Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

కేరళ తీర్థయాత్రలు/ విహారయాత్రలు ( మున్నార్ ) - కర్రా నాగలక్ష్మి

kerala viharayatralu

మనదేశంలో వున్న మరొక అతిముఖ్యమైన వేసవి విడిది మున్నారు గురించి తెలుసుకుందాం . కేరళ వాణిజ్యరాజధాని కొచ్చిన్ కి సుమారు 130 కిలో మీటర్ల దూరంలో సుమారు 6 వేల అడుగుల యెత్తులో వుంది . కొచ్చిన్ , అలెప్పీ వెళ్లే పర్యాటకులు తప్పకుండ్ వెళ్లవలసిన ప్రదేశం అని చెప్పవచ్చు .

చాలా వేసవి విడుదలలు చూసేం మళ్లామరొకటి చూసే అవుసరం యేమిటి ? అని అనుకొనేవారు తెలుసుకొన వలసిన విషయం యేమిటంటే ఒక్కో ప్రదేశం ఒక్కోరకంగా వుంటుంది , వాటిపరిసరాలు , ప్రకృతి యేవీకూడ ఒకేలా వుండవు , ఉత్తర భారతదేశంలోని వేసవివిడుదలలో తెల్లగా మంచుకప్పబడ్డ పర్వతశిఖరాలు చూస్తూ ప్రొద్దుట టీ తాగడం ఓ అనుభూతి అయితే కనుచూపుమేర వరకు కొండచరి యలలో పరచుకున్న ఆకుపచ్చని టీ తోటలను చూస్తూ కమ్మని కాఫీ చప్పరించడం దక్షిణ భారతదేశంలోని వేసవివిడుదలలో కనిపిస్తుంది .      మున్నారు   లో ఇవికాక గాలిలో తేలియాడే ఏలకులు , లవంగ , మిరియాలు మంచిగంధపు వాసనలు బోనసు . ఇక్కడి అడవులలో వున్న ఔషధ వృక్షాలు వాటిపైనుంచి వీచేగాలి చాలా ఆరోగ్యకరం అంటారు .

మున్నారు చేరుకోడానికి అతిదగ్గరగా వున్న రైల్వేస్టేషను , విమానాశ్రయం కూడా సుమారు 130 కిలోమీటర్ల దూరంలో వున్నాయి , కొచ్చిన్ విమానాశ్రయం మున్నారుకి 130 కిలోమీటర్ల దూరం , కొచ్చిన్ గాని ఎర్నాకుళం రైల్వేస్టేషనుకి సుమారు 130 కిలోమీటర్ల దూరం లోనూ వుంది మున్నారు . కేరళలోని అన్ని పట్టణాలనుంచి మున్నారుకి బస్సు సర్వీసులు వున్నాయి .మున్నారు లో అందరకీ అందుబాటు ధరలలో హోటల్స్ వున్నాయి , పట్టణం మధ్యలో చాలా రకాల భోజన హోటల్స్ వున్నాయి . మనవుండే బసనుంచి బయటికి వస్తే మేఘాలు చల్లగా మనని తాకుతూ వుంటాయి , అలా మేఘాలలో నడుస్తూ వెళ్లే అనుభూతి చాలా గొప్పగా వుంటుంది , అందుకే ఈ పర్యాటక స్థలం పర్యాటకులలో స్థానం సంపాదించుకుంది .

సుగంధద్రవ్యాల తోటలతో నిండివున్న యీ ప్రదేశం1800 లలో ఆంగ్లేయు పరిపాలకుల దృష్టిని ఆకర్షించింది . ఆంగ్లేయ పరిపాలకులు దక్షిణ భారతదేశపు వేడిని తట్టుకోడానికి యిక్కడకు వచ్చేవారట .

ముందుగా మనం మున్నారు అనే పేరెలా వచ్చిందో చూద్దాం , మూ నరు అంటే మళయాళంలో మూడు నదులు అని అర్దం , మూడు నదులు ప్రవహిస్తున్న ప్రదేశం కాబట్టి యీ ప్రాంతం మున్నారు గా పిలువబడుతోంది . కొచ్చిన్ నుంచి బస్సులో బయలుదేరేం . దట్టమైన అడవులలోంచి ప్రయాణం , కాంక్రీట్ జంగిల్ అలవాటుపడ్డ ప్రాణం సువాసనలు వెదజల్లే చల్లనిగాలికి ప్రాణం లేచొచ్చింది . దారిలో చిన్నచిన్న పల్లెలు తప్ప చెప్పుకోదగ్గ వూర్లేమీ లేవు. కొచ్చిన్ లో చాలా వుక్కపోతగా వుండే వాతావరణం కొండలు దాటుతున్నదగ్గరనుంచి చల్లగా అతి చల్లగా మారి మున్నారు చేరేసరికి కాశ్మీరులో చలిని గుర్తుచేసింది . అన్నట్టు మరో విషయం మున్నారుని దక్షిణ కశ్మీరుగా వ్యవహరిస్తారు .      ఒకరోజు కనిపించిన నడక దారులలో కొండలలో నడుస్తూ గడిపేం , మరునాడు చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరేం . చాలా పర్యాటక ప్రదేశాలు వున్నా మేం తేకడి అభయారణ్యం యెంచుకున్నాం . రానూపోనూ టాక్సీ చేయించుకొని వెళ్లేం . మాటాక్సీ తేకడి అభయారణ్యం గేటు దగ్గర విడిచి పెట్టేడు , మేం లోపల ఎంట్రన్స్ టికెట్టు తీసుకున్నాం , ఆ యేడాది వర్షాలు లేక తేకడి లోని సెలయేళ్లు యెండిపోవటంతో జంతువులు తేకడి అడవులలోపలకి వెళ్లిపోయేయట , యెక్కడా పచ్చని గడ్డికూడాలేదు . వ్యూ పాయింటు పైకి యెక్కి పగలంతా కూర్చున్నాం , ఆ యెండలో యే చిన్న జంతువు కూడా బయటకి రాలేదు . వ్యూ పాయింటు చాలా యెత్తులో వుండటం వల్ల అడవిలో చాలా భాగం చూడగలుగుతున్నాం , కనుచూపుమేర అంతా యెండిపోయిన మోడులతో , యెండు ఆకులతో నిండి వుంది . చీకటి పడే వేళకి కిందకి వచ్చేం యేదో నక్కలు , పేరుతెలియని పక్షులు తప్ప మరేమీ కనబడలేదు . చాలా నిరాశ యెదురైంది .

అన్ని వేసవి విడుదలలలో వున్నట్లే యిక్కడ కూడా పూల తోటలు , సన్ రైజ్ పాయింట్ , సన్ సెట్ పాయింటు లు వున్నాయి , అవి మాకు పెద్దగా యింట్రస్ట్ లేదు , అందుకే మేం గంధం తోటలు చూడ్డానికి , జంగల్ యేనుగులను చూడ్డానికి బయలుదేరేం .గంధం తోటలు అనగానే చిన్నప్పుడు విన్న యెన్నోకధలు గుర్తొచ్చేయి , గంధం చెట్లకి పాములు చుట్టుకొని వుంటాయని , గంధం వాసన కొన్ని ఆమడల దూరం వరకు వేస్తుందని , కొన్ని వందల చెట్లున్నప్పుడు యెంతదూరం వరకు వాసనొస్తుందో అని వూహించుకున్నాం , ఒక్కో చెట్టుకి యెన్ని నాగులు వుంటాయో వూహించుకుంటూ వుండగానే మా డ్రైవరు గంధం తోట చేరేం అన్నాడు , యేవాసనా లేదు , గంధం తోటకి తేలేదేమో డ్రైవరు మోసం చేస్తున్నాడేమో అనే అనుమానాలు వచ్చేయి , గంధం వాసన రావట్లేదేమీ అని అడిగితే మా డ్రైవరు గంధం చెట్టు బెరడు తీసి గంధం కాండాన్ని తాళంతో కొడితే గంధం వాసన వచ్చింది . మరేమిటో మన పెద్దవాళ్లు గంధం తోటలో వున్న వేప చెట్టుకి కూడా గంధం వాసన అంటుతుందని అన్నమాటలు వుత్తివే అని అలాగే గంధం వాసనకి నాగులు ఆకర్షింపబడి చెట్టుకి చుట్టుకొని వుంటాయని అనే మాటలు నిజం కావు అని తెలిసింది .

గంధం తోటంతా కారులో తిరిగి మా రెండో పర్యాటక స్థలమైన ఏనుగుల వ్యూ కి వెళ్లేం . రోడ్డుకి అవతలవైపు పచ్చగా వున్న పచ్చిక మైదానం యిటువైపున మాలాగే వచ్చిన పర్యాటకులు కార్లలో కూర్చొని వున్నారు మేంకూడా కూర్చున్నాం , యెక్కడా యేనుగుల జాడ లేదు , యెదురుగా వున్న గడ్డి తినడానికి యేనుగలు గుంపులుగా వస్తాయట , మా బేడ్లక్ యేనుగులు రాలేదు , వెనక్కి తిరిగి వస్తూవుంటే గుంపునుంచి తప్పిపోయిన యేనుగు తిరిగి గుంపు చేరడానికి చేసిన వీరంగం చూసేం .

మున్నరులో వున్న మూడురోజులూ మేఘాలలో తిరుగుతూ మేఘాలను తాకుతూ చాలా ఆనందం పొందేం . ఇక్కడ ఓరకమైన మూలిక అమ్ముతున్నారు దాని పేరు నాకు తెలీదు ఓ పదిరూపాయలకి కొన్నాను అది సన్నగా వేరును చిన్నచిన్న ముక్కలుగా చేసినట్లుగా వుంది . దానిని నీళ్లల్లో వేసుకొని తాగాలట , నీరు లేత గులాబి రంగులోకి మారుతుంది , మున్నారు ప్రతీ షాపులోనూ యీ నీరు అమ్మకానికి కూడా దొరుకుతుంది . ఈ నీరు తాగటం వల్ల అనేక రోగాలు నయమౌతాయని స్థానికులు చెప్పేరు .

వచ్చేవారం ‘ గురువాయూరు ‘ గురించి చదువుదాం అంతవరకు శలవు .         

                                        

      

మరిన్ని శీర్షికలు
sarasadarahasam