Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మది నిశ్శబ్ద రాగమే ఈ రెప్పచాటు రాగం... - మంజు యనమదల

reppachatu mounam book review

గుప్పెడు గుండె సవ్వడులను, మౌనం చెప్పిన మనసు భావాలను రెప్పల చాటుగా దాచి మనకందించిన అక్షర సరాగమే లక్ష్మి కందిమళ్ళ రచించిన ఈ " రెప్పచాటు రాగం.. "  స్త్రీ తత్వపు సున్నితమైన లక్షణాలను, సహజత్వాన్ని అందంగా అక్షరాలకు అద్ది ఎన్నో భావాలను, ముచ్చట్లను తనదైన శైలిలో చక్కని అలతి పదాలతో అందించిన మనసు మౌనరాగమే ఈ " రెప్పచాటు రాగం.."

వేదనాభరితమైన జ్ఞాపకాలు గుండె గాయపు గురుతులుగా మౌనాలాపన చేస్తున్నాయని అంటూనే మళ్ళీ కొత్తగా చిగురించాలన్న ఆశావహ దృక్పధంతో వేదన కవితకు ముగింపునివ్వడం కవయిత్రికున్న ఆశాభావాన్ని చెప్తుంది. " ఉనికిని తెలుపని కలలు ఉహలకే భారమై.." అంటూ " చితికిన బతుకులో వెలుగులు నింపని ఉషోదయం.. " అని బాధను కూడా అందంగా కరిగిపోతున్న కలలు కవితలో చెప్తారు. సుడిగుండాలు, మనిషి ఆశలే మనిషికి శాపమా, మనసు కష్టాన్ని, ఆకలికి దొంగిలించిన దొంగకు వేసిన శిక్షకు తల్లడిల్లి మానవత్వ మూలాలను ప్రశ్నిస్తారు. ఏకాంతంలో నిశ్శబ్ద శబ్దంలా హృదయరాగాలను పలికిస్తూ, శిలని శిల్పంలా మలుస్తూ, అక్షర దీపికలు వెన్నెల వసంతంలా చేరాయంటారు. ఆరాధనను ఆవేదనలో హృద్యంగా చూపిస్తారు.

ఆశల తీరాలను, మనోభావాలను, నిజాన్ని, ఆశయాన్ని, అన్ని ఉండాలని నాకై నేనులో ఈ పాదం దివ్య పాదాల పదమై చిరు కాంతిగా మిగిలిపోవాలని కోరుకుంటారు. అహానిదే రాజ్యమైనప్పుడు ఇక బంధానికి తావెక్కడ అని ప్రశ్నిస్తారు అహం కవితలో. ఎంత ఆశో అంట నమ్మకమంటూ, నిశ్శబ్ద చెలిమి స్పర్శని నిశ్శబ్దంగా రెప్పల తడిని స్పృశించే హృదయాన్ని నిశ్శబ్ద రాగంగా వినిపిస్తూ, ఆకలి ఓ మొండి చుట్టమనడం ఆమెకే చెల్లింది. లాలనలో నిరీక్షణను, ఆశల గువ్వలు చిక్కుబడిపోవడాన్ని, అలసిన మనసును, స్పర్శలో స్మృతులు మిగిల్చిన మాధుర్యపు మమకారాన్ని, దుఃఖ దీవితో పాటుగా పంచమనాదాన్ని పలకరిస్తూ, మనోజ్ఞ దృశ్యాలను, ఆత్మీయరాగాన్ని అక్షరాల్లో అందిపుచ్చుకుంటూ, మధు కలశంతో నీకై ప్రతిక్షణం ఎదురుచూస్తున్నానంటూ తన ప్రేమను, ఆరాధనను సున్నితంగా అక్షరాల్లో ఇమిడ్చి చక్కని, చిక్కని భావాలు ఈ కవితల్లో కూర్చారు. ఒక రాత్రి తాకిన అడవిమల్లి మధుర పరిమళాన్ని, ఉహల ఊసులను, అనుభూతుల అనుభవాలను, ఓ పలకరింపు ఊపిరిగా ఎలా మారుతుందో వివరిస్తూ, నా నీడగా చైతన్య మంత్రమెలా ఉంటుందో చూడమంటూ, ద్విపద సుమాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో భావాలను  సరళ పదాల్లో చదువరుల మనసులకు హత్తుకునేటట్లుగా చెప్పడంలో లక్ష్మి కందిమళ్ళ పరిణితిని సాధించారు.

" అలిగిన రాత్రిని
పున్నమిగా మారుస్తూ
లాలిస్తుంటావు.." (నా నీవై నాకై నువ్వుగా )
ఎంత లలితమైన భావన ఇది.

శూన్యం మాటలను మౌనంతో బంధించాక నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిశ్శబ్దానౌతున్నా అంటారు. నీకు నీవే ఓ ప్రశ్నలా మిగిలిపోతున్నావంటారు మరో కవితలో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ని రాకతో నాలోని నిశ్చలత్వం కవిత్వమై కడలి హోరును, తూరుపు సిందూరాన్ని, వసంతపు అందాలను, కాలం చేసి అద్భుతాలను, ఏకాంత వేళ మౌన నిరీక్షణను, వెన్నెలపూవులను తనదైన శైలిలో వర్ణిస్తూ మనల్ని ఆకట్టుకుంటారు.  జీవితం కడిగిన ముత్యమై మెరవాలంటారు. ఒక సవ్వడిని ఎద సవ్వడిగా వినిపిస్తారు. ఎండమావిని బంధించాలంటారు. నిరంతరం మనసు పలికే మధుర భావాలు ఏమిటో తెలియకున్నా ఒక దేనితో ఒకటి ఎలా ముడిబడి ఉంటాయో అంటూ మనసు, మానవత్వం, ఆహ్లాదం, తొలిపొద్దు ఇలా ప్రతి చర్య ఒకదానితో ఒకటి ముడిబడే ఉంటాయన్న సత్యాన్ని చాలా గొప్పగా చెప్తారు. ప్రకృతితో మనసు మమేకమైనప్పుడు ప్రతి రేయి వెన్నెల వసంతమేనంటారు. ఓ స్పర్శ భరోసానిచ్చే ఆత్మీయ ఆలంబన కావాలంటారు. ప్రతిదీ అపురూపమే అయినా, ష్.. అలికిడి చేయకుండా నిన్నటి గురుతుల్లో కాసిన్ని హాసాలు చిలకరించమని చమత్కరిస్తూ, నీలోని నీవును తెలుసుకోమని తాత్వికతను జోడిస్తూ జీవనతృష్ణను చెప్పడం చాలా బావుంది.

కొత్త గుభాళింపులను, నిశ్శబ్ద ఏకాంతాలను, హృదయరాగాన్ని, ఓ నిశ్చలత్వపు నిరీక్షణను, భరోసాని, సందిగ్ధావస్తను, జ్ఞాపకాల గుభాళింపును, పులా అంతరంగాన్ని, మనసును, పచ్చని చెట్టును, నీ రాకకై ఆమె జాబిల్లి కోసం కలల దీవిలో కౌముదిగా వేచి ఉండటాన్ని, మధుర రహస్యాలను, ఇంతే అంటూ ఒకే ఊపిరిగా మారిన ఇరు మనసుల సాన్నిహిత్యాన్ని, కవి అక్షరం ఎప్పుడు సూర్య, చంద్రులకు ప్రతికేనంటూ చక్కని పద ప్రయోగాలతో భావాలను ఒలికించారు.

చివరిగా ఆటను వేసిన ముద్రలను, చీకటిని నింపుకు వస్తున్న విషాదాన్ని, ఆమె పొదివి పట్టుకుని, నిశ్శబ్దంగా దీపమై ప్రజ్వలిస్తూ ఉంటుంది అని నిశ్శబ్ద దీపం కవితలో అంటారు. ఎంతో లోతైన భావమిది. నాకు చాలా నచ్చిన కవిత కూడా. చాలా చిన్న కవితే కాని సముద్రమంత విషాదం నిండి ఉంది ఈ కవితలో.

ఎన్నో నిశ్శబ్దాల చప్పుళ్ళను, ఓ మానవత్వపు మనిషి మనసు రాగాలను చక్కని వాడుక పదాల్లో పలికిస్తూ, తన భావాలను చిక్కని, చాలా వరకు నిడివి తక్కువ కవితలుగా లక్ష్మి కందిమళ్ళ రాసినా, వాటిలోనున్న లోతైన, అర్థవంతమైన భావాలు చదువరులను ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న కవితలతో మొదలైన తన అక్షర ప్రస్థానం నేడు చక్కని కవితలుగా పలువురి ప్రశంసలు అందుకుంటూ, వన్నెలు సంతరించుకున్నాయి. మరిన్ని భావ వీచికలు లక్ష్మి కందిమళ్ళ కలం నుండి జాలువారాలని, తెలుగు సాహిత్యంలో తనదైన శైలిని ముద్ర వేయాలని కోరుకుంటూ... మనసు రాగమై అలరించిన రెప్పచాటు రాగానికి హృదయపూర్వక శుభాభినందనలు.

మరిన్ని శీర్షికలు
weekly-horoscope september 27th to october3rd