Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue327/833/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)...  చీకటి మూసిన ఏకాంతం నిండిన తన బతుకుని వెలిగించే ఆ చందమామ ఎవరు! అసలు… ఈ జన్మలో తన బతుకులో వెలుగు రేఖలు వ్యాపిస్తాయా! సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు మౌక్తిక మనసుని అల్లకల్లోలం చేసి పారేశాయి. అనేక ఆలోచనలతో సమరం సాగిస్తున్న ఆమె మెదడు విశ్రాంతిని కోరుకుంది. మరి కొద్దిసేపటికి ఆమె కళ్ళు మూతలు పడ్డాయి.

“ముక్తా గారూ…’’ స్టాఫ్ రూమ్ లో విశ్రాంతిగా కూర్చున్న మౌక్తిక మధుకిరణ్ పిలుపుకి తలెత్తి చూసింది. సున్నితమైన ఆ పిలుపు మౌక్తిక చెవులకి మంగళ వాయిద్యాల్లా శుభ ప్రదంగా వినిపించింది. సన్నిహితులందరూ ఆమెని ‘ముక్తా’ అనే పిలిచినా… ఎవరి పిలుపులోనూ లేని మాధుర్యం ఇతడి పిలుపులో నిండి ఉంది.

“ఏమిటండీ…’’ అదుపు తప్పుతున్న తలపులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ అడిగింది మౌక్తిక.

“ఏమీలేదండీ… బిఎస్సీ సెకెండ్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు ఫిజిక్స్ క్లాస్. ఇవాళ శమంతకం గారు రాలేదు కదా! వీళ్ళు తెగ అల్లరి చేసేస్తున్నారు. వీళ్లగోల వినలేకుండా ఉన్నామని పక్కక్లాసులవాళ్ళు ఒకటే బాధపడుతున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే… ఆక్లాస్ టేకప్ చేయగలరా?’’ అభ్యర్ధనగా అన్నాడు మధుకిరణ్.

“నో ప్రాబ్లం…నాకెటూ లీజరే.’’ బల్లమీద పుస్తకాలు తీసుకుని లేచినిలబడింది మౌక్తిక.

“థాంక్యూ వెరీమచ్ ముక్తా గారూ…’’ మర్యాదగా చెప్పాడు మధుకిరణ్.

“యు ఆర్ వెల్ కం…’’ ఎటో చూస్తూ చెప్పింది మౌక్తిక. అతడి వైపే సూటిగా చూస్తే తన మనసుకి కళ్ళెం వేయలేదేమోనని ఆమెకి భయం. అతడి కళ్ళు ఆపాదమస్తకమూ తననే పరికిస్తూ ఉంటాయని ఆమెకు తెలుసు. ఆకళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించే ప్రేమభావన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అవ్యక్తమైన ఆరాధనేదో అతడివైపుకి బలంగా ఆకట్టుకుంటుంది.

వింతమోహంతో జ్వలించుకుపోతూ…అతడివెంట పరుగులుతీసే మనసుని నియంత్రించడం ఆమె వల్లకాదు. అందుకే ఆ దిక్కులు చూడడం. ఆమె అలాగే… ముక్తసరిగానే ప్రవర్తిస్తుందని అతడికీ తెలుసును. అందుకే స్టాఫ్ రూమ్ లోనుంచి తన క్లాసుకి తరలిపోయాడు మధుకిరణ్.
అతడు చెప్పిన విధంగా బిఎస్సీ సెకెండ్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్ క్లాస్ తీసుకుంది మౌక్తిక. ఆమె పాఠం చెబుతున్న విధానానికి వాళ్ళ అల్లరి కాస్త శాంతించింది.

మరి కాసేపటికి క్లాసంతా పిన్ డ్రాప్ సైలెన్స్ గా మారిపోయింది.తాను టైమ్ పాస్ కి చదువుకున్న చదువు ఇలా పొట్టకూటికి ఉపయోగ పడుతుందని మౌక్తిక అస్సలనుకోలేదు. బాగా టీచ్ చేస్తుందని కాలేజ్ లో మంచిపేరే ఉందామెకి. అనవసరమైన విషయాల్లో తలదూర్చదన్న కీర్తీ ఉంది. తాను ప్రశాంతంగా జీవించడానికి కారణమైన ఈ ఉద్యోగమంటే ఆమెకి అపరిమితమైన గౌరవం, ఇష్టం ఉన్నాయి. అందుకే… సాధ్యమైనంతవరకూ తన ఉద్యోగానికి న్యాయం చేయాలని ఆమె ప్రయత్నం.

ఆ సాయంత్రం… కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉంటే… కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి తననే తదేకంగా చూస్తున్న మధుకిరణ్ కనిపించాడు. అ చూపులోని తీవ్రతకి ఒళ్ళు ఝల్లుమంది.

ఎందుకు! ఎందుకిలా జరుగుతోంది!

తన మనసు తన అధీనంలో ఉండనని మొరాయిస్తోందెందుకు!

అతడి మైకంలో పడిపోతానంటూ మారాం చేసి తనను విసిగిస్తోందెందుకు!

పాడు మనసు… పాడు మనసాని!

ఈ మనసు చేసే వింతచేష్టలకి పర్యవసానం ఏమిటీ?

అందుకే కాబోలు…’ మనసు కోతివంటిదీ…వయసు కొమ్మవంటిదీ…ఊపేసి పోతుంది మొదటిదీ… ఆ ఊపు మరవనంటుంది రెండవదీ’ అన్నాడో సినీ కవి. దానికి సజీవసాక్ష్యం ప్రస్తుతం తానున్న స్థితి.

ఇంకా నయం! రమ్య అతడిని గమనించలేదు. గమనించి ఉంటే తన బుర్ర అప్పడంలా నమిలేసి ఉండేది. ‘బతుకుజీవుడా’ అనుకుంది మౌక్తిక. ఇంటికి వచ్చి పనుల్లోపడినా మధుకిరణ్ తలపులు మాత్రం ఆమెని వీడలేదు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram