వాడిని ఎలాగైన పట్టుకుని పోలీసులకు అప్పగించాలి”అన్నాడు సెక్యురిటి.
“సరే వెళ్ళు”అంది మిత్రవింద.

బ్రతుకుజీవుడా అనుకుంటు సెక్యురిటి ముందుకు సాగిపోయాడు. ఇంత తతంగం జరుగుతున్నా ఒక్క మిత్రవింద తప్ప క్వార్టర్స్ లోంచి ఎవరు రాలేదు. అందరు చలికి ముడుచుకుని పడుకుని ఉన్నారు. మిత్రవింద స్వెటర్ భుజాల చుట్టు కప్పుకుని మెల్లగా నుడుస్తూ మెయిన్ గేటు చేరుకుంది. దాదాపు ఆరడుగుల ఎత్తు ఉంది మెయిన్ గేటు. దాని మీద ఎక్కి లోపలికి రావటం దాదాపు అసాధ్యం అని చెప్పాలి.
కాని గేటు పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ మాత్రం దాదాపు అయిదు అడుగుల ఎత్తు మాత్రం ఉంది. గోడలో ఒక చోట బీటలు కనిపించటం వల్ల దాన్ని వెంటనే మరమ్మత్తు చెయ్యాలని అంబాసిడర్ చెప్పాడు. రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా వెంటనే గోడ మరమ్మత్తు మొదలైంది.  కొంత మేరకు గోడను కూల్చీవేశారు. దాంతో కాంపౌండ్ గోడ ఒక చోట మరి ఎత్తు తగ్గిపోయింది. బహుశా ఆ దొంగవెదవ ఎవరో ఈ విషయం తెలుసుకుని గోడ దూకి లోపలికి వచ్చి ఉంటాడు. చుట్టు గమనిస్తూ తిరిగి తన క్వార్టర్స్ దగ్గరకు చేరుకుంది మిత్రవింద. అప్పుడే ఇద్దరు సెక్యురిటి గార్డ్స్ తమ పని పూర్తిచేసుకుని మొహాలు వేలాడవేసుకుని వస్తున్నారు.

“దొంగ దొరికాడా “అడిగింది మిత్రవింద.

“లేదు మేడం. ఇటవైపు అంతా వెతికాం. ఎక్కడ కనిపించలేదు”అన్నాడు బహదూర్ అనే సెక్యురిటి గార్డ్.

“బహుశా బయటకు వెళ్ళిపోయిఉంటాడు. సరే నేను వెళ్ళి పడుకుంటాను. మంచి నిద్ర చెడిపోయింది”అని తన క్వార్టర్ వైపు నడిచింది మిత్రవింద. తలుపులు గడియ వేసుకుని తన బెడ్ రూంలోకి నడిచింది. మంచం దగ్గరకు వెళ్ళబోతూ అప్రయత్నంగా తన మెడ వైపు చూసుకుంది. తాళిబొట్టు ఇంకా మెడలో వేలాడుతోంది. సాధరణంగా తాళి కట్టుకుని ఆఫీసుకు వెళ్ళదు మిత్రవింద. ఇంట్లో బీరువాలో దాటి వెళుతోంది. కాని ఆఫీసునుంచి ఇంటికి వచ్చిన తరువాత మళ్ళి తాళిని మెడలో వేసుకుంటుంది. అద్దంలో దాన్ని చూసుకుంటు మురిసిపోతుంది. కొంచం సేపు తాళివేసుకుని ఇంటిపనులు చేసుకుంటుంది. నిద్రపోయేటప్పుడు మాత్రం తాళిని జాగ్రర్తగా తీసి బీరువాలో పెట్టి తాళం వేస్తుంది. ఇది రోజు జరిగే కార్యక్రమం. కాని ఆ రోజు రాత్రి ఒక పుస్తకం చదువుతూ పరిసరాలను మరిచిపోయింది. ఆ పుస్తకం పేరు ది డైరీ ఆఫ్ ఆనీ ఫ్రాంక్.

ఆ పుస్తకం చదువుతుంటే టైం తెలియలేదు. ఏగబీగిన నలబై పేజీలు చదివేసరికి నిద్రముంచుకు వచ్చింది. పుస్తకం మూసి వెంటనే నిద్రలోకి జారుకుంది. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు కాని కాంపౌండ్ లో హడావిడి వినేసరికి అనుకోకుండ ఆమెకు మేలుకువ వచ్చింది. కంగారులో తాళిబొట్టుతోనే ఇంట్లోంచి బయటకు వచ్చింది. సెక్యురిటి గార్డ్స్ తో మాట్లాడింది. వాళ్ళు మెడలో వేలాడుతున్న తాళిని చూశారో లేదో తెలియదు. కాని మిత్రవిందకు మాత్రం చాల భయం వేసింది. వెంటనే తాళిబొట్టును తీసి బీరువాలో పెట్టి తాళం వేసింది. అప్పుడు కాని ఆమె మనస్సు కుదుటపడలేదు.వెళ్ళి మంచం మీద పడుకుంది. పడుకుందన్న మాట ఎంత ప్రయత్నించిన మిత్రవిందకు నిద్రపట్టలేదు. మెల్లగా కిటికిలు తెరిచి బయటకు చూసింది. ఒక్కసారిగా చల్లగాలి మొహానికి తాకింది. ఆ రోజు చలి మరి ఎక్కువగా ఉంది. కాంపౌండ్ లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి. ఇద్దరు సెక్యురిటి గార్డ్స్ వంతులువారిగా చుట్టు తిరుగుతూ కాపలా కాస్తున్నారు.

ఆకాశంలో చంద్రుడు వెన్నల ముద్దలా మెరిసిపోతున్నాడు. దూరంగా నక్షత్రాలు మేము కూడా ఉన్నామంటు సన్నగా వెలుగుతున్నాయి.  ఈ సమయంలో పక్కన అబ్బాస్ ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకా ఎన్ని రోజులు అతన్ని విడిచి దూరంగా ఉండాలో తెలియటం లేదు. అందరు పెళ్ళయిన తరువాత హాయిగా సంతోషంగా ఉంటారు. కాని మిత్రవింద అబ్బాస్ మాత్రం దూరంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండ కాలం గడుపుతున్నారు.

అబ్బాస్ గుర్తుకు రావటంతో మిత్రవింద సెల్ తీసి అతనికి కాల్ చేసింది. రింగ్ పోతుంది కాని అతని వైపు నుంచి రెస్పాన్స్ లేదు. అయిన ఆగకుండ మళ్ళీ ప్రయత్నించింది మిత్రవింద. రెండు సార్లు ఆఫ్ చేసి రింగ్ చేసిన తరువాత మూడో సారి రెస్పాండ్ అయ్యాడు అబ్బాస్.
“ఇప్పటికైన రెస్పాండ్ అయినందుకు చాల ద్యాంక్స్. ఏం చేస్తున్నావు మహానుభావ”అంది చలోక్తిగా మిత్రవింద.

“నీకు అంత నవ్వులాటగా ఉంది”అన్నాడు అబ్బాస్ నిరుత్సాహంగా.

“ఏం జరిగింది. అంత డల్ గా ఉన్నావు.?

“ఎంత ప్రయత్నించిన ఆ ఉగ్రవాదుల ఆచూకి తెలియలేదు. ఎక్కడ ఉన్నారో ఎక్కడ దాక్కున్నారో అర్ధంకావటం లేదు. పై అధికారుల నుంచి ఒకటే వత్తిడి. ఈ మద్య నిద్రకూడ పట్టటం లేదు”అన్నాడు భారంగా అబ్బాస్.

“వాళ్ళు ఎక్కడికి పోతారు. ఈ రోజు కాకపోతే రేపు తప్పకుండ దొరుకుతారు. అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ మనస్సు ఆరోగ్యం పాడుచేసుకోవద్దు”అంది మిత్రవింద.

“అమ్మ కూడా ఒకటే పోరపెడుతోంది.”

“ఏ విషయంలో?

“మన పెళ్ళి విషయంలో. రోజు ఆవిడ పోరపడలేకపోతున్నాను. ఏదో సాకు చెప్పితప్పించుకుంటున్నాను.”

“మన పెళ్ళి అయిపోయిందిగా అబ్బాస్. మళ్ళీ  పెళ్ళి ఏమిటి?

“నువ్వు నేను అనుకుంటే సరిపోదు. నా డిపార్ట్ మెంట్ అనుకోవాలి. ఆ ఉగ్రవాదులు దొరికితే మన పెళ్ళికి ఎలాంటి ఆటంకం ఉండదు. రెండు దేశాల మద్య ఉన్న అపార్ధాలు తొలగిపోతాయి కనుక ఎవరు మన పెళ్ళికి అభ్యంతరం చెప్పరు. తరువాత మనం ఇద్దరం హాయిగా కలిసి ఉండవచ్చు.”

“నాకు మాత్రం అలా ఉండాలనిలేదనుకుంటున్నావా. నువ్వు నేను అనుకున్నంత మాత్రాన్న అన్ని జరిగిపోవు. దానికి సమయం రావాలి. ఆ ముష్కరులు పట్టుబడితే అన్ని సమస్యలు తీరిపోతాయి”అంది మిత్రవింద.

“అది సరే ఇంత రాత్రి అయిన నిద్రపోకుండ ఏం చేస్తున్నావు”అడిగాడు అబ్బాస్.

మిత్రవింద జరిగిన దంతా చెప్పింది.

“ఇప్పుడు ఎంత నిద్రపోదామని అనుకున్నా నిద్ర రావటం లేదు. అందుకే ఏం తోచక నీకు కాల్ చేశాను. నీకు కూడా నా లాగే నిద్రపట్టటం లేదా.”

“ఇప్పుడే డ్యూటి ముగించుకుని ఇంటికి వచ్చాను. ఇంతలో నువ్వు కాల్ చేశావు.”

“ఆ ఉగ్రవాదుల గురించి ఏమైన ఆచూకి తెలిసిందా.”

“ఇంకా లేదు. మా వాళ్ళు రాత్రిపగలు అని తేడాలేకుండ వాళ్ళ కోసం వెతుకుతున్నారు. కాని ఇంతవరకు వాళ్ళగురించి చిన్న క్లూ కూడా దొరకలేదు”అన్నాడు నిరుత్సాహంగా అబ్బాస్.

మిత్రవింద చల్లగా నవ్వింది.

“అంత నిరుత్సాహపడకు అబ్బాస్. మనిషి గట్టిగా ప్రయత్నిస్తే ఏదైన సాధించగలడు. ఎలాంటి సమస్య అయిన పరిష్కరించుకోగలడు. ఈ మాటలు నిజమని మీ అమ్మగారు నువ్వు నిరూపించారు. మిమ్మల్ని చూసి నేను మోటివేట్ అయి నేను అనుకున్న ఉద్యోగం సంపాదించుకోగలిగాను. నీకు కూడా తప్పకుండ వాళ్ళ గురించి ఏదో ఒక క్లూ దొరకపోదు. ఈ రాత్రి ఏం ఆలోచించకుండ ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం ప్రశాంతమైన మనస్సుతో వాళ్ళ గురించి ఆలోచించు. తప్పకుండ ఏదో లీడ్ దొరుకుతుంది”అంది మిత్రవింద.

“నీ మాటలు విన్నతరువాత నాలో మళ్ళీ ఉత్సాహం కలిగింది. నువ్వు చెప్పినట్టుగానే రేపు ఆఫీసుకు వెళ్ళి ప్రశాంతంగా ఆలోచిస్తాను. సరే ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఇక పడుకుంటాను. గుడ్ బై గుడ్ నైట్”అని చెప్పి లైన్ కట్ చేశాడు అబ్బాస్.

మిత్రవింద కూడా సెల్ ఆఫ్ చేసి పడుకుని కళ్ళు మూసుకుంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్