Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mulakkaya royyalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

మనదేశంలో ఎక్కడైనా ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు చాలా హడావిడి జరుగుతుంది. నూటికి తొంభై పాళ్ళు,  ప్రమాదాలకి కారణాలు మానవ తప్పిదాలకిందే  తేలుస్తారు. ఈమధ్యన జరిగిన పడవ ప్రయాణమే చూద్దాం –వేసవి కాలంలో నీళ్ళు తక్కువగా ఉండి బోట్ తేలిపోతుందేమోననీ, వర్షాకాలం లో వరదనీటి ఉధృతి ఎక్కువగా ఉంటుందనీ, అధికారులు బోటింగుని పెర్మిట్ చేయకూడదని, చట్టమైతే ఉంది. అసలు ఆ వెళ్ళిన పడవకి అనుమతే లేదని కూడా విన్నాము. అంటే దానికి కారణం, పడవలకి అనుమతిచ్చే అధికారులది కూడా కదా.. అసలు గొడవేమిటంటే, దేశంలో చట్టాలను పట్టించుకునేవాళ్ళు బహుతక్కువ. వాటిని అమలుపరచడానికి ఓ శాఖ, దాంట్లో చాలామంది అధికారులూ కూడా ఉంటారు. ఏ ఒక్కరు నిక్కచ్చిగా ఉన్నా, ఇలాటి ఎన్నో ప్రమాదాలను నియంత్రించవచ్చు. ఆ బోట్ యజమానికేముందీ, ఎలాగోలాగ పర్యాటకులకి తీపి మాటలు చెప్పి, డబ్బుచేసుకోవడమే వాడి ధ్యేయం—ఎవరెలాపోతే వాడికేమిటీ? పరిస్థితులు అంత ప్రతికూలంగా ఉన్నప్పుడు, అసలు వెళ్ళాల్సిన అవసరమేమొచ్చిందీ? ఎవరికి వారే, పరవాలేదు లెద్దూ అనుకునేవారే.. ఒక్కరికీ తట్టలేదు, అసలు ఈ బోట్ వాడు authorized  అవునా కాదా, ఆ బోట్ లో ఉండాల్సిన అవేవో  Life boatsలాటివి అందుబాటులో ఉన్నాయా లేదా, సాధారణంగా అత్యవసరపరిస్థితుల్లో రక్షించడానికి , నామమాత్రానికైనా గజ ఈతగాళ్ళున్నారా లేదా, అన్న విషయాన్ని ఒక్కరూ పట్టించుకున్నట్టులేదు—ఫలితం ఎంతోమంది విహారయాత్రకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

చూసే ఉంటారు—నగరాల్లోనూ, పట్టణాల్లోనూ పెద్దపెద్ద ఆకాశ హర్మ్యాలు కడుతూంటారు.. వాటికి సంబంధిత అధికారులు అదేదో ఫలానా  F S I  అని ఏదో అనుమతిస్తారు.ఒక్కడు పట్టించుకోడు. మనం ఏదో ఎపార్ట్మెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు, మనం ఏదో అన్నిటికంటే పై అంతస్థులో అదేదో పెంట్ హౌసో, సింగినాదమో, పైనుంచి వ్యూ బావుంటుందని, ఎంపిక చేసుకుని, పెర్మిషనుందా అని అడిగినప్పుడు చల్లగా చెప్తాడు.. “ దానికేముందండీ మీరు Take over  చేసుకునేలోపల వచ్చేస్తుందీ.. దానికేమీ టెన్షన్ పెట్టుకోకండీ “ అంటాడు. చివరకి అది రానూరాదూ పెట్టాపెట్టదూ.. అసలు సమస్య లేకుంటే ముందరే పెర్మిషన్ వచ్చుండేదేమో అని మాత్రం ఆలోచించరు.ఎప్పుడో ఏ కార్పొరేషన్ వాడో నిద్ర లేచి, inspection  చేసినప్పుడు తెలుస్తుంది, దీనికి పెర్మిషన్ లేదూ అని.. కూలగొట్టేస్తే నెత్తీ నోరూ బాదుకోవడం. పెద్దమనిషి ఖర్చుపెట్టిన లక్షలు బూడిద పాలవడం.

ఉదాహరణకి ఈ మధ్యన కొద్దిగా మార్పులు చేసి, మోటార్ వెహికిల్స్ చట్టాల్లో, జుర్మానాలు ఎక్కువ చేసారు—ఎన్ని ప్రభుత్వాలు వాటిని ఆమోదించి, అమలు పరుస్తున్నాయో చూస్తూనే ఉన్నాము. అవేవో తీరా అమలుపరిచేస్తే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు రావేమో అని భయం. పైగా ఇలాటి చట్టాలు అమలుపరచాల్సొచ్చినా,  పై అధికార్లు, తమ కిందివారికి చెప్తారు “ మరీ అంత  strict  గా ఉండి హీరోఇజం చూపించక్కర్లేదూ.. చూసీ చూడనట్టుండూ..” అని ఓ సలహాకూడా ఇస్తారు. కారణం , మన సేఫ్టీకోసం కంపల్సరీ చేసిన హెల్మెట్లు పోలీసోళ్ళే వాడరూ..

పెద్దపెద్ద భవనాల్లో, చెప్పాపెట్టకుండా అగ్నిప్రమాదాలు జరుగుతూంటాయి.. ఆస్థినష్టం మాట దేవుడెరుగు, ఒక్కోప్పుడు ప్రాణ నష్టం కూడా జరుగుతూంటుంది,  ప్రమాదాలు ఆపలేకపోయినా, కనీసం జనాల్ని రక్షించాల్సిన, అత్యవసర పరికరాలు కూడా ఉండవు.. అప్పుడెప్పుడో దేశ రాజధానిలో ఓ సినిమా హాలు తగలడిపోయి ఎంతో మంది చనిపోయారు. ప్రతీ ఆకాశహర్మ్యంలోనూ ఫలానా ఫలానా , అగ్నిమాపక సామగ్రి ఉంటేనే కానీ, అనుమతి ఇవ్వరని చట్టాలైతే ఉన్నాయి. కానీ అలాటివాటిని పట్టించుకోకుండానే , అనుమతులు తెచ్చుకోవడం చాలా సులభం.. డబ్బు పారేస్తే ఏదైనా చేయొచ్చనే పేద్ద నమ్మకం.

ప్రభుత్వాలేం చేస్తాయీ..  ప్రమాద సంఘటన మీద ఓ కమెటీ వేసి, 15 రోజుల్లో రిపోర్టివ్వాలంటారు.ఇలాటి రిపోర్టులు వేలల్లో ఉంటాయి. ప్రభుత్వం లో ప్రతీదానికీ ఓ శాఖ, దాంట్లో వందలాది ఉద్యోగులూ ఉన్నారు కదా, వారి పని వారు సక్రమంగా చేస్తే చాలు.  చట్టాన్ని అతిక్రమించేవారికి, ఏ రంగంలోనైనా సరే, ఓ పేద్ద భరోసా—డబ్బు పారేస్తే ఏపనైనా జరుగుతుందని.. ఆ అభిప్రాయం మారనంతవరకూ ఇలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయీ, మనం ఇలా రాస్తూనే ఉంటాము…

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
karnataka  viharayatralu