Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka  viharayatralu

( బెంగలూరు )

1956 నవంబరు ఒకటిన మైసూర్ రాష్ట్రంగా యేర్పడి 1973 లో కర్నాటక గ మారిన రాష్ట్రంలో యీ వారం నుంచి పర్యటిద్దాం .కర్నాటక దేశం 3000 క్రీస్తుపూర్వానికి చెందిన హరప్ప సింధు నాగరికతల కాలానికి చెందిందని  గనుల త్రవ్వకాలలో బయటపడిన అవశేషాలవల్ల తెలుస్తోంది . నందరాజుల పరిపాలనలో కర్నాటకలోని చాలా భాగాలు వుండేవని , వారి తరువాత వచ్చిన మౌర్య చక్రవర్తి అశోకుని పరిపాలనలో కర్నాటక వున్నట్లు చరిత్రకారులు నిర్ధారించేరు . నాలుగు శతాబ్దాలు శాతవాహనుల పరిపాలించేరు , తరవాత కదంబ , బాదామి చాళక్యులు మొదలైన వారిపరిపాలనలో వుండి , హరిహరరాయలు , బుక్కరాయల ఆధీనంలో హాసపట్టణ రాజధానిగా మారింది , హాసపట్టణమే విజయనగరంగా మార్చబడి విజయనగర సామ్రాజ్యమైంది , తళ్లికోట యధ్దంలో బీజాపూరు సుల్తానుల హస్తగతమైంది . 17 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలోకి వచ్చింది . ఆ కాలంలోనే యురోపియన్లు భారతదేశంలో అడుగు పెట్టడం , ఒక్కోరాజ్యాన్ని వారి ఆధీనంలో వుంచుకోడం మొదలుపెట్టేరు . కృష్ణరాజవడయార్ -2 బలహీనరాజవడంతో అతని సైన్యాధికారి హైదరాలి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని యురోపియన్లను నియంత్రించేడు , అతని కుమారుడు టిప్పుసుల్తాను కూడా చాలా యుధ్దాలు చేసి యురోపియన్లను నియంత్రించడంలో చాలా వరకు సఫలం చెందేడు , అతని తరువాత సమర్ధుడైన పాలకుడు లేనందువల్ల కర్నాటక యురోపియన్ల చేతులలోకి వెళ్లింది . పోర్చుగీసువారు గోవా చుట్టుపక్కల వున్న ప్రాంతాన్ని ఆక్రమించగా మిగతా భాగం ఆంగ్లేయుల వశమైంది .

యురోపియన్లకు కర్నాటక మీద అంతమోజు యెందుకంటే అక్కడ వెలకట్టలేని సంపద బంగారుగనుల రూపంలో వుండేది . ఆంగ్లేయుల కాలంలో గనులలో త్రవ్వకాలు చాలా ముమ్మరంగా జరిగి చాలా మటుకు బంగారం ఇంగ్లాండికు తరలించేరు . మైసూర్ మహారాజా పేలస్ లోని మ్యూజియం చూస్తే బంగారు గనులలో యెంత బంగారం దొరికేదో ఓ అంచనా లభిస్తుంది .కర్నాటకలోని యిప్పటి రజకీయ పరిస్థితులు మనందరకీ తెలిసినవే , వాటిగురించి మనకి అనవసరం .కర్నాటక బంగారు గనులకే కాక యిక్కడి అడవులు చందనం చెట్లకు , యేనుగులకు ప్రసిధ్ది . ఒక్కసారి వీరప్పన్ ను తలచుకోండి , కర్నాటకా అడవులలో వుంటూ చందనం , యేనుగు దంతాలను దొంగచాటుగా అమ్ముకొని కొన్ని వేలకోట్ల ధననష్టం కలిగించేడు ప్రభుత్వానికి .మన కథలోకి వస్తే ముందుగా మనం రాష్ట్ర రాజధాని బెంగలూరు గురించి తెలుసుకుందాం . జైపూర్ ని పింక్ సిటి అన్నట్లు దీనిని గార్డెన్ సిటి అంటారు , ఇప్పుడు యెక్కడా అంతగా చెట్లు కనబడవు .మా చిన్నప్పుడు బొంబాయినగరం నిద్రపోదు అనేవారు , ఇప్పుడు దానిని మార్చి నగరాలు ( భారతదేశం లో మాత్రమే ) నిద్రపోవు అని దిద్దుకోవాలి . 1992 ప్రాంతాలలో బెంగలూరు కోరమంళ లో వుండేవారం , సెంట్రల్ బస్టాండునుంచి కోరమంగళ వెళ్లడానికి రాత్రి 8 తరువాత సిటీ బస్సుండేవి కావు , ఆ బస్సుకూడా తరచుగా కాన్సిల్ అనేవారు , ఆటోలు పగలే అంతదూరం రామనేవారు . అప్పటికే వూరు నిచ్చాటయేది , 1994 లో బెంగలూరు హౌరా బండికోసం అర్ధరాత్రి స్టేషను చేరుకున్నాం ఆశ్చర్యం బెంగలూరు పట్టపగలులా మెరిసిపోతోంది . రెండేళ్లల్లో యెంతో పెరిగి పోయింది , సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చేకా సిటీ చాలా పెరిగిపోయింది .

బెంగలూరు పర్యాటకులకు యిష్టమైన ప్రదేశమనే చెప్పుకోవాలి , ఇక్కడ ముఖ్యంగా చూడదగ్గవి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ , కబ్బన్ పార్క్ , బెంగలూరు పేలస్ , టిప్పు సుల్తాను సమ్మర్ పేలస్ , విధాన సౌధ , నంది కోవెల , విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ పార్క్ , ఇవికాక కావేరి షో రూమ్ . ప్రత్యేకంగా కావేరి గురించి యెందుకు రాసానంటే యిది కర్నాటక ప్రభుత్వంవారి షాపు , ఇక్కడ మనకు గారంటీ వస్తువులు దొరుకుతాయి , ముఖ్యంగా చందనం వస్తువులు . వారి వద్ద వున్న కలక్షెను చాలా బాగుంటుంది . కొన్నా కొనకపోయినా ఆ కళా ఖండాలను చూడడం కూడా చాలా బాగుంటుంది . ఇది మహాత్మగాంధి రోడ్డు పైనే వుంటుంది . మహాత్మగాంధి రోడ్డు నుంచి బ్రిగేడ్ రోడ్డు వెళ్లే చోట వున్న KSIC షోరూమ్ కూడా తప్పకుండా వెళ్లాలి .

బెంగలూరు సిటీ టూరు బుక్ చేసుకుంటే యీ రెండూ తప్పకుండా చూపుతారు . KSIC వారి ఫేక్టరీ టూరు కూడా వుంటుంది .బెంగలూరు లో యీవారం ‘ లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ గురించి తెలుసుకుందాం .

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ -

1760 లో హైదరాలి మొదటిసారిగా యీ బొటానికల్ గార్డెన్ ని రూపకల్పన చేసి నిర్మించేడు , టిప్పుసుల్తాను దీనిని పూర్తిచేసి దుర్లభ మైనటువంటి  మొక్కలను సేకరించి ఈ ఉద్యానవనాన్ని పెంచేడు , తరువాత వచ్చిన ఆంగ్లేయులు కూడా యెంతో శ్రద్దతీసుకొని 1890 లో అద్దాలభవనాన్ని నిర్మించేరు . ఈ ఉద్యానవనం సుమారు 240 యెకరాలలో విస్తరించి వుంది .2002 లో ‘ బోన్సాయి ‘ శాఖను ప్రారంభించేరు , ఇంఒ.    దులో యెన్నో బోన్సాయి చెట్లను చూడొచ్చు . ఇది కాక గులాబితోట , ట్రోపికల్ గార్డెన్ , లోటస్ గార్డెన్ లు చూడాలి , కళ్లు చెదిరే అందాలు కనిపిస్తాయి .

ప్రతీ సంవత్సరం ఫ్లవర్ షో లు నిర్వహిస్తారు , గణతంత్ర దినోత్సవానికి , స్వాతంత్ర దినోత్సవానికి వారం రోజులపాటు వుంటాయి , ఇందులో పోటీలు కూడా వుండటం వల్ల దేశవ్యాప్తంగా రకరకాల పూల మొక్కలు వస్తాయి , కొన్ని అమ్మకానికి కూడా వుంటాయి , మొక్కల పెంపకం , సేకరించడం హాబీ అయిన వాళ్లకి యిది సువర్ణవకాశమనే చెప్పాలి . ఫ్లవర్ షో ఒక్కటైనా చూడాలి , అన్ని రకాల పూలు , వాటిని అమర్చిన పధ్దతి చాలా బాగుంటుంది . అయితే వేసవిలలో కాక అక్టోబరు నుండి ఫబ్రవరి వరకు అయితే మొత్తం తిరగడానికి బాగుంటుంది . సమయం యెక్కువ లేనివారు ముఖ్యమైన శాఖలతో పాటు అద్దాల భవనాన్ని చూసుకు రావొచ్చు .

నంది టెంపుల్ ( బసవన గుడి ) —

ప్రస్తుతం బసవనగుడి అనే పిలవబడుతున్న ప్రదేశంలోనే వుందీ కోవెల , నందిని బసవన్న అని కూడా అంటాం కదా అదే పేరుతో ప్రసిధ్ది పొందింది . 1530 లో విజయనగర సామ్రాజ్యం ఆధీనంలో ‘ కేంపగౌడ ’  ద్వారా నిర్మించబడింది . విజయనగర రాజుల పాలనలో విరూపాక్షులు , బసవలు అనే రెండు తెగల మధ్య యుధ్దాలు అవీ జరిగినట్లు చరిత్రలో వుంది బసవలు ఆధిపత్యంలో వున్నప్పుడు దీని నిర్మాణం జరిగి వుండొచ్చని ఓ అంచనా . ఏదియేమైనా ఈ నంది విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి . 15 అడుగుల యెత్తు , 20 అడుగులపొడవు వున్న  ఏకశిలానిర్మితం . అంటే ఓ కొండని నందిగా చెక్కివుంటారు .

ఆ కాలంలో వులి సుత్తి వుపయోగించి చేసిన విగ్రహం ఓ అద్భతమనే చెప్పాలి , నంది కొమ్ముల నుంచి కాలి గిట్టల వరకు శిల్పులు చూపించిన నైపుణం కళ్లార్పనివ్వవు . నంది మెడలో గంటలు , గొలుసులు చెక్కిన తీరు చూస్తే ఓ సారి ఆగంటలను చేత్తో తాకకుండా వుండలేము . బసవయ్యా  రావయ్యా అని పిలిస్తే ఒక్కసారి రంకెవేసి లేచొస్తుందేమో అనే భ్రమ కలుగుతుంది . కోవెల గోపురం 20వ శతాబ్దం లో నిర్మించబడింది .  దీనిని స్థానికులు ‘ దొడ్డ బసవన్న ‘ అని కూడా అంటారు . ఈ కోవెలకు దగ్గరగా ఓ వినాయకుని కోవెలవుంది . ఈ కోవెలలో ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో చివరి సోమ, మంగళ వారాలలో ‘ వేరు శనగకాయల ‘ జాత్ర జరుగుతుంది . నందికి వేరుశనగలంటే యిష్టమని భక్తులు వచ్చి బసవడికి వేరుశనగలు సమర్పిస్తారు .       అయితే  నంది కోవెల చూస్తే మందిరం ప్రభుత్వంవారి నిరాదరణకి గురైందని అనిపించింది , అంత శిల్పకళ మరుగున పడిపోయినట్లనిపించింది కాస్త శ్రద్ద చూపిస్తే అంతటి శిల్పకళని ముందుతరాలవారికి అందజేసిన వారం అవుతాం . మళ్లా వారం మరికొన్ని ప్రదేశాలు చూద్దాం . అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
weekly-horoscope september 6tth to september 12th