Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Gongura Royyalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

మాతృత్వం అన్నది ఎవరిది వారికే వదిలేయవలసిన విషయం కదా.. అందులో బయటివారి జోక్యం అనవసరం. ఏ స్త్రీకైనా అమ్మ అనిపించుకోవాలనే ఉంటుంది—కారణం అందులో ఉన్న ఆనందం. కొంతమంది దురదృష్తవశాత్తూ అమ్మ కాలేరు. వాటికీ టెక్నాలజీ ధర్మమా అని, కొత్త కొత్త పధ్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వయసుతో సంబంధం లేకుండా, మాతృత్వ ఆనందం అనుభవించడానికి. ఎవరి తాహతుని బట్టి వారు, లభ్యమవుతున్న పధ్ధతులని స్వీకరిస్తున్నారు.

ఈ మధ్యన ఒకావిడ, తనకు 70 ఏళ్ళపైబడే వయసులో బిడ్డల్ని అదీ కవలపిల్లల్ని కన్నందుకు, సోషల్ మీడియా లో నానా యాగీ చేసారు.  ఆ వయసులో వైద్యసహాయం తీసుకుని పిల్లల్ని కనడం అపురూపరం కాబట్టి, ఆ తల్లితండ్రులూ, వైద్యం చేసిన డాక్టరమ్మా, ప్రపంచానికి తెలియచేసారు, వారు సాధించగలిగిన విశేషాన్ని… అసలు అందరికీ తెలిసింది కాబట్టే అంత హడావిడి చేసారు. చాలామందికి, తాము చేయలేనిదాన్ని మరొకరు చేస్తే, అభినందించడం మానేసి, విమర్శించడమే ఓ పనిగా పెట్టుకుంటారని తేలింది.

ఇంక్ పిల్లల్ని కనడం కొంతమందికి ఇష్టం కూడా ఉండదని విన్నాము..వాటికి ఎన్నో కారణాలు—కెరీర్ కి అడ్డం వస్తుందని కొందరూ, ఫిగర్ పాడైపోతుందేమోనని కొందరూ కారణాలేమైతేనేం, అలాటివారూ ఉంటారు. భార్యాభర్తలిద్దరిదీ ఒకే అభిప్రాయం అయితే పరవాలేదు కానీ, కాకపోతే విడిపోవడాలు కూడా చూస్తున్నాము. చెప్పొచ్చేదేమిటంటే పిల్లల్ని కనడమా వద్దా అన్నది భార్యాభర్తల నిర్ణయం మాత్రమే. బయటి వారి  ప్రమేయం  అనవసరం.

బయటి దేశాల్లో ఇటువంటి సంఘటన జరిగితే ఎంతోగొప్పగా చెప్పుకుంటారు, అవసరమైతే  ఆర్ధిక సహాయం చేయడానికి అక్కడి సమాజం లో ముందుకొస్తారు. ఇక్కడ ఈ విమర్శలు చేసేవారు , సోషల్ మీడియాలో, మాతృత్వం గురించి, పెద్ద పెద్ద కవితలూ అవీ రాయడం , మాతృత్వం కోసం , ఒక స్త్రీ ఎంతకైనా తెగించినా తప్పేమీ లేదనేవారూ ఉండొచ్చు. ప్రస్తుత సందర్భంలో ఆ పెద్దావిడ ఏమీ అనైతిక పనేమీ చేయలేదే, వైద్యసహాయం మూలానే కదా పిల్లల్ని కంట.  ఆ దంపతులేమీ, ఈ so called  శ్రేయోభిలాషులని సహాయం అర్ధించలేదే, మరి ఏ కారణంతో నూటికి 70 మంది ఆ దంపతులని దుమ్మెత్తిపోసారో అర్ధమవదు.

ఆదంపతులు పూర్వాపరాలు ఆలోచించే, ఆ నిర్ణయానికి వచ్చుండొచ్చుగా… అనైతిక సంబంధాలు పెట్టుకుని, పిల్లల్ని కని, పెంటకుప్పలమీద పసికందులని వదిలిపెట్టిన కేసులెన్నో చదువుతూంటాము పేపర్లలో.. వారికంటే ఈ దంపతులు బెటరే కదా.. అసలు సమస్యేమిటంటే, మన దేశంలో, ఒక వయసు దాటిన తరువాత, దగ్గరదగ్గరగా కూర్చుంటేనే, ఏవేవో ఊహించేసుకుంటారు చూసినవారు..అదేదో ఘోరాతిఘోరమైన నేరం చేసినట్టు.  దేశంలో జరిగేనేరాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చట్టాలు చేసినా… వాటిని ఆపే శక్తిమాత్రం లేదు. మహా అయితే, ప్రభుత్వాధినేతలనుండి ఓ ప్రకటన వస్తుందంతే “ ఇలాటి ఘోరాలు ఆపి స్త్రీలకు అన్యాయం జరక్కుండా చూసే బాధ్యత ప్రతీ పౌరుడిదీనూ…” అంటూ.. కర్మకాలి ఆ నేరస్థుడేదో పట్టుబడ్డా, ఏళ్ళకు తరబడి కేసు నడుస్తూనే ఉంటుంది. ఈమధ్యన విజయవాడలోనో, మరో చోటో, ఓ 19 ఏళ్ళ కుర్రాడూ, వాడి స్నేహితులూ( ఆ ఈడువాళ్ళే) , అమ్మాయిలని వేధిస్తూ పైగా వారిని బ్లాక్ మెయిల్ కూడా చేయడం, ఒక్కర్నికాదు, ఎంతో మంది అమ్మాయిలని, తీరా పట్టుబడిఅరెస్టయితే, వాడు చెప్పిందేమిటీ—“ నా వయసు 19 ఏళ్ళే కదా, పట్టుబడినా ఏమీ అవదూ..” అని , అలా  చేసాడుట. ప్రతీదానికీ ఉద్యమాలూ ధర్నాలూ చేసే మన సమాజ సేవకులు ఇలాటి దౌర్భాగ్యులమీద ఈగ వాలనీయరు.. పైగా అదేదో తమకు పట్టనంటుంటారు.. సమాజంలోని అట్టడుగువర్గం వారి మీద అత్యాచారాలు జరగడం చదువుతూనే ఉంటాము.. ఈమధ్యన ఉత్తర్ ప్రదేశ్ లో ఓ రాజకీయనాయకుడి నిర్వాకం చదివాముగా.. ఇంక కొంతమంది దొంగ స్వాముల లీలలైతే ఎన్నో ఉన్నాయి. కొందరిని మాత్రమే జైల్లో పెట్టగలిగారు.

ఈ శ్రేయోభిలాషులు అలాటి విషయాల మీద దృష్టి పెడితే మంచిదేమో కానీ, ధైర్యంగా 70 ఏళ్ళు దాటిన తరవాత కూడా, మాతృత్వాన్ని ఆనందంగా స్వీకరించిన ఆ తల్లి మీద కాదు.

సర్వే జనా సుఖినోభవంతూ….

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu