Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
laghushanka cartoons

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

జీవితంలో ప్రతీవాడికీ ఈ frustration అనేది, ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఆఫీసు కి వెళ్ళడానికి ఫలానా టైముకి ఏ లోకలో, ఏ బస్సో పట్టుకోవాలని, ఆదరాబాదరాగా హడావిడి పడేసి, పరుగు పరుగున వెళ్ళేటప్పటికి, మన కళ్ళెదురుగుండానే, ఆ బస్సో, లోకలో వెళ్ళిపోయినప్పుడు ఎంత frustrate అవుతామో అనుభవించేవాడికే తెలుస్తుంది. అలాగని కారుల్లో వెళ్ళేవాళ్ళకి ఉండవని కాదు. వాళ్ళు వెళ్ళే దారిలో ఏ level crossinగో ఉందనుకోండి, ఇతని కారు గేటుకి ఇవతలవైపు ఉండిపోతుంది, పట్టాలమీదేమో సావకాశంగా ఓ గూడ్స్ బండి ఏ 70- 80 వాగన్లతో వెళ్తూంటుంది. అది ఎప్పటికి వెళ్ళనూ, గేటు ఎప్పటికి తెరవనూ, అవతలివైపుకి ఎప్పుడు వెళ్ళనూ, ఏమిటో అంతా frustratioనే ! ఇంతలో రెండో లైను మీద ఇంకో గూడ్సూ. మామూలుగా వెళ్ళే రూట్ లో కాకుండా, short cut కదా అని ఈ రూట్ లో వెళ్ళడంతో వచ్చిన తంటా అంతా ఇది !

మామూలుగా ప్రతీ రోజూ నగరాల్లో ఉండే ట్రాఫిక్కు జామ్ముల సంగతైతే అడగఖ్ఖర్లేదనుకోండి. ఓ లేన్ లో బళ్ళు ఎక్కువగా ఉన్నాయని, ఇంకో లేన్ లోకి వెళ్తూంటారు, కొంతమంది ప్రబుధ్ధులు అలాటివాళ్ళు పడే అవస్థలు చూస్తూంటే తెలుస్తుంది. అలాగే ఏ మాల్ లోకైనా వెళ్ళినప్పుడు చూస్తూంటాము, బిల్లింగ్ దగ్గర, ప్రతీ కౌంటరు దగ్గరా కొల్లెరు చాంతాళ్ళంత క్యూలు. ఏదో తక్కువుంది కదా అని ఓ క్యూలో, మన సామాన్లన్నీ పెట్టుకుని నుంచుంటాము. మన ముందరవాడేమో, ఓ బండెడు సామాన్లేసికుని, పైగా ఈ బిల్లింగేదో జరుపుతూంటే, ఏదో మర్చిపోయానని, ఇంకో వస్తువేదో తేవడానికి వెళ్ళడం, ఇంతట్లో మనం ముందుగా జనాలెక్కువున్నారని వదిలేసిన క్యూ, సాఫీగా జరుగుతూ వెళ్తూంటుంది. అలాటప్పుడు మరి ఎంత frustratioనో కదూ..!

ఇంక రైల్వే స్టేషనుకి రిజర్వేషన్ కౌంటరు దగ్గర చూడాలి, సరీగ్గా మన నెంబరొచ్చేసరికి, ఆ కౌంటరు వాడికి లంచ్ టైమవుతుంది, కిటికీ మన మొహాన్నే మూసిపారేస్తాడు!ఎక్కడ క్యూలుంటే అక్కడ ఈ frustration అనేది తప్పకుండా ఉంటుంది. మనవైపు వీధుల్లో ఉండే మంచి నీటి కుళాయిల దగ్గర చూస్తూంటాము ఈ పరిస్థితి.

ఈ frustrationలనేవి ఉద్యోగ జీవితంలో చాలా వచ్చేస్తూంటాయి. కొత్తగా పెళ్ళైన రోజుల్లో, సాయంత్రం భార్యతో ఏ సినిమాకో వెళ్దామని ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు, బిచాణా అంతా సద్దేసి బయలుదేరదామనుకుంటూండగా, ప్యూనొచ్చి, పై అధికారి పిలుస్తున్నారూ అన్నప్పుడు వచ్చే frustration అంతా ఇంతా కాదు! వాడి బుర్ర పగలుకొట్టేద్దామా అన్నంత కోపం వచ్చేస్తుంది. పైగా ఏవో ఓ బొత్తెడు కాగితాలు మన మొహాన్న కొట్టి, వీటిని టైపు చేసి, డిస్పాచ్ అయేటట్టు చూడూ అని చెప్పినప్పుడు చూడాలి. ఈ టైపులూ డిస్పాచ్చిలూ ఏమిటీ అనుకోకండి, ఈ కంప్యూటర్లూ మెయిళ్ళూ లేని మారోజుల్లో మరి ఈ టైపురైటర్లూ, డిస్పాచ్చిలే కదా గతి!

ఈ Smart Phones  వచ్చిన తరవాత మరో రకం  frustration  మొదలయింది. అదేదో సిగ్నల్ సరీగ్గా లేకపోతే,  కాల్స్ రావూ పోవూ, అన్నిటికంటే ముఖ్యం అంతర్జాలం లో ఏమీ చూసుకోలేము. అందులోనూ రైళ్ళలో ప్రయాణాలు చేస్తున్నప్పుడైతే మరీనూ.. టిక్కెట్లకోసం,  online booking  కదా ఈరోజుల్లో, అన్నీచేసి తీరా payment  దగ్గరకొచ్చేసరికి ఆ సిగ్నలో ఏదో కొండెక్కేస్తుంది.. అక్కడున్నవేమో రెండంటే రెండే టిక్కెట్లాయే.. తీరా మనకి సిగ్నలూ, సింగినాదం వచ్చేసరికి ఆ టిక్కెట్టుంటుందో ఊడుతుందో తెలియదు. పైగా waiting list  లో వెళ్ళడానికి మనసొప్పదూ.. అలాగని తత్కాల్ లో చేసుకునే స్థోమతా లేదూ ( కన్సెషన్లుండవుగా ) ..

ఈ D T H  ల తో మరోరకమైన ఫ్రస్ట్రేషన్లు--- ఏ క్రికెట్ మాచ్చో చూస్తూన్నప్పుడు, అకస్మాత్తుగా  బయట వాతావరణం మారిపోయి , సిగ్నల్ ఆగిపోతుంది. టీవీ screen  మీద ఓ సందేశం .. “  Due to weather conditions, Signal is not available “ అంటూ.. ఆ టీవీ ని పగలగొట్టేద్దామనిపిస్తుంది.

పైగా మనకెంత తొందరో, అంత ఆలశ్యమవుతూంటుంది, ఇలాటప్పుడే ఈ ఫ్రస్ట్రేషన్లు ఎక్కువైపోతూంటాయి.. అయినా కాలం నడుస్తూనే ఉంటుంది.

సర్వేజనా సుకినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
kerala viharayatralu