గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue328/835/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/
(గత సంచిక తరువాయి).... ఒక్క ఉదుటున లేచి కూర్చుంది మౌక్తిక.. చుట్టూ పరికించి చూసింది. తానున్నది తనగదిలోనే అని రూఢి అయ్యాక…ఏదో రిలీఫ్ గా అనిపించింది. గదిలో లేత నీలిరంగు జీరోవాల్ట్ బల్బ్ మసగ్గా వెలుగుతోంది. అంతకుముందు తాను గాంచిన కల జ్ఞప్తికి రాగానే అమె ఉఛ్వాసనిశ్వాసాలు తీవ్రతరమైనాయి.ఒళ్ళంతా అప్పుడే స్నానం చేసినట్లుగా చెమటలు పట్టాయి. ఆకల…తరచుగా వస్తూ ఆమెని ఇబ్బంది పెడుతోంది. కలతనిద్రలో ఆమెను వెంటాడి… వేధించే అతి భయంకరమైన కల అది. అసలా కల తనకెందుకొస్తోందో ఆమెకు అంతు చిక్కదు. మామూలప్పుడు ఏకలా రాకుండా ఏదో ఒకవేళకైనా కాస్త నిద్ర పడుతుంది.. కాని, మౌక్తిక మనసు మారుమూలల్లో ఏమైనా స్పందనలు కలిగిననాడు…అదుపు తప్పిన ఆమె మనసు అస్థిమితంగా కొట్టుకునేవేళ… అకస్మాత్తుగా వచ్చి, ఆమెను ఆరడి పెట్టి, ఆమె మనసుని కల్లోలపరచి…ఆమెను హింసిస్తుంది.
అసలా కలకి అర్ధం ఏమిటి!? అస్తమానం వచ్చి తన మానససరోవరంలో అలజడి సృష్టిస్తుందెందుకు? తానేంచేయాలి? వెంటనే గూగుల్ లో సెర్చ్ చేసింది. అందులో సమాచారం చదివాక ఆమెకు మరీ ఆందోళన ఎక్కువైంది. ఫోన్ క్లోజ్ చేసేసి అలా ఏదో తెలియని వేదనతో సతమతమైంది.ఎన్నోరకాల ప్రశ్నలు పగబట్టినట్లుగా వేధిస్తూంటే ఆరాత్రి మరి నిద్రపోలేదు మౌక్తిక. మనశ్శాంతిని కోల్పోయిన తన జీవితంలో… శుభతరుణం ఎన్నటికీ రాదా!
కకావికలం అయ్యింది ఆమె మది.
----------------------
భోరుమని కురుస్తోంది వర్షం. మండుటెండల తాకిడికి ఎండి, బీటలువారిన పుడమితల్లిని సేద తీర్చేందుకు వరుణదేముడు చిలకరించిన పన్నీటిజల్లులా జోరుగా కురుస్తోంది వాన. వానధారలు సన్ షేడ్ లమీదుగా భూమ్మీదకి జారిపడుతూ ‘ టప్….టప్…’ అంటూ లయబధ్ధంగా చప్పుడు చేస్తున్నాయి. దివిని భువిని అనుసంధానం చేయడానికి వెండితీగలతో అల్లిన వంతెనల్లా ఉన్నాయి ఆపకుండా నింగిలోనుంచి జాలువారుతున్న వర్షపుధారలు. ప్రకృతిసమస్తం పులకరించి, ఆనందతాండవం చేస్తోంది.
అప్పుడప్పుడు ఫెళఫెళమంటూ గర్జిస్తున్న మేఘాల శబ్దాలు…చేయి తిరిగిన మార్దంగికుడు లయవిన్యాసం చేస్తున్నప్పుడు వెలువడే మృదంగనాదాల్లా ఉన్నాయి. తళతళ మెరుపులకాంతిలో వింత అందంతో అలరారుతున్నాయి చెట్టు-చేమ. కిటికీలోనుంచి వానదేముడి విన్యాసాలను చూస్తున్న మౌక్తిక మది అవ్యక్తానందానుభూతులకి ఆలవాలమైంది. అద్భుతమైన ఈ వర్షం కురిసిన రాత్రిని ఉల్లాసంగా గడపాలంటే చెంత వలచిన విభుడుండాలి. బయట…అడ్డు-ఆపు లేకుండా కురుస్తున్న వానవలన ఉత్పన్నమౌతున్న చల్లదనం… లోన వయసులో ఉన్న శరీరాల రాపిడికి రాజుకుంటున్న అగ్నిగుండం…బయట ప్రకృతి చిందులు…లోన రగులుతున్న నెగళ్లు. అసలీ రకమైన ఆలోచనలు తనకెందుకొస్తున్నాయో…ఆమెకే అంతుచిక్కడంలేదు. తనకిటువంటి ఊహలు కలగడం సబబేనా! తానేదైనా తప్పుగా ఆలోచిస్తోందా!
తరచితరచి మనసుని ప్రశ్నించుకున్నా సమాధానం శూన్యం. అయినా దాన్నడిగితే అదేం చెబుతుంది! వెర్రిమనసు… తానెప్పుడో దానినోరు నొక్కేసింది. అయినా ఆగనంటోంది ఈ జ్వలనం.ఇలాంటి రసవత్తరమైన సమయంలో రమ్యశరత్ లు ఏం చేస్తారు? ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి స్వర్గసుఖాలు అనుభవిస్తారు.వర్షమంటే రమ్యకు ప్రాణం… పసిపిల్లలా అల్లరి చేస్తుంది. “జలుబుచేస్తుంది తడవకు…’’ అంటూ శరత్ ప్రేమతో చేసే హెచ్చరికలు పట్టించుకోనంతగా వానలో నానిపోతూ గంతులు వేస్తుంది.
అలా తడుస్తున్న ఆమెను బలవంతంగా చెయ్యిపట్టి లోపలికి లాక్కెళ్తాడు శరత్. ముద్దుగా మందలిస్తూనే తల తుడుస్తాడు. విక్స్ పూస్తాడు. ఎందుకో… ఆసమయంలో అతడిని చూస్తే రమ్యకి కేవలం భర్తలా మాత్రమే అనిపించడు. ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక సంరక్షకుడిలా… ఎన్నోరకాల రక్తసంబంధం ఉన్నవాడిలా అనిపిస్తాడు.
ఆడదాని అదృష్టమంతా ఆమెను కట్టుకున్నవాడేమోననిపించేంత గాఢంగా రమ్యను ప్రేమిస్తాడు. పూజిస్తాడు…లాలిస్తాడు… పాలిస్తాడు.
స్త్రీ కేవలం ఒక మగవాడిని మాత్రమే మొగుడిగా కోరుకోదు. ఆమగవాడు…అన్ని పాత్రలను సమర్ధవంతంగా పోషించే మొనగాడు కావాలనుకుంటుంది. అటువంటి పూర్ణ, పుణ్యపురుషుడు భర్తగా లభిస్తే…ఓహ్! ఆ మగువదే మహద్భాగ్యం.అటువంటి అతికొద్దిమంది అదృష్టవంతుల్లో రమ్య ఒకరు. తాను రమ్యను చూసి జెలస్ ఫీలౌతోందా! ఏమో… తన ఆలోచనలకి నవ్వుకుంది మౌక్తిక. |