Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Bumps .. Not for Birthday, For Death Day!

ఈ సంచికలో >> శీర్షికలు >>

యాప్‌తో పెట్టుకుంటే బాప్‌ రే అనాల్సిందే.. - ..

bap re app

స్మార్ట్‌ ఫోన్ల మత్తులో ప్రపంచం మొత్తం ఊగిపోతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ యాప్‌ వెలుగు చూసినా, క్షణాల్లో అది ప్రపంచమంతా పాకేస్తోంది. మన విషయంలో కొత్తగా చెప్పేదేముంది.? యాప్స్‌ని అడ్డగోలుగా ఎలా వాడెయ్యాలో మనకి తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో. 'టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌'తో మనకి పెద్దగా పని లేదు. ఫలానా వ్యక్తి ఓ యాప్‌ వాడుతున్నారంటే, ఖచ్చితంగా ఆ యాప్‌ మన మొబైల్‌లోనూ వుండాలనేంత కసి.. మన భారతీయుల్లో ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ మధ్యనే 'ఫేస్‌ యాప్‌' ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఓ ఫొటోని పోస్ట్‌ చేస్తే, ఆ ఫొటోలోని వ్యక్తి కొన్నేళ్ళ తర్వాత ఎలా వుంటాడో ఊహించి కొత్త చిత్రం సృష్టిస్తుంది. ఈ యాప్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో వుందిగానీ.. దాని చుట్టూ చాలా వివాదాలు కూడా వున్నాయి. ఇది జస్ట్‌ మచ్చుకి ఒకటి మాత్రమే. చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాంతాడంత వుంటుంది.

ఏ యాప్‌ అయినాసరే, మొబైల్‌ ఫోన్‌లోని దాదాపుగా మొత్తం డేటాని యాక్సెస్‌ చేసేలానే డిజైన్‌ చేయబడ్తుంది. 'మీ గ్యాలరీని వాడుకోవాల్సి వస్తుంది.. మీ మొబైల్‌లోని ఇతర ఫోల్డర్స్‌ని వినియోగించాల్సి వస్తుంది.. మీ మెసేజ్‌లను యాక్సెస్‌ చేయాల్సి వస్తుంది..' అంటూ టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌లో స్పష్టంగా ఆయా యాప్‌లు చెబుతుంటాయి. కానీ, ఆ టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌తో మనకేం పని.? చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు. మొబైల్‌లోకి కొత్త యాప్స్‌ వచ్చాయా.? లేదా.? అన్నది మాత్రమే చూసుకుంటారు. ఫలితంగా, మొబైల్‌లోని విలువైన డేటాని ఆయా యాప్‌లకు అప్పగించేస్తుంటారు. బ్యాంక్‌ అకౌంట్స్‌కి సంబంధించిన సమాచారం కావొచ్చు.. వ్యక్తిగత సమాచారం కావొచ్చు.. మొత్తం బహిర్గతమైపోయేలా కొన్ని యాప్స్‌ రూపొందుతున్నాయి.

ఇదిలా వుంటే, పేరున్న సంస్థల యాప్స్‌ కొన్ని నియమాలకు కట్టుబడి వ్యవహరిస్తుంటాయి. అదే సమయంలో, వాటికి డూప్‌లు పుట్టుకొచ్చేస్తుంటాయి గనుక.. అసలు సమస్య ఈ డూప్‌లతోనే. అచ్చంగా ఒరిజినల్‌ని పోలి వుండే డూప్‌ యాప్‌లకే మన ఇండియాలో ఎక్కువగా గిరాకీ వుంటోందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం, చదువుకున్నవాళ్ళు సైతం టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ గురించి ఆలోచించకుండా యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నట్లు తేలింది. చదువుకున్నవాళ్ళ పరిస్థితే ఇలా వుంటే, చదువు లేని వారి సంగతేంటి.? అయినా, ఈ రోజుల్లో చదువుతో పనేమీ లేదు.. యాప్స్‌ వినియోగించడానికి. సో, ఎంతలా స్మార్ట్‌ ఫోన్లతో నష్టపోతున్నా.. జనం ఫన్‌ కోసం యాప్‌లను వినియోగిస్తూనే వున్నారు.. విలువైన సమాచారం దొంగిలించబడుతూనే వుంది.

మరిన్ని శీర్షికలు