Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nee peru talachina chalu

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue327/834/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి).... ఇండియన్ అంబాసిడర్ అప్పుడే మిత్రవిందతో పాకిస్ధాన్ రాజకీయాల గురించి చర్చించి రిలాక్స్ గా కూర్చున్నాడు. ఆమె వెళ్ళిపోయిన తరువాత టేబుల్ మీద ఉన్న పేపర్ అందుకుని చదవబోయాడు. అప్పుడే టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ చప్పుడు చేసింది. చప్పున రిసివర్ ఎత్తి యస్ అన్నాడు హుందాగా.

“నేను పాకిస్ధాన్ రక్షణమంత్రి పర్సనల్ అసిస్టెంట్ ను మాట్లాడుతున్నాను”అవతలనుంచి వినిపించింది.

“ఓ మీరా చెప్పండి. ఏమిటి విషయం”అన్నాడు అంబాసిడర్.

“మిమ్మల్ని ఒకసారి మంత్రిగారు రమ్మని చెప్పారు”అన్నాడు అసిస్టెంట్.

“ఎందుకో తెలుసుకోవచ్చా’అడిగాడు అంబాసిడర్.

“పెద్దగా సీరియస్ విషయం కాదు. ఒక విషయంలో క్లారిపికేషన్ కోసం రమ్మనిచెప్పారు”

“అది ఏమిటో తెలుసుకోవచ్చా. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి”అన్నాడు అంబాసిడర్ సందిగ్ధంగా.

“నాకు కూడా అసలు విషయం తెలియదు. నాతో ఏం చెప్పలేదు”అన్నాడు పర్సనల్ సెక్రటరి.

“సరే ఒక గంటలో వస్తానని మంత్రిగారికి చెప్పండి”అన్నాడు అంబాసిడర్.

“ద్యాంక్స్ “చెప్పి లైన్ కట్ చేశాడు పర్సనల్ సెక్రటరి. అంబాసిడర్ కూడా రిసివర్ క్రెడిల్ చేసి ఆలోచనలో పడ్డాడు. అసలు విషయం చెప్పకుండ ఉన్నట్టుండి రక్షణ మంత్రి తనని రమ్మని చెప్పటం కొంచం కంగారుపెట్టింది అంబాసిడర్ ను. ఇలా వెళ్ళటం ఆశ్చర్యం కాకపోయిన విషయం చెప్పకుండ రమ్మని చెప్పటం మాత్రం కొంచం విచిత్రంగా తోచింది అంబాసిడర్ కు. గోడ గడియారం పదకొండుగంటలు చూపిస్తోంది. బయలుదేరటానికి ఇంకో గంట టైం ఉంది. ఈ లోగా కొన్ని ముఖ్యమైన ఫైల్స్ మీద సంతకం చేసి లేచి నిలబడ్డాడు అంబాసిడర్.  అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళి రిఫ్రెష్ అయి ఇవతలకు వచ్చాడు. మెల్లగా నడుస్తూ పార్కింగ్ స్పేస్ లో ఉన్న తన కారు వైపు నడిచాడు. కారు పక్కనే సిగరెట్ తాగుతూ విడియో గేమ్ చూస్తున్న డ్రైవర్ అంబాసిడర్ ను చూసి అలర్ట్ అయ్యాడు. సెల్ వెంటనే ఆఫ్ చేసి స్టిఫ్ గా నిలబడ్డాడు.  వెనుక డోర్ తెరిచిపట్టుకున్నాడు. అంబాసిడర్ ఏం మాట్లాడకుండ వెళ్ళి కూర్చున్నాడు.

“ఎక్కడికి వెళ్ళాలి సార్”కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు డ్రైవర్.

“డిఫెన్స్ మినిస్టర్ ఆఫీసుకు వెళ్ళు” మెల్లగా అన్నాడు అంబాసిడర్. కారు మెల్లగా కదిలి గమ్యస్ధానం వైపు సాగిపోయింది. అంబాసిడర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అరగంట తరువాత కారు రక్షణమంత్రి ఆఫీసు ప్రాంగణంలో ఆగింది. కారు పార్కింగ్ స్పేస్ లో పార్క్ చేసిన వెంటనే అంబాసిడర్ దిగాడు. రక్షణమంత్రి చాంబర్స్ ఎక్కడుందో ఆయనకు బాగా తెలుసు. ఇంతకుముందు రెండు మూడుసార్లు ఆయనను కలుసుకోవటం జరిగింది. ఆ మూడు సమావేశాలు చాల స్నేహపూరితవాతావరణంలో జరిగాయి. విశాలమైన పొడుగాటి కారిడార్ దాటి రక్షణమంత్రి చాంబర్స్ దగ్గరకు చేరుకున్నాడు. కోటు జేబులోంచి ఖర్చీఫ్ తీసి మొహాన్ని తుడుచుకున్నాడు. తరువాత తలుపుతోసుకుని లోపలికి వెళ్ళాడు. లోపల రక్షణమంత్రితో పాటు ఇంకో మిలిట్రి అధికారి కూడా ఉన్నాడు. అతను వయస్సులో చాల చిన్నవాడిలా కనిపిస్తున్నాడు.  కాని కళ్ళలో తెలివితేటలు కొట్టోచ్చినట్టు కనిపిస్తున్నాయి.

“రండి అంబాసిడర్”మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు రక్షణమంత్రి.

“ద్యాంక్స్ మినిస్టర్ “అని చెప్పి ఆ అధికారి పక్కన కూర్చున్నాడు అంబాసిడర్.

“ఈయన పేరు జహీర్ అబ్బాస్. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ లో క్యాప్టన్. ప్రస్ధుతం ఈయనే ఆ ఉగ్రవాదుల గురించి దర్యాప్తు చేస్తున్నాడు’అని అబ్బాస్ ను పరిచయం చేశాడు.

“మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాల ఆనందంగా ఉంది”అన్నాడు అంబాసిడర్.

“ఇంతకుముందు ఒకసారి మిమ్మల్ని కలుసుకున్నాను అంబాసిడర్. మీరు ఇచ్చిన పార్టీకి రక్షణమంత్రితో నేను వచ్చాను”అన్నాడు అబ్బాస్.“అలాగా అంటు నవ్వాడు అంబాసిడర్.

“మిమ్మల్ని పిలిపించటానికి బలమైన కారణం ఉంది. ఆ విషయం చెప్పటానికి ముందు మీరు ఒక విడీయో క్లిప్పింగ్ చూడాలి”అంటు అబ్బాస్ వైపు చూశాడు మంత్రి. అబ్బాస్ వెంటన తన టాబ్ ని ఆన్ చేసి చూపించాడు. అది భారతరక్షణమంత్రి రెండు రోజులకు ముందు ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన క్లిప్పింగ్. రెండు నిమిషాల పాటు భారతరక్షణమంత్రి స్పీచ్ దీక్షగా విన్నాడు అంబాసిడర్. స్పిచ్ పూర్తయిన తరువాత పాకిస్ధాన్ రక్షణమంత్రి అంబాసిడర్ వైపు చూసి అడిగాడు.

“స్పిచ్ విన్నారు కదా. మీకేం అనిపిస్తుంది.?  అంబాసిడర్ ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. గదిలో ఒక్కసారిగా నిశబ్దం నిండుకుంది. ఏయిర్ కండీషనర్ చేస్తున్న చప్పుడు మాత్రం సన్నగా వినిపిస్తోంది.

“సారీ హానరబుల్ మినిస్టర్. మా మంత్రిగారి తరపున నేను మీకు సారీ చెప్పుతున్నాను”అన్నాడు అంబాసిడర్ ఇబ్బందిగా చూస్తూ.

“మీ మంత్రిగారు ఇలా మాట్లాడటం చాల శోచనీయం మిస్టర్ అంబాసిడర్. కొన్ని రోజులకు ముందే మన రెండు దేశాల మద్య స్నేహపూర్వక ఒడంబడికలు ఎన్నోజరిగాయి. ఉగ్రవాదులను అదుపు చెయ్యటానికి కొన్నిచర్యలు కూడా చేపట్టాం. అంతేకాదు మా అధికారులు ముఖ్యంగా జహీర్ అబ్బాస్ కూడా ఆ ముష్కరులను పట్టుకోవటానికి చాల కష్టపడుతున్నాడు. దురదృష్టవశతు ఇంకా వాళ్ళ గురించి చిన్న ఆచూకి కూడా దొరకలేదు. ఈ రోజు కాకపోయిన రేపయిన వాళ్ళ ఆచూకి దొరుకుతుంది. ఈ విషయం గురించి మీ అధికారులకు మంత్రిగారికి ఎన్నోసార్లు చెప్పాం. అయిన మీ హనరుబుల్ మంత్రిగారు ప్రత్యేకంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు”అన్నాడు మంత్రి.

“సారీ మినిస్టర్. ఆయన తరుపున నేను మీకు సారీ చెప్పుతున్నాను. ఈ విషయాన్ని మా ప్రధాన మంత్రిగారి దృష్టికి తీసుకు వెళతాను” అన్నాడు అంబాసిడర్. “ఆయన మాటలు మా అధికారులమీద మా దేశప్రజలమీద విపరీతమైన ప్రభావం చూపించాయి. అతికష్టం మీద వాళ్ళను సముదాయించగలిగాం. దయచేసి ఇంకో సారి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టవదని మీ తరుపునుంచి మీ మంత్రిగారిని కోరుతున్నాం. ఇంతకంటే చెప్పటానికి ఏం లేదు. మీరు చదువుకున్నవారు”అన్నాడు మంత్రి.అలాగే అని మెల్లగా తలూపాడు అంబాసిడర్.అంతవరకు మౌనంగా ఉన్న అబ్బాస్ అందుకున్నాడు. “ప్రస్ధుతం నేను నా డిపార్ట్ మెంట్ ఆ ఉగ్రవాదులను పట్టుకునే పనిలో ఉన్నాం. ఈ రోజు కాకపోయిన రేపయిన వాళ్ళను తప్పకుండ పట్టుకుంటాం. సందర్భం వచ్చింది కనుక ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మిమ్మల్ని మోసం చెయ్యటం మా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. ఒకవైపు స్నేహం చూపిస్తూ ఇంకోవైపు వెన్నుపోటు పొడటటం మాకు చేతకాదు. అఫ్ కోర్స్ ఉగ్రవాదులను పట్టుకోవటంలో మేము విఫలమైన మాట నిజమే. అంతమాత్రాన్న మా నిజాయితిని శంకించవలసిన పనిలేదు. కోపంతో ఉక్రోషంతో నేను ఈ మాటలు అనటం లేదు. బాధతో అంటున్నాను. అర్ధంచేసుకోండి”.

“సారీ ఆఫీసర్ మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు ఇంకోసారి సారీ చెప్పుతున్నాను. ఇదేం మనస్సులో పెట్టుకోకండి. ఇప్పుడిప్పుడే మన రెండు దేశాల మద్య స్నేహభావం నెలకొంటోంది. దానికి గుర్తుగా రెండు దేశాలమద్య ఎన్నో అగ్రిమెంట్స్ జరిగాయి. దురదృష్టవశతు ఆ నేపధ్యంలోనే అలాంటి సంఘటన జరగటం శోచనీయం. జరిగింది మరిచిపోండి”అన్నాడు అంబాసిడర్.

ఇంకో అయిదు నిమిషాల తరువాత మీటింగ్ ముగిసింది. చేతి రుమాలుతో మొహం మీద చెమటను తుడుచుకుంటు బయటకు వచ్చాడు. ఆయన మొహం అవమానంతో పాలిపోయింది. ఒక దేశ దౌత్యాధికారిగా ఇది మాములే అయిన ఈ పరిణామం ఆయన ఎదురుచూడలేదు. గంట తరువాత ఆయన తన చాంబర్స్ చేరుకున్నాడు. వెంటనే హాట్ లైన్ లో ప్రధానమంత్రి పర్సనల్ సెక్రటరితో మాట్లాడాడు. కాంపౌండ్ లో హడావిడి వినిపించటంతో భారంగా కళ్ళు తెరిచింది మిత్రవింద. ఆమె గది బయట ఎవరో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. కాళ్ళకు చుట్టుకున్న రగ్గును అవతలకు పెట్టి మెల్లగా లేచి నిలబడింది మిత్రవింద. వేసుకున్న నైటిని సరిచేసుకుని తలుపు తెరుచుకుని గదిలోంచి బయటకు వచ్చింది.

అప్పటికే చాల మంది ఉద్యోగస్ధులు సైట్ సీయింగ్ వెళ్ళటానికి తయారవుతున్నారు. వాళ్ళ హడావిడి చూడగానే ఆ రోజు ఆదివారం అని గుర్తుకువచ్చింది మిత్రవిందకు. తిరిగి లోపలికి వెళ్ళి శుభ్రంగా మొహం కడుక్కుంది. పెర్గులేటర్ తో కాఫీ తయారుచేసుకుని గ్లాసుతో తిరిగి బయటకు వచ్చింది. ఇంకో గంటలో దాదాపు క్వార్టర్స్ అని ఖాళీఅవుతాయి. ఎంబసిలో పనిచేస్తున్న చాల మంది తమ కుటుంబాలతో సైట్ సీయింగ్ కు వెళ్ళిపోతారు. ఉదయం పదిగంటలకు బయలుదేరి సాయంత్రం ఆరుగంటలకు తిరిగివస్తారు. టిఫిన్ లంచ్ అంతా హోటల్ లో పూర్తిచేస్తారు. మిత్రవింద క్రిప్టాలజిస్ట్ రాజేష్ మాత్రం ఎక్కడికి  వెళ్ళరు. తలుచుకుంటే మిత్రవింద ఎక్కడికైన వెళ్ళవచ్చు. ఆమెను అడ్డుకునే అధికారం ఎవరికి లేదు. కాని ఎంబసి విడిచి ఒంటరిగా బయటకు వెళ్ళటం మిత్రవిందకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇక రాజేష్. అతనికి మాత్రం అందరిలాగే బయటకు వెళ్ళి ఎంజాయ్ చెయ్యాలని ఉంటుంది. కాని ఆ అవకాశం అతనికి లేదు. ఎంతో అత్యవసర పరిస్ధితులలో తప్ప రాజేష్ ను ఎట్టి పరిస్ధితులలోను బయటుక పంపించరు.“గుడ్ మార్నింగ్ మేడం”అని ఒక గొంతు వినిపించింది. చప్పున వెనక్కి తిరిగి చూసింది మిత్రవింద. ఎదురుగా గౌరి కనిపించింది. ఆమె కూడా ఎంబసిలో ఉద్యోగస్ధురాలు కంప్యూటర్ సెక్షన్ లో పనిచేస్తుంది. మిత్రవిందకు మంచి స్నేహితురాలు. కాకపోతే మిత్రవింద కంటే ఒక సంవత్సరం సీనియర్.

“సైట్ సీయింగ్ కు వెళుతున్నారా”నవ్వుతూ అడిగింది మిత్రవింద.

“అవును మేడం. క్యార్టర్స్ ఒంటరిగా కూర్చుంటే తెగ బోర్ కొడుతుంది. పిచ్చెత్తినట్టుగా ఉంటుంది.ఆలా బయటకు తిరిగి వస్తే అటు టైం పాస్ అవుతుంది. శరీరంలోకి కొత్త శక్తివచ్చినట్టుగా ఉంటుంది. రేపు డ్యూటి ఉత్సాహంతో చెయ్యవచ్చు”అంది గౌరి.

“మీతో ఇంకేవరైన వస్తున్నారా”అడిగింది మిత్రవింద.

“లేదు నేను ఒక్కదానినే వెళుతున్నాను. సిటిలో నాకు వరుసకు మామయ్య అవుతారు. ఆయన చాల కాలం నుంచి ఇక్కడే సెటిల్ అయ్యారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ సరదాగా గడిపి తిరిగి వస్తాను”అంది గౌరి.

“మీరు చాల అదృష్టవంతులు. దేశంకాని దేశంలో మీ చుట్టాలు ఉన్నారు”అంది మిత్రవింద.

“మీరు ఎక్కడికి వెళ్ళారా మేడం”అడిగింది గౌరి.

“మీ లాగా నాకు ఇక్కడచుట్టాలు కాని బందువులు కాని స్నేహితులు కాని ఎవరు లేరు. పైగా ఎంబసి విడిచి ఒంటరిగా బయటకు వెళ్ళటం నాకు ఇష్టంలేదు”అంది మిత్రవింద.

“నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళకుండ ఇరవైనాలుగు గంటలు ఈ నాలుగుగోడల మద్య ఎలా గడుపుతున్నారో నాకు అర్ధం కావటం లేదు. అఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే మేడం నేను బయలుదేరుతాను”అని మెల్లగాతన కారు వైపు నడిచింది గౌరి.

మరో ఇద్దరు ఉద్యోగస్ధులు మిత్రవిందను పలకరించి వెళ్ళిపోయారు. సరిగ్గా గంట తరువాత ఎంబసి దాదాపు నిశబ్ధమైపోయింది. మిత్రవింద ఉంటున్న వైపు ఆమె రాజేష్ మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఒంటరిగానో తమ కుటుంబాలతో వెళ్ళిపోయారు. మెల్లగా ముందుకు వెళ్ళి ఒక క్వార్టర్ వైపు తొంగిచూసింది. రాజేష్ హాలులో కూర్చుని లాప్ టాప్ తో కుస్తీ పడుతున్నాడు. అతన్ని డిస్ట్రబ్ చెయ్యటం ఇష్టంలేక తన ఇంట్లోకి వచ్చేసింది మిత్రవింద.

ఎంబసి అంతా నిశబ్ధంగా నిస్తేజంగా ఉంది. అప్పుడే సెక్యురిటి మెయిన్ గేటు తలుపులు మూస్తున్న చప్పుడు అస్పష్టంగా వినిపించింది.    హాలులో కూర్చుని అబ్బాస్ కు కాల్ చేసింది. ఆశ్చర్యంగా మొదటి రింగ్ కే రెస్పాండ్ అయ్యాడు అతను.

“ఏం చేస్తున్నావు భార్యామణి” హాస్కిగా అడిగాడు అబ్బాస్.

“ఎప్పుడు చేసేదే చేస్తున్నాను. ఏం తోచక హాలులో గోళ్ళు గిల్లుకుంటు కూర్చున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు”అడిగింది నవ్వుతూ మిత్రవింద.

“నిన్నరాత్రంతా నైట్ డ్యూటి చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. కాఫీ తాగుతుంటే నువ్వు కాల్ చేశావు. సరే ఈ రోజు నీ ప్రోగ్రాం ఏమిటి?    “ఏం లేదు. అన్ అఫీషియల్ గా ఎంబసికి సెక్యురిటి గార్డ్ ను. నేను ఎక్కడికి వెళ్ళగలను”అంది మిత్రవింద నిరుత్సాహంగా.

“నీ బాధ నాకు అర్ధమైంది. ఆ ఉగ్రవాదులు పట్టుబడితే కాని మన సమస్య తీరదు. కాని ఎంత కష్టపడిన ఆ రాక్షసుల ఆచూకి తెలియటంలేదు. ఒకవైపు మా అధికారుల వత్తిడి ఇంకో వైపు మీ రక్షణమంత్రి అవాకులుచెవాకులు విపరీతమైన టెన్షన్ కలగచేస్తున్నాయి. ఆయిన నేను ఎంత మాత్రం నిరుత్సాహపడను. నాశాయశక్తుల ప్రయత్నించి వాళ్ళను పట్టుకుంటాను. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతవరకు నువ్వు ఓపికగా కాచుకో చాలు.”

“ఆ నమ్మకం నాకు ఉంది అబ్బాస్. నువ్వు తప్పకుండ విజయం సాధించగలవు. నిన్ను ఇబ్బంది పెట్టాలని అలా అనలేదు. ఏదో సరదాగా మాట వరుసకు అన్నాను.”

“ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు మళ్ళిచెప్పుతున్నాను. ఎట్టిపరిస్ధితిలోను ఆ క్రిప్టాలజిస్ట్ రాజేష్ ను మాత్రం బయటకు పంపించకు. మన రెండు దేశాల పరిస్ధితులు అంత బాగా లేవు. పైకి స్నేహంగా నటిస్తున్నారు కాని లోపల మాత్రం కోపంతో అనుమానంతో రగిలిపోతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్ధితి”అన్నాడు అబ్బాస్ భారంగా.

“నాకు తెలుసు అబ్బాస్. ఇంకేమిటి  విషయాలు. మా అత్తగారు ఎలా ఉన్నారు”అంది మిత్రవింద.

“నిజం చెప్పాలంటే ఆవిడ బాధ చూడలేకపోతున్నాను. నా కోడలు పిల్లను ఎప్పుడు తీసుకువస్తావని రోజు పోరుపెడుతోంది. ఏదో జవాబు చెప్పి తప్పించుకుంటున్నాను. పరిస్ధితుల గురించి ఆమెకు బాగానే తెలుసు. అయిన ఆత్రం అణుచుకోలేక ప్రతిరోజు అడుగుతూ నన్ను ఇబ్బంది పెడుతోంది.”

“నేను అత్తగారితో మాట్లాడతాను. దయచేసి ఆవిడ సెల్ నెంబర్ ఇవ్వండి.”

“ఆమెకు సెల్ ఆపరేట్ చెయ్యటం చాతకాదు. నా లాండ్ లైన్ నెంబర్ ఇస్తాను. కావాలనుకుంటే మాట్లాడు.నెంబర్ మెసెజ్ చేస్తాను”అన్నాడు అబ్బాస్.వెంటనే మిత్రవింద లైన్ కట్ చేసింది. క్షణం తరువాత అబ్బాస్ ఇంటి లాండ్ లైన్ నెంబర్ ఆమె ఫోన్ లో ప్రత్యేక్షమైంది. వెంటనే ఆ నెంబర్ కు కాల్ చేసింది. బహుశా ఈ విషయం అబ్బాస్ ఆమెకు చెప్పిఉంటాడు. అందుకే మాములుగా ఆర్డర్లీ కాకుండ షబ్నమ్ రిసివర్ ఎత్తింది.

“నేను అత్తయ్య మిత్రవిందను మాట్లాడుతున్నాను”అంది మిత్రవింద.

“నువ్వా తల్లి ఎలా ఉన్నావు.”

“నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది”అడిగింది మిత్రవింద.

“నాకేం గుండు రాయిలా ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఈ ఇంట్లో కాలుపెడతావా అని ఎదురుచూస్తున్నాను.”

“మీరేం బాధపడకండి. తొందరలోనే ఆ రోజు వస్తుంది. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఉగ్రవాదులను పట్టుకోవటానికి మీ అబ్బాయి రాత్రిపగలు అని తేడాలేకుండ ప్రయత్నిస్తున్నారు. తప్పకుండ విజయం సాధిస్తారు. వాళ్ళను పట్టుకుని భారతప్రభుత్వానికి తొందరలోనే అప్పగిస్తారు. కొంచం ఓపిక పట్టాలి అంతే.”అంది మిత్రవింద.

అయిదు నిమిషాలు మాట్లాడి షబ్నమ్ ను సముదాయించగలిగింది మిత్రవింద. ఆమెతో మాట్లాడిన తరువాత లైన్ కట్ చేసి ఇవతలకు వచ్చింది. అప్పుడే ఒక అనూహ్యమైన పరిణామం జరిగింది.

రాత్రి  మాములుగా తెల్లవారిపోయింది. మిత్రవిందకు మాత్రం అది కాళరాత్రి అయింది. రాత్రంతా ఆమె రాజేష్ శవం పెట్టిన బాక్స్ దగ్గర కూర్చునే ఉంది. భోజనం చెయ్యటం మాట అటు పక్కన పెడితే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. చలనం లేకుండ బొమ్మాలా కూర్చుంది. ఎవరు పట్టించుకోకపోతే ఆమె ఇంకా అలాగే కూర్చునే ఉండేది. అప్పుడే అంబాసిడర్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె పరిస్ధితి చూడగానే అతని మనస్సు కరిగిపోయింది.

“సారీ మేడం. రాత్రి ఏదో ఆవేశంలో పరుషంగా మాట్లాడాను. ఆవేం పట్టించుకోకండి. ఇంటికి వెళ్ళి కొంచం సేపు విశ్రాంతి తీసుకోండి”అన్నాడు.
మెల్లగా లేచి నిలబడింది మిత్రవింద. నిద్రలో నడుస్తున్నట్టుగా నడుస్తూ తన ఇంటికి చేరుకుంది. రాత్రంతా నిద్రపోకపోవటం వల్ల కళ్ళు ఎర్రగా అయ్యాయి. మనిషిలో పూర్తిగా శక్తి ఉడిగిపోయినట్టు బలహీనంగా కనిపిస్తోంది. కొన్ని గంటలలోనే పది లంకణాలుచేసిన దానిలా ఉంది. గంట తరువాత స్నానం చేసి బట్టలు మార్చుకుంది. టిఫిన్ సహించలేదు. కాఫీ మాత్రం తాగి తిరిగి ఆఫీసు చేరుకుంది. అప్పటికే స్టాఫ్ అందరు వచ్చేశారు. అందరి మొహంలో విచారం బాధ గూడుకట్టుకుని ఉన్నాయి.

కొన్ని గంటలకు ముందు తమ కళ్ళముందు తిరిగిన రాజేష్ ఇప్పుడు లేడు. అది తలుచుకుంటే అందరికి చేదుమాత్ర మింగినట్టుగా ఉంది. తల్లి తండ్రికి రాజేష్ ఒక్కడే కొడుకు. ఆ దంపతులు రాజేష్ మీద ఎన్నోఆశలు పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు తమ కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడని తెలిస్తే ఏమాత్రం తట్టుకోలేరు. వాళ్ళను తలుచుకుంటే మిత్రవిందకు దుఖ్ఖం ఆగటం లేదు.

అంబాసిడర్ హాట్ లైన్ లో భారతప్రభుత్వంతో మాట్లాడుతూ చాల బిజీగా కనిపించాడు. మూడు గంటల తరువాత అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాజేష్ శవాన్ని డిప్లమెటిక్ విమానంలో ఇండియా పంపిస్తున్నారు. తరువాత అక్కడనుంచి అతని తల్లితండ్రి ఉంటున్న గ్రామానికి తీసుకువెళతారు. పన్నెండు గంటలకు మిగత తతంగం పూర్తయింది. రాజేష్ శవాన్ని అంబులెన్స్ లోపెట్టారు. చివరిసారిగా అందరు అతన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. మిత్రవింద పరిస్ధితి చెప్పనవసరం లేదు. దుఖ్ఖానికి ప్రతిరూపంలా ఉంది.

అంబులెన్స్ రాజేష్ శవాన్ని తీసుకుని ఏయిర్ పోర్ట్ కు బయలుదేరింది. ఆ తరువాత స్టాఫ్ అందరు వెళ్ళిపోయారు. ఎవరికి ఆఫీసులో పని చెయ్యబుద్ధి కాలేదు. మిత్రవింద తన గదిలో నిస్తేజంగా కూర్చుంది. అప్పుడే ఆమె సెల్ చప్పుడు చేసింది. అబ్బాస్ చేశాడు.

“ఎలా ఉన్నావు మిత్రవింద”మెల్లగా అడిగాడు అబ్బాస్.“చావలేక బతుకుతున్నాను అబ్బాస్. నా నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలిఅయింది”అంది మిత్రవింద.

“అనవసరంగా నిన్ను నువ్వు దోషిగా భావించకు. ఇదంతా కాకతాళీయకంగా జరిగిపోయింది. ఇందులో ఎవరి తప్పు లేదు.”

“లేదు అబ్బాస్. నేను కొంచం కఠినంగా ప్రవర్తించిఉంటే ఈ అనర్ధం జరిగేది కాదు. సెంటిమెంట్ కు లొంగిపోయి పెద్ద తప్పుచేశాను. మొహమాటం అనేది ఎంత పెద్ద బలహీనతో సెంటిమెంట్ కూడా ఒక రకమైన బలహీనత. అది అన్ని వేళలా మంచి చెయ్యదని రాజేష్ సంఘటన నిరూపించింది.”

“జరిగింది మరిచిపో మిత్రవింద.”

“ఈ సంఘటన ప్రభావం మన దేశాల మీద ఎలా ఉంటుంది.?

“ఇది ఇంతటితో ఆగిపోదు. మీ ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోదు. ముఖ్యంగా మీ ప్రజలు విపరీతంగా స్పందిస్తారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించటం చాల కష్టం. నువ్వు మాత్రం చాల జాగ్రర్తగా ఉండు. “

“అసలు  రాజేష్ ను ఎవరు చంపారు. అంత దారుణంగా చంపవలసిన అవసరం ఎవరికి వచ్చింది”?

“ఎవరు చంపారో ఖచ్చితంగా తెలియదు. నాకు మాత్రం మా ఇంటర్ సర్వీస్ డిపార్ట్ మెంట్ మీద అనుమానంగా ఉంది. రాజేష్ హత్య జరిగిన విధానం చూస్తుంటే నాకు వాళ్ళమీదే ఎక్కువగా అనుమానంగా ఉంది. ఆ డిపార్ట్ మెంట్ అధికారులు మాత్రమే పాయింట్ బ్లాంక్ రేంజిలో నుదుటి మద్యలో కాలుస్తారు. ఇవి కేవలం నా అనుమానాలు మాత్రమే. వాటికి తగిన ఆధారాలు లేవు.

“చంపటానికి ముందు అతన్ని రాక్షసంగా టార్చర్ చేశారు. ఎందుకు?

“బహుశా మీ దేశం రహస్యాలు తెలుసుకోవటానికి అనుకుంటాను”అన్నాడు అబ్బాస్. అతను చెప్పకపోయేసరికి కోపంతో కాల్చీ చంపిఉంటారు. ఐయస్ఐ పెద్ద తప్పుచేసింది. ఇది ఇంతటితో ఆగిపోదు. దీనికి రిటార్టుగా మీ దేశంలో ఏదైన జరగవచ్చు. మనం చెయ్యగలిగింది ఏం లేదు. ఈ సంఘటన వల్ల మన రెండు దేశాలు చాల నష్టపోతాయి. అంతో ఇంతో స్నేహభావంతో ఉన్న మన దేశాల మీద ఈ సంఘటన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఉగ్రవాదుల దాడి ఒక ఎత్తు అయితే ఈ సంఘటన మరో ఎత్తు. దీని పర్యావసానం ఎలా ఉంటుందో తలుచుకుంటే భయంగా ఉంది. అదే జరిగితే అందరికంటే మనం ఇద్దరం బాగా నష్టపోతాం. ఇబ్బందిలో పడతాం”

“ఎలా?

“ఈ సంఘటన మీ ప్రభుత్వం అంత తేలికగా తీసుకోదు. ప్రెస్ మీట్ పెట్టి మా దేశాన్ని తీవ్రంగా విమర్శిస్తారు. దీని వల్ల మన రెండు దేశాల మద్య టెన్షన్ నెలకొంటుంది. ఇంతవరకు స్నేహితులుగా ఉన్న ఈ రెండుదేశాలు అగర్భశుత్రవులుగా మారిపోతాయి. ఇద్దరిమద్య యుద్ధ వాతావరణం నెలకొన్ని ఆశ్చర్యపోనవసరం లేదు. దీని వల్ల మన పెళ్ళి ఇంకా కొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. రెండు దేశాలు ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నప్పుడు మనం పెళ్ళిచేసుకోలేం కదా”అన్నాడు అబ్బాస్.

ఆ మాటలు వినగానే మిత్రవింద మొహంలో కళ పూర్తిగా ఇంకిపోయింది.

“ఇప్పుడు ఏం చేద్దాం. ఈ జన్మలో మనం కలిసి ఉండలేమా?

“తప్పకుండ ఉంటాం. నువ్వేం కంగారుపడకు. ఈ దేశాలు ప్రభుత్వాలు కాదు కదా ఆ పాలాక్షుడు కూడా మనని వీడదీయ్యాలేడు. నేనే ఏదో ప్లాన్ ఆలోచిస్తాను. నువ్వు మాత్రం ఏం జరగనట్టుగా ఉండు”

“అంతా నీదే భారం అబ్బాస్. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరులేరు. నా ఉద్యోగం మన పెళ్ళికి అటంకం అనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చెయ్యటానికి సిద్దంగా ఉన్నాను. ఈ ఉద్యోగం కంటే నీతో కలిసి ఉండటమే నాకు కావల్సింది”అంది మిత్రవింద.

“అప్పుడే అంత నిరుత్సాహపడకు. అంతా నాకు వదిలిపెట్టు. ఈ సమస్యకు పరిష్కారం నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. సరే ఉంటాను. తరువాత కాల్ చేస్తాను”అని లైన్ కట్ చేశాడు అబ్బాస్. మిత్రవింద కూడా సెల్ ఆఫ్ చేసి అన్యమనస్కంగా ఉండిపోయింది. ఉగ్రవాదుల దాడి వల్ల తాత్కాలికంగా ఆమె పెళ్ళి వాయిదా పడింది. ఇప్పుడు రాజేష్ సంఘటన వల్ల ఇంకా కొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది.

ఎందుకో కారణం తెలియదు కాని తమ పెళ్ళి జరగదని ఆమెకు అనుమానం వేస్తోంది. అబ్బాస్ చెప్పినట్టు జరిగితే దాని ఫలితం ఇద్దరు అనుభవించకతప్పదు.

రాజేష్ సంఘటన భారతప్రభుత్వాన్ని కదిలించివేసింది. ఈ దారుణానికి కారకులు ఎవరో తెలుసుకోవాలని భారతప్రధాని స్వయంగా పాకిస్ధాన్ ప్రధానితో మాట్లాడాడు. నేరంచేసినవాళ్ళను తప్పకుండ పట్టుకుంటామని హామీ ఇచ్చాడు పాకిస్ధాన్ ప్రధాని. భారత రక్షణసంస్ధలు ముందు జాగ్రర్తగా ఎలాంటి అవాంచనీయమైన సంఘటన జరిగిన ఎదురుకోవటానికి సిద్దం అయ్యాయి.

నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచాయి. ఢిల్లీలో ఎలాంటి సంఘటన జరగలేదు. ప్రభుత్వం అధికారులు తేలికగా నిటుర్చి కొంచం రిలాక్స్ అయ్యారు. అదే వాళ్ళు చేసిన తప్పు. తుపాను వచ్చేముందు వాతావరణం చాల ప్రశాంతంగా ఉంటుంది. ఢిల్లిలో కూడా నాలుగురోజులు ప్రశాంతంగా గడిచింది. సరిగ్గా ఆయిదవ రోజు ఎవరు ఊహించని భయంకరమైన సంఘటన జరిగింది.

సంఘటన రెండు దేశాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా మిత్రవింద అబ్బాస్ కు పెద్ద సమస్యగా మారింది.ఇండియా న్యూఢిల్లీ.
    పాకిస్ధాన్ ఎంబసికి కొంచం దూరంలో ఒక పాత మారుతి కారు ఆగిఉంది. అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. నీలంరంగు జీన్స్ దాని మీద టీషర్ట్ వేసుకున్నారు. వాటిమీద పంచ్ మీ హియర్ అన్న అక్షరాలు ముద్రించి ఉన్నాయి. చూడటానికి ఇద్దరు కాలేజి స్టూడెంట్స్ లా ఉన్నారు. దాదాపు గంట నుంచి వాళ్ళు ఎంబసిని గమనిస్తున్నారు. ఎవరికి అనుమానం కలగకుండ వాళ్ళలో ఒకడు అప్పుడప్పుడు కారు బాయ్ నెట్ తెరిచి కారును పరీక్షిస్తున్నట్టు నటిస్తున్నాడు. చూసినవాళ్ళకు కారు చెడిపోయిందని దాన్ని రిపేర్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారని అనుకుంటారు తప్ప వాళ్ళు ఎంబసిని వాచ్ చేస్తున్నారని ఎవరికి అనుమానం రాదు.

క్షణాలు నిమిషాలు గడుస్తున్నాయి. అప్పుడే ఎంబసి మెయిన్ గేటు తలుపులు తెరుచుకున్నాయి. ఒక చిన్నగారు గేటులోపలనుంచి బయటకు వచ్చిది. డ్రైవింగ్ సీటులో ఒక అందమైన అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె పేరు నస్రీన్. పాకిస్ధాన్ ఎంబసిలో అడ్మినిస్టేషన్ వింగ్ లో పనిచేస్తుంది. ఆ రోజు ఆదివారం కనుక తన బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోవటానికి వెళుతోంది. ఆమె కారు ముందుకు వెళ్ళిన వెంటనే ఆమె కోసమే ఎదురుచూస్తున్న కారు ముందుకు కదిలింది. నస్రీన్ కారు వెనుకే ఫాలో అయింది. పావు గంట తరువతా నస్రీన్ కారు సిటి లిమిట్స్ దాటి నేషనల్ హైవే మీద ప్రవేశించింది. అక్కడికి కొంచం దూరంలో లవర్స్ ప్యారడైజ్ అనే ఏరియా ఉంది. ఆ ప్రాంతంలో పెద్దగా జనసంచారం ఉండదు.

అందుకే వయస్సులో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి స్వీట్ నదింగ్స్ చెప్పుకుంటారు. ప్రస్ధుతం నస్రీన్ కూడా తన బాయ్ ఫ్రెండ్ ను అక్కడే కలుసుకోబోతుంది. ఉన్నట్టుండి వెనుక కారు వేగంగా వచ్చి నస్రీన్ కారుకు అడ్డంగా వచ్చి ఆగింది. నస్రీన్ కంగారుపడి ఒక్కసారిగా బ్రేక్ ను గట్టిగా అదిమింది. కీచుమంటు చప్పుడు చేస్తూ కారు ఆగిపోయింది. వెంటనే ఆ యువకులు వేగంగా నస్రీస్ కారు దగ్గరకు పరిగెత్తుకుంటు వచ్చారు. ఒకడు మెరుపువేగంతో తన జేబులోంచి ఒక డబ్బా తీసి నస్రీన్ మొహం మీద పెట్టి ప్రెస్ చేశాడు. పిచ్చికారిలా ఆమె మొహం మీద ఏదో చిమ్నింది. ముందు తియ్యని వాసన వేసింది. శరీరం అంతా ఒక్కసారిగా మత్తుతో సోలిపోయింది. అయిదు నిమిషాల తరువాత నస్రీన్ శరీరం అచేతనంగా స్టీర్టింగ్ మీద వాలిపోయింది.

వెంటనే ఆ ఇద్దరు యువకులు నస్రీన్ శరీరాన్ని ఎత్తుకుని తమ కారు దగ్గరకు నడిచారు.వెనుక సీటులో పడుకోపెట్టారు. క్షణం తరువాత ఆ యువకులు డ్రైవ్ చేస్తున్న కారు వేగంగా ముందుకు సాగిపోయింది.

ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి బయటకు వెళ్ళిన ఎంబసి స్టాఫ్ అందరు తిరిగి వచ్చేశారు. ఒక్క నస్రీన్ తప్ప. ఇంతకుముందు ఆమె ఎన్నోసార్లు బయటకు వెళ్ళింది. కాని సాయంత్రం ఆరుగంటలకల్లా ఎంబసి చేరుకునేది. కాని ఆ రోజు మాత్రం ఏడుగంటలైన ఆమె తిరిగి రాలేదు. ఎంబసి స్టాఫ్ కంగారుపడి ఆమె సెల్ ఫోన్ కు కాల్ చేశారు. ఫోన్ రింగ్ అవుతుంది కాని ఆమె వైపు నుంచి రెస్పాన్స్ లేదు.

ఈ విషయం తెలుసుకున్న పాకిస్ధాన్ అంబాసిడర్ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు. కాని గంటలు గడిచిన పోలీసులకు ఆమె ఆచూకి దొరకలేదు. కాని ఆమె కారు మాత్రం లవర్స్ ప్యారడైజ్ సమీపంలో కనిపించింది. కాని కారులో ఆమె మాత్రం లేదు. కారు వెనుక సీటులో ఆమె సెల్ ఫోన్ కనిపించింది.

రాత్రంతా పోలీసులు నస్రీన్ కోసం వెతుకుతునే ఉన్నారు. కాని ఆమె గురించి చిన్న క్లూ కూడా తెలుసుకోలేకపోయారు. ఆమె సెల్ ఫోన్ రికార్డ్స్ ప్రకారం ఆమె చివరి కాల్ అమన్ అనే వ్యక్తికి కాల్ చేసినట్టు తెలిసింది. వెంటనే అతని సెంబర్ కు కాల్ చేశారు పోలీసులు. కాని అతని సెల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.

ఆ రాత్రి పాకిస్ధాన్ ఎంబసిలో చాల మంది నిద్రపోలేదు. నస్రీన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. సరిగ్గా తెలవారుజామున అయిదుగంటలకు ఒక కారు వచ్చి పాకిస్ధాన్ ఎంబసి ముందు ఆగింది. అందులోంచి ఇద్దరు ఒక అమ్మాయి శరీరాన్ని మోసుకువచ్చి గేటు ముందు పడేశారు. తరువాత కారులో వేగంగా అక్కడనుంచి వెళ్ళిపోయారు.

ఉదయం అలవాటు ప్రకారం ఆరుగంటలకు సెక్యురిటి గార్డ్స్ మెయిన్ గేటు తెరిచారు. బయట నస్రీన్ శవాన్ని చూసి గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళారు. క్షణంలో ఈ విషయం అందరికి తెలిసిపోయిది.అందురు గుంపులు గుంపులుగా వచ్చి గేటు దగ్గర నిలబడ్డారు. పది నిమిషాల తరువాత నైట్ డ్రస్సులో అంబాసిడర్ వచ్చాడు.

ఆచేతనంగా ఉన్న నస్రీన్ శవాన్ని చూసి ఆయన గుండెలు అవిసిపోయాయి. సెక్యురిటి గార్డ్స్ ఆమె శవాన్ని తీసుకువచ్చి లోపలపెట్టారు. మరునాడు ఈ దారుణమైన వార్త మీడియాకు లీక్ అయింది. దాంతో పాకిస్ధాన్ ప్రజలు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. పోలీసులు వచ్చి అంబాసిడర్ తో మాట్లాడారు.

“మీ ఎంబసిలో పనిచేస్తున్న అమ్మాయికి అమన్ అని ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. చివరికాల్ ఆమ అతనికే చేసింది. అతన్ని పట్టుకుని దర్యాప్తు చేద్దామని అతని సెల్ కు కాల్ చేశాం. కాని స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. ఎలోగో అతని ఇంటి అడ్రస్సు తెలుసుకుని అతని ఇంటికి వెళ్ళాం. కాని అతను అక్కడలేడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వెళ్ళాడో తెలియదు. అతని ఫోటో కాని అతనికి సంబంధించిన వివరాలు కాని ఏం దొరకలేదు. నెహృనగర్ లో ఒక చిన్న పోర్షన్ లో అతను అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటి యజమానిని పట్టుకుని విచారిస్తే అమన్ గురించి కొన్ని వివరాలు తెలిశాయి. అదృష్టవశతు అతని ఫోటో రెంటల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ మీద కనిపించింది. వెంటనే అతని ఫోటోను సిటి అంతా సర్కులేట్ చేశాం. అన్ని చెక్ పోస్ట్ లను అప్రమత్తం చేశాం. ఇప్పుడే కాకపోయిన రేపయిన అతను ఖచ్చితంగా దొరికితీరుతాడు”అని తమ రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు.

“ద్యాంక్స్ ఆఫీసర్ మీరు ఇక వెళ్ళండి. ఏదైన అప్ డేట్ తెలిస్తే వెంటనే నాకు కాల్ చెయ్యండి”అన్నాడు అంబాసిడర్. అలాగే అని చెప్పి నమస్కారం చేసి పోలీసులు వెళ్ళిపోయారు.  అంబాసిడర్ వెంటనే తన చాంబర్స్ లోకి వెళ్ళి రక్షణమంత్రికి హాట్ లైన్ లో కాల్ చేశాడు.    “హానరుబుల్ మినిస్టర్ చాల దారుణం జరిగిపోయింది”అన్నాడు అంబాసిడర్.

“ఏం జరిగింది అంబాసిడర్” మాములుగా అడిగాడు మంత్రి.

“మన ఎంబసిలో పనిచేస్తున్న నస్రీన్ అనే అమ్మాయిని ఎవరో దారుణంగా రేప్ చేసి చంపేశారు. గంట ముందు ఆమె శవాన్ని మెయిన్ గేటు దగ్గర పడేసి వెళ్ళిపోయారు”అన్నాడు భారంగా అంబాసిడర్.

“ఎవరు చేశారు ఈ దారుణం?

“తెలియదు సార్. కాని ఎందుకు చేశారో ఊహించగలను”.

“ఎందుకు చేశారు. ఒక అమ్మాయిని అందులోను ఎంబసిలో పనిచేస్తున్న అమ్మాయిని అంతదారుణంగా రేప్ చేసి చంపవలసిన అవసరం ఎవరికి వచ్చింది”ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు మంత్రి.

“బహుశా రాజేష్ చావుకు ప్రతి కారంగా ఈ పని చేశారని నాకు అనుమానంగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు ఉండకపోవచ్చు. కాని అలా జరగటానికి అవకాశం ఉంది. దయచేసి నాదోక చిన్న విన్నపం”అన్నాడు అంబాసిడర్.

“చెప్పండి.

“ఎట్టిపరిస్ధితిలోను ఈ విషయం మీడియాకు లీక్ చెయ్యకండి. ప్రస్ధుతం రెండు దేశాల మద్య ఉన్న పరిస్ధితి మీకు తెలియంది కాదు. ఈ సమయంలో ఈ విషయం బయటకు పొక్కితే చాల ప్రమాధం జరుగుతుంది. మన ప్రజలు ఆవేశంతో ఊగిపోతారు. హిందువుల మీద దాడి చెయ్యటానికి అవకాశం ఉంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఏర్పడుతుంది. ఆ పరిస్ధితి రాకముందే మనం ముందు జాగ్రర్త తీసుకోవటం చాల అవసరం. అందుకే సాధ్యమైనంతవరకు ఈ విషయాన్ని మీడియాకు లీక్ చెయ్యకండి”అన్నాడు అంబాసిడర్.

“అలాగే మీరు ఇంతగా చెప్పుతుంటే కాదంటనా. మీ కోరిక ప్రకారమే ఎవరికి చెప్పను. చివరకు నా పర్సనల్ అసిస్టెంట్ కు కూడా చెప్పను”అన్నాడు మంత్రి.

“ద్యాంక్స్ సార్”అని లైన్ కట్ చేశాడు పాకిస్ధాన్ అంబాసిడర్.

“మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. తొందరలోనే ఆ ఉగ్రవాదులను పట్టుకోవాలి. వాళ్ళను భారతప్రభుత్వానికి అప్పగించాలి.మన సత్తా ఏమిటో చూపించాలి”అన్నాడు బ్రిగేడియర్.

“యస్ సార్”అన్నాడు అబ్బాస్.

“భారత ప్రభుత్వానికి మన మీద పూర్తిగా సదభిప్రాయం పోయింది. మనం కావాలనే ఉగ్రవాదులను పట్టుకోవటం లేదని వాళ్ళ అనుమానం. ఈ విషయాన్ని భారతరక్షణమంత్రి కూడా తన ప్రెస్ మీట్ లో వెల్లడించాడు. ఒక రకంగా ఆయన చెప్పింది నిజమే. బారముల్లాలో దాడిజరిగి చాల రోజులైంది. నెలలు దాటిపోయింది.అయినమనం ఇంతవరకు ఆ ఉగ్రవాదులను పట్టుకోలేదు. కనీసం వాళ్ళ ఆచూకి తెలుసుకోలేక పోయాం. ఇది నిజంగా మనం సిగ్గుపడవలసిన విషయం. మనం నిజాయితిగానే వాళ్ళకోసం ప్రయత్నిస్తున్నాం అయిన వాళ్ళగురించి చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయాం. ఇది చాల శోచనీయం”అన్నాడు భారంగా బ్రిగేడియర్.

“మీ బాధ నాకు అర్ధమైంది బ్రిగేడియర్. నేను నా టీమ్ ఎంతో కష్టపడుతున్నాం. ఆ ముష్కరుల ఆచూకితెలుసుకోవటానికి అయిదు వందలమంది ఏజంట్లను నియమించాం. రోజు వాళ్ళదగ్గరనుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి కాని వాటిలో ఉగ్రవాదుల ప్రసక్తి మాత్రం లేదు. మీరేం వర్రి కాకండి. వాళ్ళ ఆచూకి తప్పకుండ తెలుసుకుంటాను. మనమీద అనుమానం పడుతున్న భారత్ ఆపోహ పోగోడ్తాను. నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఈ లోగా వాళ్ళను పట్టుకుని మీ ముందు నిలబెడతాను”అన్నాడు అబ్బాస్ దృఢంగా.

“మీ మీద నాకా నమ్మకం ఉంది క్యాప్టన్ క్యారీ ఆన్. మీకు ఏ సహయం కావాలనుకున్నా ప్రభుత్వం చేస్తుంది”అన్నాడు బ్రిగేడియర్.అబ్బాస్ స్టిఫ్ గా ఆయనకు సెల్యుట్ చేసి తన చాంబర్స్ వచ్చి కూర్చున్నాడు. డ్రాయర్ తెరిచి అందులోంచి పాకిస్తాన్ మ్యాప్ తీసి టేబుల్ మీద పరిచాడు. అతని మనుష్యులు దాదాపుదేశం మొత్తం చూశారు. హౌజ్ టూ హౌజ్ సెర్చ్ కూడా చేశారు. కాని ఉగ్రవాదుల ఆచూకి కాని వాళ్ళకు సంబంధించిన చిన్న క్లూ కాని ఇంతవరకు దొరకలేదు. విచిత్రంగా ఆ  ఇద్దరు  ఉగ్రవాదులు గాలిలో కలిసిపోయినట్టుగా కలిసి పోయారు.

అయిన అనుమానం తీరక మళ్ళి మ్యాప్ ను జాగ్రర్తగా చూస్తున్నాడు అబ్బాస్. కంగారులో ఏదైన ప్రదేశాన్ని విడిచిపెట్టిఉండవచ్చని అతని అనుమానం. ఏసి నిర్విరామంగా పనిచేస్తున్నా అబ్బాస్ నుదుటిమీద చిరుచెమటలు అలుముకున్నాయి. తీక్షణంగా మ్యాప్ లో ప్రదేశాలను చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక ప్రదేశం చూసి చప్పున ఆగిపోయాడు.

అది పిఓకే ప్రాంతం అంటే పాకిస్ధాన్ ఆకుపైడ్ కాశ్మీర్ ఏరియా. ఆ పేరును చూసి ఒక్కసారిగా నిటారు అయ్యాడు అబ్బాస్. ఇంతవరకు అతని మనుష్యులు ఆ ప్రాంతానికి వెళ్ళేదు. అసలు ఆ ప్రదేశం గురించి అబ్బాస్ చూచాయిగా కూడా వాళ్ళకు చెప్పలేదు. ఆ ప్రదేశం తప్ప అన్ని చోట్ల వెతికారు. సో ఖచ్చితంగా ఆ ఇద్దరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో తలదాచుకుని ఉంటారని గట్టిగా నమ్మకం కలిగింది అబ్బాస్ కు.   దాదాపు 133000 చదరపు కిలోమీటర్లు ఉన్న పాకిస్ధాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాద్ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఆ ప్రాంతంలో దాదాపు నలబై లక్షలమంది నివసిస్తున్నారు. బహుశా అక్కడ నివసిస్తున్న ప్రజలతో ఆ ఇద్దరు ఉగ్రవాదులు కలిసిపోయిఉంటారు.

అబ్బాస్ మ్యాప్ ను మూసి డ్రాయర్ లో పడేశాడు. తన సెల్ తీసి ఒక నెంబర్ కు కాల్ చేశాడు. అవతలమనిషితో అయిదునిమిషాల సేపు మాట్లాడాడు. చివరగా “ఆ ప్రదేశాన్ని జాగ్రర్తగా వెతకండి. నసీర్ మజీద్ ఖాన్ తప్పకుండ కనిపిస్తారు. వాళ్ళు కనిపించినవెంటనే నాకు కాల్ చెయ్యండి. అలాగే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలుసకోండి. దీనికోసం ఎంత ఖర్చయిన ఫర్వాలేదు. ఎంతమంది కావాలంటే అంతమందిని ఉపయోగించుకో. కాని నాకు ఫలితం మాత్రం కావాలి”అన్నాడు అబ్బాస్.

“యస్ క్యాప్టన్. వెంటనే పని ప్రారంభిస్తాను. ఎప్పటికి అప్పుడు మీకు అప్ డేట్స్ ఇస్తాను ఉంటాను”అని లైన్ కట్ చేశాడు అవతలమనిషి.   అప్పుడే అతని రెండోసెల్ చప్పుడు చేసింది. ఫోన్ డిస్ ప్లే మీద మిత్రవింద నెంబర్ కనిపించింది.“మిత్రవింద ఏమిటి విషయం”సెల్ ఆన్ చేస్తూ అన్నాడు అబ్బాస్.

“ఏం లేదు ఊరికే కాల్ చేశాను”అంది నిర్లిప్తంగా మిత్రవింద.“రాజేష్ ఎపిసోడ్ నువ్వు ఇంకా మరచిపోనట్టుగాఉంది. జరిగింది ఏదో జరిగిపోయింది. అస్తమానం అదే తలుచుకుంటు వర్రికాకు. అనవసరంగా నీ ఆరోగ్యం దెబ్బతింటుంది”అన్నాడు అబ్బాస్.  బలహీనంగా నవ్వింది మిత్రవింద.

“నువ్వు ఎన్నోసార్లు బాధ్యతలు తీసుకున్నవాళ్ళకు సెంటిమెంట్ కాని జాలి మనస్సు కాని ఉండరాదని చెప్పావు. ఆ మాటలు నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కాని రాజేష్ ఎపిసోడ్ జరిగిన తరువాత నీ మాటలు నిజమని తెలిసింది.”

 

“రాజేష్ విషయం మరిచిపో. అతన్ని తలుచుకుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఎంతో వృద్ధిలోకి రావలసినవాడు. అర్ధాంతరంగా ప్రాణాలు పోగోట్టుకున్నాడు. పోలీస్ డిపార్ట్ మెంట్ ఆ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తొందరలోనే నేరస్ధులను పట్టుకుంటారు.”    “ఆ ఉగ్రవాదుల ఆచూకి తెలిసిందా”ఉన్నట్టుండి అడిగింది మిత్రవింద.

“నా అనుమానం నిజమైతే ఇంకో రెండు రోజులలో వాళ్ళిద్దరు నా చేతులకు దొరుకుతారు. వాళ్ళను క్షేమంగా మీ ప్రభుత్వానికి అప్పగిస్తాను. దాంతో నా బాధ్యత తీరిపోతుంది. అప్పుడు మన పెళ్ళికి ఎలాంటి అటంకం భయం అనుమానాలు ఉండవు”అన్నాడు అబ్బాస్.

“అబ్బ ఎంత మంచి వార్త చెప్పావు. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. అదే నిజమైతే నేను ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాను. హాయిగా నీకు వండిపెడుతూ అత్తకు సేవలు చేస్తూ ఆనందంగా గడుపుతాను.”

“అదేమిటి ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగాన్ని అంత తేలికగా వదిలేస్తావా”ఆశ్చర్యంగా అన్నాడు అబ్బాస్.

“ఉద్యోగం హోదా జీతం కంటే నీ ప్రేమ నాకు ముఖ్యం. నీతో కలిసి జీవించటం నాకు ఆనందం. వాటిముందు ఈ ఉద్యోగం ఒక లెక్కలోనిది కాదు”అంది మిత్రవింద.అతను ఏదో చెప్పబోతుంటే అప్పుడే అతని అఫీషియల్ సెల్ చప్పుడుచేసింది. “మిత్రవింద అర్జంట్ కాల్ వచ్చింది. తరువాత నీతో మాట్లాడతాను”అని లైన్ కట్ చేసి ఆ సెల్ తీసుకున్నాడు. “క్యాప్టన్ నసీర్ మజీద్ ఖాన్ ఆచూకి దొరికింది”అన్నాడు అవతల మనిషి ఉత్సాహంగా.

“ఎక్కడ ఉన్నారు”అన్నాడు అబ్బాస్. సెల్ పట్టుకున్న అతనిచేతులు గట్టిగా బిగుసుకున్నాయి. “బల్టిస్తాన్ ప్రాంతంలో ఆడవిలో టెంట్ వేసుకుని ఉంటున్నారు ఇద్దరు. ఈ విషయం తెలుసుకోవటానికి నేను చాల కష్టపడవలసివచ్చింది. చాల డబ్బు కూడా ఖర్చయింది”అన్నాడు ఏజంట్.

“గుడ్ వర్క్ నీ కష్టం ఊరికే ఉంచుకోను. నీకు కావల్సిన డబ్బు ఇస్తాను.వెంటనే వాళ్ళు ఉంటున్న ప్రాంతం ఫోటో తీసి నా సెల్ కుపంపించు”అన్నాడు అబ్బాస్. రెండు నిమిషాల తరువాత ఒక ఫోటో అతని సెల్ లో ప్రత్యేక్షమైంది.అందులో అడవి ప్రాంతంలో ఒక టెంట్ కనిపించింది. ఆ టెంట్ ముందు నసీర్ కూర్చుని వంటచేస్తున్నాడు. మజీద్ ఖాన్ తుపాకి పట్టుకుని చుట్టు పక్కల గమనిస్తున్నాడు.

ఎన్నో రోజులనుంచి వెతుకుతున్న ఉగ్రవాదుల ఆచూకి ఇప్పుడుదొరికింది. అబ్బాస్ ఉత్సాహంగా సెల్ తీసి తన సూపీరియర్ ఆఫీసర్ కు కాల్ చేశాడు.
“చోర్ చోర్ పకడో”అంటు బయట పెద్దగా సెక్యురిటి గొంతు వినిపించింది. మిత్రవింద ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. సమయం పన్నెండుగంటలు కావస్తోంది.  కాళ్ళకు చుట్టుకున్న దుప్పటిని పక్కకు నెట్టి మెల్లగా మంచం దిగింది. నైటీ సరిచేసుకుని గది తలుపులు తెరుచుకుని బయటకు వచ్చింది. కాంపౌండ్ అంతా లైట్లు దేదిప్యమానంగా వెలుగుతున్నాయి.
    “ఏం జరిగింది సెక్యురిటి”చిరాకుగా అడిగింది మిత్రవింద.
    “ఎవడో దొంగవెదవ లోపలికి దూరాడు మేడం. అతని పట్టుకోవాలని ప్రయత్నిస్తే మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు”అన్నాడు సెక్యురిటి నిరుత్సాహంగా.
    “ఇది రెండోసారి ఎవడో లోపలికి రావటం”అడిగింది మిత్రవింద.
    “అవును మేడం. రెండు సార్లు చాల చాకచక్యంగా తప్పించుకున్నాడు. అన్ని చోట్ల వెతికిన దొరకలేదు”అన్నాడు సెక్యురిటి.
    గాలిచల్లగా వీస్తోంది. ఆకాశంలో చంద్రుడు వెన్నల ముద్దలా మెరిసిపోతున్నాడు.
    అప్పుడే లోపలికి వచ్చిన మనిషి కోసం వెళ్ళిన రెండో సెక్యురిటి అక్కడికి వచ్చాడు.
    “ఆ మనిషి కనిపించాడా”ఆత్రంగా అడిగింది మిత్రవింద.
    “లేదు మేడం. అన్నిచోట్ల గాలించాం. చివరకు చెట్టు పుట్ట కూడా చూశాం. కాని ఎక్కడ ఆమనిషి జాడలేదు. ప్రతిసారి దొరికినట్టు దొరికి చేపపిల్లలా తప్పించుకుంటున్నాడు”అన్నాడు మొదటి సెక్యురిటి.
    “ ఆ మనిషి లోపలికి వచ్చాడో తెలియదు కాని మీరు మాత్రం నా మంచి నిద్రచెడగొట్టారు. వస్తాను”అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళింది మిత్రవింద. తలుపులు గడియపెట్టి బెడ్ రూంలోకి అడుగుపెట్టింది. ఎదురుగా ఉన్న నిలువెత్తు అద్దం ముందు నిలబడింది. తనని తాను చూసుకుంది. అప్పుడే మెడలో ఉన్న తాళిబొట్టు ఠీవిగా  వేలాడుతూ కనిపించింది.
    క్షణం పాటు గుండె ఆగినంత పని అయింది మిత్రవిందకు.
    తాళిబోట్టును ఏ మాత్రం కవరు చేసుకోకుండ అలాగే బయటకు వెళ్ళి సెక్యురిటితో మాట్లాడింది. వాళ్ళు చూశారో లేదో తెలియదు కాని వాళ్ళ మొహంలో ఎలాంటి భావం కనిపించలేదు. మెల్లగా తాళిబొట్టును తీసి బీరువాలో పెట్టబోయింది. బీరువా వెనుక ఒక మనిషి దూరేంత సందు ఉంది. అక్కడ నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు.
    మిత్రవింద ప్రీజ్ అయిపోయినట్టు చలనం లేకుండ ఉండిపోయింది. చలిజ్వరం వచ్చినట్టుగా ఆమె శరీరం చల్లబడిపోయింది.
    “ఎవరు నువ్వు”అతికష్టం మీద దైర్యం తెచ్చుకుంటు అడిగింది మిత్రవింద.
    “నా పేరు జావేద్. పాకిస్ధాన్ బార్డర్ సెక్యురిటి ఫోర్స్ లో పనిచేస్తున్నాను”అన్నాడు అతను.
    “ఇక్కడికి ఎందురు వచ్చారు?
    “నా గరల్ ఫ్రెండ్ ను కలుసుకోవటానికి.”
    “ఎవరు నీ గరల్ ఫ్రెండ్”ఆసక్తిగా అడిగింది మిత్రవింద.
    “మీకు తెలుసు గౌరి”అన్నాడు జావేద్.
    “అంటే ఇప్పుడు గౌరిని కలుసుకోవటానికి వచ్చావా” ఆశ్చర్యంగా అడిగింది మిత్రవింద.
    “అవును మేడం. గౌరి నేను ప్రేమించుకున్నాం. పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాం. కాని పరిస్ధితుల వల్ల ధైర్యంగా ఎవరికి చెప్పలేకపోతున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. కాని ఇంకా గౌరివాళ్ళ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అందుకే సమయం దొరికినప్పుడు రహస్యంగా ఇక్కడికి వచ్చి ఆమెను కలుసుకుంటున్నాను.”
    “సెక్యురిటికి తెలియకుండ లోపలికి ఎలా రాగలుగుతున్నావు.”
    “ప్రతి రోజు సాయంత్రం గౌరి సరుకులు కొనటానికి సూపర్ బజార్ కు కారు తీసుకుని వెళుతుంది. నేను కారు డిక్కిలో దాక్కుని ఆమెతో పాటు ఎంబసికి వస్తాను. ఎవరు చూడనప్పుడు ఆమె నన్ను తన గదిలోకి తీసుకువెళుతుంది. అక్కడ కొన్ని గంటలు ఆనందంగా గడిపిన తరువాత వెళ్ళిపోతాను. సెక్యురిటి గార్డ్స్ గేటు దగ్గర లేనప్పుడు గోడదూకి బయటకు వెళ్ళిపోతాను. మాములుగా అయితే ఉదయం నాలుగుగంటలకు వెళ్ళాలని అనుకున్నాను. కాని అనుకోకుండ నా స్నేహితుడి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వాడికి యాక్సిడెంట్ అయిహాస్పటల్ లో ఉన్నాడు. అందుకే వెంటనే నన్ను రమ్మని కాల్ చేశాడు. నేను బయటకు వెళ్ళబోతుంటే అనుకోకుండ అటువైపు వచ్చిన సెక్యురిటి గార్డ్ నన్ను చూశాడు. గట్టిగా అరుస్తూ నా వెంటపడ్డాడు. నేను వెళ్ళి వేపచెట్టు వెనుక దాక్కున్నాను. అప్పుడే మీరు తలుపు తెరుచుకుని బయటకు వచ్చారు. సెక్యురిటి మీతో మాట్లాడుతుంటే నేను నక్కి నక్కి మీ ఇంట్లో దూరాను. ఆ టైంలో చుట్టుపక్కల ఎవరు లేరు. అది నాకు ప్లస్ అయింది. ఇది జరిగింది మేడం.
    “జరిగింది ఏదో జరిగింది. మీరు వెంటనే వెళ్ళిపోండి. మిమ్మల్ని నా ఇంట్లో చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయి”అంది మిత్రవింద కంగారుగా.
    “వెళతాను. కాని ఎవరికి ఈ విషయం చెప్పకండి. మీరు చెప్పరని నాకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా మేముఉన్న పరిస్ధితిలో ఉన్నారు కనుక”అన్నాడు జావేద్.
    “ఏమిటి మీరు అంటున్నది”చిరుకోపంతో అంది మిత్రవింద.
    “మీ గురించి గౌరి నాకు అంతా చెప్పింది. మీకు ఇంకా పెళ్ళికాలేదు. కాని మీ మెడలో తాళిబొట్టు ఉంది. అద్దంముందు నిలబడి దాన్ని సరిచేసుకోవటం నేను చూశాను. బహుశా మీరు కూడా మా లాగే ప్రేమలో పడినట్టున్నారు. మీకు మాకు ఒక్కటే తేడా. మీకు పెళ్ళయింది మాకు ఇంకా కాలేదు. మీరు కాని మా విషయం బయటపెడితే మేము మీ రహస్యం చెప్పవలసివస్తుంది.అందుకే ఇద్దరం ఏం తెలియనట్టు నోరు మూసుకుని ఉందాం”అన్నాడు జావేద్.
    గత్యంతరం లేక అలాగే అని తలూపింది. తరువాత జావేద్ బయలుదేరాడు.మిత్రవింద తలుపు తీసి అటుఇటు చూసింది. కాంపౌండ్ లో లైట్లు ఆరిపోయాయి.
    “సమయానికి నన్ను కాపాడినందుకు మీకు చాల ద్యాంక్స్ వస్తాను”అని వడివడిగా మెయిన్ గేటు వైపు వెళ్ళిపోయాడు.
    మిత్రవింద తేలికగా నిటుర్చి తలుపులు వేసి బెడ్ రూంలోకి వెళ్ళింది. తాళిబొట్టును తీసి బీరువాలో పెట్టి తాళం వేసింది. ఎవరికి తెలియకూడని రహస్యం అనుకోకుండ జావేద్ కు తెలిసిపోయింది. ఎందుకైన మంచిది ఈ విషయం అబ్బాస్ కు చెప్పాలి.
    మంచం మీద పడుకుని అబ్బాస్ కు కాల్ చేసింది. కాని అటువైపు నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. అయిదునిమిషాలపాటు ఆగకుండ టై చేస్తునేఉంది మిత్రవింద. కాని ఏం లాభం లేకుండ పోయింది. ఇక చేసేది లేక సెల్ ఆఫ్ చేసి పక్కన పడేసింది.
    నిద్రపోదామని కళ్ళు మూసుకుంది. కాని ఆశ్చర్యంగా ఎంత ప్రయత్నించిన నిద్రరాలేదు. ఆ రాత్రి అబ్బాస్ ను తలుచుకుంటు జాగారం చేసింది మిత్రవింద.

38 వ భాగం.
    హెలిక్యాప్టర్ రోటర్స్ చప్పుడు చెవులను బద్దలు చేస్తోంది.దాదాపు యాభై అడుగుల ఎత్తులో ఎగురుతోంది మిలిట్రి చోపర్. అందులో కూర్చున్న జహీర్ అబ్బాస్ తన కళ్ళముందు బైనాకూలర్స్ పెట్టుకుని ముందుకు చూస్తున్నాడు.
    అది పాకిస్ధాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం.
    “పైలెట్ ఇక్కడ దిగిపోతాను. పని పూర్తిఅయిన తరువాత సాటిలైట్ ఫోన్ తో నిన్ను కాంటాక్ట్ చేస్తాను. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి”అన్నాడు అబ్బాస్.
    తరువాత పైలెట్ చోపర్ ను కొంచం కిందికి దించాడు. వెంటనే అబ్బాస్ భుజం మీద బ్యాగ్ తో నేలమీద దూకాడు. అది పూర్తిగా అడవి ప్రాంతం. జనసంచారం కొంచం కూడా లేని ఏరియా. అబ్బాస్ దిగిన చోటునుంచి ఒక పావుగంట లోపలికి నడిస్తే నసీర్ ఖాన్ మజీద్ ఖాన్ ఉంటున్న చోటు వస్తుంది. నిజానికి ఇలాంటి ఆపరేషన్ లో అబ్బాస్ కు సహయంగా ఇంకో నలుగురు వెళ్ళవలసిఉంది. కాని అంతమంది వెళితే నసీర్ ఖాన్ కు తెలిసే అవకాశం ఉంది. అందుకే రిస్క్ తీసుకుని ఒంటరిగా బయలుదేరాడు అబ్బాస్.
    సమయం ఎంతయిందో తెలియదు. ఎండ మండిపోతుంది. బ్యాగ్ లోంచి తన సర్వీస్ తుపాకి తీసి చేత్తో పట్టుకుని ముందుకు నడిచాడు. చెట్లను అడ్డం పెట్టుకుని ఆగకుండ నడుస్తూ స్పాట్ కు చేరుకున్నాడు. ఒక చెట్టు చాటను నిలబడి బైనాకూలర్స్ తో ముందుకు చూశాడు. దాదాపు రెండు వందల అడుగుల దూరంలో ఒక టెంట్ కనిపించింది. టెంట్ ముందు ఒక ఉగ్రవాది కూర్చుని వంటచేస్తున్నాడు. పొయిలోంచి వస్తున్న పొగ సుడులు తిరుగుతూ పైకి లేస్తోంది.అతను మజీద్ ఖాన్ అని గుర్తుపట్టాడు అబ్బాస్. అయితే చుట్టుపక్కన ఎక్కడ నసీర్ ఖాన్ కనిపించలేదు. బహుశా అతను టెంట్ లోపల ఉండి ఉండాలి. లేకపోతే బయటకు అయిన వెళ్ళిఉండాలి.
    ముందు మజీద్ ఖాన్ మీద దాడి చేసి అతన్ని బందించాలి. తరువాత నసీర్ ఖాన్ విషయం చూడాలి. సమయంకోసం ఓపికగా కాచుకున్నాడు అబ్బాస్.
    క్షణాలు నిమిషాలు గడుస్తున్నాయి. చుట్టు పెద్దగా చడి చప్పుడు లేడు. అప్పుడప్పుడు పక్షులు చేస్తున్న కిలకిలరావాలు మాత్రం అస్పష్టంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా పావుగంట తరువాత మజీద్ ఖాన్ వంట పూర్తిచేశాడు. గిన్నెలు ముందు పెట్టుకుని సర్దుతున్నాడు. అబ్బాస్ పిల్లిలా అడుగులు వేస్తూ అతని వైపు సాగిపోయాడు. మజీద్ ఖాన్ పరిసరాలను పట్టించుకోకుండ తన పనిలో బిజీగా ఉన్నాడు. రెండు నిమిషంలో అతని దగ్గరకు చేరుకున్నాడు అబ్బాస్.
    అప్పుడే పని పూర్తిచేసి లేచిన మజీద్ ఖాన్ కు ఎదురుగా తుపాకి తో అబ్బాస్ కనిపించేసరికి కంగారుపడ్డాడు. చప్పన నేలమీద ఉన్న తుపాకిని అందుకోబోయాడు. విద్యుత్ వేగంతో ముందుకు కదిలాడు అబ్బాస్. అరచెయ్యి అడ్డం పెట్టు అతని మెడ మీద బలంగా చరిచాడు. సరిగ్గా అతను అనుకున్న చోట ఖాన్ కు దెబ్బ తగిలింది. ఖాన్ కనీసం అరవలేదు మూల్గలేదు. చాపచుట్టలా కిందికి జారిపోయాడు. అతన్ని తీసుకుని టెంట్ వెనుక పడోకోపెట్టాడు.
    ఇంకో నాలుగు గంటలవరకు ఎనుగులు తొక్కిన అతను లేవడు. అబ్బాస్ టెంట్ లోపలికి వెళ్ళి చూశాడు. లోపల బట్టలు కొన్ని వంటసామానులు ఒక తుపాకి కనిపించింది. కాని ససీర్ ఖాన్ మాత్రం లేడు. తుపాకిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు అబ్బాస్.
    నసీర్ ఖాన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అతని కోసం వెతుక్కుంటు వెళ్ళటం కంటే అతని కోసం కాచుకుని ఉండటం మంచిది. ఎక్కడికి వెళ్ళిన తప్పకుండ అతను టెంట్ దగ్గరకు వస్తాడు. అందుకే టెంట్ లోపల కూర్చుని బయటకు చూస్తూ గడిపాడు అబ్బాస్.
    అతను అనుకున్నది నిజమైంది.
    దూరంగా నసీర్ ఖాన్ వస్తున్నాడు. అతని చేతిలో ఏవో సామానులు ఉన్నాయి. బహుశా సిటిలోపలికి వెళ్ళి వస్తున్నట్టుగా ఉంది. అబ్బాస్ చప్పున లేచి ఒక పక్కగా నక్కి నిలబడ్డాడు. నిమిషం తరువాత  మజీద్ ఖాన్ ను పిలుస్తూ నసీర్ ఖాన్ లోపలికి వచ్చాడు. మజీద్ ఖాన్ కు బదులు అబ్బాస్ కనిపించేసరికి అతని పై ప్రాణాలు పైనే పోయినంత పనిఅయింది.
    కంగారుగా వెనక్కి తిరిగి పారిపోవాలని అనుకున్నాడు. కాని అంతకంటే ముందే అబ్బాస్ రియాక్ట్ అయ్యాడు. విసురుగా ముందుకు కదిలి తన తుపాకితో అతని తలమీద బలంగా కొట్టాడు. కీచుగా అరుస్తూ నసీర్ ఖాన్ తలపట్టుకున్నాడు. మరో దెబ్బ వేశాడు. దాదాపు రెండు వందలమంది ప్రాణాలను హరించిన నసీర్ మీద కొంచం కూడా జాలిదయలేదు అబ్బాస్ కు. నసీర్ ఖాన్ తలచిట్లి రక్తం ప్రవహించసాగింది. తలపట్టుకుని అలాగే నేలమీద కూలిపోయాడు.
    అతన్ని భుజంమీద వేసుకుని మజీద్ ఖాన్ పక్కనే పడేశాడు. తరువాత తన సెటిలైట్ ఫోన్ తీసి చోపర్ పైలెట్ కు కాల్ చేశాడు. అయిదు నిమిషాల తరువాత చోపర్ వచ్చి టెంట్ కు కొంచం దూరంలో సమతల ప్రదేశంలో ఆగింది.పైలెట్ అబ్బాస్ కలిసి సృహతప్పిన ఇద్దరిని చోపర్ లోకి ఎక్కించారు. తరువాత చోపర్ గమ్యస్ధానం వైపు సాగిపోయింది.
    పైకి గంభీరంగా ఉన్నాడుకాని లోపల మాత్రం అబ్బాస్ సంతోషంతో ఊగిపోతున్నాడు. సాధించింది ఏం తక్కువ విజయం కాదు. ఈ సమయం కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నాడు. అది ఈ రోజు తీరింది. వీళ్ళిద్దరిని సురక్షితంగా భారతప్రభుత్వానికి అప్పగిస్తే అతని బాధ్యత తీరిపోతుంది. దాంతో రెండు దేశాలమద్యఉన్న అపోహలు అనుమానాలు పూర్తిగా తొలగిపోతాయి.
    రెండు గంటల తరువాత చోపర్ మిలిట్రి అబ్బాస్ డిపార్ట్ మెంట్ చేరుకుంది. అబ్బాస్ ఇద్దరు ఉగ్రవాదులను సంబంధిత అధికారులకు అప్పగించాడు.
    “ఎక్స లెంట్ క్యాప్టన్. చెప్పిన పని చక్కగా పూర్తిచేశారు. రేపు మీరు వీళ్ళిద్దరిని తీసుకుని ఢిల్లీ వెళ్ళాలి. అధికారులకు స్వయంగా మీరు అప్పగించి రావాలి”అన్నాడు బ్రిగేడియర్.
    “యస్ సార్”అన్నాడు అబ్బాస్.
    పావుగంటలో మిగత ఫార్మాలిటిస్ పూర్తిచేసుకుని తన చాంబర్స్ చేరుకున్నాడు అబ్బాస్. సెల్ తీసి మిత్రవిందకు కాల్ చేశాడు. అతని కాల్ కోసమే ఎదురుచూస్తున్నట్టుగా వెంటనే రెస్పాండ్ అయింది ఆమె.
    “అనుకున్నపని పూర్తయింది మిత్రవింద. ఆ ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకుని మా అధికారులకు అప్పగించాను”అన్నాడు అబ్బాస్.
    “అబ్బా ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇక మన పెళ్ళికి ఎలాంటి ఆటంకం ఉండదు కదూ”అంది మిత్రవింద. ఆమె గొంతులో ప్రపంచాన్ని జయించినంత సంతోషం కనిపిస్తోంది.
    “అవును. ఈ శుభవార్తను అమ్మకు చెప్పాలి. తను కూడా సంతోషిస్తుంది”అన్నాడు అబ్బాస్.
    “ఉద్యోగానికి రిజైన్ చెయ్యనా”అంది మిత్రవింద.
    “నీకు ఏది వచ్చిన పట్టలేం. అప్పుడే అంత తొందరపడకు. ఉన్నట్టుండి నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేస్తే అందరికి అనుమానం వస్తుంది. అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టు. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు నేనే నిన్ను రిజైన్ చెయ్యమని చెప్తాను సరేనా.”
    “అలాగే అంది నిరుత్సాహంగా.
    “ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి”మళ్ళి అంది మిత్రవింద.
    “రేపు ఉగ్రవాదులను తీసుకుని ఢిల్లీ వెళుతున్నాను. వాళ్ళను మీ అధికారులకు అప్పగించిన తరువాత వెంటనే తిరిగి వస్తాను. తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం”అన్నాడు అబ్బాస్.

పాకిస్ధాన్ ఇంటర్నేషనల్ ఏయిర్ లైన్ కు చెందిన స్పెషల్ విమానం ఢిల్లీ ఏయిర్ పోర్ట్ లో మెత్తగా లాండ్ అయింది. అందులోంచి ముందు ఇద్దరు సెక్యురిటి కమెండోలు దిగారు. చుట్టు ఒకసారి సర్వేచేశారు. తరువాత చేతితో లోపల సైగ చేశారు. లోపలనుంచి ఇంకో ఇద్దరు సెక్యురిటి మజీద్ ఖాన్ ససీర్ ఖాన్ లను పట్టుకుని దిగారు. వాళ్ళిద్దరు మత్తుతో జోగుతున్నారు. భారత అధికారులకు వాళ్ళను అప్పగించే సమయంలో ఎలాంటి సమస్యలు రాకూడదని అబ్బాస్ వాళ్ళను డ్రగ్ చేశాడు.
    చివరగా అబ్బాస్ దిగాడు.
    వాళ్ళను రిసివ్ చేసుకోవటానికి భారత్ నుంచి సంబంధిత అధికారులు వచ్చారు.
    “ఇదిగో నుంచి మీరు వెతుకతున్న ఉగ్రవాదులు”అన్నాడు అబ్బాస్.
    “ద్యాంక్స్ మిస్టర్ క్యాప్టన్. మీ వాళ్ళు చెప్పిన పని పూర్తిచేశారు. మాకు చాల సంతోషంగా ఉంది”అన్నాడు భారత అధికారి.
    “ఇక మేము బయలుదేరవచ్చా”అడిగాడు అబ్బాస్.
    “నో మీరు అప్పుడే వెళ్ళటానికి వీలులేదు. మా రక్షణమంత్రి మీ గౌరవార్ధం ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. దానికి మీరు తప్పకుండ రావాలి. ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు పార్టీ. పార్టీ అయిన తరువాత మీరు వెళ్ళవచ్చు”అన్నాడు ఆ అధికారి.
    అబ్బాస్ కు పెద్దగా ఇష్టంలేకపోయిన సరే అన్నాడు.
    తరువాత కార్యక్రమం చాల వేగంగా జరిగిపోయింది. ఇద్దరు ఉగ్రవాదులను తీసుకుని అధికారులు వెళ్ళిపోయారు. అబ్బాస్ కు అతని టీమ్ కు మిలిట్రి గెస్ట్ హవుస్ విడిది ఏర్పాటు చేశాడు. అక్కడికి చేరుకున్న వెంటనే అబ్బాస్ తన పై అధికారికి కాల్ చేసి పార్టీ విషయం చెప్పాడు.
    “పార్టీ అటెండ్ అయిన తరువాతనే బయలుదేరండి. అంతగా ఆహ్వానించినప్పుడు కాదనటం బాగుండదు”అన్నాడు బ్రిగేడియర్.
    ఆ తరువాత అబ్బాస్ మిత్రవిందకు కాల్ చేసి మాట్లాడాడు.
    “అంతా సవ్యంగా జరిగింది మిత్రవింద. మీ వాళ్ళు పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ ముగిసిన తరువాత బయలుదేరుతాను”అన్నాడు అబ్బాస్.
    ఆ రోజు సాయంత్రం అరుగంటలకు పెద్ద హోటల్ లో పార్చీ జరిగింది. రక్షణమంత్రి స్వయంగా వచ్చి అబ్బాస్ ను అభినందించాడు.
    “ఎక్స్ లెంట్ వర్క్ నాకు మాత్రం ఒక విషయంలో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మంత్రి.
    “ఏమిటి మినిస్టర్”అన్నాడు అబ్బాస్.
    “ఇంత తొందరగా మీరు వాళ్ళను పట్టుకుంటారని నేను ఊహించలేదు. మీ దేశంలో నీ లాంటి సమర్ధుడైన ఆఫీసర్ ఉన్నాడంటే నాకు ఇంకా నమ్మకం కలగటంలేదు”అన్నాడు నవ్వుతూ.
     ఆ మాటలు చురక్కు మంటు తగిలాయి అబ్బాస్. తలుచుకుంటే అతను రిటార్ట్ ఇచ్చేవాడు. కాని అతిధిగా వచ్చాడు కనుక నవ్వుతూ ఉండిపోయాడు.
    “వాళ్ళను పట్టుకోవటానికి ఇన్ని రోజులు తీసుకున్నారంటే మీ అధికారులు ఉగ్రవాదుల విషయాన్ని చాల సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించటంలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టి కొంచం గట్టిగా మాట్లాడేసరికి మీ వాళ్ళు బెదిరిపోయి ఆఘమేఘాలమీద వీళ్ళను పట్టుకున్నారు. ఈ పని ముందే చేసి ఉంటే సమస్య ఉండేది కాదు కదా”అన్నాడురక్షణమంత్రి.
    అబ్బాస్ ఏం మాట్లాడలేదు. భావరహితంగా నిలబడి ఆయన మాటలు వింటున్నాడు.
    రక్షణమంత్రి పక్కన ఉన్న భారతఅధికారి కంగారుగా మంత్రి వైపు చూశాడు. ఇలాంటి శుభసందర్భంలో ఆయన ఇలాంటి పరుషమైన మాటలు మాట్లాడటం అతనికి ఏమాత్రం నచ్చలేదు. సదరు మంత్రిని ఆపాలని ప్రయత్నించాడు కాని అతని ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.
    అబ్బాస్ మాట్లాడకపోయేసరికి మంత్రి ఇంకా రెచ్చిపోయాడు.
    “అయిన మీ వాళ్ళకు ఎందుకంత అహంకారం. మీ దేశం కొత్తగా ఆకాశంలోంచి ఉడిపడింది కాదు. ఒకప్పుడు అఖండ భారత్ లో మీ దేశం ఒక భాగం. మేము దయతలిసి ఇస్తే మీకో దేశం ఏర్పడింది. మీ రక్షణమంత్రి మా దేశం గురించి అవాకులు చెవాకులు పేలాడు. తలుచుకుంటే మీ దేశాన్ని కొన్ని గంటలలో మేము స్వాధీనం చేసుకోగలం. ముందు నుంచి మా దేశం శాంతిని స్నేహాన్ని కాంక్షించే దేశం. అందుకే మీ విషయంలో మేము పెద్దగా సీరియస్ గా లేము. మా మంచితనాన్ని చేతకాని తనంగా భావిస్తోంది మీ ప్రభుత్వం. ఇది మంచిది కాదని మా మాటగా మీ వాళ్ళకు చెప్పండి. ఇలా మాట్లాడినందుకు ఏం అనుకోకండి”అంటు నవ్వాడు.
    అప్పుడు కూడా అబ్బాస్ ఏం మాట్లాడలేదు. కాని భారత అధికారి మాత్రం ఆందోళనగా అటుఇటు చూశాడు. పార్టికి కొంతమంది పత్రిక విలేఖరులు కూడా వచ్చారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఈ మాటలు వింటే రేపు పేపర్ లో ఫ్రంట్ పేజిలో ఈ విషయం ప్రముఖంగా వస్తుంది. వాళ్ళకు కొంచం దూరంలో ఒక వ్యక్తి మాత్రం కనిపించాడు. అతను కూడా ఒక పత్రిక విలేఖరి. పాకిస్ధాన్ దేశానికి సంబంధించిన మనిషి. అతను క్యాజువల్ గా తన ఫోన్ లో రికార్డర్ ను ఆన్ చేసి పెట్టాడు. అనుకోకుండ రక్షణమంత్రి మాట్లాడిన మాటలు అందులో రికార్డ్ అయ్యాయి.
    మాములుగా కొంతమంది తమ సెల్ ఫోన్ తో మరికొంతమంది విడియోతో ఆ పార్టీని షూట్ చేస్తున్నారు.  అబ్బాస్ మాత్రం మంత్రి మాటలు కొంచం కూడా పట్టించుకోలేదు. దాని వల్ల అతనికి నష్టమే కాని లాభం ఏమాత్రం లేదు. ప్రస్ధుతం అతని ఆలోచన అంతా మిత్రవిందకు తనకు జరిగే పెళ్ళి మీద ఉంది. ఒకసారి పెళ్ళయితే దేనికి ఎవరిని లెక్కచెయ్యవలసిన అవసరం ఉండదు. అలాగని అతనికి దేశభక్తి లేదనలేం. ఇలాంటి మాటలు అతని రక్షణమంత్రి కూడా అన్నాడు. ఇద్దరు మంత్రులు దొందుదొందే. ఇద్దరు అనుభవం ఉన్న రాజకీయనాయకులు. కాని నోరును మాత్రం అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఇద్దరికి తెలియదు.
    అయితే అబ్బాస్ కాని భారతరక్షణమంత్రి కాని ఒక విషయం గమనించలేదు. అబ్బాస్ కు కొంచం దూరంలో ఇద్దరు సెక్యురిటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రక్షణమంత్రి మాటలు విన్నారు. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. ఆవేశంతో వాళ్ళ పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి.
    పార్టీ అయిన తరువాత అదే రోజు రాత్రి పాకిస్ధాన్ బయలుదేరారు అబ్బాస్ అతని టీమ్.
    
    

    
    
    
    
                    

 


    
    

    
    
    

 

    
    
    
    
    
                    
    

 

 

ముగింపు వచ్చేసంచికలో...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్