Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు, అంటే 1970-80 ల దాకా మనదేశంలో, అంతగా టెక్నాలజీ అభివృధ్ధి చెందని రోజులన్నమాట.. ప్రతీ విషయానికీ ఏ కొద్దిమందో స్పెషలిస్టులుండేవారు.  అది ఓ వైద్యమవనీయండి, ఓ సంగీతమవనీయండి,, ఓ జ్యోతిషమవనీయండి, అంతదాకా ఎందుకూ, కొన్ని  అతి వ్యక్తిగతమైన సాంసారిక సమస్యలకోసమవనియండి  రహస్యంగా సంప్రదించాల్సిన రోజులు.  పిల్లలు తప్పుదారి పడతారేమోనని, ఇంట్లో తల్లితండ్రులు చాలా ఆంక్షలు పెట్టేవారు. దానితో చాలా విషయాలు మిస్టరీగానే మిగిలిపోయేవి…

పుస్తకాల్లో కూడా అంతగా రాసేవారుకాదుకూడా. ఏ కొత్తవిషయం గురించి తెలుసుకున్నా, ఎంతో ఆశ్చర్యంగా ఉండేది… బహుశా బయటి దేశాల్లో మరీ ఇంతలా ఉండేది కాదేమో.  పైగా ఆరోజుల్లో విదేశాలకి ఎక్కడో అరుదుగా, ఏ పైచదువులకో మాత్రమే వెళ్ళేవారు. ప్రసార మాధ్యమాలు కూడా అంతంత మాత్రమే. ఏదో మొత్తానికి 1973 తరువాత దేశంలో టీవీ ప్రసారాలు  మొదలయ్యాయి, ప్రపంచంలోని విషయాలు, మరీ ఏ సినీమాలోనో కాకుండా, ఇంట్లోనే చూడగలిగే సదుపాయం వచ్చింది… కాలక్రమేణా,  పంచరంగుల టీవీ ప్రసారాలూ కూడా అందుబాటులోకి వచ్చేసాయి.

టీవీ ప్రసారాలతో పాటు, అంతర్జాలం కూడా చవగ్గా అందుబాటులోకి వచ్చేటప్పటికి, ఉపయోగాలతో పాటు, దురుపయోగాలు కూడా ఎక్కువైపోయాయి. ఉపయోగాల విషయానికొస్తే, మనకి కావాల్సిన ఏ సమాచారమైనా,  క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాము. ఇదివరకటిరోజుల్లో లాగ, పెద్దవారిని అడగడం, టీచర్స్ ని అడగడమూ, కాకూకూడదంటే, ఏ లైబ్రరీకో వెళ్ళి పుస్తకాలు చదివే అవసరమే లేదు ఈ రొజుల్లో…ప్రాపంచిక విషయాలగురించి ఒక వయసొచ్చేదాకా తెలుసుకునే అవకాశం ఉండేది కాదు పూర్వపు రోజుల్లో.. కానీ అంతర్జాలమహిమ ధర్మమా అని ఆలోటు తీరిపోయినట్టే. కొత్తవిషయమేదైనా విన్నప్పుడు, మరీ నోరు వెళ్ళబెట్టాల్సిన అవసరం లెకపోవడంతో, అందరిలోనూ ఓ ఆత్మవిశ్వాసం ఏర్పడిందనడంలో సందేహం లేదు. కొంతకాలంక్రితం వరకూ, అంతర్జాలం, కంప్యూటర్లకే restrict  అయి ఉండేది.. కానీ Smart Phone  అందుబాటులోకి రావడంతో, ఈరోజుల్లో “ ముఠ్ఠీ మే దునియా “  అయిపోయింది.ఇంట్లోంచి అడుగు బయటపెట్టకుండా , బ్యాంకు లావాదేవీలూ, పన్నులు కట్టడాలూ, టిక్కెట్ల రిజర్వేషన్లూ, నెలసరి సరుకులూ, రోజువారీ కూరగాయలూ… ఒకటేమిటి, ఏ వస్తువైనా క్షణాల్లో చేసేయగలుగుతున్నారు.

ఇన్నెసి  సదుపాయాలుంటే, వాటితోపాటే కష్టాలు కూడా వెనువెంటె ఉండడం సహజం కదా. డబ్బులావాదేవీల్లో అవకతవకలూ, ఫ్రాడ్డులూ, మోసపోవడాలూనూ. ఒకానొకప్పుడు , ప్రతీ దానికీ అంటే పంచాంగాలకీ, జ్యోతిషానికీ, ఏ కొద్దిమందికో ఆ పరిజ్ఞానం ఉండేది. ఈ రోజుల్లో, చదవడం వచ్చిన ప్రతీవాడూ జ్యోతిష్కుడే, ఎవరికి వారే తోచింది చెప్పడం. అందులో ఎంత నిజం ఉందో, మనతలరాత రాసిన ఆ బ్రహ్మక్కూడా తెలియదు. టివీల్లో ప్రకటనలు చూస్తే బెంబేలెత్తిపోవడం ఖాయం. మరో విషయం, దేశంలో ఎక్కడైనా జరగరానిది జరగడం తరవాయి, క్షణాల్లో  Social Media  ద్వారా అందరికీ తెలుస్తోంది..

నిజానిజాలు తెలుసుకోకుండా, లేనిపోని అల్లర్లుకూడా జరుగుతూండడం కూడా చూసాము. అన్నిటిలోకీ ముఖ్యంగా,  శరీర అనారోగ్యాలగురించి— ఎలాటి రోగం కానీయండి, ఎలాటి ఆరోగ్య సమస్య కానీయండి, ప్రతీదానికీ అంతర్జాలంలో సమాధానం దొరుకుతుంది. దానితో ప్రతీవాడూ, తనే ఓ డాక్టరయానని భావిస్తున్నాడు. ముందుగా తనసమస్యా, దాని లోతుపాతులు, వైద్యాలూ చదివేసాకే డాక్టరు దగ్గరకు వెళ్ళడం, రోగంగురించి డాక్టరు చెప్పేలోపలే, తన  అంతర్జాల పరిజ్ఞానంతో, ఆ డాక్టరుతో వాదించడం, అసలు ఆయన పని ఆయన చేసుకోనీయకపోవడం. ఈమాత్రందానికి, డాక్టర్లూ, ఆసుపత్రులూ ఎందుకుట? ఆ వైద్యమేదో, తనే స్వంతంగా చేసేసుకుంటే, ఖర్చులైనా తప్పుతాయిగా? మనం అంతర్జాలంలో ఏమేం చేస్తున్నామో, ఎవరికీ తెలియదనే భ్రమ లో ఉన్నాము ఇన్నాళ్ళూ… ఆ ముచ్చటా తీరిపోయింది, ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది…”   “Electronic devices like Mobile,Desktop. Laptop, Modems will be under surveillance”. ఈరోజుల్లో అన్నిటికంటే ప్రమాదమైనది—అశ్లీల దృశ్యాల గురించి. అంతర్జాలంలో వేలాది సైట్లున్నాయి, వీటిగురించి. మొక్కుబడికోసం, ప్రభుత్వాలు కొన్ని సైట్స్ ని నిషేధించామంటారు.దీనివలన ఎలాటి ప్రయోజనమూ కనిపించడం లేదు. యదేఛ్ఛగా చూపిస్తున్నారు. ఈ రోజుల్లో, స్కూలుకీ, కాలేజీలకీ వెళ్ళే  ఆడ, మగ పిల్లలకి, సెక్స్ గురించి అవగాహన ఉంది, ఈ  Porn sites  ధర్మమా అని. చెప్పొచ్చేదేమిటంటే,  అంతర్జాలంలో మంచీ ఉంది, చెడూ ఉంది.. ఎవరెలా ఉపయోగించుకుంటే అలా…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
weekly-horoscope july19th to july 25th july